ప్రాంతీయ సినిమా – 2: ఓలివుడ్ ఒడిదుడుకుల మయమే!

    0
    8

    [box type=’note’ fontsize=’16’] ఒడిశా సినిమా మార్కెట్‌ని హిందీ సినిమాలు ఆక్రమించాయని చెబుతూ ఎనిమిది దశాబ్దాల చరిత్ర గల ఓలివుడ్ సినిమాలను విశ్లేషిస్తున్నారు సికందర్. [/box]

    ఎనిమిది దశాబ్దాల చరిత్ర గల ఓలివుడ్ (ఒడిశా సినిమా పరిశ్రమ) అత్యంత గుణాత్మకంగా ఇంకా అస్తిత్వాన్ని వెతుక్కునే ప్రయత్నంలోనే వుంది. ఇప్పటికీ అక్కడి నిర్మాతలకి, దర్శకులకీ సినిమా అంటే ఏంటో తెలీదు. ఏం తీస్తారో, ప్రేక్షకులేం చూస్తారో ఎవరికీ అంతుబట్టదు. ఇప్పుడైతే తలా తోకాలేని కథలతో సినిమాలు తీసేదాకా వచ్చారు.  మన టాలీవుడ్ నుంచి కూడా కొందరు అక్కడికెళ్ళి విఫలయత్నాలు చేసి వచ్చారు. మరొకళ్ళు భువనేశ్వర్ వెళ్లి తెలుగు సినిమా తీస్తే చవకలో అవుతుందని ప్లాన్ చేస్తున్నారు. కానీ అక్కడ పది  రోజులు షెడ్యూల్ వేసుకునిపోతే,  నెల రోజులు పడుతుంది. ఏ టెక్నీషియనూ అక్కడ పదకొండు గంటలలోపు షూటింగ్ కి రాడు. అందుకని వాళ్ళని లాడ్జిలో బసచేయించి తమ అదుపులో వుంచుకోవాలనుకుంటున్నారు. ఓలివుడ్ అంటే లేజీవుడ్డే మరి!

    ఓడిశా రాజధాని భువనేశ్వర్, ఆ తర్వాత కటక్ రెండూ ఓలివుడ్ కి కేంద్ర స్థానాలైనా, 1959 వరకూ కలకత్తా (అప్పట్లో కలకత్తానే)  వెళ్లి ఒరియా (ఓడియాకి అప్పటి పేరు) సినిమాలు తీసేవాళ్ళు. 1936 లో తొలి ఒరియా సినిమా ‘సీతా బిబాహ్’ (సీతా వివాహం) తీశారు. అప్పటికి తెలుగు సినిమాలు పౌరాణిక నాటకాల ఆధారంగా తీయడం మానుకుని, ఇదే 1936 లో కాల్పనిక  కథతో ‘ప్రేమ విజయం’ అనే సాంఘీకం తీయగల్గే  రికార్డుని సాధిస్తే, ఒరిస్సా ఇంకా ‘సీతా బిబాహ్’ లాంటి  పౌరాణిక నాటకం ఆధారంగానే తీసే దశలో వుండి పోయింది. పైగా1949 వరకూ 15 ఏళ్ళ పాటు  రెండో సినిమా జాడ కూడా లేకుండా పోయింది. కొందరు భూస్వాములు, వ్యాపారులు రంగప్రవేశం చేసి,  ‘లలిత’ అనే సాంఘీకంతో పునరుజ్జీవింప జేశారు ఒరియా సినిమాని.
    ఇలా ఏడాదికి ఒకటి రెండు, నాల్గు ఐదు, ఆరేడు సినిమాలు మాత్రమే తీసుకుంటూ వస్తున్నఓలివుడ్,  2013 నుంచే ఓ పది నుంచి ఇరవై సినిమాల వరకూ నిర్మించ గల్గుతోంది. ఒడిశా సినిమా మార్కెట్ ని హిందీ సినిమాలు ఆక్రమించాయి. రాష్ట్రమంతటా వున్నవే 150 థియేటర్ లైతే,  జీఎస్టీతో టికెట్ల ధరలు పెరగడంతో ప్రేక్షకులు కూడా తగ్గి థియేటర్ల యజమానులు కష్టాల్లో పడ్డారు. అయితే ఇప్పుడున్నంత దిగజారిన నాణ్యతా ప్రమాణాలతో ఒకప్పుడు  ఒడియా  సినిమాలు వుండేవి కావు. 1960 లో ‘శ్రీ లోకనాథ్’ ఒరియా భాషలో నిర్మించిన పదకొండో సినిమా. దీనికి దర్శకుడు ప్రఫుల్ల సేన్ గుప్తా. ఈయన ఆ సంవత్సరం జాతీయ స్థాయిలో వెండి పతకం సాధించాడు. నాస్తికుడైన భర్తకీ, ఆస్తికురాలైన భార్యకీ మధ్య నడిచే కథ. చివరికి ఆస్తికత్వాన్నే సమర్ధించే ముగింపు. ఇదే సంవత్సరం ప్రశాంత్ నందా అనే నటుడికి  ‘నువా బోవూ’ లో నటనకి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు లభించింది. నటుడు, దర్శకుడు, రచయితా, గీత రచయితా, గాయకుడూ అయిన  ప్రశాంత్ నందా 1966, 1969 లలో సైతం ‘మతిర్ మనీషా’, ‘అదిన మేఘా’ లలో నటనకి గాను రెండు సార్లు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు పొందాడు. ‘మతిర్ మనీషా’ కి మృణాల్ సేన్ దర్శకత్వం వహించాడు.

    ఒక రకంగా గంభీరమైన కథలతో స్తబ్దుగా వున్న ఒడియా సినిమా రంగాన్ని కమర్షియల్ సినిమాల దిశగా మరల్చి ఊపు తీసుకొచ్చిన వాడు మహ్మద్ మొహిసిన్. ఈయన ఒడియా సంస్కృతిని కాపాడుతూనే కమర్షియల్ సినిమాలు తీశాడు. పూర్వాశ్రమంలో బాలీవుడ్ లో పనిచేసిన ఫలితమిది.  1981 – 2003  మధ్య తీసిన పదహారు సినిమాలూ హిట్టయ్యాయి. వీటిలో ‘లక్ష్మణ రేఖ’, ‘లక్ష్మీ ప్రతిమ’ బాగా పేరు తెచ్చుకున్నాయి. నటుడుడిగా రంగప్రవేశం చేసిన ఈయన నటించిన ‘రాకా’ అనేపాత్ర ఇంటింటా ఆత్మీయమైపోయింది.
    ఇదే కాలంలో అమీయా రంజన్ పట్నాయక్ ఒడియాలోమల్టీస్టారర్  సినిమాలు తీసే కొత్త ట్రెండ్ ని ప్రారంభించాడు. ఒడియాలో కొత్త నటీనటుల్ని పరిచయం చేయడమే గాక, హిందీ, తమిళ భాషల్లోంచి సంగీత దర్శకులని, ఇతర సాంకేతికుల్నీ తీసుకువచ్చి అట్టహాసంగా సినిమాలు తీశాడు. 1985 లో ‘హకీమ్ బాబు’ కి నిర్మాతగా జాతీయ అవార్డు పొందాడు. ఇంతటితో ఆగకుండా ఒడియా,  బెంగాలీ,  బంగ్లాదేశీ భాషల్లో త్రిభాషా చిత్రాలు కూడా తీయడం మొదలెట్టాడు.

    1990 లలో ఉత్తమ్ మోహంతి అనే కొత్త దర్శకుడు రంగప్రవేశం చేశాడు. తొలి ప్రయత్నం ‘అభిమాన్’ తోనే ఈయన సంచలనం సృష్టించాడు. బాలీవుడ్ నటి నందితా దాస్ కి ఒడియాలో మూలాలున్నాయి. 2000 లో జాతీయ  అవార్డు పొందిన ‘బిశ్వ ప్రకాశ్’ లో ఈమె నటించారు. ఒడియా నటీనటుల్లో పాపులరైన వారు బిజయ్ మోహంతి, మిహిర్ దాస్ లు. కొత్త తరం స్టార్ గా సిద్ధార్థ్  మహాపాత్ర నిలదొక్కుకున్నాడు. హీరోయిన్లలో వర్షా ప్రియదర్శిని పాపులర్ స్టార్ గా ఒడియా ప్రేక్షకుల అభిమానం పొందుతోంది.
    ఇటీవలి సంవత్సరాలలో ఓలివుడ్ లో పెనుమార్పులొచ్చాయి. అనారోగ్యకర ధోరణులు ప్రవేశించాయి. బ్లాక్ మనీ బాబులు ఒడియా సినిమా పరిశ్రమ బాట పట్టారు. విచ్చల విడిగా నల్ల ధనాన్ని వెదజల్లుతూ హంగామా చేయడం మొదలెట్టారు. ఒడియా  మార్కెట్ కి అరవై  నుంచి ఎనభై  లక్షల మధ్య సినిమా తీస్తే మహా ఎక్కువ. అలాంటిది నయా నిర్మాతలు అట్టహాసంగా కోటి దాటించేస్తున్నారు. ఐదూ పది లక్షలున్న హీరో హీరోయిన్ల పారితోషికాల్ని ఇరవై లక్షలకి పెంచి ఇచ్చేస్తున్నారు. ఈ నిర్మాతలకి సినిమాలంటే అసలు ప్రేమే లేదు. రచయితలన్నా, మంచి కథలన్నా గౌరవం లేదు. ఇతర భాషల కథలు కొనేస్తున్నారు. లేదా కాపీ కొట్ట మంటున్నారు. దీంతో ఒడియా సినిమాలు వాటి నేటివిటీని, ఒరిజినాలిటీనీ  కోల్పోయి వెలవెల బోతున్నాయి. ఇదంతా చూస్తూ రెగ్యులర్ నిర్మాతలు ఇరకాటంలో పడిపోతున్నారు.
    ఇదిలా వుండగా, ఇప్పుడొస్తున్న నటీనటుల్లో, సాంకేతిక నిపుణుల్లో,  నైపుణ్యం కూడా కొరవడుతోంది. పైగా క్రమశిక్షణ కూడా లేదు. ఉదయం ఆరుగంటలకి షూటింగు పెట్టుకుంటే పదకొండు వరకూ రారు.  పైగా పాపులర్ స్టార్లు పారితోషికాలతో  పాటు పర్సంటేజీలు అడుగుతున్నారు. ఇది నయా నిర్మాతలకి పెద్ద విషయం కాకపోయినా రెగ్యులర్ నిర్మాతలకి భారమై పోతోంది. అయితే పాటలకి ఫారిన్ లొకేషన్లు మాత్రం స్టార్లు డిమాండ్ చేయకపోవడం కొంత ఊరట. దాంతో బడ్జెట్ భారీగా పెరుగిపోతుందని తెలుసు. దీంతో  దక్షిణ రాష్ట్రాల్లో ఊటీ వంటి లొకేషన్లతో సరిపెట్టుకుంటున్నారు.
    ఓలివుడ్ మార్కెట్ లో ఆంధ్రప్రదేశ్, చత్తీస్ ఘర్, పశ్చిమ బెంగాల్, బెంగుళూరు, ఢిల్లీ, జంషెడ్ పూర్ ఏరియాలున్నాయి. ఇటీవల కాలంలో ఒమాన్, బెహ్రెయిన్, మలేషియా, యూఏఈ లలో కూడా అక్కడి ఒడియా  ప్రజలకి ఒడియా సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో గత రెండు సంవత్సరాల్లో వసూళ్ళు కూడా పెట్టుబడికి ఎన్నో రెట్లు వస్తున్నాయి. గతంలో బడ్జెట్ ని కోటి దాటించేసిన నయా నిర్మాతలు ఇక నార్మల్ కొచ్చారు. దీంతో బడ్జెట్లు భారీగా పడిపోయి, లాభాలు దండిగా పెరిగాయి. రెగ్యులర్ నిర్మాతలు కూడా ఇప్పుడు సులభంగా సినిమాలు తీసుకోగల్గుతున్నారు. ‘ఇష్క్ తూ హీ తూ’ 70 లక్షలతో తీస్తే, ఊహించని విధంగా 7 కోట్లు వసూలు చేసింది. ‘సూపర్ మిచ్చువా’ బడ్జెట్ 35 లక్షలతో తీస్తే,  6 కోట్లు వచ్చాయి. ‘రంగీలా బాబా’ కోటిన్నరతో తీస్తే, 5 కోట్లు వచ్చాయి. ‘సమ్ థింగ్ సమ్ థింగ్’ 56 లక్షలతో తీస్తే, 4.5 కోట్లు వచ్చాయి. ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఈ టైటిల్స్ ని   చూస్తేనే తెలిసిపోతోంది ఎలాటి సినిమాలు తీస్తున్నారో. ఈ ట్రెండ్ కి కారకులైన నయా నిర్మాతల బాటలో ఇప్పుడు రెగ్యులర్ నిర్మాతలు కూడా లాభ పడుతున్నారు. అర్ధం పర్ధం లేని మసాలా సినిమాలకి కనక వర్షం కురిపిస్తున్నారు ప్రేక్షకులు కూడా.  ‘ఐ లవ్ యూ 100 ఔట్ 100’ అనే అధమస్థాయి  సినిమాని ముష్టి 35 లక్షలతో తీస్తే, 3 కోట్లు వచ్చాయి!

    ఈ పరిస్థితుల్లో ఒకప్పుడు జాతీయ ఉత్తమ చలన చిత్ర అవార్డులకి పెట్టింది పేరైన ఒడియా సినిమాలు,  ఇక 1999 నుంచీ వాటికి  దూరం జరుగుతూ వచ్చేశాయి. ఇక ఫక్తు కమర్షియల్ బాట పట్టి, యువ ప్రేక్షకుల కోసమే యూత్ ఓరియెంటెడ్  సినిమాలు అన్నట్టుగా గా సొమ్ములు చేసుకుంటున్నాయి.

    సికిందర్

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here