మనం మరచిన సంప్రదాయ తత్వవేత్తలు – Re-membering tradition – A K Coomaraswamy and A K Saran పుస్తక పరిచయం

0
6

[dropcap]ఇ[/dropcap]ది లక్నోకు చెందిన కుమారస్వామి ఫౌండేషన్ వారు ప్రచురించిన “Re-membering tradition – AK Coomaraswamy and AK Saran” అన్న పుస్తకం గురించిన పరిచయం. ఆనంద కుమారస్వామి గారు మరియు అవధ్ కిషోర్ శరణ్ గారు చేసిన పరిశోధనలు మరియు ఇతర రచనల ఆధారంగా ఆధునిక యుగంలో సంప్రదాయానికి ఆధునికతకు మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం గురించిన వ్యాఖ్యానం ఈ పుస్తకం. కుమారస్వామి ఫౌండేషన్ వారి సైటులో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు

https://www.coomaraswamyfoundation.org/other .

ఆనంద కుమారస్వామి భారతీయ కళల గురించి భారతీయ జీవన విధానం గురించి లోతుగా ఆలోచించి ఎన్నో గాఢమైన విశ్లేషణలు చేశారు ఇరవయ్యవ శతాబ్దపు తొలినాళ్ళలో. మూలాలకు భంగం కలగకుండా ఆంగ్ల భాషలో పాశ్చాత్యులకు మరియు ఆంగ్లం తెలిసిన భారతీయులకు భారతీయ సనాతన దృక్పథాన్ని విశదీకరించటంలో కృతకృత్యులైన అతికొద్ది మంది మేధావులలో ఆనంద కెంటిష్ కుమారస్వామి అగ్రగణ్యులు.

అవధ్ కిషోర్ శరణ్ గారు ఆ పరంపరకు కొనసాగింపు. లక్నో విశ్వవిద్యాలయంలో సోషియాలజీ ప్రొఫెసర్ గా పని చేసారు. ఇది కాక దేశ విదేశాలలో ఎన్నో విశ్వవిద్యాలయాలలో పరిశోధకుడిగా అధ్యాపకుడిగా పని చేశారు. అయితే కుమారస్వామి అయినా శరణ్ గారైనా సంప్రదాయ మూలాలను ఆధారంగా చేసుకుని ఆధునీకరణ అన్న పేరుతో వచ్చిన ఒకానొక ప్రచండ తుఫానుకు ఎదురొడ్డారు వారి జీవిత కాలంలో. ముఖ్యంగా శరణ్ గారికి వారి జీవిత కాలంలో రావలసినంత గుర్తింపు రాలేదు ఈ కారణంగా. కుమారస్వామి 1947లో చనిపోయారు. శరణ్ గారు 2003 లో. ఇద్దరికీ మధ్యన ఒక తరం అంతరం. శరణ్ జీవిత కాలంలో ఆధునీకరణ వైపు మన ప్రయాణం మరింత వేగవంతమయ్యింది. కాబట్టి మీరేమి కోల్పోతున్నారో ఆలోచించండి మీరెటు వెళుతున్నారో ఆలోచించండి ఆ దారి సరైనదేనా అసలు మీ గమ్యం ఏమిటి మీ ఆలోచనల తాత్విక మూలాలు ఏమిటి అంటూ ఎన్నో ప్రశ్నలు లేవనెత్తిన శరణ్ వంటి మేధావులను సహజంగానే సమాజం పక్కకు నెట్టేసింది. అయితే ఆయన శిష్యులు అనుయాయులు కొంత మంది ఇంకా ఆయన ఆలోచనాధారను సజీవంగా ఉంచుతున్నారు. ఇప్పటికీ ఆధునికత వ్యామోహంలో పూర్తిగా కొట్టుకుపోకుండా మూలాల గురించి సాంప్రదాయ వైఖరి గురించిన ప్రశ్నలు ఉన్న వారికి శరణ్ రచనలు గొప్ప మార్గదర్శకాలు.

ఈ పుస్తకం రచయిత బ్రిజేంద్ర పాండే గారు. ఆయన లక్నో విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలో పొలిటికల్ సైన్సు ప్రొఫెసర్. లక్నో కేంద్రంగా పనిచేసే కుమారస్వామి ఫౌండేషన్ సెక్రెటరీ. పుస్తకానికి ముందు మాట రాసిన ఆర్కే మిశ్రా కూడా లక్నోకు చెందిన మరొక పొలిటికల్ సైన్సు ప్రొఫెసర్.ఈయన కుమారస్వామి ఫౌండేషన్ అధ్యక్షుడు. ఇది ఈ పుస్తక నేపథ్యం.

ఆనంద కుమారస్వామి, రెనె గెనాన్ (Rene Guenon) , ఫ్రిట్జఫ్ శ్వాన్ (Frithjof Schuon) మొదలైన వారంతా శాశ్వత వాదం (Perennialism) , శాశ్వత తత్వశాస్త్రం (Philosophia Perennis) , సంప్రదాయవాదం (Traditionalist) అనే భావజాలానికి చెందిన వారు. ఏకే శరణ్ గారు ఒక విధంగా ఈ పరంపరకు కొనసాగింపు.

“Tradition: The meaning” అన్న అధ్యాయంలో సంప్రదాయం గురించి భారతీయ తాత్విక చింతన గురించి సనాతన ధర్మం గురించి శృతి స్మృతి పురాణ ఇతిహాస దర్శన శాస్త్ర విషయాల గురించిన ఎన్నో అంశాలు చర్చించారు రచయిత. ఇవి కాక ఈ విషయాలలో ప్రాక్పశ్చిమ దృక్పథాలలో వైరుధ్యాల గురించి ప్రస్తావించారు రచయిత పాండే. ఇంతే కాక వర్ణాశ్రమ ధర్మాల గురించి పురుషార్థ చతుష్టయం గురించిన ఆలోచనలు వాటితో ఆధునిక ధోరణికి ఉన్న వైరుధ్యాలను గురించి చర్చించారు. ఈ క్రమంలో మనుషులలోని సహజ స్వభావాలకు విరుద్ధంగా సహజంగా ఉండే తేడాలను గుర్తించకుండా అందరికీ ఒకటే రకం విద్య ఇవ్వాలన్న ఐరోపా ప్రభావిత ఆలోచన గురించీ సమానత్వమనే సిద్ధాంతం (mania for equality) గురించీ విశ్లేషించారు రచయిత పైన పేర్కొన్న ఇతర తత్వవేత్తల రచనల ఆధారంగా.

వంశపారంపర్యంగా నిర్వహించుకుంటూ వచ్చిన జాతి ధర్మాలు వృత్తుల గురించిన ప్రస్తావన చేశారు తర్వాత రచయిత. ప్రస్తుత కాలంలో కుల నిర్మూలన గురించిన చింతన ప్రబలిందని కులాలను కుల వృత్తులను నిర్మూలించి ప్రజలందరినీ కేవలం కార్మికులుగా (modern proletarians) మార్చే ప్రయత్నం జరుగుతోందని పరంపరానుగత కుల ధర్మాలు వృత్తుల (vocations) స్థానే ఉద్యోగాలు (jobs) వచ్చాయనీ అంటారు రచయిత. వృత్తిని బట్టి కులం అన్న వాదం గురించి కులాన్ని బట్టి వృత్తి అన్న వాదం గురించి కొన్ని చర్చలు చేశారు రచయిత. భారతీయ సంప్రదాయంలో కులం అన్నది ఒక వ్యక్తి యొక్క ఆత్మకు గురుత్వాకర్షణ కేంద్రం అన్న ఫ్రిట్జఫ్ శ్వాన్ వాక్యాన్ని ప్రస్తావిస్తారు రచయిత ఒక చోట (In Indian tradition, caste is the centre of gravity of the individual soul)

అయితే ఇప్పటి కాలంలో ముఖ్యంగా పాశ్చాత్య సమాజాలలో కుల వ్యవస్థను గురించిన అపోహలకు అభిప్రాయాలకు మూలం ఆ సమాజాలలో వంశ పారంపరిక న్యాయం (law of heredity) అన్నది లుప్తం అవ్వటమే ఆన్న శ్వాన్ వాక్యాలను ప్రస్తావిస్తారు రచయిత. ఇప్పుడు పాశ్చాత్య సమాజాలలో అందరూ సామాజిక ఎదుగుదలను ఆశిస్తూ నిచ్చెన మెట్లను ఎక్కాలని అనుకుంటున్నారని నిజానికి వారికి వారి వారసత్వ వృత్తులు గురించిన అవగాహన అన్నది పూర్తిగా సమసిపోయిందని అంటారు . మధ్య యుగాల ఐరోపా సమాజంలో కూడా హస్త కళాకారుల వృత్తులు వారసత్వ పరంపరలో భాగంగానే వచ్చేవని అయితే పారిశ్రామిక విప్లవం తర్వాత వచ్చిన యంత్రాలు వారసత్వ పరంపరలను పూర్తిగా విచ్ఛిన్నం చేశాయని ఆన్న శ్వాన్ వాక్యాలను తలచుకుంటారు (machines have practically abolished heredity). ఈ విషయాలను గురించి చర్చిస్తూ సంప్రదాయ సమాజాలకు (traditional societies) పారిశ్రామిక సమాజాలకు (industrial and proletarian civilisations) గల తేడాలను ప్రస్తావిస్తారు . ఇవంతా కూడా చాలా వరకు రెనె గెనాన్ (Rene Guenon) , ఫ్రిట్జఫ్ శ్వాన్ (Frithjof Schuon) వంటి వారి రచనల నుంచి రచయిత బ్రిజెంద్ర పాండే సంగ్రహించిన కొన్ని వాక్యాల సారాంశం. నిజానికి ఏది పాండే గారు రాసిన వాక్యం ఏది ఇతరుల రచనల నుంచి స్వీకరించిన వాక్యం అని చెప్పటం చాలా కష్టం ఈ పుస్తకంలో.

ఇంతవరకు సంప్రదాయం అంటే tradition గురించిన ఆలోచనలను పాఠకులతో పంచుకున్న రచయిత అటు తర్వాత కుమారస్వామి గురించి అవధ్ కిషోర్ శరణ్ గురించి వారి పరిశోధనల సారం గురించి ప్రస్తావిస్తారు.

పారిశ్రామిక నాగరికత గురించి కుమారస్వామి వ్యక్తం చేసిన ఆలోచనలను ప్రస్తావిస్తూ విలియం బ్లేక్ (William Blake), జాన్ రస్కిన్ (John Ruskin), విలియం మోరిస్ (William Morris) వంటి వారి గురించి తలుచుకుంటారు . రస్కిన్ తన రచనలలో కళలకు దూరమైన పారిశ్రామిక సమాజం గురించి పేర్కొన్న “industry without art is brutality” అన్న వాక్యం కుమారస్వామిని ఎంతగానో ప్రభావితం చేసిందని అంటారు . మనిషి సర్వతోముఖ అభివృద్ధి అన్నది కేవలం భౌతికవాదపు (materialism) విలువలపై మాత్రమే ఆధారపడి మితిమీరిన నగరీకరణ పారిశ్రామీకరణలో కొట్టుకుపోతున్న ఆధునిక సమాజాలలో అసాధ్యం ఆన్న అభిప్రాయానికి కుమారస్వామి తన జీవితాంతం కట్టుబడి ఉన్నాడని అంటారు రచయిత.

1922లో జన్మించిన 2003 వరకు జీవించిన ఏ.కే.శరణ్ సమకాలీన సమాజంలో సంప్రదాయ భావాలకు గొప్ప ప్రతినిధి అని అంటారు రచయిత. శరణ్ యవ్వన దశలో ఆయన పై కుమారస్వామి ఆలోచనల ప్రభావం గురించి ప్రస్తావిస్తారు రచయిత బ్రిజేంద్ర పాండే. సోషియాలజీ శాస్త్రంలో రాధా కమల్ ముఖర్జీ , డిపి ముఖర్జీ వంటి వారి పరంపరలో శరణ్ గారు కూడా లక్నో స్కూలుకు (Lucknow School) ప్రతినిధిత్వం వహించారు. ఆయనకు తన జీవిత కాలంలో హార్వర్డ్ విశ్వ విద్యాలయంలో మెక్సికో కెనడా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ జర్మనీ జపాన్ వగైరా ఎన్నో దేశాలలో పరిశోధనల నిమిత్తమై లేదా ఉపన్యాసాలు ఇవ్వటం కోసమై ఆహ్వానాలు అందినా కూడానూ ఇంటా బయటా ఏ కే శరణ్ కు రావలసిన గుర్తింపు రాలేదని ఆయనను ప్రధాన స్రవంతి నుంచి వెలివేశారనీ అంటారు రచయిత పాండే.ఆధునిక పాశ్చాత్య నాగరికతను ఆధునికతను సహేతుకంగా విమర్శించిన శరణ్ వంటి వారికి కొద్దో గొప్పో గుర్తింపు లభించినా కూడా అది విదేశాలలోని మేధావుల నుంచే లభించిందని దేశీ మేధావులు ఆయనను అసలుకే గుర్తించలేదని అంటారు పాండే.

ఈ క్రమంలో శరణ్ గారి పరిశోధనల గురించి ప్రస్తావిస్తారు పాండే గారు. ఆయన రాసిన రీసెర్చ్ పేపర్లలో నాకు నచ్చిన పేపర్ ఒకదాని గురించిన చర్చ చేస్తారు పాండే గారు. “హిందూ మతం మరియు భారత దేశంలో ఆర్థిక అభివృద్ధి” (Hinduism and economic development of India) అన్న పేపర్ గురించిన ప్రస్తావన ఇది. ఇటువంటి విషయాలపై ఏ మాత్రం కుతూహలం ఉన్న వారంతా కూడానూ తప్పక చదవ వలసిన రీసెర్చ్ పేపర్ ఇది. ఆధునికతకు సంప్రదాయానికి సమన్వయం సాధ్యమే అని అనుకునే వారు ముఖ్యంగా చదవ వలసిన పేపర్ ఇది.ఈ పేపర్ ఈ లంకెలో లభ్యం ( https://www.persee.fr/doc/assr_0003-9659_1963_num_15_1_1726 ).

ఈ పేపర్లో భారత దేశం మరియు చైనా వంటి దేశాలలో పాశ్చాత్య దేశాల వలె వైజ్ఞానిక అభివృద్ధి మరియు పారిశ్రామిక అభివృద్ధి జరగకపోవటానికి గల మతపరమైన కారణాల గురించి మేక్స్ వెబర్ (Max Weber) చేసిన ప్రతిపాదనల గురించిన ప్రస్తావన చేస్తారు శరణ్.

ఆధునిక అభివృద్ధి నమూనాకు కావలసినది ప్రధానంగా మూడు ముడి సరుకులని అంటారు ఈ పేపర్లో శరణ్. అవి నూతన ఆవిష్కరణలు, నూతన కల్పనలు, వ్యక్తివాదం అని అంటారు శరణ్ (invention, innovation, individualism). ఇవన్నీ ఇతర సమాజాలలో లాగా జరగాలంటే ముందు హిందూ మత దృక్పథాలతో ఈ భావాలకు ఉన్న వైరుధ్యాలను మనం గుర్తించాలని అంటారు . అసలు పారిశ్రామిక విప్లవం ఎన్లైటెన్మెంట్ వంటివి కేవలం పాశ్చాత్య సమాజాలలో మాత్రమే జరగటానికి గల మూల కారణాల గురించిన శోధన చేయాలంటారు . అంతే కాక ఆయా సమాజాలలో ఉన్న సంప్రదాయ చింతనకు అవి దూరంగా జరిగిన వైనాన్ని కూడా గుర్తించాలని అంటారాయన. మానవుడికి ప్రకృతికి మధ్యన ఉన్న సంబంధాన్ని గురించిన ఆలోచన అన్నది పాశ్చాత్య సమాజంలో ముందుగా మారిందని ఈ మార్పే క్యాపిటలిజం ఆధునికత వంటి వాటికి ప్రధానమనీ హిందూ ధార్మిక దృక్పథం చెలామణిలో ఉన్నంత కాలం ఇటువంటి సంస్కృతి మరియు నాగరికత అన్నది భారత దేశంలో స్వతహాగా జన్మించటం అన్నది జరగదని అంటారు శరణ్ ఈ పేపర్లో.

మనిషిని ప్రకృతిని వేరు చేసి చూడటం భారతీయ దృక్పథానికి విరుద్ధమైన విషయం అని అంటారు శరణ్. ప్రకృతిని పాశ్చాత్యులకు మల్లే మృతప్రాయమైనదిగా చూడటం ప్రకృతిని తన అవసరాలకు వనరులు లేదా ముడి సరకులు సరఫరా చేసే సాధనంగా చూడటం అన్నది భారతీయ దృక్పథంలో ససేమిరా ఇమడని ఆలోచన అంటారు శరణ్.

మన కాలంలో ఈ వైరుధ్యం అవిరళమైన నిర్మలమైన గంగానది ప్రవాహం కోసం ప్రాణత్యాగం చేసిన ఐఐటీ ప్రొఫెసర్ స్వామి సానంద్ పోరాటంలో ప్రస్ఫుటంగా కనపడుతుంది.

అసలు భారతీయ దృక్పథంలో పాశ్చాత్య సమాజానికి మల్లే “reason” కు గొప్ప స్థానాన్ని ఇచ్చిన దాఖలాలు లేవంటారు శరణ్. ఆధునిక వైజ్ఞానిక చింతన (modern scientific spirit) అన్నది సంప్రదాయ భారతీయ సమాజంలో ఉద్భవించక పోవటానికి కారణం అర్థం కావాలంటే భారతీయ మేధ పై ప్రకృతికి పురుషునికి మధ్యన ఉన్న సంబంధాన్ని నిర్వచించిన ఈ ధార్మిక మత సిద్ధాంతాల ప్రభావం అర్థం చేసుకోవాలని అంటారు . అయితే దీని అర్థం అసలు టెక్నాలజీ అన్నది భారత దేశంలో లేనే లేదని కాదని సంప్రదాయ సాంకేతికతకు (Traditional technology) ఆధునిక సాంకేతికతకు (Modern technology) గల తేడాలను విశ్లేషిస్తారు శరణ్ ఈ రిసర్చి పేపర్లో.

ఆధునిక అభివృద్ధి నమూనాకు మూల కారణమైన ఆధునిక వైజ్ఞానిక ప్రగతి అన్నది భారత దేశంలో జరగక పోవటానికి గల కారణాలను మరింత విశ్లేషిస్తూ ఇలా అంటారు శరణ్. కాలాన్ని గురించి మరియు చరిత్ర గురించిన భారతీయ దృక్పథం ఇతర ప్రాచీన సంస్కృతులకు మల్లే ఆధునిక ఐరోపా దేశ సంస్కృతులకు భిన్నమైనదనీ అంటారు . Timeless and historyless character of Hinduism గురించి ప్రస్తావిస్తారు శరణ్. హిందూ మత తత్వం అన్నది కాలాతీతమైనది చారిత్రక దృక్పథానికి అందనిది అంటారాయన. పాశ్చాత్య సమాజాలలో లాగా హిందూ సమాజం స్వంత సంప్రదాయానికి దూరమయ్యాక నవ్య నాగరికతా సృజన అన్నది జరగలేదని అంటారు శరణ్. పాశ్చాత్య నాగరికత ప్రభావానికి లోనైన హిందూ సమాజం తన జీవ లక్షణాన్ని కోల్పోయిందని ఇటువంటి సమాజంలో ఉన్న ప్రజలు రెంటికి చెడ్డ రేవడి వంటి విచిత్రమైన స్థితిలో మిగిలి పోతారని అంటారు . Incapable of higher Indifferent to lower అని అంటారు ఆయన ఇటువంటి సమాజంలోని ప్రజల మానసిక దృష్టిని గురించిన ప్రస్తావన చేస్తూ. అంటే కింది స్థాయికి చెందినటువంటి శుష్కమైనటువంటి కేవల భౌతిక అభివృద్ధి వెంటా పడలేక ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక ఉన్నతిని చేరుకునే శక్తి లేక మిగిలిపోతారని శరణ్ భావం. ఈ పేపర్లో ఆంగ్లేయుల కాలంలో పాశ్చాత్య సంస్కృతి ప్రభావానికి లోనైన భారత దేశంలో పుట్టుకొచ్చిన ఎన్నో సంస్కరణోద్యమాల గురించి చర్చిస్తారు శరణ్.

ఈ విషయమై కొన్ని అద్భుతమైన ప్రతిపాదనలు చేస్తారు శరణ్ ఈ పేపర్లో.

The first thing to note here is that the encounter between tradition and modernism is not an encounter of religion and philosophy with science.

సంప్రదాయానికి ఆధునికతకు మధ్య జరుగుతున్న ఈ సమరంలో మనం మొదట గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ఇది ఒక వైపున విజ్ఞాన శాస్త్రానికి అంటే సైన్సుకు మరొక వైపున మతానికి తత్వశాస్త్రానికి మధ్య జరుగుతున్న యుద్ధం కాదు.

So it is an encounter of one scientific system with another and a radically different one.

ఇది ఒక వైజ్ఞానిక దృక్పథానికి దానికి పూర్తిగా భిన్నమైన మరొక వైజ్ఞానిక దృక్పథానికి జరుగుతున్న యుద్ధంగా భావించాలి.

Hinduism and modern science are opposed as truth and error: between them there is no question of synthesis.

హిందూ ధర్మం మరియు ఆధునిక సైన్సు అనే రెండూ పరస్పర విరుద్ధాలు. తప్పు ఒప్పు లాగా. ఈ రెండిటి మధ్యన సమన్వయం అన్నది జరిగే ప్రశ్నే లేదు. అది సాధ్యపడదు అని తీర్మానిస్తారు శరణ్.

ఈ కారణాల దృష్ట్యా భారత దేశ ఆర్థిక అభివృద్ధి ఆన్న విషయంలో స్వయం ప్రతిపత్తి అన్నది సాధ్యమయ్యే విషయం కాదని అంటారు శరణ్. అంటే పాశ్చాత్య దేశాల నుంచి అభివృద్ధి నమూనా దిగుమతి చేసుకుని వారి సమాజాలకు నాసిరకం నకలుగా మారవచ్చునేమో కానీ భారతీయమైన భావాల ఆధారంగా ఆధునిక ప్రమాణాలకు అనుగుణంగా ఆర్థిక అభివృద్ధి సాధించటం అసాధ్యం అని శరణ్ భావం.

ఈ విషయాలపై ఇలా రాసిన భారతీయ మేధావులు అతి కొద్ది మంది ఉన్నారు నాకు తెలిసినంత వరకు. విశ్వనాథ సత్యనారాయణ వంటి వారు ఇటువంటి ప్రతిపాదనలు “వేయి పడగలు”, “హాహా హుహూ”, “వల్లభ మంత్రి” వంటి ఎన్నో రచనలలో చేశారు. పాశ్చాత్య వైజ్ఞానిక ప్రగతికి సనాతన ధర్మ దృష్టికి గల వైరుధ్యాన్ని గుర్తించి పారిశ్రామిక విప్లవం ఫ్రెంచి విప్లవం తెచ్చిపెట్టిన భావాలతో సనాతన సమాజానికి ఉన్న భేదాభిప్రాయాల గురించి కంచి పరమాచార్యులు తమ బోధనలలో పేర్కొన్నారు. కరపాత్ర స్వామి “మార్క్స్ వాద్ ఔర్ రామరాజ్య” అన్న పుస్తకంలో ఈ వైరుధ్యాలను గురించి ప్రస్తావించారు. ఆయన శిష్యులు ప్రస్తుత పూరి శంకరాచార్యులు నిశ్చలానంద సరస్వతి కూడా “వికాస్ విమర్శ” ఆన్న గ్రంథంలో ఈ విషయాల గురించిన చర్చ చేశారు. ఈ విషయమై తెలుగులో రచనలు చేసిన వారు ఎంత మంది ఉన్నారో నాకు తెలియదు. మన కవులు రచయితలు సాహితీ వేత్తలు ఈ విషయాలపై మరింత ఆలోచించవలసిన అవసరం ఉంది.

ఇప్పటి కాలంలో ఆధునిక వైజ్ఞానిక అభివృద్ధి వ్యామోహంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. మితిమీరిన పారిశ్రామీకరణ వల్ల కాలుష్యం హెచ్చరిల్లుతోంది. ప్రకృతిలో సహజ స్వచ్ఛత సన్నగిల్లుతోంది. మన ఆర్థిక విధానం అంతా కూడా అసమానత, మత్స్య న్యాయం, అత్యాశ, మితిమీరిన పోటీతత్వం, మితిమీరిన లాభాపేక్ష వంటి ఎన్నో రుగ్మతలు కలిగి ఉంది. ఇటువంటి పరిస్థితులలో కొంత మంది మేధావులు పాత టెక్నాలజీ తెచ్చిన సమస్యను అదే భావజాల స్రవంతిలో సృష్టించిన మరొక కొత్త టెక్నాలజీ తీరుస్తుందన్న ఆశతో ఉన్నారు. మనిషి టెక్నాలజీకి బానిస అవుతున్నాడా లేక టెక్నాలజీ మనిషికి సేవ చేస్తోందా ఆన్న ప్రశ్న ఉండనే ఉంది. ఈ విషయమై హాన్స్ జోనాస్ (Hans Jonas), హైడెగ్గర్ (Heidegger), సైమన్ వీల్ (Simone Weil) వంటి తత్వవేత్తల గురించి ప్రస్తావిస్తారు రచయిత పాండే.

అయితే శరణ్ వంటి తత్వవేత్తలు ఈ విధమైన ఆలోచనలు చేసిన మేధావులకు భిన్నంగా నేటి మన జీవన దృక్పధాల మూలాలకు వెళ్ళి సమూల సంస్కరణ దిశగా ప్రయాణం చేయాలని భావించారని అంటారు పాండే. ఇది జరగాలంటే కేవలం ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం సాంకేతికత వంటి విషయాలలో మాత్రమే కాక సామాజిక వ్యవస్థలు రాజకీయ వ్యవస్థలు ఆర్థిక విధానాల విషయంలో కూడా సమూల సంస్కరణ జరగాలని శరణ్ వంటి మేధావుల అభిప్రాయం అని అంటారు రచయిత బ్రిజేంద్ర పాండే. అయితే యాంత్రికీకరణ (mechanization) అన్నది ఏ రోజుకి ఆరోజు పెరిగి పోతూ ఆధునికీకరణ (modernization), లౌకికీకరణ (secularisation) , దుష్ట భౌతిక వాదం ( sordid materialism), అవధుల్లేని వినిమయతత్వం (rampant consumerism) వంటివి బాగా ప్రబలిపోతున్న ఈ యుగంలో ఆధ్యాత్మిక పునరుత్పత్తి అంటే spiritual regeneration అన్నది అసాధ్యమైన విషయము లాగానే అనిపించచ్చును. అయితే మన దృష్టి చేయవలసిన కార్యం మీద ఉండాలే కానీ కార్య సాధన వలన లభించే ప్రతిఫలం మీద ఉండకూడదని శరణ్ గారు జీవితాంతం నమ్మారనీ ఒక వేళ ఏదైనా సంఘర్షణ లేదా సందిగ్ధ పరిస్థితి అన్నది వేస్తే మనం న్యాయం లేదా ధర్మం దిక్కున ఉన్నామా లేదా అన్నది మాత్రమే ప్రధానం అని ఆయన విశ్వసించారని అంటూ పుస్తకాన్ని ముగిస్తారు పాండే గారు.

పైన ప్రస్తావించినట్లు తెలుగులో ఇటువంటి విషయాలపై చర్చలు తక్కువ. ఆధునికత తెచ్చిపెట్టిన భావజాల చట్రాలను మరియు వలస మేధ తెచ్చి పెట్టిన భావ దాస్య సంకెళ్ళను అధిగమించి మన మేధావులు ఆలోచించిన దాఖలాలు తక్కువ. అసలుకే లేవని కాదు! ఉండాల్సినంతగా లేవు.

ఆ దిశగా ఆలోచన చేయగోరే వారికి అవధ్ కిషోర్ శరణ్ (A K Saran) పరిశోధనలు తప్పకుండా ఉపయోగపడతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here