రేటింగ్ రేస్

1
7

[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘రేటింగ్ రేస్’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]మూ[/dropcap]డు రింగులు అయిన తరువాత, “హలో చెప్పండి. మీరు న్యూస్ చానల్ ఏడుంపావ్ ఆఫీసుకి ఫోన్ చేశారు” అంది రిసెప్షనిస్ట్.

“మేడం గారూ నమస్కారం, నేను విశాఖ రైల్వే స్టేషన్‌లో సమోసాలు అమ్ముతాను, నా పేరు అప్పారావ్. మీ చానెల్‌కి ఓ మంచి కిక్కిచ్చే బ్రేకింగ్ న్యూస్ చెబుదావని ఫోన్ చేశాను. కాబట్టి పెద్ద జర్నలిస్ట్ ఎవరికైనా తొందరగా ఫోన్ ఇవ్వండి” అన్నాడు .

“ముందు విషయం చెప్పండి, నిజంగా మీరు చెప్పిన విషయంలో మసాలా ఉంటే అప్పుడు ఇస్తాను” అంది ఆ రిసెప్షనిస్ట్.

“సరే, కొద్ది సేపటి క్రితం మన విశాఖ రైల్వే స్టేషన్‌లో బాంబు పెడతాం అని ఓ నలుగురు ఉర్దూలో మాట్లాడుతుంటే, కళ్ళారా చూసేసి, చెవులారా విన్నానండీ. పరిస్థితి విషమించక ముందే, ఈ విషయం మీ చెవిలో వేద్దామని ఇలా ఫోన్ చేశాను.”

ఆ మాట వింటూనే కళ్ళు పెద్దవి చేస్తూ, “నిజవా” అంటూ పెద్దగా అడిగింది .

“అబద్దాలు చెప్పాల్సిన పని నాకెందుకు. అమ్మ తోడు” నెత్తిన చెయ్యి పెట్టుకుంటూ అన్నాడు .

“అలాగా, అయితే ఒక్క నిమిషం ఉండండి” అంటూ అతని కాల్‌ని హోల్డ్‌లో పెట్టి , విషయం సీనియర్ జర్నలిస్టుకి చెప్పి, ఆ కాల్ వెంటనే ఆయనకి ఫార్వార్డ్ చేసింది. అతను లైన్ లోకి వస్తూ, ‘ఈ రోజు నక్క తోకని పచ్చడిగా తొక్కేసి ఆఫీసుకి వచ్చేసినట్టున్నాను. పెద్ద బ్రేకింగ్ న్యూస్ రాబోతున్నట్టుంది. ఈ దెబ్బతో మన చానెల్ టి.ఆర్.పి. రేటింగ్ ఆకాశాన్ని అందుకోవాలి’ అని లోలోన తెగ సంబర పడిపోయి “హలో, ఆ బాంబుని ఎక్కడ పెడుతున్నారు. కొంచెం డీటైల్‍గా చెప్పండి” అన్నాడు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బై పోతూ.

“ఆ వివరాలూ అవీ మరింత వివరంగా చెప్పాలంటే, ఓ యాభై వేలు ఈ నెంబర్‌కి ఆన్లైన్ పే చేయి” అన్నాడు అప్పారావ్ నిర్లక్ష్యంగా.

అప్పారావ్ మాటలు వింటూనే కాస్త కోపంగా “వేళాకోళంగా ఉందా, నువ్వు డబ్బు తీసుకుని మోసం చేస్తే, ముక్కు, మూతి, తెలియని నిన్ను ఎలా నమ్మడం” అడిగాడు ఆ జర్నలిస్టు.

“వేళాకోళo లేదూ, శ్రీకాకోళం లేదూ. నేనండీ, గుర్తుపట్టలేదా! ఓ సారి ఇక్కడ డ్రగ్స్ తరలిస్తున్నారు అని ఇరవై వేలు తీసుకుని మీకు పూర్తి సమాచారం ఇచ్చాను కదా. మీరు ఆ న్యూస్ టీవి లో వేసీ వెయ్యగానే, ఆ డ్రగ్  గాంగ్ తప్పించుకుంది. కానీ మీ చానెల్‌కి భలే పేరొచ్చింది. గుర్తొచ్చిందా, ఆ సమోసాల అప్పారావ్ నేనే, ఇంకా మీకు డౌటానుమానం ఉంటే చెప్పండి, ఇంకో చానల్‌కి ఫోన్ చేసి విషయం చెప్పి, వాళ్ళ దగ్గిరే రాజాలా డబ్బు తీసుకుంటాను. ఇలాంటి వాటి గిరాకీ మీకు తెలుసు కదా” అన్నాడు

 “సర్లే , నువ్ ఇలా చెప్పగానే నీకు భయపడిపోయి చిత్తం మహాప్రభో అని డబ్బులు నీ అక్కౌంట్‌లో వేసేయాలా, అదేదో మా వాళ్ళే వచ్చి అక్కడ మొత్తం తిరిగి అసలు వివరాలు తెలుసుకుంటారు” అన్నాడు జర్నలిస్టు.

“సరే అలాగే తగలడు, ఈలోపు నేను ఆరున్నర న్యూస్ చానెల్‌కి పూర్తి వివరాలు ఇచ్చి వాళ్ళ నుండే డబ్బు కూడా తీసుకుంటాలే. అప్పుడు వాళ్ళు దాన్ని వివరంగా వేసుకుంటారు. నేను కూడా చూసింది, చూడనిదీ మసాలా అద్ది మరీ, ఆ టీవి మైక్ ముందు చెప్తాను. అప్పుడు వాళ్ళ టీ.ఆర్.పి, చూసి కుళ్ళుకు చచ్చిపోదువు గాని, ఉంటాను” అన్నాడు అప్పారావ్ నిర్లక్ష్యంగా ఫోన్ పెట్టేయబోతూ.

“నో, నో, నో, అయ్యో ఉండవయ్యా అప్పారావ్, వేస్తాను. ఇంతలోనే అంత కోపం ఎందుకు. మా జాగ్రత్తలో మేం ఉండాలి కదా, అందుకే నిన్ను కొంచెం గట్టిగా టెస్ట్ చేశా” అని తన ఫోన్ తీసి డబ్బు వేశాడు.

ఆ డబ్బు వచ్చిందని తన మొబైల్‍లో చూసుకున్న అప్పారావ్, “అన్ని ఛానెల్స్ మీలా ఉంటే ఎంత బావుండునండీ” అని ఓ క్షణం తర్వాత “అదీ మరీ, ఇప్పుడు చెప్తాను రికార్డు చేసుకోండి. ఖచ్చితంగా చెప్పాలంటే, ఓ నలుగురు వ్యక్తులు, స్నానం అదీ చేసి ఓ వారం అయినా అయుంటుంది. బట్టలు బాగా మాసిపోయాయి. అందరికీ బాగా గడ్డం పెరిగింది. వాళ్ళు ముక్కుతో ఏదో పీలుస్తూ, ఆ బాంబుని ఇక్కడి నుండి బయలుదేరే రైల్లో పెట్టాలని మాట్లాడుకున్నారు. నేను నా చెవులారా విన్నాను”

“అలాగా, మంచి పని చేశావ్. ఇంతకీ అది ఏ రైలు, ఏ ఫ్లాట్ ఫామ్ మీద ఉంది” అంటూ గబ గబా బోలెడు ప్రశ్నలు అడిగేస్తున్నాడు, ఓ పక్క టి.వీ.లో ఎక్స్‌క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ కూడా వేసేయమన్నాడు .

“అవన్నీ పూస గుచ్చినట్టు చెప్తా కానీ, ఇదే నెంబర్‌కి ఇంకో యాభై వేలు పంపు మరి. టైమ్ లేదు” చెప్పాడు అప్పారావ్ చుట్ట వెలిగిస్తూ.

“టైమ్ నీది, వేయక చస్తానా, వేస్తా” అని వేసేసాడు.

“అది బెంగాల్  వెళ్ళే రైలు, ఫ్లాట్ ఫారం నాలుగు మీద ఉంది” చెప్పాడు.

“చంపావ్ రా నాయనా, అందులో మా చానెల్ సి.ఈ.ఓ. కుటుంబం కూడా ఉంది. ఇంతకీ ఏ కోచ్” అడిగాడు ఆత్రుతగా బుర్ర గోక్కుంటూ

“చెప్తాను, కానీ చివరిగా కొసరు ఓ పదివేలు వేయి” అనగానే

“ఆ ఆ వేస్తాను” అని క్షణం తర్వాత, “ఆ వేసేసాను చూడు” అన్నాడు.

“సరే అది ఏ.సి. బోగీ, నెంబర్ ఫోర్ కోచ్, ఇంకా అరగంటే టైమ్ ఉంది చూస్కో” చెప్పి ఫోన్ పెట్టేశాడు

ఆ వార్త స్క్రోలింగ్‌లో చదివిన సీ.ఈ.ఓ.కి గుండె గుబేలుమంది. వెంటనే ఎవరో తరిమినట్టు, పరుగున తన రూమ్ నుండి బయటికి వచ్చి, “మీ దుంపల్ తెగ, ఏంటి మీరు చేస్తున్నది? వివరాలన్నీ వెంటనే పోలీసులకి చెప్పండి. నా కుటుంబం రిస్క్‌లో ఉంది. మీరు ఇలా ఆలస్యం చేస్తారేంటి, ఇడియట్స్, వాళ్ళు నా భార్య బిడ్డలు” అరిచాడు టెన్షన్‌గా.

“ఏంటి సార్, ఈరోజు కొత్తగా మాట్లాడతున్నారూ, పోయిన నెల నాలుగు మర్డర్లు చేసి పోలీసులకి దొరకని ఓబులేసుని మనం ఇంటర్వ్యూ చేశాం. అలాగే ఎవరూ పట్టుకోలేని డ్రగ్ దందా మనవే బయట పెట్టాం. ఇవన్నీ ముందు మనం పోలీసులకి చెప్పామా. ఇదీ అంతే, మనకి రేటింగ్స్ కావాలి. సెన్సేషనల్ న్యూస్ కావాలి. అదేగా మీరు మాకు నూరిపోసింది .పైగా, నేనూ ఇందులో పార్టనర్‌నే. ఇప్పటికే టి.ఆర్.పీ. బాగా పెరిగింది. ఇంకాస్త పెరగనివ్వoడి. అయినా ఇంకా పేలడానికి అరగంట సమయం ఉందట. పావుగంట వరకూ ఈ బ్రేకింగ్ వేసి, అప్పారావ్ రికార్డింగ్స్ వినిపించి, ఆ తర్వాత కొంచెం మసాలా అద్ది, ఆ తరువాత పూర్తి వివరాలు పోలీసులకి చెప్పేద్దాం” అన్నాడు తేలిగ్గా.

సీ.ఈ.ఓ.కి ఒక్కసారే బుర్ర గిర్రున తిరిగిపోయింది. తన చానల్ ముందుకు దూసుకు వెళ్లడానికి ఇలాంటివి చాలా చేశాడు. కానీ మొదటిసారిగా, తన చానల్ మానవత్వంలో ఎంత వెనక్కి వెళ్లిపోయిందో అర్థం చేసుకున్నాడు. తెలిసిన వివరాలు తానే పోలీసులకి చెప్పాలని ఫోన్ తీశాడు. కానీ ఈ లోపు గుండె నొప్పి రావడంతో కింద పడ్డాడు. వెంటనే కెమెరామెన్ పరిగెత్తుకుంటూ అతని వైపు రావడం చూసి “హమ్మయ్య, ఈ దరిద్రుడికైనా కొంచెం మానవత్వం ఏడ్చినట్టుంది” అనుకున్నాడు మనసులో. ఆ కెమరామెన్, అలా వేగంగా వచ్చి, వచ్చి అతని మొహంపై కెమెరా పెట్టాడు. ఆ జర్నలిస్ట్ వచ్చి, “తీవ్రవాద చర్యను తట్టుకోలేక మా చానెల్ సీ.ఈ.ఓ. గారికి గుండెపోటు వచ్చింది, చూస్తున్నారా” అని చెప్పుకుంటూ పోతున్నాడతను.

అంత నొప్పి లోనూ, ఆ ఇద్దరి వంకా చూస్తూ, వ్యంగ్యంగా ఓ నవ్వు నవ్వాడు ఆ సీ.ఈ.ఓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here