నంద్యాలలో రాయలసీమ సాగునీటి సాధన సమితి సమావేశం – నివేదిక

0
11

[dropcap]12[/dropcap] సంవత్సరాల క్రిందట ‘రాయలసీమ సాగునీటి సాధన సమితి’ ఆవిర్భవించింది. దాని అధ్యక్షులు శ్రీ బొజ్జా దశరథ రామిరెడ్డి గారు. పెనుగొండలో జనవరి 2024లో జరిగిన ‘రాయలసీమ జల కవనం’ సభకు ఆయన ముఖ్య అతిధి. పాణ్యం దత్తశర్మ దానికి పద్య ప్రసంగకర్తగా ఆహ్వానించబడినారు. అప్పుడు ఇరువురికీ స్నేహం ఏర్పడింది. పాణ్యం దత్తశర్మ  కూడా రాయలసీమ వారేనన్నది విదితమే.

హైదరాబాదులో, దశరధరామిరెడ్డి గారు, వనస్థలపురంలోని దత్తశర్మగారింటికి వచ్చి, తమ ఉద్యమానికి కొన్ని పాటలు రాసి ఇమ్మని అడుగగా, దత్తశర్మ దాని కంగీకరించి 10 పాటలు రాసి యిచ్చినారు. జూన్ 2,3 తేదీలలో ఉద్యమ కళాకారులతో రెడ్డిగారు ఒక సమావేశం ఏర్పాటు చేసి, సంచిక రచయిత దత్తశర్మగారిని మ్యూజిక్ సిట్టింగ్ కొరకు ఆహ్వనించినారు. పాట ట్యూన్ చేసేటప్పుడు సాహిత్యంలో చేయవలసిన చిన్న మార్పులను రైమ్ అండ్ రిథమ్‌కు అనుగుణంగా చేసి, గాయక కళాకారులకు దత్తశర్మ దిశానిర్దేశం చేసినారు.

బొజ్జా వారి వంశం రాజకీయంగా, సామాజికంగా ప్రజలతో మంచి కీర్తిప్రతిష్ఠలు గలిగినది. దశరథ రామిరెడ్డిగారి తండ్రి కీ.శే. బొజ్జా వెంకటరెడ్డి గారు 3 టర్మ్స్ స్వతంత్వ అభ్యర్థిగా, కాంగ్రెస్ అభ్యర్థిగా, ఎమ్మెల్యేగా, ఎం.పిగా ఎంపికై ప్రజాసేవ చేసినవారు. నిరాడంబరులు. దశరథ రామిరెడ్డిగారు, ఏ రాజకీయ పార్టీకి చెందిన వారు కాదు. స్వయంగా, స్వతంత్రంగా ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారు. ఆయనను ప్రభుత్వాలు అరెస్టు చేసి, జైలుకు పంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా, ఆయన, మొక్కవోని ధైర్యంతో, ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూ ముందుకు సాగుతున్నారు.

పాణ్యం దత్తశర్మగారి పాటలతో సాగునీటి పంపకాలలో రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని, శ్రీబాగ్ ఒడంబడిక రాయలసీమ పాలిట మిథ్య అయిన తీరును, ఏ.పి. విభజన చట్టంలో రాయలసీమ హక్కులు అమలుకాకపోవటాన్ని వివరించారు. మధ్యాంధ్రములో, 30 లక్షల ఎకరాలకు గాను ఇరవై లక్షల ఎకరాలు జలకళతో సాగవుతుంటే.. రాయలసీమలోని 90 లక్షల ఎకరాలకుగాను, సాగునీటి ప్రాజెక్టులు ఇరవై మాత్రమే, సాగునీరు అందుతున్నది కేవలం ఎనిమిది లక్షల ఎకరాలకే. రాయలసీమ రైతుల త్యాగాలు విలువలేకుండా పోయాయి. 2023లో కేంద్రం తెచ్చిన చీకటి చట్టం రాయలసీమకు తీరని అన్యాయం చేసింది. శ్రీశైల జలాశయం కనీస నీటిమట్టం లేనప్పుడు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని సమితి డిమాండ్. పోలవరం ప్రాజెక్టు తెల్ల ఏనుగైంది. దాని తక్షణ ఫలితం పట్టిసీమ ప్రాజెక్టు. దాని వల్ల కృష్ణ నీరు ఎంతో ఆదా అవుతుంది. కానీ దానికి సంబంధించిన జి.ఓ. రాలేదు. కృష్ణ నీటిలో రాయలసీమకు 40 శాతం హక్కు ఉంది. ఇది అమలుకాలేదు. సిద్ధేశ్వరం అలుగును నిర్మిస్తే శ్రీశైలం ప్రాజెక్టుకు అది రక్షణ అవుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య అది రవాణాకు చక్కని వీలు కల్పిస్తుంది. ఈ విషయాలన్నీ పాటలలో పొందుపరిచారు దత్తశర్మ. వాటికి రాగాలు కూడా గాయకులకు సూచించి, వారితో పాడించారు. వారితో బాటు ఆయనా పాడారు.

సమితి విజయాలను, ఉదా: గుండ్రేవుల రిజర్వాయర్ నివేదికను తెప్పించటం, హంద్రీ నీవా నీటితో చెరువులు జలకళలాడేలా చేయడంలో ప్రభుత్వమే పూనుకునేలా చేయడం, ముచ్చుమర్రి, రాఘవేంద్ర ఎత్తిపోతల పథకానికి అనుమతి సాధించడం, శ్రీశైల జలాశయం కనీస నీటిమట్టం, ఎప్పుడూ 854 అడుగులుండాలని, ‘రూల్ కర్వ్’ సాధించడం, కూడా పాటలలో ఒదిగేలా చేశారు పాణ్యం దత్తశర్మ.

సమావేశానికి శ్రీ బొజ్జా దశరథ రామిరెడ్డి గారు అధ్యక్షత వహించగా, సమితి కార్యవర్గ సభ్యులు శ్రీ సుధాకరరావు గారు, శ్రీ శ్రీనివాస రెడ్డిగారు పర్యవేక్షించారు. గాయక కళాకారులు సర్వశ్రీ నాగరాజు, రామాంజనేయులు, నారాయణ గౌడ్, ఉద్యమ నాయకులు శ్రీయుతులు బెక్కెం రామసుబ్బారెడ్డి. ఈశ్వర రెడ్డి, డేవిడ్, మహేశ్వర రెడ్డి, రామకృష్ణారెడ్డి, అడ్వకేట్ రవికుమార్ గారు సమావేశంలో పాల్గొన్నారు.

సమావేశం చివరలో, అధ్యక్షులు, ఇతర కార్యవర్గ సభ్యులు, పాణ్యం దత్తశర్మ గారిని శాలువ, నూతన వస్త్రాలు, ఫలతాంబూలాదులతో ఘనంగా సన్మానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here