రాయడానికి ఏమీ లేదు

    9
    6

    [box type=’note’ fontsize=’16’]సైన్యంలో పనిచేసే తండ్రులను పోగొట్టుకున్న పిల్లల మనోవేదనని వైభవ్ పాథక్ ఆంగ్లంలో అక్షరబద్ధం చేయగా, పసిపిల్లల వ్యథని హృదయాన్ని తాకేలా తెలుగులో అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్. [/box]

    “ఏం రాయాలో నాకేమీ అర్థం కావడం లేదు” అంది ఆ పిల్లాడి పక్కన కూర్చున్న అమ్మాయి. నిజమే! అతనిదే కాదు, మొత్తం తరగతిలోని పిల్లలందరిదీ ఇదే సమస్య. స్వాతంత్ర్య దినం సమీపిస్తుండడంతో… ఆ వేడుకని ఎలా జరుపుకోవాలో తెల్పుతూ పలు దిశల నుంచి సూచనలు వచ్చాయి. డిపార్టుమెంట్ చైర్‌పర్సన్ నుంచి వచ్చిన సూచన ఏంటంటే – విద్యార్థులందరూ సరిహద్దుల వద్ద ఉండే సైనికులకి ఉత్తరాలు రాయాలని! ఇదొక చక్కని ప్రేరణగా ఉంటుందని ఆయన భావన. వాళ్ళ నాన్నకి ఆయన చిన్నప్పుడు రాసిన మొదటి ఉత్తరాన్ని గుర్తు చేసుకున్నాడు. వాళ్ళ నాన్న ఒకసారి ఇంటికొచ్చినప్పుడు తెచ్చిచ్చిన ఒక చవక రకం పెన్సిల్‌తో పొందిక లేని రాతతో రాశాడా ఉత్తరాన్ని. ప్రభుత్వ పాఠశాలలో ఆ చిన్నారి రోజెలా ఉంటుందో తెలిపే వివరాలు, అమ్మ పెన్ కొనివ్వడం లేదనే ఫిర్యాదు ఉన్నాయా ఉత్తరంలో. వాళ్ళ నాన్నకి రాసిన తొలి, చివరి ఉత్తరం ఆయనలో మిశ్రమ భావాలను రేకెత్తించాయి. అందుకనే పిల్లలకి ఆ సూచన చేశాడు.

    ***

    ఆ పిల్లాడు పెన్ అందుకున్నాడు. పెన్‌ని చూస్తూ వాళ్ళ అమ్మని తలచుకుంటూ, ముఖంపైకి లేని నవ్వును తెచ్చుకున్నాడు. నోట్‌బుక్ లోంచి ఒక పేజీని జాగ్రత్తగా చించి, ఉత్తరం రాయడానికి సిద్ధమయ్యాడు.
    ఖాళీ!
    ఏం రాయలో అతనికేమీ అర్థం కాలేదు. చేతులు వణుకుతున్నాయి, నుదుటిపైనుంచి చెమటలు కారుతున్నాయి. అతని అసౌకర్యం స్పష్టంగా తెలుస్తోంది. అతనికి చాలా బాధగా ఉంది. అదో రకం వేదన. అదెలాంటిదంటే… దాన్ని అనుభవించడమే కాదు… అధిగమించాల్సి ఉంటుంది కూడా. గట్టిగా ఊపిరి తీసుకుని, రాయడానికి మళ్ళీ ప్రయత్నించాడు. సంబోధనాత్మక పదం వ్రాయక ముందే, ఇంకో అమ్మాయి – “ఏం రాస్తున్నావో నీకు తెలుసా?” అని అడిగింది. “తెలియదు” అన్నాడు. అయితే అతను అబద్ధం చెప్పాడు. ఏం రాయాలో అతనికి ఖచ్చితంగా తెలుసు. కానీ ఆ అమ్మాయికి చెప్పేంత ధైర్యం లేదు.. ఎందుకంటే తానో అజ్ఞాత వ్యక్తిగా ఆ ఉత్తరం రాయబోతున్నననీ, అందుకు ధైర్యం కూడగట్టుకుంటున్నానని ఆ అమ్మాయికి చెప్పలేకపోయాడు.
    వాళ్ళ నాన్నకి క్రితంసారి రాసిన ఉత్తరంలో – ‘తానిప్పుడు పెద్దయ్యాడు కాబట్టి తనకి పెన్ తేవాలని లేదంటే కనీసం కొనివ్వమని అమ్మకి చెప్పమ’ని రాశాడు. ఈ దఫా తనేమీ అల్లరి చేయలేదని, మంచి పిల్లాడిలా ఉన్నానని రాశాడు. నాన్న కొత్త పోస్టింగ్‌కి వెళ్ళినప్పటి నుంచి ఎటువంటి తుంటరి పనులు చేయలేదని…. ఊహూ… తుంటరి పనులు చేసినా దొరికిపోలేదని రాశాడు. నాన్నకిచ్చే సెలవల కోసం ఆత్రతగా ఎదురుచూస్తున్నాడు. నాన్న కొని తెచ్చే పెన్ కోసం వేచి చూస్తున్నాడు. ఆ పెన్నుతో నాన్నకి ఇంకా ఎన్నో ఉత్తరాలు రాయొచ్చని ఆశ పడుతున్నాడు.

    తెల్ల కాగితం కేసి, దాని మీదున్న పెన్ను క్యాప్ చూస్తుంటే ఆ అబ్బాయికి పాత విషయాలెన్నో గుర్తొచ్చాయి. ఆ క్యాప్‌ని తీసుకుని పిడికిలిలో ఉంచుకున్నాడు. తన కలలు చెదిరిపోయిన ఆ రోజుని అతడెన్నడూ మరిచిపోడు. అప్పుడే బడి నుంచి ఇంటికొచ్చాడు. అమ్మ అతని చిరకాలపు కోరికని తీరుస్తూ ఓ పెన్ కొంది. ఎంతో సంతోషపడ్డాడు. కొత్త పెన్నుతో నాన్నకి ఉత్తరం రాయాలనుకున్నాడు. గబా గబా యూనిఫాం విప్పి మాములు బట్టలు వేసుకుంటుండగా కాలింగ్ బెల్ మోగ్రింది. అమ్మ వెళ్ళి తలుపుతీసింది.
    సైనికుల కుటుంబాలలో ఓ రహస్య సంకేతం ఉంటుంది. ఇంటికి వచ్చిన సైనికులు తమ పిల్లలకి కనబడడానికి గుమ్మం దగ్గర నిలుచుంటారు. అయితే తమవాళ్ళు కాకుండా, వేరే సైనికులు ఎవరైనా ఉంటే… అది దేనికి సూచనో వాళ్ళకి తెలుసు!

    తలుపు దగ్గర ఒక కేక వినబడింది, బట్టలు మార్చుకోకుండానే గుమ్మం దగ్గరికి పరిగెత్తాడు. ఆ కేక తర్వాత కొన్ని క్షణాలు నిశ్శబ్దం… చెవుడొచ్చేంత నిశ్శబ్దం! వాళ్ళమ్మ ఏడుస్తోంది, కన్నీరు బుగ్గల మీదుగా ధారగా కారుతోంది. కాని గొంతులోంచి చిన్న శబ్దం కూడా బయటకు రావడం లేదు. ఆ సైనికుడు చెప్పిన వార్త ఆమెని నిలువెల్లా విషాదంలో ముంచేసి, నోట మాట రాకుండా చేసింది. ఐదు నిమిషాల పాటు వికృతంగా రోదించింది. ఆమె గొంతులో మాట పెగిలేసరికి… ఓ ఆక్రందన వెలువడింది. వాళ్ళమ్మ ఆక్రందన అతనికి ఇప్పటికీ పీడకలలు తెప్పిస్తోంది.

    “రాయడం పూర్తయ్యిందా?” టీచర్ అడిగింది.
    “అయిపోయింది, ఒక్క నిమిషం” అన్నాడా పిల్లాడు. తన మెదడులోంచి అమ్మ కేకను తోసిపారేయలేక, ఇంకేం రాయాలో తోచక…. కాగితం మీద గబగబా ఏదేదో రాశాడు.
    కేవలం రెండే వాక్యాలు రాశాడు.

    బతికి ఉన్నప్పుడే కుటుంబంతో కలవడానికి ప్రయత్నించండి. మీ పిల్లలు ఉత్తరాలు రాయడానికి ఎవరో ఒకరు ఉండాలి.”

    ***

    పిల్లలు రాసిన అన్ని ఉత్తరాలను డిపార్టుమెంట్ ఆపీసులో అందజేశారు. అక్కడి గుమాస్తా ప్రతీ ఉత్తరాన్ని ఒక చక్కని కవర్‌లో పెట్టి వాటన్నింటిని ఒక కట్టలా తయారుచేశాడు. అన్ని కట్టలనీ ఒక పెద్ద గోధుమరంగు పాకెట్‌లో పెట్టి, చిరునామా అతికించారు. ఆ రోజు సాయంత్రం గుమాస్తా ఆ పాకెట్‌ని పోస్ట్‌బాక్సులో వేశాడు.
    బహుశా రక్షణశాఖ వారిచ్చిన చిరునామాలో ఏదో తప్పు దొర్లినట్టుంది, ఆ ప్యాకెట్ తిరిగి డిపార్టుమెంట్‌కి వచ్చేసింది.

    రికార్డు రూములో ఏళ్ళ పాటు పడి ఉంది. ఓ ఏడాది యాన్యువల్ క్లీనింగ్‍లో భాగంగా దాన్ని తీసి చెత్తబుట్టలో విసిరేసే వరకూ అది అక్కడే ఉంది.

    ♣♣♣

    ఆంగ్లమూలం: వైభవ్ పాథక్
    తెలుగు: కొల్లూరి సోమ శంకర్

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here