రెడ్ వైన్

1
5

[dropcap]వా[/dropcap]ణీని యీ రోజు యెలా అయినా కలవాలి. దానికి నా మీద చాలా కోపంగా వుంది. ఎప్పుడు మా వూరు వెళ్లినా దాన్ని కలవడం లేదని బలే మారాం చేస్తుంది. కోపం తెచ్చుకొని కొన్ని రోజులు ఆల్ సోషల్ మీడియాలో నన్ను బహిష్కరిస్తుంది కూడా. ఈ ఈవినింగ్ యెలాగైనా తీరిక చేసుకుని వాళ్ళింటికి వెళ్లి దాన్ని కలవాలి. వాణీ నా చిన్ననాటి స్నేహితురాలు. ఓకే వూళ్ళో పుట్టాం, వొకే బడిలో, వొకే హైస్కూలులో, వొకే కాలేజ్‌లో చదువుకున్నాం. పెళ్ళైన తరువాత దాని అదృష్టం కొద్దీ అది మా స్వంత వూరులోనే వుంది, నాది మాత్రం విశాఖపట్నంలో కాపురం.

నిన్ననే వొక పనిమీద మా వూరు వచ్చాను. మళ్ళీ రేపు తిరుగు ప్రయాణం. మధ్యాహ్నం భోజనం చేసి టీవీలో ప్రోగ్రామ్స్ నచ్చక మంచం మీద వాలితే నిద్ర పట్టేసింది. “ఏమే యివాళ మీ ఫ్రెండ్ వాళ్ళ యింటికి వెళ్తానన్నావ్… లే… లే… అప్పుడే సాయంత్రం అయిదు కావొస్తూంది” అంటూ మా అమ్మ తట్టి లేపడంతో వెంటనే నిద్ర లేచాను. టైం చూస్తే అమ్మ చెప్పినట్లు సాయంత్రం అయిదు దాటింది. ఇక ఆలస్యం చేస్తే అవదు అని టవల్ పట్టుకొని రూమ్ బయటకు వచ్చి, అయినా బద్దకంగా వుండటంతో, అక్కడే వున్న కుర్చీలో కూలబడ్డాను. జోరుగా చల్లని గాలి మొదలైంది. నల్లని మబ్బులు యెవరో తరుముతున్నట్లు ఆకాశంలో పరిగెడుతున్నాయి. ఆహ్లాదపరిచే మట్టి వాసన. వొళ్ళు పులకరించే చిరు చినుకులు. రోజూ ఎండా, వుక్కపోతతో సతమవుతున్న జనాల బాధలను చూసి ప్రకృతి కరుణించిందా అనేటట్లు, వొక్క సారిగా వాతావరణంలో మార్పులు. మనసును రంజింప చేసే సొంపైన యిటువంటి వాతావరణం సూర్యుడికి కూడా యింపనుకుంటా, దట్టమైన నల్లని మబ్బులు కప్పుకొని ముడుచుకు పడుకున్నట్లు వున్నాడు, వెలుతురు కూడా మసక మసకగా వుంది.

ఇటువంటి వాతావరణంలో నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తాయని అంటారు. కానీ నేను వాటిని చూసే అవకాశం నాకు కలగక పోయినా, నా మనసులో ఉప్పొంగుతున్న భావోద్రేకాలు చూస్తుంటే, అది నిజమేనేమో అనిపిస్తుంది.

మాది నాలుగిళ్ళ వాకిలి గల యిల్లు. చుట్టూ గదులూ, వాటి ముందు వసారా, స్తంభాలూ, మధ్య వాకిలి, వాకిలి మధ్య తులసికోట. అది పాతకాలం యిల్లు. ఈ రోజుల్లో అటువంటి యిళ్ళు కరువై పోయాయి. అటువంటి యింట్లో మనుషులు వేరు వేరుగా నివసించినా, వారి మనసులు మాత్రం వొక్కటిగానే వుంటాయి యిప్పటికి కూడా.

చిన్న చినుకులు కాస్తా కొంచం ముదిరి జోరు వానగా మారింది. నన్ను యేదో తన్మయత్వం ఆవరించింది. ఒక్క వుదుటున కుర్చీ లోంచి లేచి వాకిల్లోకి గెంతి వానలో గిరా గిరా తిరుగుతూ, తడుస్తూ తెలియని అనుభూతికి లోనయ్యాను. నాలో వున్న పసిపిల్ల “ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన… ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన… చుట్టంలో వస్తావే… చూసెళ్ళి పోతావే… అచ్చంగా నాతోనే…” అంటూ నెమ్మదిగా హమ్మింగ్ చేస్తూ పాడుకొంటూంది. ఎంతసేపయిందో నాకే తెలీదు. అలా ఆ వానలో తడుస్తూ ఆనందిస్తూనే వున్నాను. నా గొంతు అంత శ్రావ్యంగా వుండదు. బహుశా నా బొంగురు గొంతు విని వరుణుడికి కోపం వచ్చి వుంటుంది. తన కోపాన్ని నాకు తెలిపేందుకా అన్నట్లు కళ్ళు ఎర్రగా చేసి నన్ను హెచ్చరిస్తున్నట్లు కళ్ళు జిగేల్ మనే మెరుపుతో పెళ పెళ శబ్దంతో చెవులు చిల్లులు పడేలా ఉరిమేడు. వాన తగ్గు ముఖం పట్టింది. అయినా నేను ఆ వాకిలి వదిలి పెట్టే ధ్యాసే లేదు. ఇంకా నీటి తుంపరలు నా శరీరాన్ని తాకుతూనే వున్నాయి. ఆ చిన్న చిన్న ఆనందాన్ని నేను కోల్పోదలుచుకో లేదు.

కొంత సేపటికి ఆ చిరు జల్లులు కూడా ఆగిపోయాయి. నన్ను ఆ తడి బట్టలలో చూద్దామని సూర్యుడికి కూడా ఆశ పుట్టిందేమో, మేఘాల చాటునుండి తొంగి తొంగి చూస్తున్నాడు. అతడి క్రీగంటి చూపుల తీక్షణత నన్ను యీ లోకంలోకి తెచ్చి పడేసింది. అప్పుడు చూసుకున్నాను. నా ఒంటి మీద కమీజ్ (టాప్) తప్పిస్తే క్రింద సల్వార్ (బాటమ్) లేకుండా యింత సేపూ వాకిట్లో వానలో గెంతానని. ఏదో తెలియని భయం, సిగ్గుతో చుట్టూ పరికించి చూసాను. ఎవరూ కనబడలేదు. ఎవరి గదుల్లో వాళ్ళు వున్నట్లున్నారు. బతికి పోయాను. మధ్యాహ్నం పడుకునే ముందు తొందరగా లేచి తయారై వాణీ వాళ్ళ యింటికి వెళదామనే ధ్యాసలో సల్వార్ లేకుండా వొక్క కమీజ్‌తో పడుకుండిపోయాను. ఒక్క కమీజ్‌తో రూములోనుంచి బయటకు వచ్చిన సంగతే మరిచిపోయాను. అమ్మ యిచ్చిన వేడి ఫిల్టర్ కాఫీ, వాతావరణంలో వచ్చిన మార్పులూ నన్ను మాయ చేసి బాటమ్ లేని సంగతి మరపింప చేసాయంటే నిజానికి దగ్గరగా వుంటుంది. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా పరుగు లాంటి నడకతో బాత్ రూమ్ లోకి వెళ్లి తలుపు మూసుకున్నాను. తలకి షాంపూ పెట్టి స్నానం చేస్తున్నాను.

ఇంతలో “ఇంకా యెంత సేపే… వానలో యింత సేపూ తడిసింది చాలక యింకా స్నానం కూడానా…?” అంటూ అమ్మ అరుపు… కాదు కాదు… అమ్మ పిలుపు. ఆ పిలుపు వినపడినా నా ఆలోచనలు ఏ డ్రస్సు వేసుకోవాలి అనే ప్రశ్న పైనే లగ్నమై పోయాయి. ఈ సారి సరా సరి మా అమ్మ బాతురూం తలుపు కొట్టి మరీ పిలిచింది.

మా అమ్మ తలుపు తట్టిందంటే అది ఫైనల్ వార్నింగ్ అనమాట. ఇక ఆలస్యం చేయకూడదని నా బ్లూ టవల్ వొంటికి మొత్తం చుట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాను. ఇంతలో మళ్ళీ అమ్మ తలుపు తట్టి “నీలూ ఫోన్ చేసింది… వాణీ కాకినాడ వెళ్లిందట…” ఆ మాట వింటూనే బాత్ రూమ్ తలుపు కొంచం తెరిచాను. ఆ తలుపు సందులో నుంచే అమ్మ నా సెల్ ఫోన్ చేతిలో పెట్టి వెళ్లి పోయింది. ఆ తడి చేతులతోనే నీలూతో మాట్లాడి వొక చేత్తో సెల్ ఫోన్ పట్టుకొని, మరో చేత్తో నేనెంత  ప్రయత్నిస్తూన్నా మొండిగా నా మాట విననంటూ మొరాయిస్తున్న టవల్‌ని వొంటికి చుట్టి పట్టుకొని బాత్ రూమ్ తలుపు వోరువాకిలిగా చేసి, ఆ సందులోనుంచి బయట యెవరూ లేరని నిర్ధారణ చేసుకొని వొక్క వుదుటున నా రూమ్ లోకి వెళ్లాను. ఇప్పుడు వాణీ కాకినాడ యేందుకు వెళ్లిందబ్బా… అనుకుంటూ, నా ప్రోగ్రామ్ తలక్రిందులైందనే ఆలోచనలతో సతమతమవుతూ, నైటీని తొడుక్కొని రూమ్ లోనుంచి బయటపడ్డాను.

చేతిలోనే వున్న నా సెల్ ఫోన్ మళ్ళీ రింగ్ అయింది. ఎవరా అని చూస్తే, మా చెల్లి. అది మా మేడ మీద రూమ్ లోనే కాపురం వుంటుంది. వాళ్ళాయనకీ, మా చెల్లీకీ మా వూళ్ళోనే ఉద్యోగాలు. మా యింటి పై పోర్షన్ లోనే వుంటారు. పై మేడమీద వుంటూనే నాకు యెందుకు ఫోన్ చేసిందా అని కొంచం ఆశ్చర్యంతో, “హలో” అన్నాను. “ఒసేయ్… నువ్వు వొక్కర్తివే తొందరగా మా రూమ్‌కి వచ్చేయ్… సర్ప్రైజ్… తోడుగా యెవరినీ నీతో తీసుకు రాక” అంటూ అతి నెమ్మదిగా యేదో రహస్యం చెబుతున్నట్లు చెప్పి ఫోన్ కట్ చేసింది. అర్థం అవలేదు. అయోమయంలో పడ్డాను. ఏం సర్ప్రైజ్ యిప్పుడు… తీరా వెళితే కొంపతీసి నన్ను ఫూల్‌ని చేయ్యదు కదా? ఏంటో… యెప్పుడూ మా చెల్లి నాకు అర్థమయేటట్లు మాట్లాడదు. దాన్ని అర్థం చేసుకోలేక పోవడం నా తెలివితక్కువతనమో లేక దాని తెలివితేటలో నాకు యిప్పడికీ అర్థమై చావదు. సరేలే అనుకుంటూ, హెయిర్ కోంబ్ చేసుకొని, డియో వేసుకొని వొక మారు అద్దంలో చూసుకున్నాను. పరవాలేదు. నేనూ అందంగానే వుంటాను అని నా బుజం నేనే తట్టుకొని, అమ్మ దగ్గరికి పరిగెట్టేను. “ఏం… అయితే నీ ప్రోగ్రామ్ కేన్సిల్ అయినట్లేనా” అంటూ అమ్మ అడిగిన ప్రశ్నకి, తల అవునన్నట్లు వూపుతూనే, పకోడీల ప్లేట్ చేతికందుకున్నాను. ఒక్క పకోడీ కొరికేటంతలో మళ్ళీ మా చెల్లి మిస్డ్ కాల్. ఈ సమయంలో నాతో ఏం మాట్లాడుతుంది. ఏమిటా సర్ప్రైజ్ అని ఆలోచిస్తూ … పోనీలే వెళ్లి చూస్తే పోయిందేముంది అనుకోని, పకోడీలు ప్లేట్ చేత్తో పట్టుకొని మేడ మెట్లెక్కి పైకి వెళ్ళేను. రూమ్ డోర్ లోపల నుంచి లాక్ చేసి వుంది. సాధారణంగా చెల్లి రూమ్ యెప్పుడూ తెరిచే వుంటుంది. ఒక్క రాత్రి నిద్రించే సమయంలో తప్పు. నా బుర్రలో మరింతగా కుతూహలం పెరిగింది. మెల్లిగా తలుపు మీద ముని వేళ్ళతో వినీ వినిపించనట్లుగా తట్టాను. చెల్లి అతి నెమ్మదిగా తలుపు కొంచం తీసి, ఎవరూ? అన్నట్లు సందులోనుంచి బయటకి చూసింది. దాని కళ్ళల్లో భయం, సందేహం కొట్టిస్తున్నాయి. “నేనేనే” అంటూ మెల్లిగా చెప్పాను. “ఉష్….” అంటూ వేలు పెదాలపై పెట్టుకొని తలుపు తీసి, నా చేయి పట్టుకొని గబుక్కున లోపలికి లాగి వెంటనే మళ్ళీ తలుపు గడియ పెట్టేసింది. మెల్లిగా పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ లోపల హాల్ లోకి వెళ్లాను.

నన్ను నేనే నమ్మలేక పోయాను. ఆశ్చర్యమో లేక సంభ్రమమో తెలీదు కాని, నా కళ్ళు రెప్ప వేయకుండా అలాగే వుండి పోయాయి కొంత సేపు. హాల్ మధ్యలో సెంటర్ టేబిల్ మీద నిగ నిగ లాడుతూ అందంగా, మెడ పొడుగ్గా వున్న వొక గ్రీన్ కలర్ సీసా, పక్కన వో మూడు గ్లాసులూ వున్నాయి. ఒక సింగల్ సోఫా సీట్ లో మా చెల్లి హబ్బీ కూర్చొని వున్నాడు.

అర్ధం అయిపొయింది. చివరికి తెగించి సాధించింది మా చెల్లి అని మనుసులోనే దానికి అభినందనలు తెలిపాను. ఈ ప్రోగ్రామ్ గురించి చాలా రోజులుగా అనుకుంటున్నాము. అసలు మనుషులు, ప్రత్యేకించి మగవాళ్ళు యీ హాట్ డ్రింక్స్ అంటే యెందుకు వెంపరలాడతారో అనే సందేహం చాలా ఏళ్ళ నుండి మనుసును తొలుస్తూనే వుంది. అది వొకరిని అడిగి తెలుసుకునే కన్నా, స్వంత అనుభవంతో తెలుసుకోవాలని మాదో బలమైన అసమంజసమైన కోరిక. అదీ కాక, మనిషన్న తరువాత కనీసం వైనేనా వొకసారి రుచి చూడాలని తాపత్రయం. అదీ మూడో కంటికి కనబడకుండా, ఇంటి గోడలకు సైతం తెలియకుండా. మా తమ్ముడు అమెరికాలో వుంటాడు వాడికి వీలయితే యీమారు ఇండియా వచ్చినప్పుడు వొక వైన్ బాటిల్ తీసుకు రమ్మని చాలా రోజుల క్రితమే చెప్పాము. వాడు యీ మద్యనే ఇండియా వచ్చి మళ్ళీ వెళ్లి పోయాడు. బాటిల్ చూడగానే అనుకున్నా. ఇది మా తమ్ముడు చలవే అని.

“ఇది మనం చాలా రోజులుగా ప్లేన్ చేస్తున్నదే కదా… మీ తమ్ముడు వైన్ బాటిల్ గుట్టు చప్పుడు కాకుండా నాకు తెచ్చి యిచ్చాడు. నేనూ మీ చెల్లెలూ కలిసి యివాళ యీ బాటిల్ వోపెన్ చేద్దామని అనుకుని, నీవు కూడా యిక్కడ వుండడంతో యిదే మంచి తరుణమని ఎరేంజ్ చేసాము” అంటూ మా చెల్లెలి హబ్బీ పిల్లడు పాఠం అప్పచెప్పినట్లు గడ గడా నే వూహించిందే చెప్పేడు. మా చెల్లెలి హబ్బీ పూర్తిగా ‘టీటోటాలర్’. ఏ అలవాట్లూ లేని చాలా మర్యాదస్తుడు. కానీ ముగ్గురిలో యేదో తపన… దీన్ని యివాళ టేస్ట్ చెయ్యాలనే ఆరాటం.

రెడ్ వైన్… దాని టేస్ట్, అది కలిగించే మత్తు యెలా వుంటుందో తెలియదు కానీ, ఆ బాటిల్ మాత్రం చాలా అందంగా వుంది. ఒక్క మారు చిన్నపుడు విన్న ‘మేక వన్నె పులి’ అనే ఉవాచ జ్ఞాపకం వచ్చింది. బాటిల్ బాగుంది సరే, కానీ, అందులో వున్న వైన్ త్రాగితే యేమౌతుందో? తల తిరిగి పడిపోను కదా… అభాసు పాలు అయిపోను కదా? నలుగురికీ తెలిస్తే, ముఖ్యంగా మా హబ్బీకి తెలిస్తే నా చాప్టర్ క్లోజ్. ఎన్నో రకాలైన ప్రశ్నలు… సమాధానం నా వివేకం ఆలోచించి చెప్పేముందే… అమితంగా తొందర పెడుతున్న నా ఉత్సుకత.

మా చెల్లెలి హబ్బీ గ్లాసుల్లోకి చాలా కొంచం బాటిల్ లోని వైన్ పోసాడు. చూసిందికి యెర్ర ద్రాక్ష పళ్ళ రసంలా వుంది. కానీ అది పోస్తున్నప్పుడు యేదో రకమైన పుల్ల వాసన ముక్కు పుటాలకు తగిలింది. ఒక పక్క ఆనందం, మరో పక్క తప్పు చేస్తున్నానా అనే మీమాంస. మనసులో భయం యెక్కువైంది. నా గుండె చప్పుడు నాకే వినిపించసాగింది. వర్షం కురిసిన సాయింత్రం మూలాన, గదిలో చల్లగా వున్నప్పటికీ, నా నుదిటిపై చమటలు పడుతున్నాయి. నా లోని కోరిక “దానికేముంది, ద్రాక్ష పళ్ళ రసమే కదా” అంటూ నాకు ధైర్యాన్ని యిచ్చి ప్రోత్సహిస్తున్నట్లు అనిపించింది. మా చెల్లి వొక గ్లాసు తీసుకొని నా చేతికందించింది. వణుకుతున్న చేతితో ఆ గ్లాస్ పట్టుకొని ముగ్గురం ఒకేసారి పెదాలకు చేర్చి చాలా కొంచం నోట్లోకి సిప్ చేసాము. మరేమీ ఆలోచించకుండా కళ్ళు మూసుకొని ఆ వొక్క సిప్ గోతులోకి దింపాను అనే కంటే మింగేసాను అంటే అర్థవంతంగా వుంటుందేమో. ఒక్క సారి వొళ్ళు జలదరించింది. వైన్ మింగేసినా, దాని టేస్ట్ నాలికను పట్టి వ్రేలాడుతున్నట్లుగా అనిపించింది. చాలా ఒగరుగానూ, పుల్లగానూ వుంది దాని రుచి. వెగటుగా అనిపించింది. మా చెల్లెలి పరిస్థితీ అదే క్రమంలో వుంది. గ్లాసు టేబిలుపై పెట్టి, వికారంగా మొహం పెట్టి “యిది బాగోలేదు. వైన్ టెస్ట్ యిలా వుంటుందా? ఎలా తాగుతారబ్బా మనుషులు” అని బయటకే అనేసేను. మా చెల్లెలు హబ్బీ “వైన్ యిలాగే వుంటుందేమో మరి. అయినా మనుషులు వైనేమిటి, విస్కీ, బ్రార్టీలూ పీపాల కొద్దీ నిత్యం తాగేస్తున్నారు. నీకు నచ్చకపోతే వదిలేయ్… బలవంతంగా మాత్రం తాగకు” అంటూ నాకు జ్ఞాన బోధ చేసారు. “దూరపు కొండలు నునుపు” అనే సామెత గుర్తొచ్చింది. “ఏమైనా వైన్ బాటిల్లో వుంటేనే చూడడానికి చాలా బాగుంది. దానిని అందులోనే బంధించి వుంచేద్దాము” అని అన్నాను. “వద్దు” అని యెవరైనా చెప్పినప్పుడు “కావాలి” అనిపిస్తుంది. తీరా అనుభవమైన తరువాత మనమే దానిని విసిరి కొడతాం. ఇది ప్రకృతి ధర్మమేమో? ఇదే నా పరిస్థితి అంటూ మా చెల్లికీ, చెల్లెలి హబ్బీకి థాంక్స్ మరియు గుడ్ నైట్ చెప్పి అక్కడ నుండి కిందికి దిగి మా అమ్మ దగ్గరికి వచ్చేసేను. నన్ను చూస్తూనే “యెక్కడికి మాయమై పోయావే? మీ ఫ్రెండ్ యింటికి వెళ్లే పోగ్రామ్ కేన్సిల్ అయ్యిందని చెప్పావు కదా?” అంటూ ప్రశ్నలు కురిపించింది మా అమ్మ. “మేడ మీద చెల్లి దగ్గరికి వెళ్లానమ్మా” అని నిజం కాని అబద్ధం చెప్పి నా మంచం మీద వాలి పోయాను.

నేను తప్పు చేశానేమో అన్న నా భావనను పారద్రోలేందుకా లేక నేను చేసిన సాహసాన్ని సమర్థించేందుకా అన్నట్లు “మనిసన్నాక కసింత కళా పోషణ వుండక్కర్లేదా యేంటి” అన్న సినిమా డైలాగ్ నా మస్తిష్కంలో అరిగి పోయిన పాత గ్రామఫోన్ రికార్డులో అక్కడే ఆగి నాకు వినిపిస్తూనే వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here