రౌద్రం ఒక ఆయుధం… నీపై… నాపై!

0
13

[dropcap]ఈ[/dropcap] మధ్య మణిరత్నం నిర్మించిన ‘నవరస’ (2021) అనే తమిళ సీరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో చూశాను. తెలుగు డబ్బింగ్ కూడా అందుబాటులో ఉండటంతో తెలుగు మాటలతోనే చూశాను. తొమ్మిది రసాలు ప్రధానాంశాలుగా తొమ్మిది కథలు ఉన్నాయి. మంచి కథలు. చివరి రెండు కథలు కొంచెం బలహీనమైనవని అనిపించాయి. నాకు అన్నిటి లోను బాగా నచ్చిన కథ భీభత్స రసం అంశంగా తీసిన ‘పాయసం’ అనే కథ. ఈ వ్యాసంలో రౌద్ర రస కథ ‘రౌద్రం’ గురించి ప్రస్తావిస్తాను. అరవింద్ స్వామి దర్శకత్వం వహించి కథ ఇది. ఎ. ఆర్. రెహమాన్ సంగీతం, సంతోష్ శివన్ ఫొటోగ్రఫీ అందించారు. పూర్తి కథ ప్రస్తావించబోతున్నాను. సీరీస్ చూడని వాళ్ళు సెరీస్ లోని ఏ కథా తెలుసుకోవద్దు అనుకుంటే కింద చుక్కలు వచ్చే చోటుదాకా చదవటం మానేసి ఆ కింద చదవవచ్చు.

కథ మొదట్లో ఒక వడ్డీ వ్యాపారి మీద అరుల్ అనే కుర్రాడు రౌద్రంగా దాడి చేస్తాడు. సుత్తితో మొహం మీద బలంగా కొట్టటంతో ఆ వ్యాపారి తీవ్రంగా గాయపడతాడు. అతణ్ణి ఆసుపత్రిలో చేరుస్తారు. పోలీసులు అరుల్‌ని పట్టుకుని విచారణ చేస్తారు. అతను కారణం చెప్పటానికి నిరాకరిస్తాడు. ఒక మహిళా పోలీసాఫీసర్ ఆసుపత్రికి వెళ్ళి గాయపడిన వ్యక్తితో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది. అతను కోమాలో ఉన్నాడని తెలుస్తుంది. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి విచారణ గదిలోకి కోపంగా వెళ్ళబోతుంటే కానిస్టేబుల్ ఆపుతుంది. గతంలో ఖైదీని కొట్టి సస్పెండ్ అయ్యావు కదా, విచారణ మిగతా పోలీసులకి వదిలెయ్యమంటుంది. చిన్న చిన్న ఫ్లాష్‌బ్యాక్ లలో జరిగిన కథ తెలుస్తుంది. అరుల్ తన తల్లి, చెల్లితో కలిసి ఉంటుంటాడు. తండ్రి ఊరంతా అప్పులు చేసి పారిపోయాడు. అప్పులవాళ్ళు తల్లిని బెదిరిస్తుంటారు. ఆమె పాచిపని చేసి పిల్లలని పోషిస్తుంటుంది. కూతురు చదువులో శ్రద్ధ కలది. అరుల్ ఫుట్‌బాల్ ఆటగాడు కావాలనుకుంటాడు. పిల్లలిద్దరూ భవిష్యత్తు గురించి ఆందోళన పడుతుంటే తల్లి చాటున కన్నీరు పెట్టుకుంటుంది.

వడ్డీ వ్యాపారి ఇంట్లో పని చేస్తుంటుంది తల్లి. అరుల్ తల్లిని అతని దగ్గర వడ్డీ లేని అప్పు అడగమని చెబుతాడు. డబ్బు తెస్తుంది తల్లి. కుటుంబమంతా రెస్టారెంట్లో భోజనం చేస్తారు. ఫుట్‌బాల్ షూస్ కొనుక్కుంటాడు అరుల్. చెల్లి బట్టలు కొనుక్కుంటుంది. ఇక్కడ ఫ్లాష్‌బ్యాక్ నుంచి ప్రస్తుతానికి వస్తుంది కథ. చెల్లి కనపడకుండా పోయిందని అరుల్‌కి చెబుతారు పోలీసులు. అయినా నోరు విప్పడు. మళ్ళీ ఫ్లాష్‌బ్యాక్ లోకి వెళితే ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అరుల్ నగదు బహుమతి గెలుచుకుంటాడు. కొంత డబ్బు వడ్డీ వ్యాపారికి ఇవ్వాలని వాళ్ళ ఇంటికి వెళతాడు. అక్కడ కిటికీ లోంచి చూస్తే తల్లి వడ్డీ వ్యాపారి పక్కలో కనిపిస్తుంది. తట్టుకోలేక వెళ్ళిపోతాడు. బజార్లో వడ్డీవ్యాపారి మీద దాడి చేస్తాడు. అతను చనిపోయాడని తెలిశాక పోలీసులకి అసలు విషయం చెబుతాడు. పోలీసాఫీసర్ విచారణ గదిలోకి వస్తే అక్కడ వేరే నిందితుడు ఉంటాడు. ఇంతకీ ఆ పోలీసాఫీసర్ భవిష్యత్తులో అరుల్ చెల్లి. ఆమె చూస్తున్నది వేరే కేసు. స్క్రీన్ ప్లే రచయితలు తెలివిగా భవిష్యత్తు కథని కూడా కలిపి చెప్పారు. పోలీసాఫీసర్‌కి అన్న అరుల్ నుంచి ఫోన్ వస్తుంది. తల్లి కొన ఊపిరితో ఉందని, ఆమెని చూడాలని తపిస్తోందని చెబుతాడు. తల్లికి వడ్డీవ్యాపారితో సంబంధముందని అరుల్‌కి తెలిసిన రోజునే అతని చెల్లికి కూడా తెలుస్తుంది. ఆమె ఇల్లు విడిచి పారిపోతుంది. తల్లి మీద కోపం. అప్పటి నుంచి తల్లి దగ్గరకు వెళ్ళదు. “అంత కోపమేంటే నీకు?” అంటాడు అరుల్. కోపం తనని చెదపురుగు లాగా తొలిచేస్తోందని, తాను క్షణక్షణం చస్తున్నానని శోకిస్తుంది అతని చెల్లి.

అరుల్‌దే రౌద్రమని చివరి దాకా అనుకున్న మనకి అతని చెల్లి మనసులో ఉన్న రౌద్రం తెలుస్తుంది. అరుల్ తల్లిని అర్థం చేసుకున్నాడు. “మన కోసమే కదా అమ్మ ఆ పని చేసింది” అంటాడు. అతని దృష్టిలో తప్పంతా వడ్డీవ్యాపారిదే. అతన్ని చంపి తన కసి తీర్చుకున్నాడు. శిక్ష అనుభవించి బయటికి వచ్చాడు. కానీ అతని చెల్లి రోజూ శిక్ష అనుభవిస్తూనే ఉంది. కారణం ఆమె కోపం. అపరాధభావం నుంచి వచ్చిన క్రోధం. నా వల్ల తల్లి ఆ పని చేసింది. కానీ అంతకంటే దారి లేదా? అంత నీచానికి ఎలా ఒడిగట్టింది? నేనే లేకపోయి ఉంటే అలాంటి పని చేసేదా? ఇలా నిత్యం ఆలోచిస్తూ ఉంటుంది. తలిదండ్రుల మీద కోపం ఉంటే అది నరకమే. నా తప్పా అనే ప్రశ్న తొలిచేస్తూ ఉంటుంది. తల్లికి శిక్ష వేశానని అనుకుంటుంది. తల్లి కూడా ఎంతో వేదన అనుభవించి ఉంటుంది. కానీ అంతకంటే వేదన తాను అనుభవిస్తూ ఉంటుంది.

అరుల్ తన చెల్లి కన్నా ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాడని నా అభిప్రాయం. ఆమె తన కోపాన్ని ఇతరులపై చూపిస్తుంది. ఆమెది పోలీసు ఉద్యోగం కాబట్టి నేరస్థులు రోజూ తారసిల్లుతారు. కోపమంతా వారిపై చూపిస్తుంది. ఏదో ఒక రోజు ఆమె ఉద్యోగం పోయినా అశ్చర్యం లేదు. ఆమె కోపం ఆమెని నాశనం చేస్తోందని ఆమెకి తెలుసు. అయినా నిస్సహాయత. క్షమ ఉంటే ఈ నరకం నుంచి బయటపడవచ్చు. చెప్పినంత తేలిక కాదు.

మన సినిమాల్లో హీరో రౌద్రం చూడటం మనకలవాటే. కానీ రౌద్రమే కథాంశం కావటం ఇక్కడ ప్రత్యేకత. ఈ కథలో సంభాషణలు ఆకట్టుకుంటాయి. “ఆడది బంగారం. మగవాడు దాన్ని పొందాలని చూస్తాడు. దొరికితే ఇంకో బంగారం వెతుక్కుంటూ పోతాడు. బంగారం లాగే ఆడది కాలుతుంది. ఎలా కావాలంటే అలా వంగుతుంది.” “బంగారానికి వెల, విలువ ఉన్నాయి. కానీ ఆడదానికి వెలే కానీ విలువ లేదు.” ఇలాంటి మాటలు ఆలోచింపజేస్తాయి. అరుల్ చెల్లి ఇంటి నుంచి పారిపోయి పోలీసాఫీసర్ ఎలా అయిందని మనకి అనిపించవచ్చు. వారిద్దరూ భవిష్యత్తు గురించి మట్లాడుకుంటున్నపుడు అరుల్ ఆమెతో ఇంటి నుంచి పారిపోతే డబ్బున్న వాళ్ళు దత్తత తీసుకుంటారని అంటాడు. ఆ విధంగా రచయితలు ఆ అంశాన్ని కూడా స్పృశించారు. పట్టుకొట్టై ప్రభాకర్, సెల్వా, అరవింద్ స్వామి కలిసి స్క్రీన్ ప్లే అందించారు. అరవింద్ స్వామి దర్శకత్వం బావుంది. ఎడిటింగ్ అద్భుతంగా ఉంది. ఫొటోగ్రఫీ కథలో లీనమైపోయేలా చేస్తుంది. అరుల్‌గా శ్రీ రామ్, చిన్నప్పుడు చెల్లిగా అభినయశ్రీ, పెద్దయ్యాక చెల్లిగా రిత్విక చక్కగా నటించారు.

***

రౌద్రంలో క్షణికావేశం కలగటం, ఎంతవారైనా విచక్షణ కోల్పోవటం నిజజీవితంలో చూస్తూనే ఉంటాం. సినిమాల్లో హీరో హీరోయిన్లను రౌద్రానికి అతీతమైన వారిలా (విలన్ విషయంలో తప్ప) చూపిస్తూ ఉంటారు. కానీ హీరోయినే రౌద్రంలో తప్పు చేసిన చిత్రం హిందీలో వచ్చిన ‘బందినీ’ (1963). ఎంతటి సౌమ్యులైనా ఒక్కోసారి రాక్షసులుగా మారిపోతారనే అంశంతో బిమల్ రాయ్ తీసిన చిత్రమిది.

కళ్యాణి 1934లో ఒక జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉంటుంది. విషప్రయోగం చేసి ఒకరిని చంపటంతో ఆమెకి శిక్ష పడుతుంది. జైల్లో ఒక ఖైదీకి జబ్బు చేసినపుడు ఆమెని కనిపెట్టుకుని ఉండటానికి ఒక మనిషి అవసరం పడుతుంది. అది అంటురోగం కావటంతో అందరూ వెనకాడతారు. కళ్యాణి ముందుకొస్తుంది. అందరికీ చుట్టపక్కాలు ఉండబట్టి వారిని బలవంతపెట్టడం సరికాదని అంటుంది. తాను ఆ పని చేస్తానంటుంది. యువకుడైన జైలు డాక్టర్ ఆమె మంచితనానికి అబ్బురపడతాడు. నెమ్మదిగా అది ప్రేమగా మారుతుంది. అయితే కళ్యాణి అతని ప్రేమని తిరస్కరిస్తుంది. డాక్టర్ తన బంధువైన జైలర్‌కి తన ప్రేమ విషయం చెప్పి తన ఊరికి వెళ్ళిపోతాడు. జైలర్ అప్పటికే మంచి ప్రవర్తన కారణంగా కళ్యాణిని త్వరగా విడుదల చేయటానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. అతను కళ్యాణితో డాక్టర్‌ని పెళ్ళి చేసుకుంటే జీవితం బావుంటుందని చెబుతాడు. కళ్యాణి తన గతం కారణంగా ఆ పెళ్ళి చేసుకోలేనని చెబుతుంది. ఆమె గతమేంటో చెప్పమంటాడు.

గతంలోకి వెళితే కళ్యాణి, ఆమె తండ్రి నివసిస్తున్న ఊరికి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంటున్న బికాష్ వస్తాడు. కళ్యాణి తండ్రి దగ్గర మధురభక్తి కవితలు వినటానికి వస్తుంటాడు. స్త్రీలంటే అతనికి గౌరవం. స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో మంది స్త్రీలు తెరవెనుక ఉండి సహకారాన్ని అందిస్తున్నారని కళ్యాణితో అంటాడు. వారిద్దరూ ఒకర్నొకరు ఇష్టపడతారు. ఒక రాత్రి జ్వరంతో ఉన్న బికాష్ ఆమెని చూడాలనే కోరికతో ఆమె వద్దకు వస్తాడు. మొదట అతన్ని పంపించేయాలనుకున్నా వర్షం మొదలవటంతో అతన్ని ఆపేస్తుంది కళ్యాణి. ఊరంతా ఈ విషయం గుప్పుమంటుంది. కళ్యాణిని పెళ్ళి చేసుకుంటానంటాడు బికాష్. ఆమె తండ్రి ఒప్పుకుంటాడు. ఇంతలో పోలీసులు బికాష్‌ని అరెస్టు చేస్తారు. విడుదలైన తర్వాత మలేరియా వచ్చిందని, తగ్గాక వస్తానని ఉత్తరం రాస్తాడు. ఆ తర్వాత ఉత్తరాలు ఆగిపోతాయి. అతనికి పెళ్ళైపోయిందని కళ్యాణికి తెలుస్తుంది. ఊరివాళ్ళు ఆమెని, ఆమె తండ్రిని సూటిపోటి మాటలంటుంటారు. దీంతో కళ్యాణి ఊరు విడిచి వెళ్ళిపోతుంది.

స్నేహితురాలి సాయంతో పట్నంలో ఒక ఆసుపత్రిలో పనిమనిషిగా చేరుతుంది. అక్కడ హిస్టీరయా వ్యాధిగ్రస్తురాలైన స్త్రీకి పనిమనిషిగా ఉంటుంది. ఆవిడ మహాకోపిష్టి. కళ్యాణిని నానామాటలూ అంటూ ఉంటుంది. కళ్యాణి ఓపికగా సహిస్తూ ఉంటుంది. ఇంతలో కళ్యాణి తండ్రి అదే పట్నంలో యాక్సిడెంట్‌లో మరణించాడని తెలుస్తుంది. ఆమెని వెతుక్కుంటూ వచ్చాడాయన. తండ్రి శవాన్ని చూసిన కళ్యాణి స్థబ్ధురాలై ఆసుపత్రికి తిరిగి వస్తుంది. యజమానురాలు అమెని తిడుతూ తన భర్త వస్తున్నాడని, తామిద్దరికీ టీ ఇవ్వాలని ఆఙాపిస్తుంది. టీ తెచ్చిన కళ్యాణికి యజమానురాలి భర్త బికాష్ అని తెలిసి గుమ్మంలోనే టీ జారవిడుస్తుంది. యజమానురాలు బయటకి వచ్చి ఆమెని కొట్టి, తిట్టి గెంటివేస్తుంది. ఆ రాత్రి అమితమైన ఆగ్రహంతో కళ్యాణి ఆమెకి విషమిచ్చి చంపుతుంది. ఆసుపత్రి డాక్టర్ ఆత్మహత్య అనుకుంటాడు. బికాష్ తన భార్య చేత తిట్లు తిన్న పనిమనిషే చంపి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తాడు. కానీ ఆ పనిమనిషి కళ్యాణి అని తెలిసి ఖంగు తింటాడు. పోలీసులు వచ్చాక ఆత్మహత్యే అయి ఉంటుందంటాడు. కానీ కళ్యాణి తానే చంపానని అరిచి అరిచి చెబుతుంది. హత్య చేసినపుడు ఆమె మానసిక స్థితి సరిగా లేదని లాయరు వాదించటం వల్ల ఆమెకి కేవలం ఎనిమిదేళ్ళ జైలు శిక్ష పడుతుంది.

జైలర్ ఈ కథ తెలుసుకుని జైలు డాక్టర్ తల్లికి చెప్పి ఆమెని పెళ్ళికి ఒప్పిస్తాడు. కళ్యాణి విడుదలై డాక్టర్ దగ్గరకి బయల్దేరుతుంది. రైలు స్టేషన్ లో బికాష్ కనిపిస్తాడు. జబ్బుపడి ఉంటాడు. అతని సహాయకుడు అతను దేశం కోసం అంతా పోగొట్టుకున్నాడని అంటాడు. తన నాయకుల ఆదేశంతో పోలీసల రహస్యాలను తెలుసుకోవటానికి అతను ఒక పోలీసు అధికారి కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడని, ఆమె ఆత్మహత్య చేసుకుందని చెబుతాడు. ఒక డాక్టర్ కూడా లేని సొంత ఊరిలో శేషజీవితం గడపాలని వెళుతున్నాడని చెబుతాడు. బికాష్ కళ్యాణిని క్షమాపణ అడిగి ఆమె సుఖంగా ఉండాలని కోరుకుంటున్నానని చెబుతాడు. చివరికి కళ్యాణి అతని వెంటే వెళుతుంది.

ఇలాంటి స్త్రీ ప్రధాన చిత్రాలు అప్పట్లో చాలా అరుదు. హీరో హీరోయిన్లను పరమ పవిత్రులుగా చూపించే ఆ రోజుల్లో కళ్యాణి పాత్ర నిజంగా ఒక సాహసమే. కళ్యాణి చేయని నేరానికి శిక్ష అనుభవిస్తూ ఉండవచ్చని ప్రేక్షకులు చివరి దాకా అనుకుంటారు. ఎలాంటి మనిషిలోనైనా క్రౌర్యం ఉంటుందని, పరిస్థితుల ప్రభావంతో అది బయటికి వస్తుందని ఈ చిత్రంలో చూపించారు. కళ్యాణిగా నూతన్ నటించింది. భారతీయ సినిమా చరిత్రలో ఇది అత్యుత్తమ పెర్ఫార్మెన్స్ లలో ఒకటిగా నిలిచిపోయింది. బికాష్ గా అశోక్ కుమార్, జైలు డాక్టర్‌గా ధర్మేంద్ర నటించారు.

స్వాతంత్ర్యం కోసం అప్పటి యువకులు ఎన్ని త్యాగాలు చేశారో కూడా ఈ చిత్రంలో చూపించారు. తెరవెనుక ఆడవారు ఎన్ని బాధలు పడ్డారో తలుచుకుంటే కళ్ళు చెమరుస్తాయి. బికాష్ అంతా వివరిస్తూ ఉత్తరం రాసినా అప్పటికే కళ్యాణి, ఆమె తండ్రి ఊరు విడిచి వెళ్ళిపోవటంతో ఆ ఉత్తరం తిరిగి వస్తుంది. విధి అలా ఉంటుంది. సంఘం ఎవరి మానాన వారిని ఉండనివ్వదు. నిందలు వేస్తుంది. జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తుంది. క్షణికావేశంలో నేరాలు చేసి శిక్ష అనుభవిస్తున్న వారెందరో!

కళ్యాణికి కోపం బికాష్ మీద. అతని భార్యని చంపితే అతనికి శిక్ష వేసినట్టు అనుకుంటుంది. కానీ తాను చేసింది ఎంత అపరాధమో ఆమెకి ఆవేశం తగ్గగానే అవగతమౌతుంది. బికాష్ ఆమెని జైలులో కలుసుకోవటానికి వచ్చినా ఆమె అతని ఎదుటపడదు. “ఆయన అపరాధం కన్నా నా అపరాధం పెద్దది. ఆయనకు నా మొహం ఎలా చూపించను?” అంటుంది. అసలు విషయం విన్నాక అతనిది అపరాధం కాదని, త్యాగమని తెలుస్తుంది. తాను మహాపాపం చేశానని అర్థమౌతుంది. అతనికి తోడుగా ఉండటానికి అతని వెంటే వెళుతుంది.

చివర్లో వచ్చే “ఓ మాఝీ” పాటలో ఆమె మనసులోని భావాలను అద్భుతంగా ఆవిష్కరించారు కవి శైలేంద్ర. “మైఁ బందినీ పియా కీ, మైఁ సంగినీ హూఁ సాజన్ కీ” (నేను బందీని నా స్వామికి, నేను సఖిని నా ప్రియునికి), “గుణ్ తో నహీఁ హై కుఛ్ భీ, అవగుణ్ మెరే భులాదేనా” (సుగుణాలేమీ లేవు నాలో, నా అవగుణాలు విస్మరించు) అనే పంక్తులు మనసుకు హత్తుకుంటాయి. రౌద్రం అనే అవగుణం మరచిపో అని అతన్ని మనసులోనే కోరుతుంది. ఈ పాటను సంగీత దర్శకుడు ఎస్. డి. బర్మన్ స్వయంగా పాడారు. ఆత్మను తాకే గాత్రమాయనది.

జరాసంధ అనే కలం పేరుతో చారుచంద్ర చక్రవర్తి రాసిన ‘తామసి’ అనే నవల ఈ చిత్రానికి ఆధారం. జైలర్‌గా పని చేసినప్పటి తన అనుభవాల ఆధారంగా ఆయన ఈ కథ అల్లారు. తన చిత్రాలలో వాస్తవికతకు, సహజత్వానికి పెద్ద పీట వేసిన బిమల్ రాయ్ దర్శకత్వం వహించిన చివరి చిత్రమిది. ఈ చిత్రానికి ఉత్తమ హిందీ చిత్రంగా జాతీయ అవార్డు వచ్చింది. ఫిలింఫేర్ అవార్డులలో ఉత్తమ చిత్రం, ఉత్తమ కథ, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి అవార్డులు వచ్చాయి. కళ్యాణి రౌద్రంతో రగిలిపోయే సన్నివేశాలలో దోబూచులాడే కాంతితో ఆమె ముఖంలోని భావాలని చూపించిన ఛాయాగ్రాహకుడు కమల్ బోస్‌కు, సమ్మెట శబ్దంతో ఆమెలోని ఘర్షణని విశదపరిచిన సౌండ్ ఇంజినీర్ దిన్షా బిలిమోరియాకు కూడా ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి.

***

తనకు జరిగిన అన్యాయానికి రక్షణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఏ పరిష్కారం చూపించకపోతే ఆ రౌద్రంలో కొందరు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుంటారు. ఇలాంటి కథలు మనం ఎన్నో చూశాం. కానీ వీటిలో సహజత్వం లోపించిన చిత్రాలే ఎక్కువ. ఈ ఇతివృత్తంతో హృద్యంగా నిర్మించిన చిత్రం ‘ద సీక్రెట్ ఇన్ దెయిర్ ఐస్’ (2009) అనే స్పానిష్ చిత్రం.

ఆర్జెంటీనాలో 1974లో ఒక యువతి హత్యాచారం కేసుని విచారిస్తుంటారు న్యాయాధికారి బెంజమిన్, అతని మహిళా అధికారి ఇరెనె. నేరస్తుడికి జీవిత ఖైదు పడేలా చేస్తానని యువతి భర్త రికార్డోతో అంటాడు బెంజమిన్. ఇంతలో ఇద్దరు వలస కార్మికులను హింసించి బలవంతంగా నేరం ఒప్పిస్తాడు రొమానో అనే అధికారి. అది తప్పుడు అభియోగమని నిరూపిస్తాడు బెంజమిన్. చనిపోయిన యువతి ఫొటోలలో కనిపించిన గోమెజ్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా ఉండటం గమనిస్తాడు బెంజమిన్. అతని ఊరికి వెళ్ళి అతని తల్లి ఇంట్లోకి ప్రవేశించి అతను రాసిన ఉత్తరాలని దొంగిలించి తెస్తారు బెంజమిన్, అతని సహచరుడు. ఈలోగా గోమెజ్ మీద అనుమానం ఉన్న సంగతి తెలిసిన మృతురాలి భర్త రికార్డో గోమెజ్‌కి ఫోన్ చేసి నిలదీస్తాడు. దీంతో గోమెజ్ జాగ్రత్తపడి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. దొంగిలించిన ఉత్తరాల వల్ల లాభమేమీ ఉండకపోగా చట్టవిరుద్ధంగా ప్రవర్తించినందుకు పై అధికారి బెంజమిన్‌ని, అతని సహచరుణ్ని హెచ్చరిస్తాడు. కేసు మూసివేయబడుతుంది.

ఒక సంవత్సరం తర్వాత బెంజమిన్‌కి రికార్డో ఒక రైలు స్టేషన్లో కనబడతాడు. గోమెజ్ కోసం వివిధ రైలు స్టేషన్లలో కాపలా కాస్తున్నానని చెబుతాడు. అతని వేదన చూసి తన అధికారి ఇరెనెకి చెప్పి కేసు మళ్ళీ తెరిపిస్తాడు బెంజమిన్. దొంగిలించిన ఉత్తరాలలో ఉన్న కొన్ని సంకేత నామాల ద్వారా గోమెజ్ ‘రేసింగ్’ అనే ఫుట్‌బాల్ జట్టు అభిమాని తెలుస్తుంది. మనిషి తన ఉనికిని దాచగలడు కానీ తన తీవ్రమైన అభిమానాన్ని (ప్యాషన్) దాచలేడని రేసింగ్ జట్టు మ్యాచ్ ఆడే స్టేడియంలో మాటువేస్తారు. గోమెజ్ అక్కడ దొరుకుతాడు. ఇరెనె, బెంజమిన్ గోమెజ్‌ని విచారిస్తారు. మొదట ఒప్పుకోకపోయినా ఇరెనె తెలివిగా అతని పుంస్త్వం మీద అనుమానం వ్యక్తం చేయటంతో గోమెజ్ అహం దెబ్బ తిని తానే నేరం చేశానని బయటపెడతాడు. అతనికి శిక్ష పడుతుంది. కానీ బెంజమిన్‌పై పగ పెంచుకున్న న్యాయాధికారి రొమానో గోమెజ్‌ని బెయిల్ మీద విడిపించి అతనికి ఒక రాజకీయ పార్టీలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం ఇప్పిస్తాడు. రాజకీయబలం ఉండటంతో గోమెజ్‌కి ఇక శిక్ష పడదని రికార్డోకి చెబుతాడు బెంజమిన్.

బెంజమిన్‌ని చంపటానికి గోమెజ్ పంపిన గూండాలు పొరపాటున అతని సహచరుణ్ణి చంపుతారు. బెంజమిన్ చాలా బాధపడతాడు. తన ప్రాణాలకి ముప్పు ఉందని అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. కొన్నేళ్ళకి గోమెజ్ అదృశ్యమయ్యాడని తెలుస్తుంది. 25 ఏళ్ళు గడిచాక బెంజమిన్ ఈ ఉదంతంపై ఓ నవల రాయటం మొదలుపెడతాడు. అయితే ఒకసారి రికార్డోని కలిస్తే స్పష్టత రావచ్చని అతని కోసం వెతుకుతాడు. అతను 1975లో ఊరికవతల జనసమ్మర్దం లేని ప్రాంతానికి నివాసం వెళ్ళాడని తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి అతన్ని కలుస్తాడు బెంజమిన్. మొదట అతనిపై కోపం వ్యక్తం చేస్తాడు రికార్డో. తన సహచరుడు తనని రక్షించటానికి కావాలనే తన ప్రాణాలు అర్పించాడని అంటాడు బెంజమిన్. ఈ కేసు వల్లే అతను చనిపోయాడని అంటాడు. అప్పుడు రికార్డో తాను గోమెజ్‌ని కాపు కాసి, ఒంటరిగా ఉన్నపుడు కిడ్నాప్ చేసి చంపేశానని చెబుతాడు. బెంజమిన్ అక్కడి నుంచి బయల్దేరుతాడు. అయితే అతనికి ఏదో అనుమానం వస్తుంది. గోమెజ్ పట్టుబడాలని రికార్డోకి ఎంత తీవ్రమైన ఆకాంక్ష (ప్యాషన్) ఉండేదో గుర్తు వస్తుంది. తిరిగి వెళ్ళి వెనకదారి నుంచి రికార్డో ఇంటి వెనకకి వెళ్ళి చూస్తాడు. కొంతసేపటికి రికార్డో భోజనం పళ్ళెంతో ఇంటి వెనక షెడ్ లోకి వెళతాడు. అక్కడ గోమెజ్ బందీ అయి ఉంటాడు. బెంజమిన్‌ని చూసి “అతన్ని నాతో మాట్లాడమని చెప్పు” అంటాడు. రికార్డో బెంజమిన్‌తో “జీవిత ఖైదు పడుతుందని చెప్పారుగా” అంటాడు.

న్యాయ వ్యవస్థ చేయలేకపోయిన పనిని స్వయంగా చేశాడు రికార్డో. గోమెజ్‌కి జీవిత ఖైదు వేశాడు. అయితే తనకు తానే జీవిత ఖైదు వేసుకున్నాడు. గోమెజ్‌తో మాటలాడడు. రోజంతా గోమెజ్ ఒంటరిగా ఉంటాడు. అలాగే రికార్డో కూడా ఒంటరిగానే ఉంటాడు. అవినీతి నిండిన వ్యవస్థకి బలి అయిన జీవితమిది. కానీ అతని రౌద్రంలో కూడా శాంతం ఉండటం అద్భుతం! రొమానో అడ్డుపడకుండా ఉంటే గోమెజ్‌కి ప్రభుత్వమే శిక్ష వేసేది. రికార్డో కొత్త జీవితం ప్ర్రారంభించేవాడు. కానీ రొమానో అహంకారంతో, స్వార్థంతో న్యాయం జరగకుండా అడ్డుపడ్డాడు.

1974 లో అధ్యక్షుడు హువాన్ పెరోన్ మరణించాక్ ఆర్జెంటీనాలో రాజకీయ హింస పెరిగింది. ఇది తెలియని వారికి ఈ చిత్రం లోని అరాచకాలు వింతగా అనిపించవచ్చు. 1976 నుంచి 1983 దాకా సైన్య పాలనలో వామపక్షవాదులను అణచివేసే ‘డర్టీ వార్’ (మలిన యుద్ధం) నడిచింది. ఆ సమయంలో ఎన్ని అకృత్యాలు జరిగాయో, ఎంతమంది నేరస్థులు శిక్ష పడకుండా తప్పించుకున్నారో లెక్క లేదు. అలాంటి ఒక నేరస్థుడిని ఒక వ్యక్తి తన భార్య మీద ప్రేమతో తన జీవితాన్ని పణంగా పెట్టి శిక్షించాడంటే అది ప్రేమకు పరాకాష్ఠ. అందుకేనేమో ఈ చిత్రం ఆర్జెంటీనా చరిత్రలోనే అత్యంత విజయవంతమైన చిత్రంగా నిలిచింది. ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్ అందుకుంది. దర్శకుడు హువాన్ హోసె కాంపనెజ్జా ఈ అవార్డును అందుకున్నాడు. ఉత్తమ విదేశీ చిత్రం అవార్డును నిర్మాతకు కాకుండా దర్శకుడికి ఇవ్వటం సంప్రదాయం.

చిత్రంలో బెంజమిన్, ఇరెనె మధ్య అంతర్లీనంగా ప్రేమకథ నడుస్తుంది. కానీ ఆమెకు తాను తగననే భావంతో అతను ఎప్పుడూ బయటపడడు. రాజకీయ పరిస్థితుల ప్రభావం కూడా ఉంటుంది. చివరికి రికార్డో వల్ల ప్రేమ మీద నమ్మకం కలిగి ఆమె వద్దకు వెళతాడు… 25 ఏళ్ళ తర్వాత!

స్టేడియంలో గోమెజ్‌ని వెంటాడి పట్టుకునే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. ఒకే షాట్లో మొత్తం సన్నివేశం తీసినట్టు అనిపిస్తుంది కానీ కెమెరా గాల్లో ఎగిరితే గానీ అది సాధ్యం కాదని అనిపిస్తుంది. డ్రోన్ కెమెరాలు అప్పట్లో లేవు. ఎలా తీశారో? ఇంగ్లీష్‌లో ఈ సినిమా రీమేక్ చేసినప్పుడు కూడా ఈ సినిమాని ఇంత గొప్పగా తీయలేకపోయారు. ఇంగ్లీష్‌లో మృతురాలి భర్త పాత్రని మృతురాలి తల్లి పాత్రగా మార్చారు. ఎందుకో మరి?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here