రెండు ఆకాశాల మధ్య-21

0
8

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]“ఒ[/dropcap]క పరోటా సరిపోదమ్మా.. నాకు రెండు కావాలి” అంది ఆరేళ్ళ ఆమె చిన్న కూతురు షమీం.

“లేదమ్మా. ఒక్కదాంతోనే సర్దుకోవాలి. రాత్రికి మళ్ళా వేడిగా రొట్టెలు కాల్చుకుందామని కదా ఒక్క పూటకు సరిపడా వండాము” అంది రుబియా.

“గిన్నెలో యింకా చాలా ఉన్నాయి కదమ్మా” అంది షమీం.

“వాటిని రాత్రికని దాచాను తల్లీ. యిక్కడ ఉన్నన్ని రోజులు ఏం పెడ్తే అదే తినాలి. ఎంత పెడ్తే అంతదానితోనే సంతృప్తి పడాలి. అర్థమైందా” అంది రుబీయా..

యింట్లో నాలుగు రోజులకు సరిపడా సరుకులు మాత్రమే ఉన్నాయి. వచ్చే శుక్రవారం బజారుకెళ్ళి నెలకు సరిపడా సరుకులు కొనుక్కొస్తానని బావగారు చెప్పారు. అనుకోకుండా ఈ యుద్ధం వచ్చి పడింది. మిగిలిన గోధుమ పిండి, జొన్నలూ, బంగాళాదుంపల్లో సగం యింట్లో వదిలేసి సగమే తెచ్చుకుంది. అవి ఎంత జాగ్రత్తగా వాడుకున్నా మూడు రోజులకు మించి రావు. ఆ తర్వాత కూడా ఈ గుహలో ఉండాల్సి వస్తే తమ పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు.

ఆస్‌మా, ఆమె ఇద్దరక్కలు పెద్ద పిల్లలు కాబట్టి సమస్యని అర్థం చేసుకుంటారు. వాళ్ళ తమ్ముడు ఆరిఫ్ చిన్నవాడైనా బుద్ధిమంతుడు. మాట వింటాడు. తన ఎనిమిదేళ్ళ కొడుకు మజీద్ కూడా మాట వింటాడు. కానీ ఆరేళ్ళ తన కూతురు షమీం మొండికేస్తుంది. కిందపడి ఏడ్చి అనుకున్నది సాధించుకునే రకం..

“నువ్వు కూడా తిను పిన్నీ” అంది ఆస్‌మా.

రుబియా నవ్వి వూరుకుంది. “ఓహో కంచం లేదనా… మా కంచంలోనే నీ రోటీ కూడా వేసుకో” అంది ఆస్‌మా.

“పర్లేదులే. నాకు కంచం అక్కరలేదు” అంటూ రుబియా ఓ పరోటాని తీసుకుని ఎడమ అరచేతిలో పెట్టుకుని మెల్లగా తుంపుకుని తినసాగింది.

“బంగాళాదుంప కూర నంచుకో” అంది ఆస్‌మా.

రుబియా నవ్వి “నాకిలా తినడమే ఇష్టం” అంది.

తన భార్య అలా ఎందుకందో బషీర్‌కి అర్ధమైంది. కూర తక్కువగా ఉంది.. పిల్లలకు సరిపోతే చాలని ఆమె ఆలోచన..

సాయంత్రం ఐదు కాకముందే గుహలో చీకటి అలుముకోసాగింది. అందరూ తమతో పాటు తెచ్చుకున్న లాంతర్లు వెలిగించారు. మధ్యాహ్నం తినగా మిగిలిన రోటీలు, అన్నమే కొంతమంది రాత్రికి కూడా తిన్నారు. కొంతమంది వద్ద ఆహారపదార్థాలు తక్కువగా ఉండటంతో పిల్లలకు పెట్టి పెద్దవాళ్ళు పస్తులుండి పోయారు.

రేపు ఎలాగైనా వంట చేసుకోక తప్పని పరిస్థితి.. అప్పుడు గుర్తొచ్చింది అందరికీ తమతో పాటు కట్టెలు తెచ్చుకోలేదన్న విషయం.. పొయ్యి ఏర్పాటు చేసుకోవడం పెద్ద సమస్య కాదు. అంతా కొండ ప్రాంతం కాబట్టి రాళ్ళు సులభంగా దొరకుతాయి. దాదాపు ఒకే పరిమాణంలో ఉన్న మూడు రాళ్ళు పెట్టుకుంటే చాలు పొయ్యి తయారౌతుంది. పొయ్యిలోకి కట్టెలదే సమస్య. మళ్ళా వూళ్ళోకైనా వెళ్ళాలి లేదా వూరి బైటున్న పొలాల్లోకైనా వెళ్ళాలి.

ఆ వూరికి ఏ సమస్య వచ్చినా పెద్ద దిక్కుగా నిలబడే జావేద్‌ని కొందరు సలహా అడిగారు.

జావేద్ కొద్దిసేపు ఆలోచించి “దానికన్నా పెద్ద సమస్య మరొకటుంది. యిప్పుడిక్కడ దాదాపు నలభై కుటుంబాలున్నాయి. అంటే నలభై కుంపట్లు పెట్టుకోవాలి. అంత స్థలమేది? ఒకర్ని ఒకరం తాకుతున్నంత ఇరుకులో కదా ఉన్నాం. ఆ విషయం ఆలోచించారా?” అన్నాడు.

అక్కడున్న అందరికీ సమస్యేమిటో అర్థమైంది. “ఏం చేద్దామంటావు చిచ్చా” అని అతన్నే అడిగారు.

“నలభై కుంపట్లు వద్దు. ఒకటే పొయ్యి పెడ్దాం. అందరికీ కలిపి వంతులవారీగా మన ఆడవాళ్ళు వంట చేయాలి. మనందరం ఒకే కుటుంబ సభ్యుల్లా భావించుకుని పని చేసుకుంటే తప్ప ఇది సానుకూలపడదు” అన్నాడు జావేద్.

“అదెలా కుదుర్తుంది చిచ్చా.. మా కుటుంబంలో నేనూ నా భార్య ఇద్దరమేగా ఉన్నాం. కొన్ని కుటుంబాల్లో పదిమందికి పైగా ఉన్నారుగా. నా భార్య వంతు వచ్చినపుడు వాళ్ళందరికీ నా భార్య వండి వడ్డించాలంటే ఎంత కష్టం? దాని బదులు మా యిద్దరికీ సరిపడా వండుకుంటే సరిపోతుందిగా” అన్నాడొకతను.

మరొకతను యింకో అభ్యంతరం లేవనెత్తాడు. “ఎవరెవరు ఎంతెంత పిండి యివ్వాలో ఎలా నిర్ణయించడం? వాళ్ళ కుటుంబంలో ఉండే మనషుల్ని బట్టి యివ్వాలా? అందులో చిన్న పిల్లలు ఉండొచ్చు. మూడు నాలుగు రోటీలు తినందే కడుపు నిండని వాళ్ళూ ఉండొచ్చు. ఇదంతా అయ్యే పని కాదులే తావ్‌జీ” అన్నాడు.

“మనం యిక్కడికి విహార యాత్రకు రాలేదు.. కడుపు నిండా తిని త్రేన్చడానికి.. ఈ యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు. మనల్ని ఏ ప్రభుత్వమూ ఆదుకునే స్థితిలో కూడా లేదు. ఎందుకంటే మనం యిప్పుడు పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నామా లేక భారతదేశం ఆధీనంలో ఉన్నామా అనేది మనకే తెలియదు. అందుకే ఆ అశను వదులుకుని మనం ఈ సమస్యనుంచి ఎలా బైటపడాలో ఆలోచించుకోవాలి” అన్నాడు జావేద్.

“సరే.. నువ్వే ఓ ఉపాయం చెప్పు” అన్నారు అందరూ.

“ఎవరెంత పిండి తెచ్చినా, ఎవరెన్ని ఆలుగడ్డలు తెచ్చినా అన్నీ కలిపి సమిష్టిగా వాడుకుందాం. పిల్లలకు ఒక రోటీ పెద్దలకు రెండు రోటీలు.. అంతే పరిమితిని విధించుకుందాం. సరుకులు ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు లాగిద్దాం. ఆ తర్వాత అల్లా దయ” అన్నాడు జావేద్.

అందరికీ అది ఆమోద యోగ్యంగానే అన్పించింది. “కానీ చిచ్చా.. రెండొందల మందికి పరోటాలు చేసి, పెనంమీద కాల్చడం అనేది ఒక్క పొయ్యితో అవుతుందా? ఒక్కరి వల్ల అవుతుందా?” అన్నాడు బషీర్.

“నిజమే… ఒక్క పొయ్యి సరిపోదు. అదుగో గుహలోని ఆ మూలలో వరసగా పొయ్యిలు పెడ్దాం. నా ఉద్దేశంలో ఎనిమిదికి మించి రావు. ఆడవాళ్ళని రెండు జట్లుగా చేద్దాం. ఉదయం ఒక జట్టు రాత్రికి మరో జట్టు వంట చేయాలి. ఆ జట్టులోని ఆడవాళ్ళు పని విభజన చేసుకోవాలి. పిండి కలపడం, బేలన్ చేయడం, రొట్టెల్ని కాల్చడం.. కూర వండటం.. ఇలా పనిని పంచుకుని చేస్తే ఎవరికీ ఎక్కువ శ్రమ ఉండదు” అన్నాడు జావేద్.

చివరిగా కట్టెలు ఎలా తేవాలి? ఎవరు తేవాలి? అనే ప్రశ్న ఎదురైంది.

“కట్టెలే కాదు. వంట చేయడానికి, తాగడానికి నీళ్ళు కూడా కావాలి. ఈ రెండు పనులు వంతుల వారీగా మనం మగవాళ్ళం చేసుకోవాలి. రోజూ యిద్దరు జట్టుగా బైటికెళ్ళి కట్టెలు తేవాలి, మరో యిద్దరు నీళ్ళు మోసుకు రావాలి.”

“మరి బాంబులు పడితే వాళ్ళు చచ్చిపోరా?” అని అడిగారెవరో.

“ఆ ప్రమాదమైతే ఉంది. కానీ తప్పదు. మరో మార్గం లేదు. అందుకే యిద్దరిద్దరు అని చెప్పా. ఏమైనా జరిగితే రెండొందల మంది కోసం ఆ యిద్దరూ ప్రాణాలు త్యాగం చేశారని అనుకోవాలి” అన్నాడు.

“మన యిళ్ళకెళ్ళి కూడా కట్టెలు తెచ్చుకోవచ్చుగా” అన్నాడు బషీర్.

“అది మీ ఇష్టం. ఎండిన కొమ్మల్ని, మొక్కల్ని నరుక్కొస్తారో లేక యిళ్ళలో సమృద్ధిగా కట్టెలుంటే యింటి నుంచి తెచ్చుకుంటారో మీ ఇష్టం” అన్నాడు జావేద్.

ఆరు రోజులు జరిగిపోయాయి. అందర్లో అసహనం… యింకా ఎన్నాళ్లీ శిక్ష.. అసలీ యుద్ధాలు ఎందుకొస్తాయి? ఎందుకు ఒకర్ని ఒకరు చంపుకుంటారు? రెండు దేశాల మధ్య ఈ వైషమ్యాలెందుకు? యుద్ధం ప్రకటించి, కొన్ని వేల ప్రాణాల్ని బలిచేసి, సరిహద్దు రేఖని ముందుకో వెనక్కో జరిపి, మేము విజయం సాధించామని విర్రవీగే ప్రభుత్వాలకు సరిహద్దు రేఖ వెంబడి ఉండే గ్రామాల్లోని ప్రజలు పడే హింస కన్పించదా? వాళ్ళ గుండె ఘోష విన్పించదా?

కట్టెల కోసమో, నీళ్ళ కోసమో బైటికెళ్ళిన యిద్దరు మగవాళ్ళు తిరిగొచ్చేవరకు వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు గుహలో ఉన్న అందరూ వూపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నారు. ఎక్కడో బాంబు పడి పేలిన శబ్దం విన్పిస్తే చాలు వాళ్ళకేమైనా ప్రమాదం జరిగిందేమోనని భయపడిపోతున్నారు. ఇలా క్షణక్షణం భయపడ్తూ బతికే బతుకు ఎంత దుస్సహమో పాలకులకు అర్థమైతే ఎంత బావుంటుంది?

ఇదే విషయం చర్చకు వచ్చినపుడు “యుద్ధం ముగిసి ప్రశాంతత నెలకొన్నాక మన వూళ్ళో నాలుగు కుటుంబాలకు ఓ బంకర్ చొప్పున కట్టివ్వాల్సిందిగా మనం పాకిస్తాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేద్దాం” అన్నాడు జావేద్.

“అన్ని బంకర్లు కట్టివ్వడమంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం చిచ్చా. వూరి వాళ్ళందరికీ సరిపడా పెద్ద బంకర్ ఒకటి వూరి పక్కనే కట్టిస్తే చాలు. అందులో వంటలు చేసుకోడానికి, మంచి నీళ్ళు నిలువ చేసుకోడానికి సౌకర్యాలతో పాటు ఆడవాళ్ళు స్నానాలు చేయడానికి, మల మూత్ర విసర్జనకు చాటు ఉండేలా ఏర్పాటు చేస్తే చాలు” అన్నాడు బషీర్.

“అబ్బో.. ఎన్ని గొంతెమ్మ కోర్కెలో.. అసలు మనం చేసే విజ్ఞప్తి జనరల్ అయూబ్ ఖాన్ చెవి దాకా చేరుతుందంటావా? మనది చిన్న వూరు కదా.. ప్రభుత్వం మన గోడుని పట్టించుకుంటుందని నేననుకోను. మన ప్రాణాలంటే వీళ్ళకు లెక్కుండదు. ఎక్కడో ఢాకాలోనో ఇస్లామాబాద్ లోనో కూచుని కాగితాల మీద హుకుంలు జారీ చేసే సల్తనత్‌కి మనలాంటి పేద గ్రామీణులకు అందించాల్సిన సౌకర్యాల మీద ఏం ఆసక్తి ఉంటుంది” అన్నాడు బుర్హాన్. వూళ్ళోకెళ్ళా ఎక్కువ చదువు చదివింది అతనే.

“అసలిప్పుడు మనం అర్జీ పాకిస్తాన్ ప్రభుత్వానికి పంపాలా లేక భారత ప్రభుత్వానికి పంపాలా?” తన అనుమానాన్ని వ్యక్తపరిచాడు బషీర్.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here