రెండు ఆకాశాల మధ్య-42

0
8

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]“యిం[/dropcap]కెన్నాళ్ళు ఎదురుచూడమంటారు బాబాయ్? దుర్భరమైన ఒంటరి బతుకుని ఇన్నేళ్ళూ బతికాను. యింక నావల్ల కాదు. నాకు అనీస్ అంటే ప్రేమ లేదనుకున్నారా? తనంటే నాకు చాలా ఇష్టం. ప్రేమో ఇష్టమో ఉంటే సరిపోదుగా బాబాయ్. కలిసి కాపురం కూడా చేయాలిగా. ఇలా విడివిడిగా ఉండి ఎన్నాళ్ళు బతికినా ఏమిటీ ప్రయోజనం? భౌతిక సుఖాల గురించి, మిగతా అవసరాల గురించి కూడా ఆలోచించాలిగా.”

“ఆ అవసరాలు అనీస్‌కి కూడా ఉంటాయిగా.”

“నిజమే. అందుకే మొన్నటివరకూ నేను అనీస్‌ని తల్చుకుంటూనే బతికాను. కానీ ఇప్పుడు హృదయంతో కాకుండా వ్యవహారికంగా ఆలోచిస్తున్నాను. పెళ్ళికి నా సమ్మతిని కూడా తెలియచేశాను బాబాయ్. ఇక మరో ఆలోచనకు తావే లేదు.”

జమీల్ మరో నిఖా చేసుకోవాలని దృఢంగా నిర్ణయించుకున్నాడని షరీఫ్‌కి అర్థమైంది. ఇప్పుడు ఎంత నచ్చచెప్పినా ప్రయోజనం ఉండదని, తను ప్రేక్షక పాత్ర వహించడం తప్ప మరో గత్యంతరం లేదని కూడా అర్థమైంది.

మనసులో సుళ్ళు తిరుగుతున్న బాధను దిగమింగుతూ “ఎవరా అమ్మాయి? సంబంధం ఎవరు కుదిర్చారు?” అని అడిగాడు.

“నేను పూలు కొంటానే.. ఖాద్రి.. అతని కూతురితో పెళ్ళి. ఖాద్రిగారే అడిగారు. ఆయనకు నా గురించి అంతా తెలుసు. నేను వెంటనే ఒప్పేసుకున్నాను” కొద్దిగా సిగ్గుపడుతూ అన్నాడు జమీల్.

“ఆ అమ్మాయిక్కూడా ఇది రెండో పెళ్ళా?”

“కాదు. మొదటి పెళ్ళే. వయసు కూడా పదహారుకి మించి ఉండదు. నాకంటే పదేళ్ళు చిన్నది.”

“మరో నిఖా చేసుకోబోతున్నందుకు బధాయీ జమీల్. నీ పెళ్ళి విషయం మీ అమ్మానాన్నలకు, తాతగారికి తెలియబర్చావా?”

“యింకా లేదు బాబాయ్. ఈ శుభవార్తని మొదట మీకే చెప్పాను. రేపు యింటికి ఉత్తరం రాస్తాను. అది వాళ్ళకు ఎప్పుడు అందుతుందో తెలియదు. అసలు అందుతుందో లేదో కూడా తెలియదు. ఒక వేళ అందినా వాళ్ళు రాలేరుగా బాబాయ్.”

“నిజమే. కూతురి పెళ్లీ, కొడుకు పెళ్ళి అని తెలిసి కూడా ఆ పెళ్ళికి హాజరు కాలేకపోవడం కన్నా మించిన దురదృష్టం ఏ తల్లిదండ్రులకైనా యింకేముంటుంది?” ఆవేదనగా అన్నాడు షరీఫ్.

“బాబాయ్… నాకీ వూళ్లో మీరు తప్ప బంధువులెవరూ లేరు. నా నిఖా మీ చేతుల మీదుగానే జరగాలి” అన్నాడు జమీల్.

షరీఫ్‌కి ఏమనాలో అర్థం కాలేదు. తన చేతుల్తోటే తనకిష్టమైన అనీస్ గొంతు కోయమని కదా అడుగుతున్నాడు. అంతటి దుర్మార్గం తను చేయగలడా? జమీల్ మరో అమ్మాయిని నిఖా చేసుకుంటుంటే చూస్తూ భరించను కూడా లేడే.. కన్నీళ్ళు పెట్టుకోకుండా ఉండగలడా? అలాంటిది పెళ్ళి పెద్దగా దగ్గరుండి నిఖా జరిపించడం తన వల్ల సాధ్యమయ్యే పనేనా?

“మాఫ్ కరనా జమీల్.. నేనా బాధ్యతని మోయలేను. అనీస్‌కి జరుగుతున్న అన్యాయంలో భాగస్థుడిని కాలేను. నన్నర్థం చేసుకో” కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు షరీఫ్.

“ఈ కబురు విని మీరు బాధపడ్తారని తెలుసు బాబాయ్. కానీ నా కోణంలోంచి ఆలోచించి నన్ను అర్థం చేసుకుని ఆశీర్వదిస్తారనుకున్నా. మగవాళ్ళకు ఆడ తోడు లేకుండా బతకడం కష్టం బాబాయ్. రోజంతా శ్రమపడి యింటికెళ్తే యింత వండి పెట్టడానికి ఓ ఆడది అవసరం కదా బాబాయ్. మీరు కూడా ఎన్నాళ్ళని ఒంటరిగా బతుకుతారు? మరో పదేళ్ళయినా హుందర్మోకి వెళ్ళడం సాధ్యపడదు బాబాయ్. నా ఉద్దేశంలో మీరు కూడా మరో నిఖా చేసుకోవడం మంచిది.”

“నువ్వు అనీస్‌కి అన్యాయం చేసినట్టు నేను నా భార్య హసీనాకు అన్యాయం చేయలేను. ఎన్నేళ్ళయినా ఆమెను కల్సుకుంటానన్న ఆశతో బతుకుతాను.”

“మీ ఇష్టం బాబాయ్. పెళ్ళి పెద్దగా వ్యవహరించకున్నా పర్లేదు, పెళ్ళికి తప్పకుండా రండి బాబాయ్” అన్నాడు జమీల్.

నెల తిరిగేలోపల జమీల్ పెళ్ళి జరిగిపోయింది. షరీఫ్ పెళ్ళికి వెళ్ళలేదు.

జమీల్ గదిని ఖాళీ చేసి, తన మామగారింటికి వెళ్ళిపోయాడు. క్రూరమృగంలా నోరు తెర్చుకుని ఎదురుచూస్తున్న ఒంటరితనానికి షరీఫ్ మరోసారి బలైపోయాడు.

మరో మూడు నెలలు భారంగా గడిచాయి. ఒకరోజు ఉర్దూ పత్రికలో వచ్చిన ఓ వార్త చదివి షరీఫ్ ఉత్తేజితుడైనాడు. తనకూ తన కుటుంబానికి మధ్య ఏర్పడిన అడ్డు తొలగిపోయిందని సంబరపడ్డాడు. ఆ వార్త సారాంశం ఏమిటంటే పందొమ్మిది వందల డెబ్బయ్ రెండులో ఇండియా ప్రధాని ఇందిరా గాంధీకి, పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ ఆలీ భుట్టోకి మధ్య సిమ్లా ఒప్పందం జరిగింది. దాని ఫలితంగా రెండు దేశాల మధ్య సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పందొమ్మిది వందల డెబ్బయ్ ఆరు జులై ఇరవై రెండున ప్రారంభమైంది. లాహోర్ లోని మొగల్‌పురా రైల్వే జంక్షన్ నుంచి బయల్దేరి, పాకిస్తాన్ ఇండియాకి సరిహద్దులో ఉన్న వాఘా రైల్వే స్టేషన్ మీదుగా ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరం ప్రయాణించి భారతదేశంలోని అటారి చేరుకుంటుంది. అక్కడినుంచి ఖాసా రైల్వే స్టేషన్ మీదుగా ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమృతసర్ జంక్షన్ చేరుకుంటుంది. ఈ రైలు ప్రయాణించే మొత్తం దూరం యాభై రెండు కిలోమీటర్లు. ఇది రోజువారీ నడపబడుతుంది. దేశ విభజన ఫలితంగా విడిపోయిన బంధువుల్ని, ఆత్మీయుల్ని మళ్ళా కలపడమే ఈ రైలు ప్రారంభించడంలో ముఖ్యోద్దేశం…

షరీఫ్ ఆశలకు రెక్కలు మొలిచాయి. ఆ వార్త చదివిన క్షణం నుంచీ స్కర్దూలో ఉండటానికి అతనికి మనస్కరించడం లేదు. దాదాపు ఐదేళ్ళకు పైగా ఆదరించిన నేల కన్నా ఇప్పటివరకూ చూడని లాహోర్ మీద ఇష్టం కలుగుతోంది. లాహోర్‌లో కొన్నాళ్ళు గడిపి, సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌కి సంబంధించిన సమాచారమంతా తెల్సుకుని, అందులో సీటు సంపాదించి, హిందూస్తాన్ వెళ్ళాలని ఉవ్విళ్ళూరుతున్నాడు.

అమృతసర్‌ నుంచి తన వూరు హుందర్మో ఎంత దూరమో అతనికి తెలియదు. అక్కడికి చేరుకోడానికి ఎంత ఖర్చవుతుందో కూడా తెలియదు. పూలవ్యాపారంలో ఆదాయం బాగానే ఉన్నా పొదుపు చేసింది తక్కువే. హోటల్లో పని చేస్తున్నప్పుడు తిండికి పైసా కూడా ఖర్చయ్యేది కాదు. కానీ స్కర్దూ వచ్చాక తన సంపాదనలోంచి ఎక్కువ భాగం తిండికే ఖర్చు చేయాల్సి రావడం వల్ల మిగుల్చుకుంది తక్కువే. అందుకే లాహోర్ వెళ్ళి ఏదైనా పని వెతుక్కుని, మరికొంత సొమ్ము వెనకేసుకున్నాకే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ ఎక్కాలని నిర్ణయించుకున్నాడు.

అతను లాహోర్ వెళ్తానని చెప్పినపుడు జమీల్ అడ్డుచెప్పలేదు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ గురించి అతను కూడా విని ఉన్నాడు. “సరే బాబాయ్. లాహోర్ వెళ్ళడం వల్ల మీ కోరిక నెరవేరుతుందంటే నేనెందుకు వద్దంటాను? వెళ్ళండి. కానీ అక్కడికెళ్ళాక ఏం చేయాలో మొదటే నిర్ణయించుకుని వెళ్ళండి” అన్నాడు.

“అక్కడ కూడా పూల వ్యాపారం చేస్తాను” అన్నాడు షరీఫ్.

“అది మీరనుకున్నంత సులభం కాదు బాబాయ్. లాహోర్‌లో మీకెవ్వరూ తెల్సినవాళ్ళు లేరు. మొదట ఉండటానికి మీరో గదిని వెతుక్కోవాలి. తర్వాత పూలు హోల్‌సేల్లో అమ్మే వ్యాపారస్థుడిని వెదికి పట్టుకోవాలి. పూలమాలలు అమ్మడానికి మార్కెట్లో మీకో స్థలం దొరకాలి. ఇవన్నీ సానుకూలపడటానికి సమయం పడ్తుంది. అప్పటివరకూ ఏం చేస్తారు?” అన్నాడు.

షరీఫ్ కొన్ని క్షణాలు ఆలోచించి చెప్పాడు. ‘నేను బ్రోల్మోలో స్కూల్లో పనిచేశాను కదా. అలాంటి ఉర్దూ స్కూళ్ళలో పనేమైనా దొరుకుతుందేమో వెతుక్కుంటాను.”

“బ్రోల్మో చిన్న పల్లెటూరు కాబట్టి మిమ్మల్ని పనిలో పెట్టుకుని ఉంటారు. లాహోర్ లోని స్కూళ్ళలో పని దొరకాలంటే ప్రభుత్వ నియామకాల ద్వారానే సాధ్యం. ఒకవేళ ఎక్కడైనా ప్యూన్‌గా చేరదామన్నా తెల్సిన వాళ్ళ సిఫార్సు లేకుండా ఎవరిస్తారు చెప్పండి?”

“మరి నన్నేం చేయమంటావు?” అతని ఆంతర్యమేమిటో అర్థం కాక అడిగాడు షరీఫ్.

“లాహోర్‌లో ధనవంతులు చాలామంది ఉంటారు. వాళ్ళ దగ్గర కార్లుంటాయి. వాటికి డ్రైవర్ల అవసరం ఉంటుంది. పెద్దగా శ్రమ లేని పని. తొందరగా దొరికే పని.”

“కానీ నాకు కారు తోలడం రాదుగా.”

“ఇక్కడే నేర్చుకోండి. కారు నడపడం నేర్పే స్కూళ్ళు మనకు దగ్గర్లోనే ఉన్నాయి. రెండు నెలల కోర్స్ తీసుకుంటే చాలు. డ్రైవింగ్ లైసెన్స్ కూడా వచ్చాకే లాహోర్ వెళ్ళండి. ఇబ్బంది పడకుండా ఉంటారు” అన్నాడు జమీల్.

అతని సలహా షరీఫ్‌కి బాగా నచ్చింది. అతనే వెంట ఉండి పిల్చుకెళ్ళి ఓ డ్రైవింగ్ స్కూల్లో చేర్పించాడు. రోజూ ఉదయం ఏడింటికి డ్రైవింగ్ నేర్పే వ్యక్తి కార్ వేసుకుని గది దగ్గరకొచ్చి ఎక్కించుకుంటాడు. మళ్ళా ఎనిమిదింటికి అక్కడే దింపి వెళ్ళిపోతాడు.

డ్రైవింగ్ లైసెన్స్ చేతికందాక, షరీఫ్ లాహోర్‌కి ప్రయాణమైనాడు. స్కర్దూలో రైల్వే స్టేషన్ లేదు. బస్‌లో రావల్పిండి వరకెళ్ళి అక్కడినుంచి రైల్లో లాహోర్ వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. బస్ ఎక్కించడానికి జమీల్ వచ్చాడు.

అతన్నుంచి వీడ్కోలు తీసుకునే ముందు “వూరెళ్ళాక మీ నాన్నతో, తాతతో ఏమైనా చెప్పమంటావా? నువ్వెప్పుడొస్తావని అడిగితే ఏం చెప్పను?” అని అడిగాడు షరీఫ్.

“ఇలా హిందూస్తాన్ వెళ్ళడానికి మార్గం సుగమమౌతుందని మొదట్లో మనకు తెలియదు కదా బాబాయ్. తెలిసుంటే అనీస్‌ని వదిలేసి మరో అమ్మాయిని నిఖా చేసుకునేవాడ్ని కాదు. నాకు మన వూరికొచ్చి అమ్మానాన్నల్ని, తాతయ్యను చూడాలని ఉన్నా అనీస్‌కి నా మొహం చూపించలేను. ఎందుకు తొందరపడ్డారని అడిగితే నా దగ్గర సమాధానం లేదుగా బాబాయ్. అంతా జరిగిపోయాక ఇప్పుడు ఎవ్వరేం చేయగలరు? ఎప్పుడొస్తానో చెప్పలేను. అసలు వస్తానో రానో కూడా చెప్పలేను” అన్నాడు జమీల్.

“నువ్వలా అన్నావని తెలిస్తే మీ అమ్మానాన్నల్తో పాటు ముసలితనంలో ఉన్న మీ తాత బాధపడరా? ఆలోచించు.”

“సరే బాబాయ్.. వాళ్ళ తృప్తికోసం ఎప్పటికైనా సరే వస్తానన్నానని చెప్పండి. చాలు” అన్నాడు.

బస్ కదుల్తున్నప్పుడు తనని ఐదేళ్ళకు పైగా ఆదరించిన అందమైన స్కర్దూని వదిలి వెళ్తున్నందుకు షరీఫ్ కళ్ళలో నీళ్ళూరాయి.

***

లాహోర్… పాకిస్తాన్‌లో కరాచి తర్వాత అధిక జనాభా గల కాస్మోపాలిటన్ నగరం.

రైల్వే స్టేషన్ నుంచి బైటికొచ్చిన షరీఫ్‌కి గుంపులు గుంపులుగా ఉన్న మనుషులు, విశాలమైన రోడ్లు, హడావిడిగా తిరుగుతున్న స్కూటర్లు, ఆటోరిక్షాలు, కార్లు, బస్సులు, టాంగాలు.. చూడగానే కళ్ళు తిరిగాయి. జమీల్ తనకు స్కర్దూ మొత్తం తిప్పి చూపించినపుడు ‘అబ్బో ఎంత పెద్ద పట్టణమో’ అనుకున్నాడు. ఇప్పుడు లాహోర్‌ని చూస్తుంటే దీనిముందు స్కర్దూ ఏనుగు ముందు చీమలా అన్పించింది.

“ఎక్కడికెళ్ళాలి?” అంటూ ఆటోరిక్షా వాళ్ళు, టాంగావాలాలు చుట్టుముట్టారు. ఎక్కడికెళ్ళాలో అతనికే తెలియదు. మొదట ఉండటానికి గది వెతుక్కోవాలి. తర్వాత ఎక్కడైనా పని దొరుకుతుందేమో చూసుకోవాలి. చౌకలో గదులు అద్దెకు దొరకాలంటే ఎక్కడ వెతుక్కోవాలో, ఎంత దూరం వెళ్ళాలో తెలియక రోడ్డు పక్కన బిత్తర చూపుల్తో నిలబడి ఉన్న షరీఫ్ దగ్గరకు ఓ టాంగా అతను వచ్చి “నా గుర్రబ్బండి ఎక్కండి జనాబ్. మీరు వెళ్ళాల్సిన చోటికి చిటికెలో చేరుస్తాను” అన్నాడు.

షరీఫ్ అతని వైపు పరిశీలనగా చూశాడు. మనిషి సన్నగా కట్టెలా ఉన్నాడు. నడుం దగ్గర వొంగిపోయి.. తెల్లగా పండిపోయిన జుట్టులో చాలా భాగం వూడిపోయి.. దవడలు పీక్కుపోయి.. వారం రోజులుగా పస్తులున్నవాడికి మల్లే బలహీనంగా ఉన్నాడు. వయసు అరవై దాటి ఉంటుందనుకున్నాడు.

అతనికి సమాధానమివ్వకుండా మౌనంగా ఉండిపోయాడు. అతనికి జమీల్ చెప్పిన హెచ్చరిక గుర్తొచ్చింది. “బాబాయ్.. లాహోర్ చాలా పెద్ద షెహర్. మోసం చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎవర్నీ నమ్మొద్దు” అన్నాడు.

ఈ జట్కా అతన్ని చూస్తే పచ్చి మోసగాడిలా అన్పించాడు.

“అరగంట నుంచి చూస్తున్నా జనాబ్. ట్రంకు పెట్టెని మోస్కుంటూ ఇక్కడే నిలబడి ఉన్నారు. సిటీ బస్ ఎక్కాలనుకుంటున్నారా? బస్ స్టాప్ ఇక్కడ కాదు” అన్నాడు టాంగావాలా.

దానికి సమాధానం రాకపోవడంతో “పోనీ ఎక్కడికెళ్ళాలో చెప్పండి. మీరు నా గుర్రబ్బండి ఎక్కకున్నా పర్వాలేదు. ఎలా వెళ్ళాలో చెప్తాను” అన్నాడతను.

అతని గుర్రబ్బండి ఎక్కకుండా అతన్నుంచి సమాచారం సేకరించడం వల్ల నష్టమేమీ ఉండదనుకుని “నాకీ వూరు కొత్త. బతుకుతెరువు వెతుక్కుంటూ వచ్చాను. నాకు చౌకలో యిల్లు దొరికే ఇలాకాలు ఈ వూళ్ళో ఏమేమున్నాయో, అక్కడికెళ్ళాలంటే ఏ బస్సులెక్కాలో చెప్పు నీకు పుణ్యముంటుంది” అన్నాడు షరీఫ్.

“మిమ్మల్ని చూసినపుడే అనుకున్నాను జనాబ్ ఈ వూరికి కొత్తని. నేనూ పాతికేళ్ళ క్రితం మీలానే పొట్ట చేతపట్టుకుని ఈ వూరికి వచ్చినవాడ్నే. అదుగో అక్కడ నిలబెట్టి ఉందే జట్కాబండి.. దాన్ని నడుపుతూ నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ఆ గుర్రం ఎంత బలహీనంగా ఉందో చూశారా? నన్నూ నా కుటుంబాన్ని ఇన్నేళ్ళూ పోషించింది అదే జనాబ్.. ఇప్పుడది నాలానే ముసలిదయిపోయింది. వేగంగా పరుగెత్తలేదనే సాకుతో నా టాంగా ఎక్కడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. మరి నేనెట్లా బతకాలి? నా గుర్రాన్ని ఎలా బతికించుకోవాలి? ముసలితనం వచ్చింది శరీరానికే కాని ఆకలికి కాదుగా జనాబ్.”

తనక్కావల్సిన సమాచారం ఇవ్వకుండా అతని గోడుని ఎందుకు వెళ్ళబోసుకుంటున్నాడో షరీఫ్‌కి అర్థం కాలేదు. ‘బస్‌లో వద్దు నా టాంగాలో వెళ్దాం’ అంటాడా? తనకు తెలియని ప్రదేశం కాబట్టి ఎక్కడెక్కడో తిప్పి ఎక్కువ డబ్బులు గుంజాలనుకుంటున్నాడా..’ లాంటి అనుమానాలు షరీఫ్‌లో..

“ఎవరూ ఎక్కకపోతే నీకెలా గడుస్తోంది? గుర్రానికి తిండెలా పెడ్తున్నావు?” అని అడిగాడు.

“స్కూలు పిల్లల్ని నా టాంగాలో స్కూల్‌కి తీసుకెళ్ళి, స్కూల్ వదిలాక మళ్ళా యిళ్ళ దగ్గర దింపుతాను జనాబ్. అప్పుడప్పుడూ మీలాంటివాళ్ళు దయతోనో జాలితోనో నా టాంగా ఎక్కుతుంటారు. వేన్నీళ్ళకు చన్నీళ్ళలా.. ఏదో అలా జరిగిపోతోంది.”

“నేను టాంగా ఎక్కను. బస్ ‍లోనే వెళ్తాను.”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here