రాష్ట్ర కవి కువెంపు గారి ‘కల్కి’ కవిత

0
11

[శ్రీమతి రాజేశ్వరి దివాకర్ల రచించిన ‘రాష్ట్ర కవి కువెంపు గారి ‘కల్కి’ కవిత’ అనే వ్యాసం పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]సు[/dropcap]ప్రసిద్ధ కన్నడ కవిత ‘కల్కి’ కవిత రాష్ట్ర కవి కువెంపు గారు 1933 లో రచించిన’ పాంచజన్య’ కవిత్వ సంపుటం నుండి గ్రహించినది.

ప్రస్తుతం కలియుగంలో ఉన్నాము. కలి యుగ ప్రభావం వల్ల అశాంతి ద్వేషము కోపము ప్రబలుతాయి.

మరల సత్యయుగ స్థాపనకు కల్కి అవతారం ఎత్తుతాడు. మనిషి రాక్షసుడైనప్పుడు కల్కి అవతారం ఆ రాక్షస ప్రవృత్తిని చెండాడుతుంది. కల్కి మహావిష్ణువు పదవ అవతారం. పురాణ ప్రసిద్ధమైన ఈ కల్కి అవతారాన్ని దృష్టిలో పెట్టుకుని భారత కథను భారతదేశ కథగా మార్చారు యుగకవి, జగానికి కవి అని ప్రసిద్ధిని పొందిన కువెంపు గారు.

వారు ఈ కవితను రచించి సుమారు 90 ఏళ్ళ కాలం గడిచింది. ఈ నాటికీ సమాజం లోని అసమానతలకు అన్వయిస్తుంది. వారు రస ఋషి అని పేరు పొందారు. వారు వైచారికతకు గీటు రాయి. వారు సంప్రదాయిక మౌఢ్యాలను గూర్చి ఆలోచించారు. ప్రతిభావహమైన కవిత్వ కానుక ‘కల్కి’ని సృష్టించారు.

కల్కి కవిత ఒక దృశ్యకావ్యం లాంటిది. ఈ కవితలో వారు సాధించదగిన సారాంశానికి ఎంతో నేర్పుగా దిగ్భ్రాంతమైన ‘కల’ను సాంకేతికంగా మనకు చూపారు. వారు కలలో కాంచిన దృశ్యం అంతా జాగృతమైన సుషుప్తిలో కాంచడం ఒక విశేషం. వారు మేల్కొని చూసిన ఈ కలలో సమాజం దారి తప్పింది. ఈ అసమానత ఒక విప్లవాన్ని సృష్టించింది.

కల్కి కవితలో సమాజం లోని విషమత శ్రీమంతుల దర్పం వలన పేదలు ఎంతగా బాధను అనుభవిస్తున్నారో తెలిపారు. వారి దీనస్థితిని అతి భీకరంగా చిత్రీకరించారు.

కవికి నిద్రలో ఒక కల వచ్చింది. ఆదర్శ సమాజానికై తపన చెందిన కవి మనసులో నిక్షిప్తమైన భావమే సుప్త చేతనలో కలగా వచ్చింది. ఈ కలలో వారు దట్టమైన అరణ్యంలో సంచరించారు. సుదీర్ఘమైన నడక నడిచారు. అక్కడ వారు దారి తప్పారు. అది అనంతమైన దారి. వారు సాగుతున్న కొలదీ ఎటువైపు వెళుతున్నారో తెలియని స్థితి. ఆ కీకారణ్యంలో వట వృక్షాలు, పాకుడు తీగెలు. ముళ్ళ పొదలు. కేక్టస్ చెట్లు అన్నీ పిశాచుల్లా ఉన్నాయి. ఎంత దూరం నడచినా అంతు కనబడలేదు.

సంకీర్ణత నిండిన ఈ కీకారణ్యం సమాజ వ్యవస్థకు సంకేతం. అక్కడి కనుమలలో వెలుగుందనీ చెప్పలేం. చీకటి నిండిందనీ అనలేం, వారు నడస్తున్న నిద్రా వీధిలో జ్ఞానం ఉందా? అజ్ఞానం ఉందా? ఆ శివునికి మాత్రమే తెలుసు. నిజ రూపం తెలుసుకోవాలంటే పూర్తి వెలుగు – అంటే తాత్విక జ్ఞానం కావాలి.

వారి నడక అలా సాగుతూనే ఉంది. అలా వెళుతూనే ఉన్నారు. అంటే ఈ దీర్ఘమైన నడక తప్పనిసరి. ఎందుకంటే ఈ వెలుగు నీడల పరిక్రమణ ఒక రోజులోనో లేక కొన్ని రోజులలోనో తేలిపోయేది కాదు.

భయపడక సాహసంతో నడక సాగించాలి. అక్కడొక కొండ కనిపించింది. ఆ కొండ నెక్కి నెక్కి వెళ్ళి శిఖరం చేరారు. ఇలా శిఖరం చేరడమనే రూపకం సమాజ నిజ స్వరూపాన్ని కనుగొనాలంటే వైచారికపు నడిఎత్తునకు చేరాలి అని కవిగారి ఉద్దేశం. నిజాన్ని తెలుసుకోవాలంటే ఎత్తులకు ఎక్కాలి.

అలా ఆ కొండ శిఖరం మీదకు చేరాక అక్కడ నుంచి వారికొక ఊరు కనిపించింది. ఆ ఊరు మాయల ఊరు – అలా అనడంలో ఒక ఊరు అని కాదు అన్ని ఊళ్ళు అలానే ఉన్నాయి అన్నది కవి గారి చింతన.

ఆ ఊరిలో ధనవంతులు, పేదలు, సుందరత కురూపత, చీకటి, వెలుగుల ప్రతీకలతో ద్వంద్వ రీతులను ఉద్ఘాటించారు. తాము చేయబోయే సామ్యవాద ప్రతిపాదనకు శబ్ద సంఘటనల ప్రాతిపదికను వేసారు. ఆ ఊరిలో ధనికుల భవనాలు ఒక వైపు, నిరుపేద వాసాలు మరొక వైపు, సుశ్రావ్య సంగీతం, గగ్గోలు, పీతాంబరధారులు, మానం కప్పుకోడానికి గుడ్డపీలికలు కూడా లేని వారు, ఉద్యానవనాలు, శ్మశానమౌనం, ఇటువంటి వైరుధ్యాల భీకర వ్యవస్థలో, ఆ క్షణం విప్లవం చెలరేగింది.

వర్గ విభేదపు పీడనలో పేదవాని ఓర్పు నశించింది. ఆతని ఆకలికి జఠరాగ్ని మంటలు రేగాయి. ఈ మంటలు నిరుపేద గుడిసలలో చెలరేగి, శ్రీమంతులలో, చెవిటి, గుడ్డి, మూగ లనూ దహించింది. ఇక్కడ చెవిటి వారు పేదల ఆక్రోశాన్ని వినని వారు, గుడ్డివారు దీనుల బాధను చూడలేరు.

వైదిక పురాణం లోని కల్కి అవతారానికి సాదృశంగా ఇక్కడ క్రాంతి కారక కల్కి ఆవిర్భవించాడు. ఈ కల్కి ‘అస్థి పంజర అశ్వాన్నెక్కి, /శ్వేత కాంతుల కోర పళ్ళతో/ ప్రేత స్వరూపి?/కుడి చేత మెరిసే కత్తి. /ఎడమచేత పిడుగుల బంతి/ ఎముకల గుర్రం/ఎముకల సైన్యం/ ఇతడే కల్కి/దీనుల బతుకు/ మూర్తీభవించిన ఘోష. కవి సృష్టించిన కల్కి అవతారం ఇది. ‘బడవనె కలియుగద అంత్యద కల్కి’, ‘పేదవాడే కలియుగాంతం లోని కల్కి’ అన్నారు కవి.

ఈ విప్లవం దాల్చిన భీకర రణఘోషలో రక్తపు టేరులు స్రవించాయి. అతి దారుణ వేగంతో బండలను రుండ ముండాలనూ దొర్లించాయి, సమాజం లోని వైషమ్యాలను ఛిద్రం చేస్తూ. అతి దారుణ కఠోర భీభత్సాన్ని కలిగించిన కల్కి దాహం ఎంతకూ తీరలేదు. అన్నింటినీ ముంచాక, కవి దగ్గరకు ఆతడెక్కిన కొండ దగ్గరకు సమీపించింది.

కవి దిగ్భ్రాంతిని చెందాడు, కల్కి కల్కి అంటూ అరచి నిద్ర లేచాడు. ‘ఇంకెక్కడి నిద్ర’ అంటూ మారని ఈ సమాజ స్థితిని తలచి ‘తమకే కాదు, ఎవ్వరికైనా ఇంకెక్కడి నిద్ర’ అంటూ అందరిలో కల్కి అవతరించాలనీ సమసమాజం ఆవిర్భవించాలనీ ప్రకృతి సంపదలు అందరికీ అందాలనీ ఉద్దేశించారు.

కల్కి కవిత ముఖ్యంగా శ్రమ పీడనను కాకుండా ఆర్థిక అసమానతలను తెలుపింది. ఈ అసమానత ఎప్పటికి తొలుగుతుందో ఆ శివునికి మాత్రమే తెలుసు. అది ఇప్పట్లో సాధ్యం అయేది కాదు అందుకనే కవి నేర్పుగా ‘కల’ అనే కల్పనను కావించారు. తామాశించిన ఆదర్శ సామ్రాజ్యాన్ని కలకు పరిమితం చేసారు. కవి కల్పనలోని ఊరు మాయ. కవి మనసు కూడా విభ్రాంత మయింది.

కువెంపు గారు విప్లవ ఆకాంక్షను ఉద్యమ రీతిని తీవ్రంగా ప్రతిపాదిస్తూ, బడబాగ్ని తీవ్రతను, దృశ్యమానం చేశారు. కన్నడ భాషలో ‘బడవ’ అంటే పేద. పేదకు ఆకలి మంటలు రేగుతే ‘బడబాగ్ని’ చెలరేగుతుంది. అప్పుడు ఆతనిలో చెలరేగిన కోపం కరాళ భీకరమైన హింసను చేపడుతుంది.

నవోదయ కన్నడ కవితలలో ఉత్తమ కవితగా ఎన్నిన కల్కి కవిత ఆర్థిక అసమానతను వ్యక్తం చేస్తూ సమాజం లోని దోషాలను పట్టి చూపింది.

పేదల గొడవను పట్టించుకోని చెవిటి వారు, పొట్ట నింపుకోడానికి కాషాయాన్ని ధరించినవారు, గురుశిష్యులూ, సంపదలన్నీ తమకే చెందాలన్న మూఢులూ, పేద ఆకలిని గుర్తించక మృష్టాన్నం తినేవారు, ఇళ్ళు వాకిళ్ళు, అన్నీ మంటలకు ఆహుతి అయ్యాయి – అంటూ అవినీతి సమాజ చిత్రణను కావించిన కవిత మానవుల ఐక్యతను కోరింది. బాహిరమైన ఆర్థిక అసమానతల నిర్మూలన, ఆంతరమైన హిందూ ధర్మ రక్షణలను ప్రతిపాదించిన ఈ కవిత కువెంపు గారిని విప్లవ ఉద్యమ కవిగాను, సనాతన ధర్మ పునరుత్థాన చింతనాశీలురు గానూ నిరూపించింది.

కల్కి కళ్ళు దూరంగా కొండ మీద నిల్చిన కవిని చూసాయి. ఈ సమాజ స్థితిగతులను చూసి వైచారికతల ఉన్నత శిఖరం మీద చింతనా మగ్నుడైన కవి నిలిచిన ఎత్తులకు తాకింది మహాజ్వాల. కల్కి ఆగమన వేగాన్ని చూసి అయ్యో అని అరచారు. ఇంకెక్కడి నిద్ర? కల చెదిరింది. ఇంకెక్కడి నిద్ర! అన్న పంక్తులు కవ్తా సారాంశమైన అర్థ ధ్వనిని సార్థకం కావించాయి. కవి గారు కాంచిన కల నిజం అయి తీరాలి. తాను చూచిన దృశ్యం సత్యమై సమాజంలో మార్పు రానంత వరకూ, ఎవ్వరికైనా నిద్ర ఎలా వస్తుంది?

సమ సమాజ దృష్టిని ప్రతిపాదించి, ప్రతి ఒక్కరూ నిదుర నుంచి మేల్కొనక తప్పదని ప్రబోధించిన కవిత ‘కల్కి’.

Images Credit: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here