రేనాటి వైద్యుని పల్నాటి భారతము

1
9

[dropcap]”ని[/dropcap]ప్పచ్చరంబయ్యెనే నేడు వీర పల్నాటి యోధుల సింహనాదలక్ష్మి” అంటూ అణగారిన ఆంధ్రుల పౌరుషాన్ని తలచుకుని బాధ పడ్డారు కరుణశ్రీ. “బాలచంద్రుని, బ్రహ్మనాయని ప్రాణవాయువులేవి తల్లీ?” అంటూ నిట్టూర్చారు శ్రీశ్రీ. అంతగా తెలుగువారి గుండెల్లో గూడుకట్టుకున్న గాథ పల్నాటి వీరగాథ. శ్రీనాథుని వంటి విద్వత్కవి నుండి జానపద గాయకుల వరకు అందరినీ ఉత్తేజపరచిన కథ పలనాటి వీరుల కథ. దాయాదుల మధ్య పోరు, కుతంత్రాలతో రాజ్య బహిష్కారం ఇంకా అనేక సామ్యాల వలన పంచమవేదంతో పోల్చబడిన గాథ ఇది. పింగళి లక్ష్మీకాంతంగారు,అక్కిరాజు ఉమాకాంతంగారు,తంగిరాల వెంకట సుబ్బారావుగారు వంటి మహామహులు ఎందరో ఈ పల్నాటి వీరచరిత్రను గురించి చర్చించారు. ముదిగొండ వీరభద్రకవిగారు, చిలుకూరు వీరభద్ర రావుగారు వంటి ప్రసిద్ధులు ఈ ఇతివృత్తాన్ని గ్రహించి వివిధ ప్రక్రియలలో రచనలు చేసారు. ‘కోమలసాహితీవల్లభ’ బిరుదాంకితులైన డాక్టర్ కోడూరు ప్రభాకరరెడ్డిగారు కూడా ఈ కథకు ఆకర్షితులై పద్యకావ్యంగా రచించారు. రెండు ముద్రణలు పొందిన ఈ కావ్య సౌందర్యాన్ని గురించి అవధానం చంద్రశేఖరశర్మగారు, గొట్టిముక్కల సుబ్రహ్మణ్యశాస్త్రిగారు, కోవెల సంపత్కుమారాచార్యగారు, బేతవోలు రామబ్రహ్మం గారు వంటి మహామహులెందరో తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు; విశ్లేషించారు. లబ్ధప్రతిష్ఠులైన కవి పండితుల మన్ననలను అందుకున్న ఈ కావ్యం గురించి నావంటివారు కొత్తగా చెప్పవలసినది ఏమీ లేకపోయినా ఎవరి కావ్య రసాస్వాదనానుభూతి వారిది కాబట్టి ఈ కావ్యాన్ని గురించి నావి కూడా నాలుగు మాటలు.

ఈ కావ్యానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఒక చారిత్రక కావ్యాన్ని అందునా పంచమవేదంతో పోల్చబడినదానిని చిన్న పద్యాలైన తేటగీతులలో రచించటం ఒకటి. క్షణం తీరికలేని వైద్యవృత్తిలో ఉంటూ రచించటం మరొక ప్రత్యేకత. పద్యకావ్యరచనకు కొంత పరిశ్రమ చేయాలి. చందశ్శాస్త్రాన్ని అభ్యసించాలి. ఆ శాస్త్ర పరిజ్ఞానం కావ్యసౌందర్యానికి అడ్డురాకుండా చూసుకోవాలి.ఇది మామూలు కావ్య విషయం. ఇక చారిత్రక కావ్యరచనలో మరికొంత కష్టముంది. చారిత్రక కావ్యకర్త చారిత్రక విషయాలకు కావ్య పరిమళాన్ని అలదాలి. శుద్ధచరిత్రకు భావనాబలం తోడైతేనే చరిత్ర సజీవ స్పందనను కలిగించగలదు. కేవల చరిత్ర విషయ పరిజ్ఞానాన్ని కలిగిస్తుంది కానీ మనోహరంగా ఉండదు. అదే చరిత్రను కావ్యంగా చదివితే ఆకర్షణీయంగా, ఉత్తేజ భరితంగా ఉంటుంది. జాతీయ భావనలకు ప్రోది చేస్తుంది. కావ్యబద్ధం చేసినంత మాత్రాన సంఘటనల కాలక్రమ వివరణ, పాత్రలు, ప్రముఖ సన్నివేశాలు యదార్థాలని ఇతర ఆధారాలచేత నిరూపితం కావటం ముఖ్యమనే విషయాన్ని విస్మరించకూడదు. ప్రామాణికత, కాలక్రమానుసారిత్వం అనేవి చరిత్రకు ప్రధానం. వాటికి అనతి దూరంగా సత్యాన్ని, భావనను సుకుమారంగా మేళవించగలిగినవాడే చారిత్రక కావ్యకర్త(కర్త్రి) పౌరాణిక ఇతివృత్తాన్ని తీసుకుని కావ్యంగా మలచే కవికి ఉన్నంత స్వేచ్ఛ చారిత్రక కావ్యకర్తకు ఉండదు. డా.ప్రభాకరరెడ్డిగారు ఈ ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు. వైద్య వృత్తిలో ఉంటూ ఈ ఆధారాలను సేకరించటం అంత తేలిక కాదు. గ్రంథంలోవారు పొందుపరచిన చారిత్రక ఆధారాల వెనుక వారి 18 సంవత్సరాల కృషి కనుపిస్తుంది. వీరరస ప్రధానమైన ఇతివృత్తాన్ని ఎన్నుకొని తేటగీతులలో 18 భాగాలుగా 1063 పద్యాలలోవ్రాయటం ఈ కావ్యానికున్న మరొక ప్రత్యేకత. ఇక కావ్యరచనలో కనుపించే రెడ్డిగారి నైపుణ్యాన్ని రేఖామాత్రంగా, స్థాలీపులాక న్యాయంగా పరిశీలిద్దాం.

పల్నాటి ప్రభువులు హైహయ వంశజులు. వారికి ఉత్తర భారతంతో సంబంధం ఉందనేది చారిత్రక సత్యం. కావ్యం మొదటి పుటలో కవి ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉత్తర భారతంలోని జబల్పూరును గురించి, దాని పూర్వ నామాలను గురించి చెప్పారు.

పాలమాచాపురి-జంభనాపురి-జబలాపురము-జబల్పూరు.

అనుగురాజు తెప్పలినీడును పశుగ్రాసం కోసం పంపుతాడు. తెప్పలినీడు దారిలోఒక జొన్న చేనును చూస్తాడు. రైతునడిగి కొన్ని జొన్న కంకులను తీసుకొచ్చి రాజుకిస్తాడు. ఆ జొన్నలు

“కర్షకుల కలలాకృతి గాంచినట్లు”ఉన్నాయట.

పలనాడుకు ఆ పేరు రావడానికి కారణాన్ని కవి వివరించారు. ఒకప్పుడు పల్లవ ప్రభువులు ఆంధ్ర రాజులను ఓడించి ఆక్రమించటం వలన పల్లవనాడుగా పిలువబడి క్రమంగా పలనాడు అయిందట. అలాగే పల్లెలుండటంచేత పల్లెనాడు, అక్కడ దొరికే పాలరాతిని బట్టి పాలనాడు లేక పలనాడుగా మారిందనే మెకంజీ అభిప్రాయాన్ని, ఆ సీమ పల్లంగా ఉండటంవల్ల పల్లునాడు-పలునాడు- పలనాడు అనే పేరు వచ్చి ఉండవచ్చనే అక్కిరాజు ఉమాకాంతం గారి అభిప్రాయాన్ని ఉటంకించారు. అలాగే తాను సేకరించిన తాళపత్ర ప్రతులను, శాసనాలను ఆయా విషయాలను చెప్పినప్పుడు నిదర్శనంగా చూపారు. ఇటువంటివే చారిత్రక కావ్యానికి ప్రామాణికతను చేకూర్చేవి. ఒకటి,రెండు చోట్ల గాథాకారుల పాటలు ఆధారంగా వ్రాసినప్పుడు ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఈవిధంగా తన రచనకు చారిత్రక ప్రామాణ్యాన్ని సమకూర్చారు.

సాధారణంగా శిశువును కని వదలి వెళ్ళిన తల్లిని గూర్చి లోకులు ఆడిపోసుకుంటారు. శిశువు అనాథ అయినందుకు తిట్టిపోస్తారు. కానీ కవిగారి హృదయం ఆ తల్లి శోకాన్ని చూడగలిగింది.

“ప్రేమబంధమ్ము తెగద్రెంచి విడిచిపోవ

తల్లి మనసెంత శోకాన తల్లడిలెనొ!” అంటారు.(55ప). ఇక్కడే నాటి సాంఘిక దురాచారాలైన బాల్యవివాహాలను, వితంతువుల కడగండ్లను రేఖామాత్రంగా స్పృశించారు.

“తలప తగిలిన కాలికే తగులు దెబ్బ

యాపదల మీద నాపదలధిక మౌను”(80 ప)

“మోము వాచిన”మొదలైన లోకోక్తులను సందర్భానుసారంగా ప్రయోగించారు. సామాన్యులకు పలనాటి చరిత్రలో కీలక పాత్ర వహించిన నాగమ్మ కుటిలనీతిని గురించే తెలుసు కాని ఆమె ధైర్య సాహసాలు, చేసిన ప్రజోపయోగ కార్యాలు చాలా మందికి తెలియవు. కవిగారు వీటిని గురించి వివరంగా చెప్పారు. విషయాన్ని సూటిగా, అలవోకగా చెప్పటం వీరి ప్రత్యేకత. నాగమ్మ నలగామరాజు దగ్గర సంపాదించిన చనువును గురించి చెపుతూ

“మగువ మాటలు రాజుకు మల్లెలాయె

బ్రహ్మి బోధన ప్రభువుకు బల్లెమాయె” (152 ప)

అంటారు. పలనాటి వీరచరిత్రను భారతకథతో పోల్చినప్పటికీ కొన్ని భేదాలున్నాయి. ఇక్కడ నలగాముడు దుర్యోధనుడు కాడు. దుష్టచతుష్టయం లేదు. స్వతహాగా నలగాముడు మంచివాడే కానీ బలహీనుడు. యుద్ధానికి మూలమైన కోడిపందాలను వ్యతిరేకించాడు.

కోళ్ల పోరు సందర్భంగా నేటికీ ప్రచారంలో ఉన్న సుద్దులను కూడా కవి విడువలేదు.( పుట 60) కోళ్లు కూడా వాటిని పురికొల్పిన వారి స్వభావాలకు తగినట్లుగానే ఉన్నాయి. రెడ్డిగారు బ్రహ్మనాయని కోడిని అర్కబింబంతో, కాముని కోడిని అగ్నికుండంతో పోల్చారు. నాయని కోడి పొగరుగా నిలిస్తే కాముని కోడి క్రూరంగా చూసిందట.

“గట్టి చిటిమల్లు శౌర్యమ్ము పుట్టినిల్లు

మేటి నలమల్లు క్రౌర్యమ్ము మెట్టినిల్లు

యొకటి మాచెర్ల రోషమునకు ప్రతీక

యొకటి గురజాల క్రోధమునకు పతాక”(305 ప)

అక్కడ రోషం, ఇక్కడ క్రోధం-అదే భేదం. కోళ్ల పోరును వర్ణించిన తీరు ఎంతో సహజంగా, అద్భుతావహంగా సాగింది. చెవుల గోపన్న అనన్య స్వామిభక్తిని, అతని మరణానికి బ్రహ్మి పొందిన పరితాపాన్ని హృదయానికి హత్తుకునేలా వర్ణించారు. ఈ ఘట్టాన్ని కరుణరసాన్వితంగా తీర్చారు. గోపు గుండెలో దాగిన కూర్మి రక్తధారగా నిర్గమించి బ్రహ్మి వక్షమును తాకెనట. గాలి వీచినప్పుడు వెలుగుతున్న దీపం ఆరిపోవటం సహజం. గోపన్న మరణాన్ని కవి ఈ చక్కని పోలికతో చెప్పారు.

“గోప కులమున వెలసిన దీపమొకటి

పసిడి వెలుగులు వెదజల్లి ప్రజ్వలించి

కపటబుద్ధియౌ నాగమ్మ గాలి సోకి

యారిపోయినదక్కట యక్రమముగ”(413ప)

అలరాజు మరణానికి వగచిన పేరమ్మ, కొమ్మన, చల్లమాంబల దుఃఖాన్ని కరుణరసాన్వితంగా, కంట నీరు తెప్పించే విధంగా వర్ణించారు. వీరరస ప్రధానమైన ఈ కావ్యంలో కరుణ,రౌద్ర, వీర, భయానక, భీభత్స, అద్భుత,శాంత రసాల వర్ణన సముచితంగా, సందర్భానుసారంగా ఉన్నది. ఇక వర్ణనల విషయానికొస్తే మచ్చుకు ఒకటి-బాలచంద్రుడు యుద్ధరంగానికి వచ్చిన సందర్భంలోని ఒక వర్ణన – అశ్వాల కాలిగిట్టల నుంచి పైకి లేచిన ధూళి ఆకాశంలో మేఘాలవలె కమ్ముకుని సూర్యకాంతిని అడ్డగించటం వలన అకాల వర్ష ఋతువు అనిపించిందట. అలంకార ప్రయోగానికి ఒక ఉదాహరణ-

“అంత నరసింగరాజు విభ్రాంతి జెంది

పాఱజూచెడి వీరుల పాఱ జూచి”

దీనిలోని యమకాలంకారం గమనార్హం.

విపరీతమైన క్రోధంతో, ఆవేశంతో ఊగిపోయే వ్యక్తి ఆ ఉధృతి తగ్గగానే చల్లబడటం మనం చూస్తూనే ఉంటాం. ఇది మానవ మనస్తత్వం లోని ఒక కోణం. కవి ఆ కోణాన్ని కూడా స్పృశించారు. ఎవరు వారించి నా వినకుండా యుద్ధరంగానికి వచ్చి వీరవిహారం చేసిన బాలచంద్రుని పగ నరసింగరాజు మరణంతో పరితాపంగా మారింది.

ఈ విధంగా ‘పల్నాటి భారతము’లో ఎన్నో విశేషాలున్నాయి. గడియారం వెంకటశేష శాస్త్రి గారు, దుర్భాక రాజశేఖర శతావధాని గారు అద్భుతమైన చారిత్రక కావ్యాలు రచించినది ప్రొద్దుటూరు నుంచే. అసలు ప్రొద్దుటూరు నేలలోనే చారిత్రక కావ్యరచనా బీజాలు ఉన్నాయేమో అనిపిస్తుంది. ప్రభాకరరెడ్డి గారు కూడా ఆ త్రోవలో నడిచారు. ఇది రేనాటి వైద్యుని పల్నాటి భారతము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here