రెడ్ హ్యాండెడ్-2

8
8

[శ్రీ శ్యామ్ కుమార్ చాగల్ రచించిన ‘రెడ్ హ్యాండెడ్’ అనే పెద్ద కథని పాఠకులకి అందిస్తున్నాము. ఇది రెండవ భాగం.]

[dropcap]ఆ [/dropcap]రోజు మధ్యాన్నం మేఘన కేబిన్ లోకి అడుగు పెట్టాడు మహి. అతన్ని చూడగానే ఆమె మొహంలో మొదటిసారిగా నవ్వు కదలాడింది. “హలో గుడ్ ఆఫ్టర్‌నూన్ మహీధర్” అని స్నేహపూర్వకంగా పలకరించింది మేఘన.

“హలో మేఘన గారు” అని నవ్వి కూర్చున్నాడు మహి.

“థ్యాంక్ యు.. గ్రేట్” అంది తృప్తిగా.

“ఇంకా ముందు ముందు షేర్స్ పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ కొనుగోళ్లు కూడా చెప్తాను మీకు.” అన్నాడు మహి.

“అసలు రహీం ఖాన్ ఎవరికీ లొంగడు. పైగా పెద్ద క్రిమినల్. నేను చాలా రకాలుగా ప్రయత్నించాను కానీ దారి లోకి రాలేదు. పోలీసులతో కూడా పని కాలేదు” అని మెచ్చుకోలుగా చూసింది.

అమ్మయ్య నవ్వితే మొహం కాస్త చూసి భరించగలం అనుకున్నాడు మహి.

అలా నవ్వుతూ కంపెనీ, వ్యాపార విషయాలు మాట్లాడుతూ చాలా సేపు మాట్లాడింది మేఘన.

***

కొద్ధి రోజుల తర్వాత మేఘనతో మాట్లాడుతూ “సిటీలో కాస్త దూరంలో అప్పుడప్పుడే పూర్తి కావొస్తున్న అపార్ట్‌మెంట్స్ కొని ఏ కొద్దిపాటి లాభం రాగానే వెంటనే అమ్మేస్తుండటం కూడా లాభసాటి వ్యాపారమే” అన్నాడు మహి.

సమాధానం చెప్పకుండా అతని చెప్పే విషయం ఆసక్తిగా వినసాగింది.

“మీరిప్పుడు ఇంకో ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం మీకున్న ఆస్తి, మేఘన హైట్స్, పాత బస్తీలో వుంది. భవిష్యత్తులో దాని విలువ ఎక్కువగా పెరగదు.” అని చెప్పి ఆగిపోయాడు.

“మరేం చేయాలని మీ సలహా?” అడిగింది మేఘన

“దాన్ని అమ్మేసి ఇంకో మంచి ల్యాండ్, సిటీలో కొని, అక్కడ అద్భుతమైన కాంప్లెక్ కట్టాలి.” అన్నాడు చేతిలో అక్కడున్న పేపర్ వెయిట్ తిప్పుతూ.

“అదంతా ఈజీ కాదు. రహీం ఖాన్‌ను మేనేజ్ చేయాలి. మళ్ళీ కొత్తగా కట్టాలి, బ్యాంకు లోన్స్, ఈ బిల్డింగ్ రూల్స్ అన్నీ.. పెద్ద తల నొప్పి” అంటూ తల పట్టుకుంది.

“అవన్నీ నేను చూసుకుంటాను. ముందుగా మనం అమ్మబోయే దానిలో దాదాపు పది షాప్స్ ఖర్చుల కింద వదిలేయ్యాలి” అన్నాడు.

అది వినగానే ఆమెలో వ్యాపారవేత్త బయటకు వచ్చాడు. “నేనాలోచించి చెప్తాను” అంది.

“మరైతే నేనిక వెళ్తాను” అని లేచి బయటకు అడుగులు వేసాడు మహి.

“ఒక్క నిముషం మహి” పిలిచింది మేఘన.

వెనక్కి తిరిగి భృకుటి ముడివేసి చూసాడు మహి.

“మీకు అవసరమైన ఖర్చులకు డబ్బులు మా ఆఫీసులో తీసుకోండి” అంది.

ఆమె స్వరంలో స్నేహభావాన్ని గమనించిన అతను “నా అవసరాలకి సరిపడా జీతం వుంది. థ్యాంక్యూ.. వస్తాను” అని చిన్నగా నవ్వి వెళ్లి పోయాడు.

డబ్బుల గురించి పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న అతడిని చూసి, పక్కనే నిలబడ్డ లిజీ వేపు చూసి కళ్ళెగరేసింది మేఘన. ఆమె కళ్ళలో చిన్న మెచ్చుకోలు మెరిసింది.

***

ఆ రోజు రాత్రి ఊరి బయట చెరువు దగ్గర తన కారు ఆపి దిగాడు మహి. చుట్టూ పరికించి చూసి, ఎవరూ లేరని నిర్ధారణకు వచ్చి, కారులోనుండీ రెండు నెంబర్ ప్లేట్స్, ఒక పొడవాటి దుడ్డు కర్ర తీసి, వాటిని బలంగా చెరువు లోకి విసిరేసాడు. మళ్ళీ ఒకసారి చుట్టూ చూసి, రహీం ఖాన్, పహిల్వాన్ లను గుర్తు చేసుకుని నవ్వుకున్నాడు. ‘వెధవలు! దూల తీరింది. మెదడు లేని ఇడియట్స్’ అనుకుని కారెక్కాడు మహి. అతని కారు ఊరి వేపు వేగంగా దూసుకు పోయింది.

ఆరు నెలల్లో కాంప్లెక్ అమ్మేశాడు మహి. రహీం ఖాన్‌కు ఉచితంగా పది షాప్స్ రిజిస్ట్రేషన్ చేయించాడు. అంతా సాఫీగా గడిచి పోయింది. హైటెక్ సిటీలో స్థలం కొని పనులు మొదలెట్టాడు.

ఆ రోజు తర్వాత మేఘన నుండీ మహికి ఫోన్లు రావటం మొదలయ్యింది.

వారానికి రెండు మూడు మార్లు కలుసుకుని వ్యాపార విషయాలు చర్చించుకోసాగారిద్దరూ.

“ఈ రోజు సాయంత్రం ఒకసారి వస్తారా? ముఖ్యమైన విషయం మాట్లాడాలి” అంది మేఘన.

“ఆరు తర్వాత రాగలను” అని ఫోన్ పెట్టేసాడు మహి.

మహి సమాధానం విని ఆలోచనల్లో పడింది మేఘన. వెంటనే ఫోన్ తీసుకుని “హలో రంజిత్” అంది.

“ఎస్ ఇన్‌స్పెక్టర్ రంజిత్” అని వినిపించింది గంభీరమైన కంఠం అటువేపునుండీ.

“ఒక చాలా ముఖ్యమైన పని అప్పచెప్తున్నాను. నా వ్యక్తిగతం. వెంటనే నాకు అతని గురించి నీ రిపోర్ట్ కావాలి” అంది చిరునవ్వుతో.

“ఏంటి విషయం మేఘ.. నేను నీ చిన్ననాటి స్నేహితుడిని. దాపరికం లేకుండా చెప్పు” అన్నాడు.

మేఘన చెప్పసాగింది. పూర్తిగా విన్న రంజిత్ “సాయంకాలం ఫోన్ చేస్తాను” అని లైన్ కట్ చేసాడు.

సాయంత్రం ఇన్‌స్పెక్టర్ రంజిత్ చెప్పింది విని, బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి దీర్ఘమైన నిట్టూర్పు విడిచి మళ్ళీ తన పనుల్లో పడి పోయింది మేఘన.

అప్పుడు తీసుకున్న ఆ నిర్ణయంతో భవిష్యత్తులో తన ప్రాణాలు ప్రమాదంలో పడతాయని ఊహించలేకపోయింది.

ఆ రోజు రాత్రి ఇద్దరూ కలిసి భోజనాల తర్వాత ఇంటి బయట మెత్తని పచ్చిక బయలు మీద కూర్చున్నారు. చుట్టూ వెన్నెల పిండార పోసినట్లుగా వుంది.

కాసేపు ఒకరినొకరు చూసుకుంటూ కూర్చున్నారు. ఇద్దరిలో యేవో తెలీని కొత్త భావాలు పురి విప్పి నాట్యమాడ సాగాయి. ఇద్దరి మధ్యా మౌనం నెలకొంది.

ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ మొదటగా మేఘన “బిజినెస్ తప్ప ఏదైనా మాట్లాడండి మహి” అని వెనక్కి చేరగిల బడింది. ఆమె పూర్తిగా రిలాక్స్ కావటం మొదటిసారిగా చూస్తున్నాడు మహి.

కాస్త ముందుకు వంగి “సరే అలాగయితే.. మీరు ఈ రోజు ఈ క్రీం కలర్ చీరలో చాలా బాగున్నారు” అన్నాడు మంద్ర స్వరంతో.

చిన్న సిగ్గుతో తలవంచుకుని “ఓహ్.. మరీను.. పొగడ్తలు” అంది. మొగ్గలా ముడుచుకు పోయింది మేఘన.

వున్నట్లుండి ఆకాశంలో నల్లని మబ్బులు ముసురుకోసాగాయి. చుట్టూ వెన్నెల పోయి పలుచని చీకటి చిక్కగా పరుచుకోసాగింది. ఆమెనే చూడసాగాడు మహి. ఆమె మొహంలో అందం తళుక్కున మెరిసింది..

“మహి.. మీరెవరినైనా ప్రేమించారా?” అడిగింది.

ఎదురుచూడని ఈ ప్రశ్నతో ఖంగు తిన్నాడు మహి. కంగారుగా ఆమె కేసి చూసాడు. ఆమె కళ్ళు దించుకుంది.

“అబ్బే లేదు.. ఇంతవరకూ” అన్నాడు జాగ్రత్తగా.

“నేనంటే మీకు ఇష్టమేనా?’’ అంది మేఘన తన కళ్ళెత్తి మహి కేసి చూసి.

ఊహించని ఈ ప్రశ్నతో బిత్తర పోయాడు మహి.

“మీరు మంచి తెలివైన అమ్మాయి. ఇంత పెద్ద వ్యాపారాన్ని చూసుకునే తెలివితేటలు మీవి. మీరు జమీందారీ కుటుంబీకులు” అన్నాడు ఊపిరి బిగపట్టి. అసలు విషయం మాట్లాడటానికి అతనికి ధైర్యం సరిపోలేదు.

“అది కాదు నేనడిగింది. నేను నచ్చానా?” ఆమె గొంతులో అసహనం బయటపడింది.

దూరంగా ఆకాశంలో మెరుపు, పెద్ద చప్పుడుతో ఉరుములు మొదలయ్యాయి.

“మీరు చాలా పెద్దవారు. నేను మధ్య తరగతి జీవిని” అన్నాడు నిట్టూర్చి.

“మా నాన్నగారు కూడా ఆ రోజుల్లో మధ్య తరగతే” అంది.

మౌనంగా లేచి నిలబడి మేఘన కళ్ళ లోకి చూసాడు మహి. లేచి మహి ముందుకొచ్చి నిలుచుంది మేఘన. కాసేపు ఇద్దరూ ఒకరి కళ్ళతో మరొకరు సంభాషించుకున్నారు.

మహికి దగ్గరగా కదలి తన చేతుల్ని మెల్లిగా లేపి మహి మెడ చుట్టూ వేసింది మేఘన.

మహి కూడా తన చేతులతో ఆమె భుజాలను పట్టుకుని దగ్గరగా గుండెలకు హత్తుకున్నాడు.

చెంపలు లేని మేఘ మొహం మహి గుండెలకు గుచ్చుకుంది. కండరాలు లేని కట్టెముక్కల్లాంటి మేఘన చేతులు అతని మెడ మీద గట్టిగా బిగుసుకున్నాయి. నొప్పిగా అనిపించింది మహికి. కానీ అత్యంత ధనికురాలయిన స్త్రీ, ఆమె ఆస్తులు ఇక తనవే అన్న పట్టలేని ఆనందంలో అతనికి అవేమీ తెలియటం లేదు.

ఆ తర్వాత నెల రోజులు గడిచే లోపు ఉద్యోగానికి రాజీనామా చేసాడు మహి. నెల లోపు వారిద్దరికీ వైభవంగా వివాహం జరిగి పోయింది. రహీం ఖాన్ వ్యక్తిగతంగా వచ్చి శుభాకాంక్షలు తెలిపాడు.

ఇద్దరూ హనీమూన్‌కి మారిషస్‌కి వెళ్లిపోయారు.

కాలం వేగంగా పరిగెత్తింది. అపరిమితమైన డబ్బులు ఎలాంటి భోగాలను, సుఖాలను ఇవ్వగలవో అప్పుడు తెలిసింది మహికి. దాదాపు పదిహేను రోజుల తర్వాత ఇంట్లోకి అడుగు పెట్టారిద్దరూ.

ఇల్లు మొత్తం తిరిగి చూసిన మహికి కళ్ళు తిరిగి పోయాయి.

పడకగది లోపలున్న బుక్ అల్మిరా పక్కకు జరిపి అక్కడున్న సేఫ్ తెరిచి అందులో వున్న నగలు, డబ్బులు, పూర్వీకుల వజ్రాలు చూపించింది మేఘన. అవన్నీ చూసి నోరు తెరిచాడు మహి.

“ఇవన్నీ బ్యాంకు లాకర్లోకి మార్చడం మంచిది, ఇంట్లో ఎందుకూ” అన్నాడు మేఘన వేపు చూసి.

“లాకర్లలో ఇప్పటికే చాలా వున్నాయి. విదేశాలలో కూడా రహస్యంగా మన డబ్బులున్నాయి.” అని సేఫ్ మూసేసి నవ్వింది మేఘన.

త్వరలోనే ఆఫీసుకెళ్లి, వ్యాపారంలో అన్నీ చూసుకోవడం మొదలు పెట్టాడు మహి.

ఒక రోజు రతన్ లాల్ దుకాణానికెళ్లి అతనితో ముఖ్యమైన డీల్ సెటిల్ చేసుకుని బయటకు వస్తుండగా అక్కడి షో కేసులో మంచి ఉంగరం కనపడింది. ఆ డైమండ్ రింగ్ తీసి తొడుక్కుని చూసాడు. చాలా అందంగా కనపడింది. వెంటనే తన కార్డు ద్వారా డబ్బులు కట్టి వచ్చేసాడు మహి.

మరునాడు మేఘనతో కలిసి ఉదయం టిఫిన్ చేస్తుండగా మేఘన “మహీ డైమండ్ రింగ్ కొన్నావా?” అంది.

“ఆఁ.. నిన్ననే. చెప్పటం మరిచిపోయా, ఇదుగో” అన్నాడు మహి తన వేలికున్న ఉంగరాన్ని చూపించి.

దాని వేపు అసలు చూడకుండా, కళ్ళార్పకుండా మహిని చూసి “నాకు చెప్పకుండా ఇంకెప్పుడూ కొనొద్దు” అంది మేఘన సీరియస్‌గా.

ఆమె స్వరంలో మెరిసిన కాఠిన్యాన్ని గమనించి బిత్తరపోయి “అది కాదు మేఘన..” అంటూ ఇంకా అతను చెప్పబోయేలోపు అతడిని చేతితో వారించి “నో ఆర్గ్యుమెంట్ మహి, నీకు కావలసినవి నేను చూసుకుంటాను” అంది.

మేఘన మొహంలో వున్న చిరాకుని చూసి “సరే మేఘన.. సారీ” అని చెప్పి లేచి గది లోకి వెళ్ళిపోయాడు.

ఆ రోజంతా ఆఫీసులో పని చేస్తున్నాడన్నమాటే కానీ తన జీవితంలో మొదటిసారిగా కాళ్ళకి యేవో సంకెళ్లు వున్నట్లుగా అనిపించిందతనికి.

రాత్రి కాగానే బాగా అలసిన మహికి త్వరగా నిద్ర పట్టింది. మేఘన లేచి వెళ్లి టేబుల్ మీదున్న మహి ఫోన్ తీసుకుని అతను చేసిన నంబర్లను గమనించి, వాట్సప్ మొత్తంగా చూసి, తిరిగొచ్చి మహి చుట్టూ చేయి వేసుకుని దగ్గరగా హత్తుకుని, తృప్తిగా కళ్ళు మూసుకుని పడుకుంది.

మరుసటి రోజు ఆఫీసులో తలమునకలుగా పనిలో వున్నాడు మహి. తలుపు తోసుకుని కేబిన్ లోకి అడుగు పెట్టింది లిజీ. తలెత్తి లిజీని చూసాడు మహి. మొదటిసారిగా ఆమెను గమనించాడు.

ఫైల్ తీసుకుని టేబుల్ మీద పెట్టి “శాంక్షన్స్ కొన్ని కావాలి. మీ సంతకాలు పెట్టమన్నారు మేఘ గారు” అని కళ్ళను అందంగా మూసి తెరిచింది లిజీ.

అందమైన రింగుల జుట్టు, మంచి పొడగరి. బహుశా అథ్లెటిక్ అయ్యుండొచ్చు, పొందికైన అందాలు అనుకున్నాడు.

“సార్ మీ సంతకాలు” అంది మరొకసారి.

“ఓకే ఓకే అక్కడ పెట్టండి” అన్నాడు తత్తరపాటుతో.

వెనక్కి తిరిగి కేబిన్‌లో నుండీ వెళ్లిపోయింది లిజీ.

అలా వెళ్తున్న లిజీ వీపు అందాలను చూసాడు మహి. ఒక్కసారిగా అతని మనసులో చిన్న కదలిక మొదలయ్యింది. మనసుని అదుపులో పెట్టుకుని, ఫైల్ తీసుకుని చదవసాగాడు. ఇన్ని సంవత్సరాలుగా ఎవరిని చూసినా చలించని తన మనసేమిటి ఈ రోజు ఇలా అనుకున్నాడు.

రాత్రి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని భోజనం మధ్యలో అడిగాడు మహి “లిజీ ఎప్పటినుండీ పని చేస్తోంది.” అని.

“ఆరు సంవత్సరాలుగా. నమ్మకమైన మనిషి. ఒంటరిగా నేను ఉంటున్న సమయంలో డాడీ పోయినప్పటి నుండీ నాతో ప్రతీ దానికి సపోర్ట్ చేసింది. పని తప్ప వేరే ఆలోచనలు లేవు. మధ్య తరగతి. చిన్నప్పుడే తల్లి తండ్రీ పోయారుట. మేనమామ దగ్గర ఎన్నో బాధలు ఓర్చుకుని చదువుకుంది. అవి తెలిసిన తర్వాత నేను తనకు మన అవుట్‌హౌస్‌లో వుండమన్నాను. వ్యాపారంలో నాకు మంచి తోడుగా వుంది ఇన్నాళ్లు.” అంది మేఘన.

“పెళ్లి కాలేదు కదా?” అన్నాడు.

“అవును. ఎప్పుడూ ఆ ఊసే ఎత్తదు. చాలా సీరియస్ అనే చెప్పాలి” అని నవ్వింది మేఘ.

“నీలాగే?” అని నవ్వాడు మహి.

“అవును, నీతో పరిచయానికి ముందు నాకసలు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదు. అసలు పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలని అనుకున్నాను. గత సంవత్సరం ఆ అమ్మాయికి మన కంపెనీ జాయింట్ డైరెక్టర్‌గా అపాయింట్‌మెంట్ ఇచ్చాను. మన వ్యాపార రహస్యాలన్నీ దాదాపుగా తెలుసు.” అంది మేఘ. ఆమె మొహంలో నవ్వు మాయమై పోయి, ఒక రకమైన దిగులు గోచరించింది. మళ్ళీ వెంటనే నవ్వింది.

“థ్యాంక్యూ. నన్ను పెళ్లి చేసుకున్నందుకు” అన్నాడు చిలిపిగా.

“లేదు. నేనే థ్యాంక్స్ చెప్పాలి మహి.. నేను నీకు నచ్చినందుకు” అంటూ లేచి వచ్చి మహి ఎదలో మొహం దాచుకుంది మేఘన.

మేఘన చుట్టూ చేతులు వేసి గుండెలకు హత్తుకున్నాడు మహి. మేఘన వీపు తడిమాడు. అసలు ఏ మాత్రం నాజూకుగా లేని, గట్టి వీపు తగిలింది. అప్పుడు అతనికి అందమైన లిజీ వీపు గుర్తొచ్చింది.

తల విదుల్చుకుని లిజీ ఆలోచనలనుండీ బయట పడ్డాడు.

ఒక క్షణం ఆగిపోయాడు మహి. “ఏంటి మహి.. ఏంటో ఆలోచిస్తున్నావు?” అంది మేఘన తలపైకి లేపి మహి మొహం చూస్తూ.

“అబ్బే ఏమీ లేదు. ముంబై పార్టీతో రేపు మీటింగ్ ఉందని గుర్తొస్తేనూ” అన్నాడు తడుముకుంటూ.

“అబ్బా ఎప్పుడూ డబ్బు, వ్యాపారం గొడవేనా?” అంది మేఘన అతని తల వెంట్రుకల్లోకి వేళ్ళు పెట్టి నిమురుతూ.

“తప్పదుగా మరి” అని మేఘనను చేతుల్లోకి తీసుకున్నాడు. అతని కళ్ళు మూసుకున్నాయి. కానీ మూసుకున్న అతని కళ్ళకు లిజీ రూపం కనపడ సాగింది.

***

“లిజీ! ఈ మధ్యాన్నం లంచ్ కలిసి చేద్దాం” అన్నాడు మహి.

పేపర్లు చేతుల్లో పట్టుకుని నిలబడ్డ లిజీ కాసేపు మహి వేపు ఇబ్బందిగా చూసి “సరే సర్” అని చెప్పి కేబిన్ బయటకు నడిచింది.

వెనకనుండి ఆమె వంపు తిరిగిన నడుము, అందాలను, బలమైన పొడవాటి కాళ్ళను చూసాడు మహి. అతని శరీరంలో ఏదో తెలీని షాక్ ఒక్కసారిగా తగిలింది. వెళ్తున్న లిజీ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. వెంటనే చూపు మరల్చుకున్నాడు మహి.

మధ్యాన్నం భోజన సమయానికి కేబిన్‌లో టేబుల్ మీద ఎన్నో రకాల వంటకాలు సర్దించాడు మహి. లిజీని తలచుకుంటూ హుషారుగా వున్నాడు.

టేబుల్ మీదున్న పేపర్లను పక్కకు నెట్టి, రెస్ట్ రూమ్‌లో మొహం కడుక్కుని, అద్దంలో చూసుకుని, మెడకున్న టై విప్పుకుంటూ, చిన్నగా విజిల్ వేస్తూ లోకి అడుగు పెట్టాడు మహి.

ప్లేట్స్‌లో వడ్డిస్తూ కనపడ్డ లిజీని చూడగానే అతని మనసు ఉరకలు వేసింది.

“కూర్చో లిజీ” అని చిరునవ్వుతో పిలిచాడు మహి.

“వ్వావ్.. వాట్ ఏ సర్‌ప్రైజ్” అంటూ కేబిన్ లోనికి అడుగు పెట్టింది మేఘన.

మేఘనను చూడగానే మహి ఒళ్ళంతా చల్లబడింది.

“హలో మేడం” అంది లిజీ.

లిజీ వేపు చూసాడు మహి. ఆమె మొహంలో ఎటువంటి భావం లేదు. మేఘన ఆ సమయంలో ఎలా వచ్చిందో అతనికి అర్థం కాలేదు.

“మీరొస్తున్నారని చెప్పగానే లంచ్ ఇక్కడే ఆరెంజ్ చేశారు, మేడం” అని చెప్పి, బయటకు వెళ్లిపోయింది. అది విని వెంటనే సర్దుకుని “అవును డార్లింగ్.. కమాన్..” అంటూ టేబుల్ వేపు నడిచాడు మహి.

“నీకెంత ప్రేమ నేనంటే మహీ” అని మహి మెడచుట్టూ చేతులు వేసి అతని పెదాలను మూసేసింది మేఘన.

‘ఓహ్ గాడ్’ అని ఇష్టం లేని మనసుని అదుపులో పెట్టుకుని, కళ్ళు మూసుకుంటూ, బలవంతంగా మేఘన బక్క పలుచని వీపుని చేతులతో చుట్టేశాడు మహి.

***

ఆ తర్వాత వారం రోజుల వరకూ లిజీను చూడలేకపోయాడు. ఆమె తన కేబిన్ లోకి వస్తుందేమోనని ప్రతి రోజూ ఎదురు చూసాడు మహి.

ఆ రోజు మధ్యాన్నం కేబిన్ లోకి వచ్చి మహి ముందు కొన్ని పేపర్లు పెట్టి, “మీ సంతకాలు పెట్టిన తర్వాత పిలవండి” అని చెప్పి మహి ఏదో చెప్పబోయే లోపు వేగంగా బయటకు వెళ్లి పోయింది లిజీ.

వెళ్లిపోయిన లిజీ గురించి ఆలోచించి ఇంటర్‌కం నొక్కి “లిజీ ఒకసారి రండి” అని పిలిచి వెనక్కి ఒరిగాడు.

“సర్ చెప్పండి” అంది లోనికి అడుగు పెట్టిన లిజీ.

“ఈ రోజు ఢిల్లీ పార్టీ వస్తున్నారు. ఐటీసీలో డిన్నర్‌కి పిలిచాను. మీరు వస్తే బావుంటుంది లిజీ” అన్నాడు మహి.

ఒక క్షణం మహి కళ్ళ లోకి సూటిగా చూసి, “సరే సర్, వస్తాను” అని క్యాబిన్‌లో నుండీ బయటకు నడిచింది.

సాయంత్రం వరకూ పని చేస్తూ తన వాచీ వేపు చాలా సార్లు చూసుకున్నాడు మహి. లిజీతో డిన్నర్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూడసాగాడు.

ఆఫీసు నుండీ ఏడు గంటలకల్లా హోటల్ లోకి చేరుకున్నాడు. మహిని చూడగానే, అక్కడ రిసెప్షన్ సోఫాలో కూర్చున్న లిజీ లేచి వచ్చి “హలో గుడ్ ఈవెనింగ్ సర్” అని చేయి కలిపింది.

లిజీ చేయి తగలగానే అతని మనసు యెగిరి పడింది.

ఒక మూలగా వున్న టేబుల్ దగ్గర కూర్చున్న తర్వాత “ఢిల్లీ పార్టీ..?” అంది అనుమానంగా లిజీ.

“వాళ్ళు పోస్టుపోన్ చేశారు. మనం కాసేపు కూర్చుందాం. ఈనాడు పని ఒత్తిడి చాలా ఎక్కువగా వుంది” అన్నాడు మహి. తలవంచుకుని కూర్చుంది లిజీ.

మెనూ చూసి డిన్నర్ ఆర్డర్ చేసాడు మహి. చాలా సేపు ఎన్నో విషయాలు మాటలాడుతూ ఉండిపోయారిద్దరూ.

రాత్రి పది గంటలకు బయటకొచ్చి కారెక్కారిద్దరూ..

అప్పుడే రోడ్‌కు ఆవల కారు ఎక్కబోతున్న రహీం ఖాన్ వారిద్దరినీ చూసాడు. మహిని చూసి చూపు మరల్చ బోయేలోపు పక్కనున్న లిజీ మీద అతని దృష్టి మర్లింది. ఎక్కడో చూసినట్లుందే, అనుకుంటూ కారు స్టార్ట్ చేసాడు. ఎప్పుడో ఎక్కడో కలిసాను అనుకుంటూ అతని మెదడు వేగంగా పని చేయసాగింది. ఎక్కడా? ఎక్కడ చూసాను అని తల బాదుకుంటూ ఇంటికి చేరుకున్నాడు, కానీ అతనికి గుర్తు రాలేదు.

ఎస్టేట్ బిల్డింగ్స్ ఆవరణ లోకి మహి కారు తిరిగి, దూరంగా వున్న అవుట్‌హౌస్ ముందు ఆగింది.

కారులోనుండి కిందకు దిగి “గుడ్ నైట్ సర్” అంది లిజీ.

“గుడ్ నైట్” అని తన చేతి తో లిజీ అరచేయి నొక్కి వదిలాడు మహి. కారు ముందుకి కదిలింది.

ఇంటి ముందు కారు ఆపి, దిగి పైకి చూసాడు మహి. వరండాలో లైట్స్ వెలుగుతూ ఉన్నాయి. మెట్లెక్కి వరండా దాటి లోనికి వెళ్తూ అనుకోకుండా పక్కకు చూసాడు మహి. బయట సోఫాలో ఒరిగి నిద్రపోతూ కనిపించింది మేఘన.

వెనక్కి తిరిగి మేఘన దగ్గరకెళ్ళి మెల్లిగా చేయి పట్టుకున్నాడు మహి.

“ఆ.. మహి.. ఏంటీ ఇంత ఆలస్యం?” అంది సగం నిద్రలో వున్న మేఘన మత్తుగా.

“ఒక పార్టీతో డిన్నర్ మేఘ, సారీ నీకు చెప్పటం మర్చిపోయాను. ఇంతకీ డిన్నర్ చేసావా లేదా” అని మేఘనను పట్టుకుని లోనికి నడిచాడు.

“లేదు.. నీ గురించి చూస్తూ కూర్చున్నా.. ఇద్దరం కలిసి చేద్దామని, అలా మగతగా నిద్ర పట్టేసింది” అంది.

అది వినగానే అతని మనసు కలుక్కుమంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని, ప్లేటులో పండ్లు, సలాడ్ వడ్డించాడు.

మెల్లిగా తింటూ మహి వేపు చూసి “ఏ హోటల్?” అంది.

చెప్పాలా, వద్దా అని సందేహించి “నువ్ ముందు కానివ్వు. ఇప్పటికే ఆలస్యమైంది” అంటూ లేచి పడకగది వేపు అడుగులు వేసాడు మహి. అన్నింటికీ అనుమానమే, జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు.

ఆ రాత్రి మంచి నిద్రలో మెలకువ వచ్చింది మహికి. తనను మేఘన అల్లుకుపోతున్నదని అర్థం అయ్యి, అయిష్టంగా పెనవేసుకున్నాడు. అతని మెదడు నిండా లిజీ అందాలు నిండిపోయాయి. ఆ తన్మయత్వంలో మేఘనను చుట్టుకున్నాడు.

***

అర్ధరాత్రి దాహంగా అనిపించి నిద్ర లేచాడు రహీం ఖాన్, అప్పుడు స్ఫురించింది, మహితో కారెక్కుతున్న స్త్రీ ఎవరన్నది. వెంటనే అతని నిద్ర తేలిపోయింది. చాలాసేపు నిద్రపోకుండా పళ్ళు కొరుకుతూ వుండిపోయాడు.

అదే సమయంలో లిజీ ఇంటికి దూరంగా కారాపి కిందకు దిగాడు గడ్డపు వ్యక్తి. కాసేపు లిజీ ఉంటున్న అవుట్‌హౌస్‌ను చూసి మెల్లిగా అక్కడున్న చెట్ల చీకటి నీడల్లో అటువైపు అడుగులు వేసాడు.

***

ఉదయాన నిద్ర లేవగానే సమయం చూసాడు రహీం ఖాన్. తొమ్మిది కావొస్తోంది. ఫోన్ చేతుల్లోకి తీసుకుని ఆలోచించసాగాడు. కొన్ని క్షణాలు ఆలోచించి మహి నెంబర్ కలిపాడు.

“హలో రహీం ఖాన్, చాలా రోజులకి.. క్షేమమా” అన్నాడు మహి నవ్వుతూ.

“అంత బావున్నాం సార్. మీరు?” అని తానూ నవ్వుతూ అడిగాడు.

“ఓకే. రహీం.. ఏంటిలా ఫోన్ చేసావు. ఏమిటీ సంగతి” అన్నాడు మహి

“సార్ నిన్న మీతో హోటల్ వద్ద కనిపించిన సుల్తానా మీకెలా తెలుసు..” అని ఆగాడు.

“ఆవిడ పేరు లిజీ. మన ఆఫీసులో మేనేజర్. సుల్తానా కాదు. ఎందుకని అడిగావు రహీం ఖాన్” అన్నాడు అనుమానంగా.  అది వినగానే సందిగ్ధంలో పడ్డాడు రహీం ఖాన్.

“రహీం..” అన్నాడు మహి.

“అదే సార్.. సుల్తానా అనుకున్నాను..”

“కాదు.. లిజీ అని మన ఆఫీసులో అయిదు సంవత్సరాలుగా పని చేస్తోంది.” అన్నాడు మహి

“సారీ సార్. మళ్ళీ కలిసి మాట్లాడుతాను” అని పెట్టేసి తల నొక్కుకున్నాడు రహీం ఖాన్.

ఫోన్ పెట్టేసి ఊపిరి పీల్చాడు మహి. ‘ఇంకా నయం మేఘన వున్నప్పుడు ఫోన్ చేయలేదు వెధవ. వీడెందుకొచ్చాడో అక్కడికి’ అనుకుని ఆఫీసుకి బయలుదేరాడు మహి.

మరుసటి రోజు ఆఫీసులో టేబుల్ ముందు కూర్చోగానే ఇంటర్‌కం నొక్కి లిజీని పిలిచాడు.

లోపలికొచ్చి “హలో సర్.. గుడ్ మార్నింగ్” అంది లిజీ. ఆమెలో కంగారును గమనించాడు మహి.

“ఏంటి లిజీ.. అలా వున్నారు?” అనుమానంగా అడిగాడు మహి.

“ఏమీ లేదు సార్. చెప్పండి, దేనికి రమ్మన్నారు” అంది అసహనంగా.

“ఏమైంది లిజీ? ఏమైనా ప్రాబ్లెమ్?” అడిగాడు లేచి నిలబడి.

“నా ప్రాబ్లెమ్స్ మీకెందుకు సార్. త్వరగా చెప్పండి. నాకు పని వుంది” అంది. ఆమె మొహంలో తెలీని బాధ కనపడుతూ వుందతడికి.

“సరే వెళ్ళండి. ఫోన్ చేయండి” అని కూర్చున్నాడు మహి.

ఇంతలో మహి ఫోన్ ఫోన్ మ్రోగసాగింది.

లేపి “హలో మేఘ, చెప్పు” అన్నాడు కాస్త జంకుంతూ.

“నిన్న రాత్రి ఎవరో వెండర్స్ పార్టీ అన్నావుగా?” అంది. ఆమె గొంతులో అనుమానం.

“అవును.. ఎందుకని?” అడిగాడు. అతనిలో చిన్న భయం మొదలయ్యింది.

“మరి అన్నీ రెండు రకాలు, ఇద్దరే తీసుకున్నారు” మరింత అనుమానంతో ఆలోచిస్తూ అడిగింది.

“ఆ.. ఒకరే వచ్చారు.” అన్నాడు జాగ్రత్తపడుతూ.

“ఇప్పుడే బిల్ డీటెయిల్స్ చూసాను. ఓకే. బిజీనా?” అంది మాములుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తూ.

“ఏమీ లేదు.. పనిలో వున్నాను, వుండనా మరి” అని ఫోన్ కట్ చేసి ఊపిరి పీల్చుకుని. ఇక మీదట ఇటువంటి బిల్స్‌కు కార్డు వాడకూడదు, డబ్బులు కట్టాలి అనుకున్నాడు.

ఒక నెల వరకూ లిజీ కనపడలేదు. ప్రతీ రోజూ ఎదురు చూసాడు. కానీ లిజీ అతన్ని తప్పించుకుని తిరగసాగింది. అది అర్థం చేసుకున్న అతనిలో అసహనం పెరిగిపోసాగింది.

ఒక రోజు మహి క్యాబిన్ లోకి అడుగుపెట్టింది లిజీ. “కూర్చోండి” అన్నాడు మహి.

కూర్చుని అతని ముందు ఒక ఫైల్ పెట్టి తల కిందకు వేసుకుంది లిజీ.

లిజీని పరికించి చూసాడు మహి. ఒత్తయిన కనుబొమలు, కలువపూల లాంటి కళ్ళు, వంపులు తిరిగిన ముంగురులు, అప్సరసకి మారు పేరు, ఆమెని పొందటం పూర్వ జన్మ సుకృతం అనుకున్నాడు.

“ఎందుకని నన్ను అవాయిడ్ చేస్తున్నారు” అడిగాడు మెల్లిగా.

“సర్ సంతకం పెట్టి ఇవ్వండి” అంది కళ్ళు కలపకుండా.

“మీకు నావల్ల ప్రాబ్లెమ్ ఉంటే చెప్పండి” అన్నాడు. అతని స్వరంలో ఆమె పట్ల జాలి కనపడింది.

“మేడంకు ఏ మాత్రం అనుమానం వచ్చిందంటే చాలు, నన్ను బయటకు నెట్టేస్తారు. మీకేమీ కాదు” అంది లిజీ చిన్నగా.

కాసేపు మౌనంగా లిజీని చూసి “మీకేం జరిగినా నాదే బాధ్యత, ఏమీ కాదు. పై వారం ఢిల్లీలో మీటింగ్ వుంది, మూడు రోజులుంటాను. అక్కడకు రాగలరా?” అన్నాడు.

తలెత్తి అతని కళ్ళలోకి చూసింది లిజీ. “ఎలా వస్తాను. ఇక్కడ ఏం చెప్పాలి” అంది భయంగా.

“ఎవరైనా చుట్టాలింటికి వెళ్తున్నా అని సెలవు పెడితే మంచిది” నిదానంగా చెప్పాడు.

మళ్ళీ భయంగా చూసింది అతడి వేపు.

“పోనీ ఆరోగ్యం బాగాలేదని అంటే?” అన్నాడు.

“అలా చెప్తే, మేడం మా ఇంటికి వచ్చేస్తారు” అంది తన పెద్ద కళ్ళను ఇంకాస్త పెద్దవి చేసి.

“మరైతే వేరే ఊరు వెళ్తున్నానని చెప్పి రండి. నా హోటల్ గదిలో, ఇద్దరమే గడిపి వద్దాం” అన్నాడు స్వరం తగ్గించి.

మళ్ళీ భయంగా చూసింది అతన్ని, ఆమె కళ్ళలో కంగారు కనపడుతోంది.

“..నావల్ల కాదు సార్” అని లేచి కంగారుగా బయటకు అడుగులు వేసింది. ఆమె వెళ్ళగానే రుమాలుతో నుదిటి మీద చెమట తుడుచుకుని, కుర్చీలో వెనక్కి వాలాడు.

మరుసటి రోజు రాత్రి ఇంటి ఆవరణలోకి కారు పోనిస్తూ దూరంగా కనిపిస్తున్నలిజీ అవుట్‌హౌస్‌ని చూసి కారు ఆపాడు మహి. కాసేపు ఆ ఇంటి వేపు చూసి, మరో వేపు దూరంగా కనపడుతున్న తనింటి వేపు దృష్టి సారించి, ఆలోచించాడు మహి. మనసులో ఒక ఆలోచన రాగానే ధైర్యం తెచ్చుకుని కారుని లిజీ ఉంటున్న అవుట్‌హౌస్‌ వేపు నడిపాడు.

కారు మెల్లిగా నడుపుతూ అవుట్‌హౌస్ కాస్త దూరంగా వున్నప్పుడే హెడ్ లైట్స్ ఆర్పేశాడు. వెన్నెల్లో అవుట్‌హౌస్ ఎంతో అందంగా కనపడసాగింది. కారు ఆపి, అవుట్‌హౌస్ మెట్లు ఎక్కాడు.

లోపల నుండీ చిన్నగా సంగీతం వినిపిస్తూ వుంది. తలుపు కొట్టాలా వద్దా అని ఆగాడు. అతని గుండె చప్పుడు అతనికి తెలుస్తోంది. గుండె వేగం పెరిగింది.

తలుపు మీద వేళ్ళతో తట్టాడు. “ఎవరూ?” అంటూ తలుపు తెరిచి మహిని చూసి “సార్ మీరా” అంటూ భయంగా అరిచింది.

పెదాలకి చేయి అడ్డం పెట్టుకుని సైగ చేస్తూ లోనికి అడుగు వేసాడు మహి. భయంతో కళ్ళు పెద్దవి చేసి పక్కకు జరిగి, బయటకు దృష్టి సారించి చుట్టూ చూసింది లిజీ. ఆమెకు చీకట్లో ఏమీ కనపడలేదు. ఆమె లోనికి రాగానే తలుపులు దగ్గరకు వేసాడు మహి.

భయం భయంగా వెనక్కి అడుగు వేసింది లిజీ. ఆమె ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి.

“సార్, ఎవరైనా చూస్తారు” అంది.

“ఎవరూ లేరు” అన్నాడు. అతని ఒంట్లో రక్తం వేడెక్కింది. అడుగులు ముందుకు వేసి లిజీ చుట్టూ చేతులు వేసి హత్తుకున్నాడు మహి. ఇద్దరి మధ్య రెండు క్షణాలు స్తంభించి పోయాయి.

మహి చేతులు విడిపించుకుని “ప్లీజ్ సర్. వెళ్లిపోండి ఢిల్లీలో కలుస్తాను. ఇక్కడ ప్రమాదం” అంది.

ఒక్క క్షణం అలాగే నిలబడి లిజీని చూసి, తల వెంట్రుకలు సరి చేసుకుని, ఆమె చేతులు పట్టుకుని చెంప మీద బలంగా ముద్దు పెట్టి, గిరుక్కున వెనక్కి తిరిగి తలుపులు తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు మహి.

అవుట్‌హౌస్‌కి దూరంగా చెట్ల చీకట్లో నిలబడ్డ గడ్డపు వ్యక్తి, వెళ్ళిపోతున్న మహి కారుని కోపంగా చూడసాగాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here