రెండు ఆకాశాల మధ్య-20

0
8

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]ఓ[/dropcap] రోజు ఆకస్మికంగా కాల్పుల శబ్దాలు విన్పించాయి. మామూలుగా అయితే యుద్ధం మొదలు కావడానికి ముందు పాకిస్తానీ సైనికులు సరిహద్దు గ్రామాలకు వెళ్ళి ప్రజల్ని హెచ్చరించాలి. ప్రజల్ని సహాయ శిబిరాలకు చేర్చడంలో సహాయపడాలి. అక్కడ ప్రజలకు కావాల్సిన సదుపాయాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ అటువంటివేమీ జరగలేదు.

తమ ప్రాణాల్ని కాపాడే బాధ్యత సైనికులది కాదనీ తమ ప్రాణాల్ని తామే కాపాడుకోవాలని అర్థమై కొంతమంది గుహలోకెళ్ళి ఉండటానికి ఉద్యుక్తులైతే, మరికొంతమంది ముఖ్యంగా వయసు మళ్ళిన గ్రామస్థులు యిళ్ళొదిలి రావడానికి ఒప్పుకోలేదు.

యాకూబ్ కూడా యిల్లొదిలి రానన్నాడు. “ఈ యింట్లోనే పుట్టాను. ఇక్కడే పెరిగాను. చావంటూ వస్తే ఈ యింట్లోనే రావాలి. నా జనాజా యిక్కడినుంచే లేవాలి తప్ప గబ్బిలాల కంపుకొట్టే ఏ గుహలోనో నా చావు రాకూడదు” అన్నాడు పెద్ద కొడుకు షరీఫ్‌తో.

అప్పటికి గంట నుంచీ షరీఫ్, బషీర్ అతన్ని బయల్దేరమని బతిమాలుతున్నారు.

“యిక్కడుంటే ప్రమాదం నాన్నా.. తుపాకుల తూటాలు లోపలికి దూసుకురాకపోవచ్చు గానీ ఫిరంగి గుండ్లకి యిళ్ళు నేలమట్టమై యింట్లో ఉన్న అందరూ చచ్చిపోవడం ఖాయం నాన్నా. గుహలో కెళ్ళేదే మనకు చావు రాకూడదని కదా. నువ్వు తొందరగా బయల్దేరు నాన్నా” అన్నాడు షరీఫ్.

“నేను రాను. నువ్వు కూడా నీ భార్యనీ పిల్లల్ని తీసుకుని గుహలోపలికెళ్ళి యుద్ధం ముగిసేవరకు అక్కడే ఉండు. బాంబులు పడినా అది చెక్కు చెదరదు. అక్కడైతే మీరందరూ సురక్షితంగా ఉంటారు. నాకూ మనశ్శాంతిగా ఉంటుంది” అన్నాడు పెద్ద కొడుకు షరీఫ్‌తో.

“మాతోపాటు నువ్వు కూడా సురక్షితంగా ఉండాలని కదా నాన్నా రమ్మంటున్నాం” అన్నాడు బషీర్.

‘చావు ఎలా వస్తుందో ఎప్పుడొస్తుందో ఎవరు చెప్పగలరు? ఆ గుహ మన యింటి పక్కనేమీ లేదుగా. ఏటవాలుగా ఉన్న కొండ చరియల్లో దాదాపు వంద అడుగులు పైకి ఎక్కితేగాని గుహ కన్పించదు. అలా ఎక్కుతున్న క్రమంలో తూటా తగిలి చచ్చిపోయే అవకాశం లేదంటావా? కొండ శిఖరం మీద కదా సైనిక శిబిరాలున్నాయి. మనం లోయలో ఉన్నాం. కాల్పులు జరిగితే మనలో చాలామంది చావడం ఖాయం” అన్నాడు యాకూబ్.

“మనం పాకిస్తాన్‌లో కదా ఉన్నాం. మరి మన సైనికులు మనమీదే ఎందుకు కాల్పులు జరుపుతారు? భారతదేశ సైనికులైనా అమాయకమైన గ్రామస్థులమీద కాల్పులు జరపరు నాన్నా.. పాకిస్తాన్ సైనిక స్థావరాల మీద కాల్పులు జరుపుతారు. యిప్పుడు కొద్దిసేపు కాల్పులు ఆగినట్టున్నాయి.. ఈ అవకాశం పోతే రాదు. లే నాన్నా.. మనక్కావల్సిన సామాన్లు అమ్మ సర్దేసింది. పద వెళ్తాం” అన్నాడు బషీర్.

“నేను రానురా.. నువ్వూ మీ అన్న మీ సంసారాల్ని తీసుకుని వెళ్ళండి. సైనికులు గ్రామస్థుల మీద మీద దాడి చేయరని కదా అన్నావు. అలాంటప్పుడు భయం దేనికి? నేను యింట్లోనే ఉంటాను” అన్నాడు మొండిగా యాకూబ్.

“అయ్యో నాన్నా.. తమ్ముడు చెప్పింది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఫిరంగి గుండ్లు కూడా శత్రు స్థావరాల మీదికే గురిపెడ్తారు. కానీ ఆ రెండు శిఖరాలకు మధ్య ఎంత దూరం ఉందో గమనించావా? గుండు అంత దూరం వెళ్ళలేక మధ్యలోనే పడి పేలిపోయే ప్రమాదం ఎక్కువ నాన్నా” అన్నాడు షరీఫ్.

“ఐనా సరే నేను రానురా. అల్లా మీద భారం మోపి యింట్లోనే ఉండిపోతా.. మీరు మీ అమ్మను తీసుకుని వెళ్ళిపొండి” అన్నాడు యాకూబ్.

“మిమ్మల్ని వదిలి నేను పోలేనండి. చావైనా బతుకైనా మీతోనే” తన చేతిలో ఉన్న మూటని కిందపడేస్తూ అంది యాకూబ్ భార్య.

షరీఫ్‌కి ఏం చేయాలో అర్థం కాలేదు. వయసు పైబడిన అమ్మనీ, నాన్నను యింట్లో వదిలేసి, భార్యా పిల్లల్ని తీసుకుని సురక్షితమైన గుహలోకెళ్ళి ఉండటానికి అతనికి మనసొప్పటంలేదు.

“సరే నాన్నా.. నీ ఇష్టం. నేను కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళలేను” అంటూ బషీర్ వైపు తిరిగి “తమ్ముడూ.. నేను అమ్మానాన్నలకు తోడుగా ఉంటాను. నువ్వు నీ సంసారంతో పాటు మీ వదిన్ని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపో.. తొందరగా వెళ్ళు” అన్నాడు షరీఫ్.

బషీర్‌కి వెళ్ళాలనే ఉంది. ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాల్సింది పోయి, అనుబంధం, ఆత్మీయత అనుకుంటూ ఒకరికోసం మరొకరు ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమేమిటో అతనికి అర్థం కాలేదు. అసలు మనిషంటూ బతికుంటే కదూ ఈ ప్రేమలూ, మమకారాలు.. అతనికి నాన్నది చాదస్తమైతే అమ్మది మూర్ఖత్వమనిపించింది.

హసీనా తన భర్త షరీఫ్ వైపు మురిపెంగా చూసింది. ఎంత మంచివాడో..  అమ్మానాన్నలంటే ఎంత ప్రేమో.. తనక్కూడా తన భర్తంటే చాలా ప్రేమ.. అతన్ని వదిలి తను ఎక్కడికెళ్ళినా సంతోషంగా ఉండగలుగుతుందా? లేదు. ఒకవేళ తన భర్తకు ఏమైనా ప్రమాదం జరిగితే.. అమ్మో.. అతను లేకుండా తను బతికుండగలదా? అటువంటి బతుక్కూడా ఓ బతుకేనా?

“నేను కూడా వెళ్ళనండీ.. మీరు పక్కన లేకుండా ఆ గుహలో కాదు కదా జన్నత్‌లో కూడా మనశ్శాంతిగా ఉండలేను” అంది.

“నువ్వు వెళ్ళడమే మంచిది హసీనా.. ఒకవేళ నాకేమైనా అయినా మన పిల్లల్ని చూసుకోడానికి కనీసం నువ్వయినా బతికుండాలిగా” అన్నాడు షరీఫ్,

“మీరు కూడా రండి నాన్నా.. మాకు అమ్మా నాన్నా యిద్దరూ కావాలి. ఒకవేళ మీరు రాకపోతే నేను కూడా వెళ్ళను. యిక్కడే మీతోపాటే ఉండిపోతాను” అంది ఆస్‌మా.

బషీర్ తలపట్టుకుని కూచున్నాడు. చావేదో ముంచుకొస్తున్నట్టు ఈ పంపకాలేమిటో త్యాగాలేమిటో అతనికి అర్థం కావడం లేదు.

షరీఫ్ ఆస్‌మాని బతిమాలుకుంటూ “నువ్వింకా చిన్నపిల్లవి తల్లీ. పిల్లలు దూరంగా ఉన్నా క్షేమంగా ఉండాలని కదా ఏ తల్లీతండ్రయినా కోరుకుంటారు. నా మాటిని మారాం చేయకుండా బాబాయితో వెళ్ళు” అన్నాడు.

చాలాసేపు నచ్చచెప్పాక ఆ పిల్ల బషీర్‌తో వెళ్ళడానికి ఒప్పుకుంది.

బషీర్ తన భార్యనీ తన పిల్లల్తోపాటు అన్న కూతుర్లనీ కొడుకుని తీసుకుని బైటికి వెళ్ళబోతున్న సమయంలో హసీనాకు ఏడుపొచ్చేసింది. ‘పిల్లలు జాగ్రత్త దేవర్‌జీ’ అంది.

“మీరు నిశ్చింతగా ఉండండి భాభీ.. నాకు నా పిల్లలూ అన్న పిల్లలూ వేరు కాదు. అందరూ నా పిల్లలే’ అన్నాడు.

అతని భార్య రుబియా హసీనాని కౌగిలించుకుని “ఖుదా హాఫీజ్ దీదీ.. మీకూ ఏం జరగదు. మాకూ ఏం జరగదు. అందరం సహీసలామత్ మళ్ళా కలిసుంటాం. నాకా నమ్మకముంది. నమాజ్‌లో ఇదే దువా చేస్తాను. మీరూ చేయండి” అంది.

‍”ఇన్‌షా అల్లా” అంది హసీనా.

రుబియా చాలా తక్కువ మాట్లాడుతుంది, ఏదైనా ప్రశ్న అడిగితే సమాధానం చెప్పడం తప్ప తనకు తనుగా సంభాషణ మొదలెట్టదు. హసీనాకు రుబియా అంటే చాలా ఇష్టం. స్వంత చెల్లెలిలానే చూసుకుంటుంది. ఆమెకు రుబియాను చూస్తే తన భర్తని చూసినట్టే ఉంటుంది. ఆ మొహమాటం, అమాయకత్వం, ఎక్కువగా మౌనంలో గడపడం.. ఇద్దరి మనస్తత్వంలో ఎన్ని పోలికలో.. ఇద్దరూ ఒకే కడుపున పుట్టిన బిడ్డలైనట్టు…

షరీఫ్ కూడా రుబియా ఈ యింటి కోడలైనాక తనకు చెల్లెళ్ళు లేని కొరత తీరిందనుకున్నాడు. పెళ్ళయిన కొత్తలో బషీర్ రుబియా మీద ప్రతి చిన్న దానికి కోప్పడటం, ఒక్కోసారి చేయి చేసుకోవడం చేసేవాడు. భార్యనలా బాధపెట్టకూడదని తమ్ముడికి హితబోధ చేసి అతనిలో మార్పు తెచ్చింది షరీఫే. ఆ కారణంగా కూడా రుబియాకి తన బావగారంటే అమితమైన గౌరవం..

బషీర్, రుబియా, పిల్లలు కన్నీళ్ళతోనే వీడ్కోలు తీసుకుని, కొంతమంది గ్రామస్థులతో కలిసి గుహను చేరుకున్నారు.

దారిలో ఏ ఉపద్రవమూ జరగలేదు. పర్వత శిఖరాల పైనుంచి కాల్పుల శబ్దాలు విన్పించాయి తప్ప తూటాలు గ్రామస్థుల వైపుకు దూసుకు రాలేదు. అదృష్టం కొద్దీ ఫిరంగుల్ని యిరువైపులా సైనికులు పేల్చకపోవడంతో అందరూ క్షేమంగా గుహలోపలికి వెళ్ళగలిగారు.

లోపలికెళ్ళిన కుటుంబాలు తమకు అనువైన స్థలాన్ని చూసుకుని అక్కడ జంపఖానాలు, దుప్పట్లు పరిచి ఆ స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

బషీర్ తన చుట్టూ పరికించి చూశాడు. దాదాపు సగం గ్రామం గుహలోకి వచ్చేసినట్టు అన్పించింది. ఎటుచూసినా కిక్కిరిసినట్టు మనుషులు కన్పిస్తున్నారు. అందరూ తనకు తెల్సిన వాళ్ళే.. బంధువులు మిత్రులూ పరిచయస్థులూ.. వందమంది పట్టే గుహలో రెండొందలమంది చేరిపోవడంతో గోలగోలగా ఉంది. గాలి ఆడకపోవడం వల్ల ఉక్కపోతగా ఉంది. అందరూ ఒత్తిడినుంచి బైటపడటానికి ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. అందరిలోనూ భయం.. ఇలా ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందోనని దిగులు.. మొండికేసి యిళ్ళ దగ్గర ఉండిపోయిన కుటుంబ సభ్యులు అన్ని రోజులు ఎలా ఉంటారోనని ఆందోళన…

గ్రామం నుంచి బయల్దేరిన సమయం మధ్యాహ్నం పన్నెండు కావడంతో చాలా మంది అప్పటికే వండుకున్న పరోటాల్ని, అన్నాల్ని తమతోపాటు తెచ్చుకున్నారు. ఒంటిగంటకల్లా అందరూ తెచ్చుకున్న ఆహారాన్ని తినేసి, కబుర్లలో పడ్డారు.

రుబియా కూడా తమతోపాటు రెండు గిన్నెల్లో పరోటాల్ని, బంగాళాదుంప కూరని తెచ్చుకుంది. రెండే కంచాలు తీసుకు రావడంతో ఒక కంచంలో భర్తకు వడ్డించి, మరో కంచంలో ఆరు పరోటాలు పెట్టి పిల్లల ముందుంచి “అందరికీ కలిపి ఇదే కంచం… ఒక్కొక్కరికి ఒకటే రోటీ… కూరని సమంగా పంచుకుని తినండి, పోట్లాడుకోకండి” అంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here