రసాయన ఆయుధాల నిషేధ ఒప్పందం – వివిద దేశాలు

0
8

[dropcap]ర[/dropcap]సాయనిక ఆయుధాల నిషేధం ముసాయిదా 1992లో తయారుచేయబడింది. 1993 జనవరిలో ఒప్పందం రూపుదిద్దుకున్నది. 165 దేశాలు ఒప్పందంపై సంతకం చేశాయి. 65 దేశాలు ఒప్పందాన్ని ధ్రువీకరించాయి. 1997 ఏప్రెల్ 29 నుండి ఒప్పందం అమలుకై అవగాహన కుదిరింది. ఇజ్రాయిల్ సంతకం చేసిందికానీ ధ్రువీకరించలేదు. ఈజిప్ట్, దక్షిణ సూడాన్, ఉత్తర కొరియా దేశాలు ఒప్పందాన్ని అంగీకరించలేదు. సంతకం చేయలేదు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ సమితి చార్టర్ 102లో ఒప్పందాన్ని రిజిస్టర్ చేశారు. అప్పటికే ఉన్న రసాయనిక ఆయుధాలను నిర్మూలించడానికి 2002 వరకు గడువు ఈయబడింది. అయితే నిర్మూలన ప్రక్రియలో పర్యావరణ పరంగా ఎదురు కాగల సమస్యలను దృష్టిలో ఉంచుకొని కొన్ని దేశాలకు 2007 వరకు వెసులుబాటు కల్పించడం జరిగింది. అయితే ఒప్పందంలో చేర్చబడిన ‘వెసులుబాటు’ను సమస్యలు ఉండని దేశాలతో సహా అన్ని దేశాలూ వినియోగించుకున్నాయి. వెరసి 2012 వరకు ఆయుధాల నిర్మూలన లక్ష్యం పూర్తి కానే లేదు.

O.C.W.C – ఒక పరిపూర్ణమైన వ్యవస్థ

ఆయుధాల నిషేధం అమలుకు నెదర్లాండ్స్ లోని ‘హేగ్’ హెడ్‌క్వార్టర్స్‌గా ఒక సంస్థ కూడా రూపొందించబడింది. 1997లో (ఏప్రిల్) స్థాపించబడిన ఈ సంస్థలో 500 మంది సిబ్బంది ఉన్నారు. ఇటీవలి కాలంలో సాలుసరి బడ్జెట్ రమారమి 69.69 మిలియన్ డాలర్లు. భాగస్వామ్య దేశాల సమావేశాల నిర్వహణ వ్యవస్థ, సాంకేతిక వ్యవహారాలకై సచివాలయం, పరిపాలనకై ఎక్సక్యూటివ్ కౌన్సిల్ వంటి అధికార యంత్రాంగం ఏర్పాటు చేయబడింది. ఇంగ్లీష్, అరబిక్, రష్యన్, స్పానిష్, చైనీస్ రష్యన్ అదికార భాషలుగా సర్వసన్నద్ధమైన యంత్రాగం రూపొందించడం జరిగింది.

నిర్మూలన దిశగా

రష్యా

అక్టోబర్ 1997 నాటికి రష్యా తన వద్ద 39,967 టన్నుల రసాయనిక ఆయుధాలు ఉన్నట్లుగా ప్రకటించింది. అక్టోబర్ 2011 నాటికి రష్యా తన ఆయిధ నిల్వలలో 57% వరకు నిర్మూలించింది. వర్గీకరణకు సంబంధించి కేటగిరి 2,3 లకు చెందిన రసాయనాలను రమారమి 10,616 మెగా టన్నుల వరకు రష్యా నిర్మూలించింది. ఆయుధ అవసరాల నిమిత్తం కాకుండా మిగిలిన అనేక రంగాలలోనూ రసాయనాల అవసరం ఉంటుంది. ఆ అవసరాలకు కావలసిన రసాయనాలను తాను ఒప్పందంలో పేర్కొన్న 8 ప్రాంతాలలో రష్యా భద్రపరుచుకొంది.

అమెరికా

U.Sలో కెమికల్ ఆయుధాల అధ్యాయం 1917లో మొదలైంది. నిర్మూలన కార్యక్రమం 1985లో మొదలైంది. మేరీలాండ్ లోని U.S. ‘మెడికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ వెపన్స్’ ఆధ్వర్యంలో ఇంకా కొనసాగుతోంది. U.S. తన వద్ద నున్న నెర్వ్ గేస్, మస్టర్డ్ గేస్ వంటి రసాయనాల 34.300 టన్నుల నిల్వలలో 2012 నాటికి 89.75% వరకూ నిర్మూలించిందని లెక్కలు చెప్తున్నాయి. U.S పబ్లిక్ లా ప్రకారం 2023 డిసెంబర్ 30 నాటికి అన్ని నిల్వలను నిర్మూలించవలసి ఉంటుంది. 45% నిల్వలను 2004 నాటికి నిర్మూలించగా వివిధ కారణాలుగా నిర్మూలన కార్యక్రమం పొడిగించబడతూ వచ్చింది.

చైనా

చైనా C.W.C. ని ఏప్రిల్ 25-1997 నాడు ధ్రువీకరించింది. రసాయనిక ఆయుధాలను గురించిన ఆరోపణలు చైనా మీద పెద్దగా లేవు. 1970లో అల్బేనియాకు కొద్ది మొత్తంలో రసాయన ఆయుదాలను అందించినట్టు మాత్రం తెలిసింది. జీవాయుధాలను గురించి మాత్రం చైనా పై చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.

జపాన్

మొదటి ప్రపంచ యుద్దం అనంతరం రసాయనిక ఆయుధాల తయారీ నిల్వల దిశగా వేగంగా పయనించిన జపాన్ 1930 నాటికి అత్యధిక సంఖ్యలో ఆ ఆయుధాలను కలగి ఉన్న దేశంగా రూపుదిద్దుకున్నది. రెండవ ప్రపంచ యుద్ధంలో చైనాపై వాటిని ప్రయోగించి పెద్ద ఎత్తున మారణకాండ సాగించింది. అయితే C.W.C. ప్రకారం చైనాలో విధ్వంసం తాలూకు మిగిలి ఉన్న వ్యవస్థలను నిర్మూలించవలసిన బాధ్యత జపాన్‌దే. అయితే ఆ నిర్మూలన కార్యక్రమంలో జపాన్ ప్రభుత్వానికి చైనా ప్రభుత్వం సైతం శాయశక్తులా సహకరించిందన్నది వేరే విషయం.

ఇలా ఏ దేశం కథ ఆ దేశానికి ఉంది. అయినా ఇక్కడ సమస్య ఆయిధ నిల్వలు, వ్యవస్థలు కాదు. చిన్నదైనా పెద్దదైనా దేశాలలో పెరుగుతున్న అభద్రతాభావం, దాన్ని వెన్నంటి పరిణామక్రమంలో పెరుగుతున్న శత్రుత్వ భావన! చిన్నదో, పెద్దదో – సర్వసత్తాక దేశాలు తమ చెప్పు చేతల్లో ఉండకపోతే వాటిని సమూలంగా నాశనం చెయ్యాలన్న ఆధిపత్య భావన!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here