రెండు ఆకాశాల మధ్య-10

0
6

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]పి[/dropcap]ల్లల్ని తీసుకుని మెల్లగా వసారాలో కొచ్చాడు. అప్పటికే కింది గదిలోకి కూడా మంటలు వ్యాపించాయి. రోడ్డు మీద పఠాన్లు చిన్న చిన్న గుంపులుగా ఏర్పడి, పెద్దగా అర్చుకుంటూ చేతుల్లో పొడవాటి తల్వార్లతో పరుగెత్తున్నారు. అటువైపుకు వెళ్ళడం ప్రమాదమని అర్థమైంది. యింటి వెనకవైపు చెట్లు, దట్టంగా పెరిగిన పొదలు చాలా ఉన్నాయి. అప్పటికే చీకటి పడింది కాబట్టి వాటి చాటున నక్కుతూ తప్పించుకోవచ్చనుకున్నాడు. వెనక వైపున్న ప్రహరీ గోడ వద్దకు చేరుకున్నాడు. కానీ అంతెత్తునున్న గోడని ఎక్కి దిగడం ఎలానో తెలియలేదు.

పిల్లల్తో “మీరు నా భుజాలమీద నిలబడి ప్రహరీ గోడని ఎక్కండి. ధైర్యం చేసి అటువైపుకి దూకేయండి. మనకు తప్పించుకోడానికి మరో మార్గం లేదు” అన్నాడు.

“మరి నువ్వో?” అంది షామ్లీ.

“నా సంగతి తర్వాత.. మొదట మీ ప్రాణాలు కాపాడుకోండి. చీకటి చిక్కబడకముందే ఎలాగోలా రైల్వే స్టేషన్ చేరుకోండి. ఏ రైలు దొరికితే ఆ రైలు ఎక్కేయండి. చాలు” అన్నాడు.

వెంటనే షామ్లీకి పెరట్లోని తోటలో చూసిన నిచ్చెన గుర్తొచ్చింది. “నాన్నా.. పెరట్లో నిచ్చెనుంది. మనం ముగ్గురం ఈ గోడనెక్కి అటుకి దిగొచ్చు” అంది.

శంకర్ పెరట్లోకి వెళ్ళి నిచ్చెనని మోసుకొచ్చాడు. మొదట పిల్లలిద్దరూ ఎక్కి గోడమీద కూచున్నాక తను కూడా ఎక్కి నిచ్చెనని పైకి లాక్కుని గోడకు అటు వైపు ఆనించి ముగ్గురూ దిగిపోయారు.

చీకటిని ఆసరాగా చేసుకుని చెట్ల చాటున నక్కుతూ ముందుకెళ్తున్నారు. ఎటువెళ్తే ఏమొస్తుందో తెలియదు. రైల్వేస్టేషన్‌కి వెళ్ళాలంటే ఎటువైపు వెళ్ళాలో తెలియదు. శంకర్ వేగంగా నడుస్తున్నాడు. మధ్యమధ్యలో పిల్లల్ని తొందరగా నడవమని హెచ్చరిస్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక విశాలమైన మైదానం కన్పించింది. దాన్నిండా చెల్లాచెదురుగా పడి ఉన్న శవాలు… నేలంతా రక్తంతో తడిచిపోయి జిగట జిగటగా ఉంది.

ఎంతగా పక్కకు జరిగి నడుస్తున్నా కాళ్ళకు శవాలు తగుల్తూనే ఉన్నాయి. యిద్దరు పిల్లల్ని తనకు చెరో వైపున ఉండేలా చూసుకుని, వాళ్ళ వీపులమీద చేతులేసి నడుస్తూ “ధైర్యంగా ఉండండి. కిందికి చూడకండి” అన్నాడు. నక్షత్రాల వల్ల ఏర్పడిన మసకవెల్తురులో కళ్ళు చించుకుని కిందికి చూస్తూ పిల్లల కాళ్ళకు తెగి పడి ఉన్న శరీరాలేవీ తగలకుండా జాగ్రత్త పడ్తున్నాడు.

“నాన్నా.. నాకు భయమేస్తోంది” అన్నాడు దర్శన్‌లాల్.

“భయమెందుకు? పక్కనే నేనున్నానుగా” అన్నాడు శంకర్.

“కాళ్ళకేదో అంటుకుంటోంది నాన్నా.. కాళ్ళు జారుతున్నాయి” అన్నాడు వాడు మళ్ళా.

“వర్షం పడటం వల్ల నేలంతా బురదగా మారి ఉంటుంది” అన్నాడు శంకర్.

“ఉదయంనుంచీ వర్షం పడలేదుగా నాన్నా” అన్నాడు వాడు.

పదమూడేళ్ళ షామ్లీకి కాళ్ళ కింద జిగటగా తగులుతున్నదేమిటో ఎప్పుడో అర్థమైంది. తమ్ముడికి తెలియకూడదన్న ఉద్దేశంతో “మనం తాతయ్య గదిలో అటకమీద దాక్కుని ఉన్న సమయంలో పడి ఉంటుంది రా తమ్ముడూ” అంది.

ఆ జవాబుతో వాడు గమ్మునైపోయాడు.

కీచురాళ్ళ రొద తప్ప నిశ్శబ్దంగా ఉన్న ఆ మైదానంలో ఎక్కడినుంచో మూలుగు విన్పించింది. ఎవరో బాధతో మూలుగుతున్నారు. ‘దాహం.. దాహం’ అని కూడా విన్పించింది.

శంకర్ ఆగి చుట్టూ పరికించి చూశాడు. నిర్జీవమైన శరీరాలు తప్ప ఎక్కడా కదలిక కన్పించలేదు. షామ్లీ “నాన్నా.. అక్కడ .. ఎవరిదో చేయి పైకి లేచి కన్పిస్తోంది” అంది.

శంకర్ నాలుగడుగులు పక్కకు వేసి ఆ శరీరం దగ్గర నిలబడ్డాడు. అది దాదాపు పదిహేనేళ్ళ వయసున్న బాలుడి శరీరం.. అతని వైపు కళ్ళు చిట్లించి చూశాడు. పొట్ట చీలిపోయి ఉంది.. అక్కడినుంచి యింకా రక్తం కారుతోంది. పేగులు బైటికొచ్చి.. కానీ ప్రాణం యింకా పోలేదు.

“దాహం … మంచి నీళ్ళు” అన్నాడా కుర్రాడు.

“అయ్యో.. బాబూ.. మేము ప్రాణాలరచేతిలో పెట్టుకుని పారిపోతున్నవాళ్ళం. మా దగ్గర నీళ్ళు లేవు” అన్నాడు శంకర్.

“ఐతే తొందరగా యిక్కడినుంచి వెళ్ళిపోండి బాబాయ్. వాళ్ళ కంటబడితే మిమ్మల్ని కూడా చంపేస్తారు” అన్నాడతను.

“ఇదంతా ఎలా జరిగింది?” చావబోతున్న కుర్రాడిని అడక్కూడదని తెలిసి కూడా అడిగాడు.

‘ముస్లింలు కత్తులు పట్టుకుని గుంపుగా మా బస్తీకి వచ్చారు బాబాయ్. మా బస్తీలో ఎక్కువమంది హిందువులే. మమ్మల్ని యిళ్ళలోంచి లాక్కొచ్చి, ఈ మైదానంలో వరసగా నిల్చోబెట్టి, యిష్టమొచ్చినట్టు నరికారు. నా కళ్ళముందే మా అమ్మానాన్నల్ని చంపేశారు. మా అక్కను లాక్కెళ్ళిపోయారు. నా పొట్టలో ఎవరో కత్తితో పొడిచారు. స్పృహ తప్పి పడిపోయాను. యిందాకే మెలకువొచ్చింది. నేనెలాగూ చచ్చిపోతాను బాబాయ్. మీ పిల్లల్నయినా వాళ్ళకు దొరక్కుండా కాపాడుకోండి” బాధతో మెలికలు తిరుగుతూనే అన్నాడు.

“మేమీ వూరికి కొత్త. రైల్వే స్టేషన్‌కి ఎటెళ్ళాలో తెలియదు. గుడ్డిగా పరుగెడ్తున్నాం” అన్నాడు శంకర్.

‘అయ్యో బాబాయ్.. మీరు తప్పు దారిలో వెళ్తున్నారు. వెనక్కి తిరిగి కొంత దూరం వెళ్ళాక మీకు ఎడం వైపున ఓ రోడ్డు కన్పిస్తుంది. అది నేరుగా రైల్వేస్టేషన్‌కి వెళ్తుంది” అన్నాడు.

“మమ్మల్ని క్షమించు బాబూ.. నీకు గుక్కెడు నీళ్ళు కూడా యివ్వలేకపోతున్నాం” నొచ్చుకుంటూ అన్నాడు.

“పర్వాలేదు. మొదట మీరు మీ ప్రాణాలు కాపాడుకోండి. జాగ్రత్తగా వెళ్ళండి” అన్నాడా అబ్బాయి.

వాళ్ళు కొంత దూరం వెనక్కి నడిచాక రోడ్డు కన్పించింది. ఆ రోడ్డు ఖాళీగా లేదు. మనుషులు గుంపులు గుంపులుగా పరుగెత్తుతున్నారు. కొంతమంది నెత్తి మీద మూటలున్నాయి. కొంతమంది చంకల్లో పిల్లలున్నారు. వాళ్ళందరూ హిందువులై ఉంటారని, రైల్వే స్టేషన్ వైపుకే పరుగెత్తుతున్నారని శంకర్‌కి అర్థమైంది.

వాళ్ళతో కలిసి అతను కూడా పరుగెత్తసాగాడు. అతని వెనకే పిల్లలిద్దరూ పరుగెత్తుతున్నారు.

దాదాపు పావుగంటనుంచీ పరుగెత్తుతూనే ఉన్నారు. యింకా స్టేషన్ రాలేదు. యింకెంత దూరం పరుగెత్తాలో తెలియడం లేదు. తన పక్కన పరుగెత్తుతున్నతన్ని “స్టేషన్ యింకెంత దూరం ఉంది?” అని అడిగాడు. అతను రొప్పుతూనే “యింకో మైలున్నరుంది” అన్నాడు.

కొంత దూరం వెళ్ళాక రోడ్డుకి యిరువైపులా గుబురుగా చెట్లు కన్పించాయి.

“నాన్నా.. కాళ్ళు నొప్పులు పుడ్తున్నాయి. యింక పరుగెత్తలేను” అన్నాడు దర్శన్‌లాల్.

వెంటనే శంకర్ అతన్ని ఎత్తుకుని పరుగెత్తసాగాడు.

అదే సమయంలో చెట్ల చాటునుంచి బిలబిలమంటూ పాతిక ముప్పయ్ మంది ముస్లింలు పెద్దగా అరుచుకుంటూ గుంపు మీద పడ్డారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు నరికేస్తున్నారు.

“షామ్లీ వేగంగా పరుగెత్తు” అంటూనే శంకర్ తన శక్తి కొద్దీ పరుగెత్తసాగాడు.

రెణ్ణిమిషాలు కాకముందే ‘నాన్నా’ అంటూ షామ్లీ పెట్టిన కేక విన్పించి, ఆగి వెనక్కి తిరిగి చూశాడు.

షామ్లీ కింద పడిపోయి ఉంది. బహుశా ఎవరి కాలో తట్టుకుని పడిపోయి ఉంటుంది. “లే.. లేచి పరుగెత్తు” అని అరిచాడు శంకర్.

ఆమె లేచి ఓ క్షణం నిలబడి, మళ్ళా అక్కడే కూచుండిపోతూ “కాలు బెణికింది నాన్నా.. చాలా నొప్పి.. నడవలేను. నువ్వెళ్ళిపో నాన్నా” అంటూ అరిచింది.

యిద్దరు పఠాన్లు ఆమె దగ్గరకు చేరుకున్నారు. ఒకతను షామ్లీని ఎత్తి భుజం మీద వేసుకున్నాడు.

శంకర్‌కి ఏం చేయాలో అర్థం కాలేదు. అతని పక్కనుంచి పరుగెత్తుతున్నవాళ్ళు “ఆగావెందుకు? పరుగెత్తు.. నీ ప్రాణాలు కాపాడుకో” అంటూనే పరుగెత్తుతున్నారు.

భుజం మీదున్న దర్శన్‌లాల్ “నాన్నా.. వాళ్ళు దగ్గరకొచ్చేస్తున్నారు.. పరుగెత్తు నాన్నా” అన్నాడు.

శంకర్ ఓ క్షణం ఆలోచించాడు. షామ్లీ కోసం నిలబడిపోతే షామ్లీతో పాటు దర్శన్‌లాల్‌ని కూడా కోల్పోవాల్సివస్తుంది. అతను తన ప్రాణం మీద ఆశ ఎప్పుడో వదులుకున్నాడు. పిల్లలు బతికుంటే చాలనుకున్నాడు. షామ్లీ వాళ్ళకు దొరికిపోయింది కాబట్టి దర్శన్‌లాల్‌నైనా బతికించుకోవాలనుకుని రైల్వేస్టేషన్ వైపుకి పరుగెత్తాడు. పఠాన్లు స్టేషన్ లోపలికి రాలేదు. అప్పటికే వాళ్ళు దాదాపు డెబ్బయ్ ఎనభై మందిని నరికేశారు. వేగంగా పరుగెత్తలేని ముసలివాళ్ళు, పిల్లలు, ఆడవాళ్ళు ఎక్కువ మంది వాళ్ళ కత్తులకు బలైనారు. వయసులో ఉన్న ఆడపిల్లల్ని చంపకుండా ఎత్తుకెళ్ళిపోయారు. వాళ్ళ కత్తులకు దొరక్కుండా స్టేషన్‌కి చేరుకున్న వాళ్ళు యాభైకి మించి ఉండరు.

బాంబే వెళ్ళే రైలు కిక్కిరిసిపోయి ఉంది. ఎటుచూసినా మనుషులే. ఎలాగోలా బోగీల్లోకి ఎక్కి ఇరుక్కుని కూచున్న ఆ యాభై మంది దారి పొడుగూతా ఏడుస్తూనే ఉన్నారు. అందరూ తమ కుటుంబాల్లో ఒకర్నో యిద్దర్నో అందర్నో పోగొట్టుకున్నవాళ్ళే. శంకర్ తన కూతురు షామ్లీని తల్చుకుని దుఃఖసముద్రంలో మునిగిపోయాడు. షామ్లీని ఏం చేసి ఉంటారు? చంపేసి ఉంటారా లేక.. మానభంగం చేసి.. ఆ ఆలోచనకే అతను చిగురుటాకులా వణికిపోయాడు.

దర్శన్‌లాల్ బాగా భయపడిపోయాడు. నిద్రలోంచి పెద్దగా ‘అక్కా’ అని అరుస్తూ లేచి కూచుంటున్నాడు. “నాన్నా.. అక్కను చంపేస్తున్నారు నాన్నా” అంటూ కలవరిస్తున్నాడు. “శవాలు నాన్నా.. ఎన్ని శవాలో చూశావా.. అదుగో తాత శవం.. పెద్ద తాతని కూడా పొడిచేశారు నాన్నా” అంటున్నాడు. వాడి వొళ్ళు పెనంలా కాలిపోతోంది. చలిజ్వరం వచ్చినవాడికి మల్లే వణికిపోతున్నాడు. శంకర్ అతన్ని గట్టిగా కౌగిలించుకుని కూచున్నాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here