రెండు ఆకాశాల మధ్య-29

0
5

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]ము[/dropcap]జిబిర్ రెహ్మాన్ ప్రధాని కావడాన్ని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత జుల్ఫికర్ ఆలీ భుట్టో తిరస్కరించాడు. ముజిబిర్ రెహ్మాన్ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాడు. అతని మద్దతుదారులు తూర్పు పాకిస్తాన్ లోని బీహారీల మీద దాడులు చేశారు. 1971 మార్చిలో ఒక్క చిట్టగాంగ్ లోనే బెంగాలీలు మూడు వందలకు పైగా బీహారీలను వూచకోత కోశారు. మార్చి 25న తూర్పు పాకిస్తాన్‌లో చెలరేగుతున్న ఆందోళనల్ని అణచివేయడానికి యాహ్యాఖాన్ సైన్యాన్ని పంపించాడు. ఆ రోజు రాత్రి లెఫ్టినెంట్ జనరల్ టిక్కాఖాన్ సారధ్యంలో సైనికులు ఢాకా నగరం మీద విరుచుకు పడ్డారు. వందల సంఖ్యలో అవామీలీగ్ కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి ఒకటిన్నర సమయంలో ముజిబిర్ రెహ్మాన్‌ని అరెస్ట్ చేసి పశ్చిమ పాకిస్తాన్‌కి తరలించారు. కొన్ని వందలమంది అవామీలీగ్ కార్యకర్తలు, మద్దతుదారులు భారతదేశానికి పారిపోయి తలదాచుకున్నారు. వాళ్ళలో పార్టీ నాయకులు కూడా ఉన్నారు.

మరుసటి రోజు పాకిస్తాన్ మిలటరీకి చెందిన మేజర్ జియావుర్ రెహ్మాన్ ఎదురు తిరిగి ముజిబిర్ రెహ్మాన్ తరఫున బంగ్లాదేశ్‌ని స్వతంత్ర దేశంగా ప్రకటించాడు. భారతదేశంలో తలదాచుకుంటున్న అవామీ లీగ్ నాయకులు ప్రవాసంలో ఉండే ఏప్రిల్ నెలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఓ రిటైర్డ్ కల్నల్ నేత్రుత్వంలో ముక్తి వాహిని ఏర్పాటు చేయబడింది.

ఆందోళనకారుల్ని టిక్కాఖాన్ అతి కిరాతకంగా అణచివేయసాగాడు. బెంగాలీ భాష మాట్లాడే వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు మూడు లక్షలమంది బెంగాలీ యువతులు సైనికుల చేతుల్లో, రజాకార్ల చేతుల్లో మానభంగానికి గురయ్యారు. తూర్పు పాకిస్తాన్ నుంచి లక్షల మంది శరణార్థులు భారతదేశానికి పోటెత్తారు. శరణార్థుల కోసం పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాలు సహాయ శిబిరాల్ని ఏర్పాటు చేశాయి.

భారతదేశ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రపంచదేశాల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ఏప్రిల్ 28న ఆర్మీ చీఫ్ జనరల్ మానెక్ షాని పిలిపించి యుద్ధానికి సన్నద్ధం కావల్సిందిగా ఉత్తర్వులివ్వబడ్డాయి. కానీ పాకిస్తాన్‌తో యుద్ధం మొదలైతే వాళ్ళకు చైనా అండగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి చలికాలం మొదలయ్యే వరకు ఆగితే మంచిదన్న అతని అభిప్రాయంతో అందరూ ఏకీభవించడంతో, వేచి చూడాలనే నిర్ణయానికొచ్చారు. చలికాలంలో దారులన్నీ మంచుతో కప్పబడి పోవటం వల్ల చైనా నుంచి భారత్ లోకి చొరబడటం దుర్లభం.

భారతదేశం సంయమనం పాటించడం మంచిదైంది. మొదట పాకిస్తాన్ సైన్యమే కయ్యానికి కాలు దువ్వింది. డిసెంబర్ 3 సాయంత్రం పాకిస్తాన్ వైమానిక దళం భారత్ లోని పదకొండు వాయు క్షేత్రాలమీద ఆపరేషన్ చెంగిజ్ ఖాన్ పేరుతో బాంబులు కురిపించింది. అదే రోజు అర్ధరాత్రి ఇందిరా గాంధీ పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ప్రకటించింది.

యుద్ధం పదమూడు రోజులు కొనసాగింది. విశాఖ సముద్రంలో పాకిస్తానీ సబ్ మెరైన్ ఘాజీని భారత నావికాదళం ముంచేసింది. కరాచీ మీద ఆకస్మిక దాడి జరిగింది. డిసెంబర్ 16న భారత సైనికులు ఢాకాని చుట్టుముట్టి పాకిస్తాన్ సైన్యం లొంగిపోవడానికి ముప్పయ్ నిమిషాల గడువునిచ్చారు. పాకిస్తాన్ కమాండర్ జనరల్ అబ్దుల్లా ఖాన్ నియాజీ తన సర్వీస్ రివాల్వర్‌ని భారత లెఫ్టినెంట్ జనరల్ జె. యస్. అరోరాకి అప్పగించడం ద్వారా లొంగిపోతున్నట్టు ప్రకటించాడు. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. పాకిస్తాన్ ప్రభుత్వం ముజిబిర్ రెహ్మాన్‌ని కారాగారం నుంచి విడుదల చేసి ఢాకాకు పంపించింది.

***

డిసెంబర్ 16 ఉదయం.. హుందర్మో గ్రామం..

షరీఫ్ బ్రోల్మో గ్రామానికి వెళ్ళడానికి తయారవుతున్నాడు. ఆస్‌మా పెళ్ళికి పదిరోజుల సమయమే మిగిలుంది. దూరపు చుట్టాలకు నిఖా తేదీని తెల్పుతూ ఉత్తరాలు రాసి పోస్ట్ చేశాడు. జోరాఫాంలో ఉన్న బావమరిది ఫక్రుద్దీన్‌కి, ఆర్.ఎస్.పురాలో ఉన్న అతని పెద్ద కొడుక్కి, ఫర్హానా భర్త అఫైర్ మియాకి నెల క్రితమే ఉత్తరాలు రాశాడు. బ్రోల్మోలో ఉన్న బంధుమిత్రుల్ని కల్సుకుని వాళ్ళని పెళ్ళికి ఆహ్వానించే పని ఈ రోజు ఎట్లాగయినా పూర్తిచేయాలని అతని కోరిక.

“నాన్నా… మధ్యాహ్నం భోజన సమయానికి వచ్చేస్తారుగా” అంది ఆస్‌మా.

షరీఫ్‌కి నవ్వొచ్చింది. “పెళ్ళి పిలుపులకు వెళ్ళిన ప్రతి యింట్లో కొద్దిసేపైనా కూచుని మాట్లాడాల్సి వస్తుందమ్మా. గడపలో నిలబడి చెప్పేసి రాలేం కదా. లతీఫ్ యింటికెళ్తే భోజనం చేయకుండా బైటికి రానివ్వరని నీకూ తెల్సుగా. కాబోయే జమాయిబాబుతో పది నిమిషాలైనా కబుర్లు చెప్పాలిగా. సాయంత్రానికి అన్ని యిళ్ళూ తిరగ్గలిగితే గొప్ప విషయమే” అన్నాడు.

జమాయిబాబు ప్రస్తావన రాగానే ఆ పిల్ల కళ్ళలో సిగ్గు దోబూచులాడింది. ఆ విషయం తండ్రికి తెలియకుండా ఉండటం కోసం తలను కిందికి వాల్చి నేలచూపులు చూస్తూ “ఈ రోజు వంటంతా నాదే నాన్నా. అమ్మ రెణ్నెల్లనుంచి రకరకాల వంటలు నేర్పిస్తోందిగా. రేపు అత్తారింటికి వెళ్ళాక అందరికీ నేనే వండి పెట్టాలటగా” అంది.

“నువ్వు ఏది నేర్పినా చక్కగా నేర్చుకుంటావు తల్లీ.. నాకా నమ్మకముంది” కూతురి వైపు ప్రేమగా చూస్తూ అన్నాడు.

“ఈ రోజు పరోటాలో పాటు కోడికూర చేయాలనుకుంటున్నా. మీరు తిని ఎలా వండానో చెప్తేనేగా నాన్నా నాకు తృప్తి.. పోనీ పన్నెండింటికి భోంచేసి వెళ్ళొచ్చుగా.”

“లేదమ్మా.. చాలా పనులున్నాయి. స్కర్దూ వెళ్ళి నీకు పెళ్ళి దుస్తులు కూడా కొనాలి.”

“ఇవన్నీ రేపు కూడా చేయొచ్చుగా నాన్నా.. యింకా పదిరోజుల సమయం ఉందిగా. ఈ రోజు వెళ్ళొద్దు నాన్నా. నాకోసం యింట్లోనే ఉండిపోండి” గోముగా అడిగింది.

“ఈ రోజు స్కర్దూలో మేలా ఉంటుందమ్మా. ఏది కొన్నా చౌకగా దొరుకుతాయి. నిఖా రోజు కట్టుకోడానికి నీకు చమ్కీల గులాబీ రంగు షల్వార్ కమీజ్ కొనాలి. అమ్మకూ నాకూ కొత్త బట్టలు కొనాలి. వెళ్ళక తప్పదు తల్లీ. నువ్వు వండిన భోజనం రాత్రికి తింటాగా” అన్నాడు.

“చీకటి పడకముందే వచ్చేయండి నాన్నా. మీ కోసం ఎదురుచూస్తుంటానన్న విషయం మర్చిపోకండి”

“మర్చిపోను తల్లీ. త్వరగా వచ్చేస్తాను” అన్నాడు.

“నాక్కావల్సిన రంగు గుర్తుందిగా. నెమలి కంఠం రంగు.. దుపట్టా మాత్రం ఎర్రటి మిరపకాయ రంగులో ఉండాలి. లాల్ దుపట్టా” హసీనా అతని వైపు సిగ్గుపడుతూ చూసింది.

షరీఫ్ స్మృతి పథంలో మధురమైన జ్ఞాపకమేదో మెదిలి, అతని పెదవుల మీద సన్నటి చిర్నవ్వు మెరిసింది. తమ మొదటి రాత్రి అనుభవం గుర్తొచ్చింది. ఆ రోజు మంచం మీద హసీనా ఎర్రటి దుపట్టాని తల నిండుగా కప్పుకుని తల వొంచుకుని కూచుని ఉంది. మేలి ముసుగుని పక్కకు జరిపి ఆమె మొహాన్ని తన వైపు తిప్పుకుని భార్య అందాన్ని కళ్ళారా చూసుకుంటూ మైమరచిపోయాడు. ఆమె పెదవులు మంచులో తడిసిన ఎర్ర గులాబీ పూరెమ్మల్లా తడితడిగా మెరుస్తూ కన్పించాయి. “నీ పెదవుల రంగు ఒలికిపోయి, చూశావా మొత్తం ఎలా ఎర్రగా మారిపోయిందో” అన్నాడు. ఆమె సిగ్గుల మొగ్గయి మరింత ముడుచుకు పోయింది.

దుపట్టా తీసేసి మడత పెట్టి మంచం అంచున పెట్టి ఆమె దుస్తుల వైపు చూశాడు. ఆమె కమీజ్ నెమలి కంఠం రంగులో ఉంది. ఆశ్చర్యపోతూ “అదేమిటి హసీనా బేగం.. సుహాగ్ రాత్ రోజు ఎర్ర రంగు దుస్తులు ధరించాలి కదా. నెమలి కంఠం రంగు కమీజ్ వేసుకున్నావేమిటి? మీ అమ్మ చెప్పలేదా?” అన్నాడు.

ఆమె మరింత సిగ్గుపడూ “నాకీ రంగంటే చాలా ఇష్టం. అమ్మతో గొడవపడి ఈ రంగు కమీజ్ కుట్టించుకున్నా” అంది. కొన్ని క్షణాల విరామం తర్వాత అతను మౌనంగా ఉండటం చూసి “మీకీ రంగు నచ్చలేదా? అయ్యో … నాకు తెలీదు కదా” అంది నొచ్చుకుంటూ.

“లేదు లేదు. బావుంది. ఐనా నాకు నచ్చిన రంగు దుపట్టా వేసుకున్నావుగా.. చాలు. నాకు లాల్ దుపట్టా అంటే ఇష్టమని నీకెలా తెలుసు?” అన్నాడు.

ఆమె అమాయకంగా మొహం పెట్టి తన విశాలమైన కళ్ళని ఎత్తి అతని వైపు చూస్తూ “మీకు లాల్ దుపట్టా అంటే ఇష్టమని నాకు తెలియదండీ. సుహాగ్ రాత్ రోజు ఒక్కటైనా ఎర్ర రంగు వస్త్రం ఉండాలని అమ్మ కప్పింది. మీకిష్టమన్నారుగా. రేపట్నుంచి రోజూ లాల్ దుపట్టా వేసుకునే కన్పిస్తాను” అంది.

ఆమె మాటలకు అతను పెద్దగా నవ్వాడు. “ఏడాది క్రితం బర్సాత్ అనే సినిమా చూశాను. అందులో ఓ పాట ఉంటుంది విన్నావా? హవా మె ఉడతా జాయే మేర లాల్ దుపట్టా మల్‌మల్ కా.. అంటూ లతా మంగేష్కర్ పాడింది. అది చూసినప్పటినుంచి నాకు లాల్ దుపట్టా అంటే పిచ్చి ఇష్టం” అన్నాడు.

“నాకూ ఆ పాటంటే ఇష్టం. ఇందాక బాగా పాడారు. మరోసారి పాడరా?” అంది.

ఆ పొగడ్తకు పొంగిపోయిన షరీఫ్ సిగ్గుపడుతూ “నాకు అంతవరకే వచ్చు. పాట మొత్తం రాదు” అన్నాడు. హసీనా కిలకిలా నవ్వింది. ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తూ “బర్సాత్ సినిమాలో నర్గీస్‌ని చూసి ఆ రోజుల్లో మోహించాను తెలుసా? నా అదృష్టం చూశావా? నర్గీస్ కన్నా అందగత్తె నా దుల్హన్ అయింది” అన్నాడు.

‘నేను నర్గీస్ అయితే మీరు రాజ్ కపూరా?” అంటూ హసీనా మరోసారి సెలయేటి రొదలా గలగలా నవ్వింది.

ఆస్‌మా నిఖా పక్కా అయిన రోజే చెప్పింది. ఆ రోజు కోసం తన సుహాగ్ రాత్ రోజు కట్టుకున్న నెమలికంఠం రంగు షల్వార్ కమీజ్‌తో పాటు లాల్ దుపట్టా కొనిపెట్టమని.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here