రాత్రి

1
8

[మణి గారు రచించిన ‘రాత్రి’ అనే రచనని పాఠకులకి అందిస్తున్నాము.]


[dropcap]రా[/dropcap]త్రి వస్తూనే, కూడా తీసుకువచ్చిన చీకటి తెరలతో, ప్రపంచాన్ని కప్పివేస్తుంది. నక్షత్రాలతో ఆకాశాన్ని అలంకరిస్తుంది. చంద్రుడు చల్లని వెన్నెలని బంగారు కిరణాలతో వ్యాపింప చేస్తూ అన్నిటిని పర్యవేక్షిస్తూంటాడు.
నక్షత్రాలు, అందమయిన మెరుస్తున్న పెద్ద కళ్ళతో అంతటినీ అవలోకిస్తూ వుంటాయి.
ప్రతి రోజూ ప్రకృతి చేసే గారడీ ఇది. అయినా ఎప్పుడూ క్రొత్తగానే వుంటుంది.
నల్లని ఆకాశం, చీకటి నిశ్శబ్దం, పలకరిస్తే చాలు ఎన్నో ఊసులు చెప్పే నక్షత్రాలు. వెన్నెలని, వెన్న ముద్దలా నింపుకొని కాస్తకాస్త చిలకరిస్తూన్న చంద్రుడు.
ఆ నిశ్శబ్దాన్ని మనోహర పరుస్తూ సన్నగా మధురంగా దూరం నుంచి వినిపిస్తున్న ఘజల్.
గాలి ఆ పాట మాటల బరువు మోయలేక పోయింది కాబోలు స్పష్టంగా లేదు. కానీ సంగీత స్వర ధ్వనిని మాత్రం ఊపిరిలో నింపుకొని అంతట వెదజల్లుతూ రసవంతం చేస్తోంది. అది ఉస్తాద్ సుజాత హుసైన్ ఖాన్ గొంతులావుంది. సితారా స్వర రాగంతో నిశ్సబ్దాన్ని రసమయం చేస్తోంది.
భావ గర్భితం కూడా చేస్తోంది.
రాత్రి దేవిని ప్రసన్నం చేసుకొనేందుకు భక్తుడు చేసే పూజలా వుంది ఆ అలాపన.
గుండెలని పిండేస్తూ, హృ దయ అంతరాల్లోకి చొచ్చుకువెళుతూ, నన్నూ ఆ చీకటి లోతుల్లోకి లాక్కు వెళ్తూంది.
గుండెలు బ్రద్దలు అవుతాయెమో అనిపించేటంత బాధ. అయినా అదో సుఖం. ఆ సుఖం నా అస్తిత్వాన్ని కొల్లగొట్టి నన్నూ నిశ్శబ్దం లోకి కలిపేస్తొంది.
అర్ధం కాని సుఖ వేదన. అర్థం చేసుకోవల్సిన అవసరం కూడా లేదనే విజ్ఞత.
క్షణాలు రంగు రంగుల బుడగల లాగ పరిగెడుతున్నాయి. పగిలి రంగులు వెదజల్లు తున్నాయి. పరిగెడుతున్న క్షణాల, రంగుల ప్రవాహం లోకి కొట్టుకు పోతున్న నేను, ఏ తీరాన్ని చేరుతానో, మళ్ళి నన్ను పొందుతానో, లేదో, తెలియదు. తెలియాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే, ఏ ఆలోచనలు, ఏ సందేహాలు, ఏ భయాలు భంగపరచని అలౌకిక సుఖం అది.
నన్ను కోల్పోతే మాత్రం ఏమవుతుంది. ఆ చీకటిలో, ఆ నిశ్శబ్దంలో,ఆ రాగాలలో, ఆ నక్షత్రాల వెలుగులలో, నన్ను పోగొట్టుకుంటే మాత్రం ఏమైంది. నేను అంటూ ఏమీ లేకపోతే మాత్రం ఏమైంది.
అందుకే,
చీకటి లోతులు, మనోహర గీతాలని నింపుకున్న నిశ్శబ్ద రాగాలు, నక్షత్ర కాంతుల కిరణాల వెలుగులు,
అలౌకికమైన అందాల ఆ ప్రపంచంలో నేను కరిగిపోతాను.. ఈ నేను అనే హద్దుని తుడిపేస్తూ
అప్పుడు నేనే,
ఆ అందాలు అన్నీ!
ఆ సుఖాలన్నీ!
ఆ సంగీతాలన్నీ!
ఆ వెలుగులు అన్నీ! అన్నీ నేనే!..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here