రెండు ఆకాశాల మధ్య-28

0
9

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]“ఇ[/dropcap]బ్రహీం బుద్ధిమంతుడు. కొద్దిగా రంగు తక్కువేగానీ ఒడ్డూ పొడవు బాగానే ఉంటాడుగా.”

“కుర్రవాడు మంచివాడే. కానీ అతని తండ్రి షంషుద్దీన్ గురించి మీకు తెల్సిందేగా. ఆశ ఎక్కువ. వూళ్లో వాళ్ళకున్నదంతా తనకే కావాలనుకునే రకం. దానికి తోడు అతని భార్య పరమ గయ్యాళి. పెద్ద కోడల్ని ఎలా రాచి రంపాన పెడుతుందో గమనించడం లేదా? అనీస్‌ని అలా కష్టపెడుతుంటే చూస్తూ మీరు సంతోషంగా ఉండగలరా?”

“ఉండలేను. అబ్బాయి మంచివాడు కదా. వేరు కాపురం పెట్టమంటే సరి.”

“మన మాట ఆ అబ్బాయి వింటాడా? వాళ్ళమ్మ ఒప్పుకుంటుందనుకుంటున్నారా?” అంటూ కొన్ని క్షణాలు ఆలోచించి “షంషుద్దీన్ భార్యకూ మన జావేద్ బాబాయికీ చుట్టరికం ఉంది. ఎందుకైనా మంచిది. అతని సలహా తీసుకోండి” అంది.

షరీఫ్‌కి కూడా ఆ ఆలోచన నచ్చింది. ఒకవేళ వేరు కుంపటి పెట్టించాలన్నా జావేద్ ద్వారా చెప్పిస్తే షంషుద్దీన్ భార్య ఎదురుచెప్పలేదు.

ఆ రోజు సాయంత్రం ఐదింటికి జావేద్ వాళ్ళ యింటికెళ్ళాడు. ఆ సమయంలో జావేద్ యింటి బయటున్న రాళ్ళమీద కూచుని చాయ్ తాగుతున్నాడు.

“అస్సలామలేకుం చాచా” షరీఫ్ అతనికి అభివాదం చేసి అతని పక్కనే రాతిమీద కూచున్నాడు.

“వలేకుం అస్సలాం షరీఫ్ మియా” అంటూనే యింట్లోకి విన్పించేలా “మరో లోటా చాయ్ పంపించు బహూ” అంటూ కేకేశాడు.

జావేద్‌కి ఆరుగురు కొడుకులు.. ఓ కూతురు.. అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. అతను పెద్ద కొడుకుతో కలిసి ఉంటాడు. పెద్ద కొడుక్కి ఓ అబ్బాయి తర్వాత ముగ్గురమ్మాయిలు..

గ్లాస్‌లో చాయ్‌ని వేలి కొసల్తో పట్టుకుని జావేద్ మనవడు జమీల్ బైటికొచ్చి, గ్లాస్‌ని షరీఫ్ చేతికిస్తూ “సలాం వలేకుం చాచా” అన్నాడు.

షరీఫ్‌కి జమీల్ అంటే చాలా యిష్టం. జమీల్ చిన్నప్పటినుంచి అతన్ని శ్రద్ధగా గమనిస్తూ వచ్చాడు. వూళ్లో ఉన్న అందరు కుర్రవాళ్ళకంటే బుద్ధిమంతుడు. పదో తరగతి వరకు చదువుకున్నాడు. వ్యవసాయం చేయకుండా వ్యాపారంలోకి దిగాడు. తక్కువ పెట్టుబడి పెట్టి స్కర్దూలో పూలవ్యాపారం పెట్టాడు. మొదట్లో పూల షాపుల్లో పూలు టోకున కొని బుట్టలో పెట్టుకుని రద్దీగా ఉన్న రోడ్లలో తిరిగి అమ్మేవాడు. ఇప్పుడు నాలుగు చక్రాల చెక్కబండి మీద రకరకాల పూలమాలలు పెట్టి అమ్ముతున్నాడు. వ్యాపారం బాగా సాగుతోందని, మరికొన్ని రోజులు పోతే తనే స్వంతంగా పూల దుకాణం తెరుస్తానని తనతో జమీల్ చెప్పాడు.

అసలు తన కూతురు ఆస్‌మాని అతనికిచ్చి పెళ్ళి చేయాలని షరీఫ్‌కి చాలా కోరిగ్గా ఉండేది.

జమీల్ కూడా గులాబీ పూవులా సుకుమారంగా ఉంటాడు. మనసు కూడా పూల రెక్కల్లా ఎంత మెత్తనో.. లతీఫ్‌కి మాటివ్వక ముందే జావేద్‌ని కదిపి చూశాడు. “నా కూతురికి కూతురు పుట్టినపుడే వాడికి కాబోయే పెళ్ళాం పుట్టిందని మేమందరం నిశ్చయించుకున్నాం. మేనత్త కూతురుండగా బైటి సంబంధం చేయాల్సిన అవసరం ఏముంటుంది చెప్పు” అన్నాడు జావేద్.

చాయ్ గ్లాసుని షరీఫ్ చేతికిచ్చాక, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ ఉండటం సభ్యత కాదనుకుని జమీల్ యింటి లోపలికి వెళ్ళిపోయాడు.

“ఎలా ఉంది మీ మనవడి పూలవ్యాపారం?” చాయ్ ఓ గుటక తాగి అడిగాడు షరీఫ్.

“జమీల్ చాలా తెలివిగలవాడు. వ్యాపార మెళకువలన్నీ బాగా వొంట పట్టించుకున్నాడు. తొందర్లోనే పూల దుకాణం తెరుస్తాడు”

జావేద్ మాటల్లో గర్వం తొంగి చూసింది. “చాలా సంతోషం బాబాయ్. జమీల్‌కి వ్యాపారంలో బర్కత్ ఇమ్మని అల్లాని ప్రార్థిస్తాను.”

“ఇంతకీ ఏదో ముఖ్యమైన పనిమీద వచ్చినట్టున్నావు. ఏంటది?”

“మా అక్క జైనాబీ కూతురు అనీస్ గురించి నీకు తెల్సుగా. దానికి ఈ వూళ్లోని సంబంధమే చేయాలని నా కోరిక. షంషుద్దీన్ కొడుకు ఇబ్రహీం కిచ్చి చేయాలని నేనూ నా బీబీ అనుకుంటున్నాం.”

“షంషుద్దీన్ ఎలాంటివాడో తెలిసే మాట్లాడుతున్నావా? అతని భార్య గయ్యాళి. ఆమె నాకు బంధువౌతుంది. ఐనా సరే నా ప్రాణం పోయినా మా యింటి ఆడపిల్లని ఆ యింటికి కోడలిగా పంపను.”

“ఆ విషయంలోనే నీ సాయం కోరి వచ్చాను బాబాయ్. పెళ్ళయ్యాక వేరు కాపురం పెడ్తే అత్త పోరు ఉండదుగా. ఎక్కువ రచ్చ జరక్కుండా నువ్వయితేనే వాళ్ళకు నచ్చచెప్పగలవు.”

“నీకు మీ అక్క కూతురంటే ఎంతిష్టమో నాకు తెలుసు. ఆ అమాయకుల్ని తెలిసి తెలిసి పులి గుహలోకి నెట్టామని ఎందుకనుకుంటున్నావు?”

“ఇబ్రహీం తప్ప నాకీ వూళ్లో మా అనీస్‌కి తగిన కుర్రవాడు కన్పించలేదు బాబాయ్. పోనీ నీ ఎరుకలో ఎవరైనా ఉంటే చెప్పు.”

“ఎవరో ఎందుకు? మా జమీలే ఉన్నాడుగా, వాడికి పెళ్ళి చేయాలని వాడి అమ్మానాన్న తొందర పడ్తున్నారు. అసలు మొదట నీ కూతురు ఆస్‌మానే అడుగుదామని నిశ్చయించుకున్నాం. దానికంటే ముందే నువ్వు నీ దోస్త్ లతీఫ్ కొడుకుతో పెళ్ళి ఖరారైందని చెప్పడంతో మేము గమ్మునుండిపోయాం.”

ఆ మాటలు వినగానే షరీఫ్ ఆశ్చర్యానికి లోనై “అదేంటి బాబాయ్.. మా ఆస్‌మా కోసం అడిగినప్పుడు తనకు మేనత్త కూతురి సంబంధం పక్కా చేశామని చెప్పావుగా.”

“నువ్వడిగి ఏడాది దాటిందిగా. జమీల్‌కి తన మేనత్త కూతుర్ని చేసుకోవడం ఇష్టం లేదని ఈ మధ్యనే మాకు తెల్సింది.”

“ఎందుకని?”

“వాడికి అందంగా ఉండే అమ్మాయి కావాలట. తెల్లగా నాజూగ్గా ఉండే అమ్మాయి కావాలట. నా మనవరాలు అందగత్తె కాదు. లావుగా కూడా తయారైంది. అందుకే మేము కూడా వాడ్ని బలవంతం చేయలేదు. ఇష్టంలేని పెళ్ళి చేసి వాడి సంతోషాల్ని చిదిమేయడం మాకెవ్వరికీ ఇష్టం లేదు.”

“మా అనీస్ అదృష్టవంతురాలు బాబాయ్. అల్లా దానికోసం జమీల్ వంటి అందగాడ్ని, బుద్ధిమంతుడ్ని షొహర్‌గా నిర్ణయించి ఉంటే దాన్ని ఎవరాపగలరు? మీ అబ్బాయితో, బహూతో మాట్లాడి పక్కా చేయి. నిఖా తొందరగా చేసేద్దాం” అన్నాడు షరీఫ్. అతనికి చాలా సంతోషంగా ఉంది.

జమీల్‌ని తన అల్లుడు చేసుకోవాలనుకున్నాడు. అనీస్‌ని పెళ్ళి చేసుకున్నా తన కోరిక తీరినట్లే.

“పక్కానే అనుకో షరీఫ్. నా మాటకు యింట్లో ఎవ్వరూ ఎదురుచెప్పరని నీకు తెల్సుగా. నీ అక్క కూతురు మీ యింటికొచ్చినపుడు రెండు మూడుసార్లు చూశాగా, చాలా అందగత్తె. జమీల్ కూడా తప్పకుండా ఒప్పుకుంటాడు” అన్నాడు జావేద్.

జావేద్ మరునాడుదయం షరీఫ్‌ని కలిసి, తనవైపు అందరూ పెళ్ళికి అంగీకరించారని చెప్పాడు. అమ్మాయి కుటుంబానికి అబ్బాయి కుటుంబం తెలిసి ఉండటంతో అమ్మాయి తల్లిదండ్రులు కూడా సంతోషంగా పెళ్ళికి తమ సమ్మతిని తెలియచేశారు.

అనీస్ వాళ్ళ నాన్న తమీజుద్దీన్ పదిహేను రోజులు శెలవ పెట్టి వచ్చేసినా పెళ్ళి పనులన్నీ షరీఫే చూసుకున్నాడు. షరీఫ్‌కి తన బావ మీద సదభిప్రాయం లేదు. వీలైనంత మటుకు అతన్ని తప్పించుకుని తిరగడానికే ప్రయత్నిస్తాడు. అతనితో ఎక్కువగా మాట్లాడడు. తమీజుద్దీన్‌కి కోపం ఎక్కువ.

దానికి తోడు అహంకారం… మిలట్రీలో తను చేసే చిన్నపాటి ఉద్యోగం కలెక్టర్ ఉద్యోగంతో సమానమైనట్టు విర్రవీగుతుంటాడు. అతని మాటకు ఎవ్వరూ ఎదురుచెప్పకూడదు. అతను శెలవ పెట్టి యింటికొస్తే చాలు జైనాబీ వణికిపోతూ ఉంటుంది.

షరీఫ్‌కి అక్కంటే ప్రాణం. అమ్మ తర్వాత అతను అంతగా ప్రేమించిన స్త్రీ జైనాబీనే. తన కళ్ళెదుటే బావ అక్కని గొడ్డుని బాదినట్టు ఎన్నిసార్లు కొట్టాడో.. “అక్కని కొట్టొద్దు బావా” అంటూ షరీఫ్ అతని కాళ్ళు పట్టుకున్నా విదిలించుకుని కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. తమీజుద్దీన్ మాట కూడా కరుకే. మిలట్రీ వాళ్ళు తూటాలు పేల్చినట్టే మాట్లాడతాడు. నోటికి ఏదొస్తే అది అనేస్తాడు. అది ఎదుటి వ్యక్తిని ఎంతగా గాయపరుస్తుందో ఆలోచించడు. తమీజ్ తెలియని వాడికి తమీజుద్దీన్ అని పేరెందుకు పెట్టారో అని హసీనాతో చెప్పుకుని షరీఫ్ బాధపడ్తుంటాడు.

అనీస్, జమీల్ నిఖా బ్రోల్మోలో సజావుగా జరిగిపోయింది. జల్వా పూర్తయ్యాక పెళ్ళి కూతుర్ని పెళ్ళి కొడుకుతో పంపడానికి కొన్ని నిమిషాల ముందు అనీస్ తల్లిని చుట్టుకుని చాలాసేపు ఏడ్చింది. “నువ్వు వెళ్తున్నది హుందర్మో గ్రామానికేగా. నీ మామూ ఉండే వూరే. నిన్ను రోజూ వచ్చి పల్కరించి పోతుంటాడు. నీకే కష్టమొచ్చినా మామూతో చెప్పు” అంది జైనాబీ.

తండ్రి దగ్గర, అక్క దగ్గర వీడ్కోలు తీసుకున్నాక షరీఫ్ దగ్గరకొచ్చి “యిక వెళ్దామా మామూ” అంది . ఆ పిల్ల కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రటి మందారాల్లా కన్పిస్తున్నాయి.

షరీఫ్ ఆమెను నవ్వించాలనుకున్నాడు. “జల్వాలో నీ షొహర్ని చూశావుగా. ఎలా ఉన్నాడు?” అని అడిగాడు.

“నువ్వు సంబంధం కుదిర్చినపుడే అనుకున్నాను మామూ బావుంటాడని” అంది కొద్దిగా సిగ్గుపడ్తూ.

“నీ అందానికి తగిన జోడీనే వెదికి పట్టుకున్నాను చూశావా?” అన్నాడు షరీఫ్.

“నిజం చెప్పాలంటే నాకన్నా అందంగా ఉన్నాడు మామూ. అంత మంచి షొహర్ని యిచ్చినందుకు లాఖ్ లాఖ్ షుక్రియా మామూ” అంది మరింత సిగ్గుపడిపోతూ.

***

తూర్పు పాకిస్తాన్ అశాంతితో రగిలిపోతోంది. బెంగాలీల సంస్కృతికి, పాకిస్తాన్ ముస్లింల సంస్కృతికి మధ్య ఉన్న అంతరం వల్ల అక్కడి ప్రజలు పాకిస్తాన్ పాలన కింద ఉండటానికి ఇష్టపడటం లేదు. దాదాపు వెయ్యి మైళ్ళ దూరంలో ఉన్న పశ్చిమ పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ ప్రజల్లో ప్రబలుతున్న అసంతృప్తిని పారద్రోలడంలో విఫలమైంది. తూర్పు పాకిస్తాన్ విద్యార్థులు స్కూళ్ళు కాలేజీలు వదిలేసి రోడ్లమీదికొచ్చి ఆందోళన చేస్తున్నారు. 1969లో నిరసనలు ఎక్కువయ్యాయి. ప్రెసిడెంట్ అయూబ్‌ఖాన్ రాజీనామాతో జనరల్ యాహ్యాఖాన్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టాడు. 1970లో ఎన్నికలు జరిగాయి. షేక్ ముజిబిర్ రెహ్మాన్ నేతృత్వంలోని అవామీలీగ్ పార్టీ తూర్పు పాకిస్తాన్ అసెంబ్లో స్థానాల్లో రెండు మినహా మిగతా వాటిని గెలుచుకుంది. పార్లమెంట్ స్థానాల్లో కూడా ఆధికత్యత సాధించింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here