రెండు ఆకాశాల మధ్య-38

0
6

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]ష[/dropcap]రీఫ్‌కీ తమకూ మధ్య నిప్పుల నదిలా సరిహద్దు రేఖ మొలిచినప్పటినుంచి ఆ యింట్లోని మనుషుల మొహాల్లోంచి మాయమైన జీవకళ ఇప్పుడు మెల్లమెల్లగా ప్రాణం పోసుకోసాగింది.

హసీనా తన భర్తకు ప్రత్యుత్తరం రాయడానికి ప్రయత్నించి ఎన్నిసార్లు విఫలమైందో.. ఎదురుగా కార్డు ముక్క.. చేతిలో కలం.. మది నిండా ఝంకారం చేస్తూ అవిశ్రాంతంగా కదులుతున్న ఆలోచనల తుమ్మెదల గుంపు.. కానీ కార్డు మీద ఒక్క అక్షరం కూడా రూపు దిద్దుకోవడం లేదు. పుట్టి బుద్దెరిగాక ఎప్పుడూ ఎవ్వరికీ ఉత్తరం రాయలేదు..

రాయాల్సిన అవసరం రాలేదు. చిన్నప్పుడు అమ్మ దగ్గర నేర్చుకున్న అలీఫ్ బేలు ఖురాన్ షరీఫ్ వల్లెవేయడానికి పనికొచ్చాయి తప్ప ఏనాడూ కాగితం మీద ఒక వాక్యం రాసి ఎరుగదు.

ఇప్పుడు రాయడానికి కూచుంటే కన్నీళ్ళు రాలి పడున్నాయి తప్ప అక్షరాలు పడటం లేదు. తనకు తన భర్తంటే ప్రాణం. కానీ ఎప్పుడూ ఆ విషయం తన భర్తకు చెప్పలేదు. కొన్ని పర్యాయాలు అందమైన అనుభూతుల్ని ఆస్వాదిస్తున్న సమయంలో చెప్పాలనుకున్నా స్త్రీ సహజమైన సిగ్గు అడ్డొచ్చి చెప్పలేకపోయింది. ఇప్పుడు చెప్పాలనిపిస్తోంది. అతను పక్కన లేని జీవితం ఎంత నిస్సారంగా ఉందో, తను ఎంత నిరాశలో ఉందో చెప్పాలని ఉంది. కానీ ఏదో అడ్డు పడ్తోంది… సిగ్గు కాదు… అనంతమైన దుఃఖం….

చివరికెలాగైతేనేం కొన్ని వాక్యాల్ని కార్డు మీద రాసి, పోస్ట్ డబ్బాలో వేయడానికి పంపించేముందు తను రాసిన ఉత్తరాన్ని మరోసారి చదువుకుంది. ‘జీ.. అస్సలామలేకుం. మీరెలా ఉన్నారోనని ఎంత దిగులు పడ్డామో తెలుసా? మీ ఖైరియత్ కోరుతూ అల్లాని ఎన్నిసార్లు ప్రార్థించానో తెలుసా? మీ ఉత్తరం చదివాక మనసు కొద్దిగా కుదుటపడింది. మీరు మీ అక్క యింట్లో ఉన్నారు కాబట్టి ఏ రకమైన లోటు రాకుండా చూసుకుంటారన్న నమ్మకముంది. వీలైనంత తొందరగా వచ్చేయండి. మీ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తుంటా. మీరు రాకుండా నా జనాజా లేవదు. ఇది మాత్రం నిజం. ఖుదా హాఫీజ్’.. చివరి వాక్యం చదువుతున్న ప్పుడు ఆమెకు మరోసారి ఏడుపొచ్చింది.

ఉత్తరం పోస్ట్ చేశాక ఆమెలో ఆశ ఉత్తుంగ తరంగంలా ఎగసిపడింది. ఉత్తరం చదివిన వెంటనే తన భర్త రెక్కలు కట్టుకునైనా సరే వచ్చి వాలిపోతాడన్న నమ్మకం.. పాకిస్తాన్‌కి ఇండియాకి మధ్య ఉన్న ఘర్షణపూరితమైన వాతావరణం గురించి కానీ, వీసా మంజూరుకు అడ్డుపడే కఠినమైన నిబంధనల గురించి కానీ ఆమెకు సరైన అవగాహన లేదు.

వారం దాటింది.. పక్షం రోజులు దాటాయి.. నెల.. రెండు నెలలు.. మెల్లగా ఆమెలోకి ప్రవేశించిన నిరాశ ఇప్పుడు చుట్టలు చుట్టుకుని స్థిరనివాసం ఏర్పర్చుకుంది. ఓ వైపు భర్త తిరిగిరాలేదన్న దిగులు… ఎప్పుడొస్తాడో తెలియని గుబులు.. మరో వైపు కూతురి నిఖా ఆగిపోయిందన్న బెంగ.. ఆమెను కుంగదీయ సాగాయి.

మరో దిగులు కూడా ఆమెను లోపల్లోపలే తినేయసాగింది. హుందర్మో గ్రామం హిందూస్తాన్‌లో కల్సిపోయిందని తెలిసిన వెంటనే అన్న ఫక్రుద్దీన్ తనను చూడటానికి పరుగెత్తుకుంటూ వస్తాడనుకుంది. కానీ ఎన్ని రోజులు ఎదురుచూసినా అన్న వచ్చే సూచనలేమీ కన్పించలేదు. జోరాఫాం కూడా సరిహద్దు రేఖను ఆనుకుని ఉన్న గ్రామం కాబట్టి యుద్ధం మొదలైన సమాచారంతో పాటు యుద్ధం ముగిసిన సమాచారం తెల్సి ఉంటుంది కానీ భారతదేశం ఆక్రమించుకున్న గ్రామాల సమాచారం తెలిసే అవకాశం ఉండదని ఆమెకర్థమైంది.

భర్తకు ఉత్తరం రాసిన మూడు నెలల తర్వాత హసీనా తన అన్న ఫక్రుద్దీన్‌కు ఉత్తరం రాసింది. ‘భాయీజాన్. ఆదాబ్.. జంగ్ ముగిశాక మా హుందర్మో గ్రామం హిందూస్తాన్ హుకూమత్‌లోకి వెళ్ళిపోయింది. అదే రోజు ఉదయం నా షొహర్ ఆస్‌మా పెళ్ళి బట్టలు కొనడం కోసం బ్రోల్మో వెళ్ళి తన బహెన్ జైనాబీని పిల్చుకుని స్కర్దూ వెళ్తానని చెప్పి వెళ్ళారు.

రాత్రికి రాత్రే బ్రోల్మో పరాయి దేశమైపోయింది. నీ బావగారు ఇప్పటివరకు తిరిగిరాలేదు. ఆస్‌మా పెళ్ళి ఆగిపోయింది. ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇప్పుడు మీ వూరితో పాటు మా వూరు కూడా హిందూస్తాన్‌లో ఉంది కాబట్టి నువ్వొస్తావన్న ఆశతో ఎదురుచూస్తున్నాను. భాభీకి సలాములు చెప్పు. ఖుదా హాఫీజ్’ అని రాసి, ఉత్తరాన్ని పోస్ట్ చేయించింది.

ఉత్తరం పోస్ట్ డబ్బాలో వేసిన నాలుగో రోజు ఫక్రుద్దీన్ తన భార్య ఫౌజియాతో సహా దిగిపోయాడు. దాదాపు రెండున్నర దశాబ్దాల సుదీర్ఘమైన ఎడబాటు తర్వాత తన అన్నా వదినల్ని చూడటంతో హసీనా భావోద్వేగానికి గురైంది. అన్న చేతులు పట్టుకుని వెక్కివెక్కి ఏడుస్తూ పదేపదే ఆ చేతుల్ని కళ్ళకద్దుకుంది. వదిన్ని వాటేసుకుని తనివితీరా ఏడ్చింది.

అఖండ భారతదేశం రెండు దేశాలుగా విడిపోక ముందు ఫక్రుద్దీన్ తరచూ తన చెల్లెల్ని చూసుకోడానికి హుందర్మో గ్రామానికి వచ్చేవాడు. పందొమ్మిది వందల నలభై యేడు ఆగస్ట్ ‌కి ఓ ఏడాది ముందే హసీనాకి పెళ్ళయింది. అప్పుడు హసీనాకి పదహారేళ్ళు. షరీఫ్ హసీనాకంటే ఆరేళ్ళు పెద్దవాడు. హసీనా చిన్నపిల్ల కాబట్టి సంసారాన్ని ఎలా నిభాయించుకుంటుందోనన్న ఆందోళనతో నెలకొక్కసారైనా ఫౌజియాని పిల్చుకుని చెల్లెలింటికి వచ్చేవాడు. సంసారం సజావుగా ఎలా చేసుకోవాలో ఫౌజియా చేత తన చెల్లికి చెప్పించేవాడు. షరీఫ్ చాలా సౌమ్యుడూ, మంచివాడూ అని అందరూ చెప్పినప్పటికీ తన చెల్లెల్ని అతనెలా చూసుకుంటున్నాడో తెల్సుకోవటం కోసం కూడా జోరాఫాంకి హుందర్మోకి మధ్య తరచూ చక్కర్లు కొట్టేవాడు.

దేశాన్ని రెండుగా చీల్చినపుడు సరిహద్దు రేఖ ఏ వూళ్ళని ఎలా విభజిస్తుందో ప్రత్యక్షంగా చూడకుండానే ఎక్కడో సుదూరంగా ఉన్న ఢిల్లీలో కూచుని, ఎదురుగా మ్యాప్‌ని పెట్టుకుని, బౌండరీ కమీషన్‌కి ఛైర్మన్‌గా నియమించబడిన ర్యాడ్‌క్లిఫ్ అనే బ్రిటీష్ అధికారి మ్యాప్ మధ్యలో ఓ గీత గీసి అటువైపు పాకిస్తాన్ భూ భాగం, ఇటువైపుది ఇండియా భూభాగం అని నిర్ణయించేశాడు. ఆ గీత కొన్ని గ్రామాల్ని మధ్యకు చీల్చి సగం ముక్కని పాకిస్తాన్‌లో మరో సగాన్ని ఇండియాలో విసిరేసింది. దానివల్ల ఆ గ్రామ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారోనన్న విషయం ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదు. అలానే సఖ్యతగా ఉన్న పక్కపక్క గ్రామాల్ని కూడా రెండు ముక్కలుగా ఖండించింది. ఈ విషయాన్ని ర్యాడ్‌క్లిఫ్ దగ్గర ప్రస్తావించినపుడు “నేను సరిహద్దు రేఖని ఎలా గీసినా కొంతమందికి ఇబ్బంది కలక్క తప్పదు” అనేశాడు.

సరిహద్దు రేఖ నిర్ణయించడానికి ముందు ర్యాడ్‌క్లిఫ్ ఎప్పుడూ ఇండియాని సందర్శించలేదు. భారతదేశ భౌగోళిక పరిస్థితుల గురించిగానీ, టోపోగ్రఫీ గురించి గానీ అతనికి సరైన అవగాహన లేదు. దానికి తోడు ఇక్కడి వాతావరణం సరిపడకపోవడం వల్ల తనకప్పగించిన బాధ్యతని వీలైనంత తొందరగా పూర్తి చేసి ఇంగ్లండ్‌కి వెళ్ళిపోవాలని ఆరాటపడిన వ్యక్తి.. అందుకే సరిహద్దు రేఖని హడావిడిగా గీసేసి, చేతులు దులుపుకుని పధ్నాలుగు ఆగష్టునే ఇండియా నుంచి వెళ్ళిపోయాడు.

చివరికి దాన్ని అమలు పర్చడం కూడా హడావిడిగానే జరిగింది. అమలు పర్చడానికి నియమించబడిన పాకిస్తాన్, ఇండియా ప్రతినిధులకు విభజన ప్రతుల్ని ఆగష్టు పదహారున సాయంత్రం ఐదుగంటలకు యిచ్చి, వాటిని పరిశీలించడానికి కేవలం రెండు గంటల సమయమే కేటాయించారు. మరుసటి రోజు అంటే పదిహేడు ఆగష్టున ర్యాడ్‌క్లిఫ్ అవార్డ్‌ని ప్రకటించారు.

పై విషయాలేవీ ఫక్రుద్దీన్‌కి తెలియకున్నా వాటి పర్యవసానాల్ని మాత్రం ప్రత్యక్షంగా అనుభవించాడు. హుందర్మో గ్రామం పాకిస్తాన్లో, జోరాఫాం ఇండియాలో భాగమైపోయి అన్నా చెల్లెలి మధ్య అగాధాన్ని సృష్టించాయి. అప్పటినుంచి ఫక్రుద్దీన్‌కు తన చెల్లెల్ని కల్సుకోవడం కుదరనే లేదు. ఎన్నేళ్ళు? దాదాపు ఇరవై నాలుగేళ్ళు… ఎంత మానసిక క్షోభని అనుభవించాడో.. తన చెల్లెల్ని, చెల్లెలి పిల్లల్ని చూడటానికి ఎంతగా పరితపించాడో…

రూపురేఖలు మారిపోయిన తన చెల్లెలి వైపు చూసుకుని ‘కాలం మనిషిలో ఎంత మార్పు తెస్తుందో కదా’ అనుకుని నిట్టూర్చాడు ఫక్రుద్దీన్. సన్నగా, నాజూగ్గా సన్నజాజి తీగలా ఉండే హసీనా లావైంది. అప్పటి లావణ్యం, మొహంలో నిగారింపు లేవిప్పుడు. గోధుమ రంగులో ఉండే శరీరం కమిలినట్టు నల్లబడింది. షరీఫ్ దూరమైనప్పటినుంచి సరిగ్గా నిద్రాహారాలు లేవేమో కళ్ళకింద నల్లటి చారలు కూడా ఏర్పడ్డాయి.

హసీనా కూడా తన అన్నలో వచ్చిన మార్పుని చూసి నిట్టూర్చింది. వత్తుగా నల్లగా ఉండే జుత్తు బాగా పల్చబడింది. ముందు భాగంలో మొత్తం వూడిపోయి బట్టనెత్తి కన్సిప్తోంది. మనిషి లావైనాడు. పొట్ట ముందుకు పొడుచుకొచ్చింది. ఎటొచ్చీ తనలో వచ్చినంత మార్పు తన అన్నలో రాలేదనుకుంది.

“నాకో విషయం అర్థం కాలేదు. ఈ వూరి పేరు హుందర్మో కదా. ఇప్పుడు ఎవర్నడిగినా హుందర్మాన్ అంటున్నారేమిటి?” అని అడిగాడు ఫక్రుద్దీన్.

“హిందూస్తాన్ సైనికులు దాడిచేయబోతున్నారని తెలిసి మేమందరం భయపడి గుహలోకి పారిపోయి తలదాచుకున్నాం. ఆ సైనికులకు నాయకత్వం వహిస్తున్న మాన్‌సింగ్ అనే అఫ్సర్ మాతో చాలా ప్రేమగా మాట్లాడాడు. మా గ్రామస్థుల అవసరాలు తెల్సుకుని, మమ్మల్ని ఆదుకున్నాడు. అతని మీదున్న గౌరవానికి గుర్తుగా ఈ వూరి పేరు చివర్న అతని పేరుని చేర్చి హుందర్మాన్‌గా పిల్చుకుంటున్నాం” అంది హసీనా.

“మనకు మంచి చేసిన మనుషుల్ని గుర్తుంచుకుని వాళ్ళకు సముచిత గౌరవం ఇవ్వడం గొప్ప సంస్కారం. అది సరేగానీ ఆస్‌మా పెళ్ళి విషయం ఏం చేద్దామనుకుంటున్నావు?”

“నీ బావగారు తప్పకుండా వస్తారు. దీని పెళ్ళి బ్రోల్మో లోని హనీఫ్‍తో జరిపిస్తారన్న నమ్మకం నాకు ఉంది. మేమాయన రాక కోసం ఎదురుచూడటం తప్ప ఏం చేయగలం చెప్పు?”

ఫక్రుద్దీన్ కొన్ని క్షణాలు ఆలోచించాక చెప్పాడు. “అది సరైన నిర్ణయం కాదనిపిస్తోంది హసీనా. బావ ఎప్పుడు తిరిగొస్తాడో తెలియదు. అతను తిరిగొచ్చినా, హనీఫ్ ఈ పెళ్ళికి తన అంగీకారం తెల్పినా, నా ఉద్దేశంలో అమ్మాయిని బ్రోల్మోలో ఉండే అబ్బాయికిచ్చి పెళ్ళి చేయడం అంత సమంజసం కాదు.”

“అదేమిటన్నయ్యా అలా అంటావు? ఎప్పుడో అనుకున్న సంబంధం కదా. ఆసమాకి కూడా ఈ పెళ్ళి ఇష్టమే. మా కాబోయే వియ్యంకుడు లతీఫ్ ఏరికోరి మా అమ్మాయిని కోడలిగా చేసుకోడానికి తొందరపడ్తుంటే వద్దంటావేమిటి?”

“ఈ పెళ్ళి జరిగితే వచ్చే సాధకబాధకాల గురించి నువ్వుగానీ, ఆస్‌మా గానీ ఆలోచించడం లేదనిపిస్తోంది. బ్రోల్మో మీ పక్కూరే అయినా ఈ పెళ్ళి ఓ పాకిస్తానీ కుర్రాడికి, హిందూస్తానీ అమ్మాయికి మధ్య జరగబోయే పెళ్ళి.. అసలీ పెళ్ళి జరగడమే కష్టం. వాళ్ళు వీసాలు తీసుకుని కొన్ని వేల మైళ్ళు ప్రయాణించి ఈ వూరికి రావాలి. నిఖా జరిగాక మళ్ళా మనమ్మాయిని తీసుకుని వెనక్కెళ్ళాలి. సరే ఎలాగో ఇదంతా జరిగిందే అనుకుందాం. నువ్వు నీ కూతుర్ని చూడాలంటే మళ్ళా ఇంత తతంగమూ జరగాలి లేదా అమ్మాయి నిన్నూ బావగార్ని చూడాలనుకున్నా అది కూడా పెద్ద తతంగమే కదా. ఏ దుబాయో, సౌదీ అరేబియాలోనో ఉండే కుర్రాడికిచ్చి చేసినా రాకపోకలు ఇంత కష్టంగా, నిబంధనలు ఇంత కఠినంగా ఉండవు. హిందూస్తాన్, పాకిస్తాన్‌లు స్వల్ప కారణాలకే విరోధంతో కయ్యానికి కాలు దువ్వుతున్న రోజులివి. నువ్వా విషయం మర్చిపోతున్నావు” అన్నాడు ఫక్రుద్దీన్.

హసీనా ఆలోచనలో పడింది. నిజమే … తనకీ విషయం తట్టనే లేదు.

పిల్లని పరాయి దేశానికి పంపినట్టవుతుంది. అనుకున్నప్పుడల్లా చూసుకోడానికి ఉండదు. సుస్తీ చేస్తే ఎవరు చూసుకుంటారు? పురుళ్ళు ఎవరు పోస్తారు?

ఆమెకు మరో ఆలోచన కూడా వచ్చింది.

పిల్ల దూరంగా ఉంటేనేం సుఖపడితే చాలుగా.. అంతకన్నా ఆడపిల్ల తల్లిదండ్రులు కోరుకునేదేముంటుంది? కాబోయే అత్తమామలు మంచివాళ్ళు కాబట్టి అత్తపోరుండదు. హనీఫ్‌కి మంచి ఆదాయం ఉంది. పిల్లను బాగా చూసుకుంటాడు. అదే విషయం ఫక్రుద్దీన్‌కి చెప్పింది.

అక్కడే ఉండి వాళ్ళ మాటల్ని వింటున్న ఆస్‌మా వెంటనే కల్పించుకుంటూ “నేనలాంటి సంబంధాన్ని చేసుకోనమ్మా. నిన్నూ అబ్బాజాన్‌ని చూడకుండా ఉండలేను. ఈ సంబంధమైనా అబ్బాజాన్ మూడ్రోజులు ఆ యింట్లో మాతోపాటు ఉండి, మిగతా నాలుగు రోజులు రోజూ వచ్చి చూసి పోతుంటానంటేనే ఒప్పుకున్నా” అంది.

హసీనా తన కూతురి మొహంలోకి దీర్ఘంగా చూసి, తన అన్న వైపు తిరిగి “నీ సలహా ఏమిటి భాయీజాన్.. ఆయన పక్కూరిలో బందీ అయ్యాక మాది మగదిక్కులేని సంసారం అయింది. ఆరిఫ్ చూస్తే చిన్నపిల్లవాడాయె. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు భాయీజాన్” అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది.

“ఆస్‌మాకి ఈ చుట్టుపక్కలే మంచి సంబంధం చూసి పెళ్ళి చేయడం మంచిది. ఈ విషయంలో నువ్వేమీ దిగులు పడకు. నేను చూసుకుంటాను. మా వూళ్ళో కూడా పెళ్ళి కాని కుర్రవాళ్ళున్నారు. అమ్మాయికి ఈడూజోడుగా ఉండే కుర్రవాడ్ని వెదికి నీకు ఉత్తరం రాస్తాను. నిఖా చేసేద్దాం.”

హసీనా చివ్వున తలయెత్తి తన అన్న వైపు దిగులు నిండిన కళ్ళతో చూసింది. “ఆయన తిరిగిరాకుండా అమ్మాయి పెళ్ళెలా చేస్తాం అన్నయ్యా” అంది.

“బావగారు తిరిగొచ్చేవరకు పెళ్ళి చేయకుండా ఆగితే మంచి మంచి సంబంధాలన్నీ తప్పిపోయే ప్రమాదముంది. అమ్మాయికి వయసు మీరిపోయినా పెళ్ళి జరగడం కష్టం. నా మాటిను. మంచి కుర్రాడిని చూసి తొందరగా నిఖా చేసేయడం మంచిది.”

“అంటే నీ ఉద్దేశం ఏమిటన్నయ్యా… మీ బావగారు రావడానికి ఎన్ని రోజులు పడుందనీ.. రెండు మూడు సంవత్సరాలకు పైగా పట్టొచ్చన్నట్టు మాట్లాడుతున్నావే” అంది హసీనా అన్న మొహంలో సమాధానాల కోసం వెతుకుతూ.

చెల్లెలికి నిజం చెప్పడానికి ఫక్రుద్దీన్ సందేహించాడు. అంతకన్నా ఎక్కువ సమయమే పట్టొచ్చని అతనికున్న లోకజ్జానం చెప్తోంది. అలా చెప్పి చెల్లెల్ని బాధపెట్టడం అతనికిష్టం లేదు. “అలాగని కాదు. ఆడపిల్ల పెళ్ళికి సంబంధించిన వ్యవహారం కదా. ఎంత తొందరగా కానిస్తే అంత మంచిదని” అన్నాడు.

“మరో మూణ్ణాలుగు నెలలు ఆగుదాం అన్నయ్యా” అంది హసీనా.

“సరే. నీ ఇష్టపకారమే ఆగుదాం. ఈ లోపల సంబంధాలు చూసి పెట్టుకోవడంలో అభ్యంతరమేమీ లేదుగా” అన్నాడు.

“అలాగే కానీయ్. పెళ్ళి మాత్రం నాలుగు నెలల తర్వాతే. నాకెందుకో ఈ లోపలే నీ బావగారు తిరిగొస్తారని బలంగా అన్పిస్తోంది.”

“ఇన్షా అల్లా” అన్నాడు ఫక్రుద్దీన్.

***

స్కర్దూ పట్టణంలో కాలు మోపాక మొదట షరీఫ్ అద్దె యిళ్ళని వెతుక్కుంటూ వీధులన్నీ తిరిగాడు. ఏదైనా పని వెతుక్కునే ముందు చిన్న గదిని అద్దెకు తీసుకుని తనకు ప్రాణప్రదమైన హసీనా కోసం, ఆస్‌మా కోసం కొన్న బట్టల్ని జాగ్రత్తగా భద్రపర్చాలనేది అతని కోరిక. అద్దె యిళ్ళకోసం తిరిగి తిరిగి అలసిపోయాడు. తన దగ్గరున్న డబ్బులు లెక్కపెట్టి చూసుకున్నాడు. కనీసం ఓ వారమైనా పస్తులు లేకుండా గడుపు కోవాలంటే చాలా తక్కువ అద్దెలో యిల్లు తీసుకోవాలి. కాళ్ళు చాపుకునేంత వైశాల్యమున్న గదైనా చాలు.

కొంతమంది నువ్వెవరో తెలియకుండా యిల్లు యివ్వడం కుదరదు అన్నారు. మరికొంతమంది ఈ వూళ్లో తెలిసినవాళ్ళెవరైనా ఉంటేనే యిస్తామన్నారు. ఎటువంటి షరతులు లేకుండా గది యివ్వడానికి సిద్ధపడిన వాళ్ళు అద్దె చాలా ఎక్కువ చెప్తున్నారు.

సమయం సాయంత్రం ఆరయింది. మెల్లగా చీకట్లు ముసురుకోవడంతో పాటు చలిగాలి కూడా మొదలైంది. చలికాలం కానందుకు అల్లాకు షుకర్ గుజార్ చెప్పుకున్నాడు. ఆ కాలంలో మంచు కురుస్తో ఉంటుంది. ఉష్ణోగ్రతలు మైనస్ ఐదు డిగ్రీల వరకు చేరుకుంటాయి. రోడ్లు మంచుతో కప్పబడిపోతాయి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here