[dropcap]యౌ[/dropcap]వనపు మజిలీవద్ద రెండు పరిచయాలు
ఎవరో తెలియని ఇద్దరు… ఒక నువ్వు, ఒక నేనూ
వయసు విసిరిన వలపు వల
బిగిసి బిగిసి మనలను దగ్గరకు లాగేసింది
తనువులలోని మన ప్రత్యేకత
తమకాన్ని చుట్టూరా మెల్లమెల్లగా నింపేసింది
పరిచయం
మాటల ముచ్చట్ల నడకలతో
ఇష్టంగా ఓ చిరు మొగ్గతొడిగితే
ఆ ఇష్టం,
అభిప్రాయాల అభిమానపు పరుగులతో
ప్రణయమై నిండుగా విరబూసింది
నీ సహచర్యపు సహకారంతో
భద్రమయ్యే నా భవిష్యత్తు బాటలో
బాంధవ్యపు ముచ్చటైన ముడితో
ముందుకు సాగేందుకు నేనాలోచిస్తూంటే
ప్రణయం పరిణయమయ్యే ప్రయత్నాలు చేస్తుంటే
మన తనువుల కలయికకే
నీవు తహతహలాడుతుంటావు
శారీరక సుఖాస్వాదనకే
అనుక్షణం ఆత్రంగా ఆరాటపడుతుంటావు
గట్టిగా గదమాయిస్తే
బాధ్యతగా ఉండేందుకు బాసలు చేస్తావు
నిన్ను నమ్మానా ?
నాతో ఆడుకుని,
నీ వేటగా నన్ను వాడుకుని
నీ బరువు దింపేసుకుని,
నాలో వంపేసుకుని
బరువూ బాధ్యత నాకప్పచెప్పేసి
బేఫర్వాగా నీదారిన నీవెళ్ళిపోతావు
ప్రకృతికెప్పుడూ
తన సంతును పెంచుకునే చింతే కదా
కడుపున పెట్టుకుని కాయమని సెలవిస్తుంది
క్రమంతప్పని నెలసరినీ తప్పిస్తుంది
సవతి ప్రేమ చూపే సంఘానికి
నేనంటే ఎప్పుడూ ఎనలేని అలుసే
ఒకే కార్యానికి కర్తలయిన మన ఇద్దరిలో
నిన్ను ‘మగ మహరాజు’ను చేసి
కాళ్ళుకడిగి నెత్తిన నీళ్ళుజల్లుకొంటే…
బలయిపోయిన నన్ను
బరువునెత్తుకున్న నన్ను,
కాలు జారానని,
కట్టుబాటు మీరాననీ
కత్తిగట్టేందుకూ…
కర్కశంగా శిక్షించేందుకు
కొరడా పట్టుకుని సిద్ధంగానే ఉంటుంది
మగాడా !
అందుకే నా జాగ్రత్తలో నేను…
నీకూ నాకూ మధ్య ఓ రెండడుగులు ఎడం
కనీసం మన పెళ్ళయ్యేంతవరకైనా…!