రెండు ఆకాశాల కింద

2
14

[dropcap]బి[/dropcap]డ్డల్ని ప్రయోజకుల్ని చేసి,
తమ పట్ల తమకే ఏర్పడిన నమ్మకం-
శారీరక బలహీనతల్ని అధిగమిస్తుంటే,
మనవణ్ణి పెంచేందుకు సన్నద్ధమైన
అమ్మమ్మింట్లో నేనేనాడూ ఏడ్చిన జ్ఞాపకమే లేదు!
ఆ ఆకాశం కింద…
తప్పటడుగుల సవ్వడికి ఎంత పనిలోనూ
పరుగెత్తుకొచ్చి హత్తుకునే ‘ఆమె’!
ఏ భాషకీ అందని ఏ శబ్దం నోరు జారినా
అంతులేని ఆనందంతో చేతుల్లోకి తీసుకునే ‘ఆమె’!
నా అల్లరిక్కూడా అలంకారాలు పూసి
మురిసిపోయిన ‘ఆమె’
‘ఆమె’ నాకు తెలిసిన మొదటి అమ్మ!
“మూడేళ్లు నిండుతాయి, వాణ్ని స్కూలుకి సిద్ధం చెయ్యాలి పట్రమ్మంటూ”
నా ప్రపంచంలోకి పిలుపు ఇచ్చిన
‘అసలు అమ్మ’ నాకు అంతా కొత్త!
అకస్మాత్తుగా నా చుట్టూ పరిసరాలు మారుతున్నాయి-
నలుగుపెట్టి స్నానం చేయిస్తున్నా,
నూనె రాసి తల దువ్వుతున్నా,
ముద్దు చేసి అద్దం చూపిస్తున్నా,
గోరుముద్దలు పెట్టి దిష్టి తీస్తున్నా
అమ్మమ్మ ముఖం చిన్న బోతోంది!
నన్ను చుట్టుకు పరిభ్రమించే అమ్మమ్మ ప్రపంచం
ఒక్కసారిగా తలక్రిందులైంది!
కొత్త బట్టలు తొడిగి, కొత్త బూట్లు తొడిగి
‘ఆచ్చి’ వెళ్దాం, రా’ అంటే ఆనందంగా బయలుదేరాను!
ఈ ఆకాశం కింద…
అల్లరికి, ఆటలకీ సమయమే లేదు,
అంతా స్పీడే, అన్నింటికీ పరుగే!
అమ్మ నన్నో ‘డే కేర్’ లో చేర్చింది!
పొద్దున్నే తీరిగ్గా లేచి మంచం దిగే వ్యవధి లేదు,
అమ్మమ్మ పెరట్లోలాగా జామ చెట్టు మీద చిలుకల హడావుడి లేదు!
నిద్రమంచం మీంచి డే కేర్ లోకి తిన్నగా
అక్కడ అన్ని ముఖాలూ కొత్తే!
అమ్మమ్మలా కథలూ, కబుర్లూ చెప్పటమే లేదు.
సాయంకాలం అమ్మ వచ్చింది నన్ను తీసుకెళ్లేందుకు…
డే కేర్ ఆంటీ నవ్వుతోంది…
నా దుఃఖాన్ని, అలకనీ తీర్చకపోగా,
పగలంతా నేను పడిన ఆరాటాన్ని అమ్మకు చెబుతోంది.
‘మీ వాడు భలేగా ఉన్నాడు,
ఒక్కటే పాట వాడి నోటి వెంట-
‘అమ్మమ్మ దగ్గరకెళ్లిపోతాను’ అంటూ
మేనర్స్, డిసిప్లిన్ తెలియని నన్ను
నిరాశగా చూస్తూ అమ్మ!
ఇదిగో, ఇప్పుడొస్తోంది నాకు ఏడుపు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here