రెండు ఆకాశాల మధ్య-44

0
7

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]“మ[/dropcap]రి సంబంధాలేమైనా చూస్తున్నారా?”

“చుట్టుపక్కల హిందూస్తాన్‍లో ఉన్న గ్రామాల్లోనే వెతకాలనుకుంటున్నాం. నీకు తెలిసిన సంబంధాలేమైనా ఉంటే చెప్పు” అన్నాడు కుర్షీద్.

“పెళ్ళికాని అమ్మాయిలే కావాల్నా లేక అమ్మాయికి రెండో పెళ్ళయినా పర్వాలేదా?” తన మనసులో మాటని బైటపెట్టేముందు అతని ఉద్దేశమేమిటో తెల్సుకోవడం మంచిదని అడిగాడు.

“పెళ్ళికాని అమ్మాయే కావాలని మాకేమీ లేదు. మా అబ్బాయిక్కూడా ఇదేమీ మొదటి పెళ్ళి కాదు కదా. భర్త చనిపోయిన బేవా అయినా పర్వాలేదు. భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్న అమ్మాయైనా పర్వాలేదు. ఎటొచ్చీ పిల్లలుండకూడదు. వయసు ఇరవై రెండుకి మించి ఉండకూడదు” అన్నాడు కుర్షీద్.

“నీకూ నీ కొడుక్కి అభ్యంతరం లేకపోతే మా మనవడి భార్య అనీస్ నిచ్చి నిఖా చేయడానికి నేను తయారుగా ఉన్నాను.”

కుర్షీద్ కొన్ని క్షణాలు ఆలోచించాక చెప్పాడు. “ఎవరూ? జమీల్ భార్య గురించేనా నువ్వు చెప్తున్నది?”

“ఔను. ఆ అమ్మాయి గురించే. నిఖా జరిగి కొన్ని నెలలు కూడా కాకముందే జమీల్ స్కర్దూలో చిక్కుబడిపోయాడు. ఇక్కడికి వస్తాడన్న ఆశ లేదు” జమీల్ స్కర్దూలోనే మరో పిల్లను నిఖా చేసుకున్నాడన్న విషయం మాత్రం బైట పెట్టకూడదనుకున్నాడు.

“ఏమో.. ఒక వేళ వస్తేనో?”

“సమీప భవిష్యత్తులో అలా జరిగే అవకాశం కన్పించడం లేదు.”

“మరో ఏడాది రెండేళ్ళలో రాకపోవచ్చు. పదేళ్ళ తర్వాత వస్తేనో.. హమ్‌రాజ్ సినిమాలో రాజ్ కుమార్‌లా వచ్చి నా భార్య నాక్కావాలి అంటేనో… జమీల్ ఏమీ తప్పిపోలేదుగా. ఎక్కడున్నాడో తెలుసు కాబట్టి అతనికి ఉత్తరం రాసి తలాక్‌నామా తెప్పించు. నా కొడుకు చేత కూడా అతని మొదటి భార్యకు తలాక్‌నామా పంపిస్తాను. ఏమంటావు?” అన్నాడు.

జావేద్‌కి అతను చెప్పేది సబబుగానే అన్పించింది. పెళ్ళయిన అమ్మాయికి భర్తనుంచి తలాక్ లభించకుండా పునర్వివాహం చేయకూడదు.

రాత్రి తన భార్యతో ఈ విషయం గురించి ప్రస్తావించాడు. “మన మనవడికి అనీస్ అంటే చాలా యిష్టమండీ. ఆమెకు తలాక్ ఇమ్మని అడిగితే ఎంత బాధపడతాడో ఆలోచించారా? వాడు ఎప్పటికైనా తిరిగొస్తాడన్న నమ్మకం నాకుందండి. అనీస్‌కి మరో పెళ్ళి చేసే ఆలోచనని మానుకొండి” అందామె.

“వాడక్కడ మరో అమ్మాయిని నిఖా చేసుకున్నాడని తెలిసే ఈ మాటంటున్నావా? అనీస్ దిగులు పడ్తుందని మనమీ విషయం ఆ అమ్మాయికి చెప్పకుండా దాచిన విషయం మర్చిపోయావా?”

“మర్చిపోలేదు. వాడు మగపిల్లాడు. తిరిగొచ్చాక ఇద్దరు భార్యలో కాపురం చేస్తాడు. మన ముసల్మానుల్లో మగవాళ్ళెవరైనా రెండో భార్య ఉందని మొదటి భార్యని వదులుకుంటారా చెప్పండి. అనీస్‌కి మరో పెళ్ళి చేస్తానంటే నేనొప్పుకోను.”

“నువ్వు చెప్పింది నిజమే. కానీ జమీల్ తిరిగొస్తాడన్న నమ్మకం నాకు లేదు.”

“నాకుంది.”

“రెండు దేశాల మధ్య రగులుతున్న విద్వేషాల గురించి తెలియకుండా మాట్లాడుతున్నావు. ఏమో.. భవిష్యత్తులో నువ్వు కోరుకుంటున్నట్టు జరిగే అవకాశం ఉందేమో. కానీ అప్పటికి అనీస్ ముసలిదైపోవడం ఖాయం. పచ్చగా కళకళలాడాల్సిన ఆ పిల్ల జీవితం అలా మోడువారిపోతుంటే చూస్తూ ఉండటం న్యాయమా చెప్పు.. అదే మన కూతురైతే దానికి మళ్ళీ పెళ్ళి చేయాలని, అది పిల్లా పాపల్తో సుఖంగా ఉండాలని కోరుకోవా?”

ఆమె కొంత సేపు ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది.

“పక్క వూళ్ళకెళ్ళిన కోడళ్ళు తిరిగిరారన్న నిర్ధారణకొచ్చిన వాళ్ళంతా తమ కొడుకులకు మారు మనువు చేయడానికి సన్నద్దమౌతుంటే మనమెందుకు అనీస్‌కి మరో పెళ్ళి చేయకూడదూ?” అన్నాడు జావేద్.

“మగపిల్లాడికి రెండో పెళ్ళి చేస్తే ఎవ్వరూ నోరెత్తరు. కానీ మనం మన మనవడికి అన్యాయం చేసి ఆ పిల్లకి మరో పెళ్ళి చేస్తే లోకులేమనుకుంటారు? మన బంధువులేమనుకుంటారు?”

“ఎవ్వరో ఏదో అనుకుంటారని అనీస్‌కి అన్యాయం చేస్తే అల్లా మెచ్చుతాడంటావా? ఆలోచించు” అన్నాడు జావేద్.

అతని భార్య మౌనంగా ఉండిపోయింది. ఆమె మౌనాన్ని అంగీకారంగా తీసుకుని, అనీస్‌కి ఎలా నచ్చచెప్పాలా అని ఆలోచించాడు. అనీస్‌ని ఒప్పించడమే చాలా కష్టమైన పని అని అతనికి తెలుసు. మగపిల్లలు మొదటి భార్యతో ఉన్న అనుబంధాన్ని త్వరగా తెంపుకుని రెండో భార్యతో కాపురం చేయగలరు. కానీ ఆడపిల్లలు అలా కాదు. అనుబంధాల్ని అంత సులభంగా మర్చిపోలేరు.

అతను అనీస్ దగ్గర ఆ ప్రస్తావన తెచ్చినపుడు వినకూడని విషయమేదో విన్నట్టు ఆ అమ్మాయి విచలితురాలైంది. “తోబా తోబా.. ఏం మాట్లాడుతున్నారు మీరు? తప్పు కదా. నా గురించి ఏమనుకుంటున్నారు? నా షొహర్ తిరిగొస్తాడు. అతని కోసం ఎన్ని సంవత్సరాలైనా ఎదురుచూస్తాను” అంది.

“వాడు తిరిగొస్తాడన్న ఆశ లేదమ్మా. ఇప్పటికి దాదాపు ఆరు సంవత్సరాలైంది. ఈ వూరినుంచి వెళ్ళిన వాళ్ళెవరైనా తిరిగొచ్చారా? లేదు కదా. వాడి కోసం ఎదురుచూడటంలోనే నీ బతుకంతా కరిగిపోద్ది. నువ్వింకా చిన్న పిల్లవి. నీ ముందు చాలా జీవితముంది. నా మాటిను. సలార్ మంచి కుర్రాడు. అతనూ నా మనవడిలాంటివాడే. పెళ్ళి చేసుకో, నీకు మంచి జరుగుతుంది” అన్నాడు జావేద్.

“మీరు చెప్పినట్టు ఒకవేళ నా భర్త తిరిగిరాకున్నా పర్లేదు. మీకూ నా అత్తామామలకు సేవలు చేసుకుంటూ నా జీవితాన్ని గడిపేస్తాను.”

“అనుభవ రాహిత్యంతో మాట్లాడుతున్నావు తల్లీ. మేమైనా నీ అత్తామామలైనా ఎంతకాలం ఉంటామని? మా తదనంతరం నువ్వెలా బతుకుతావు? అందుకే నీ బాగోగులు చూసుకునే ఓ తోడు అవసరం. మాకు సేవ చేయడం గురించే ఆలోచిస్తున్నావు కానీ నీకు వయసు పైబడ్డప్పుడు ఎవరు సేవలు చేస్తారు? అందుకే పిల్లలు అవసరం. పెద్దవాళ్ళుగా ఇవన్నీ ఆలోచించే నేనూ నా భార్యా ఈ నిర్ణయానికొచ్చాం” అన్నాడు జావేద్.

అనీస్ ఏడుస్తూ లోపలికెళ్ళిపోయింది.

“అమ్మాయికి నువ్వు నచ్చచెప్పు. వారం పది రోజుల్లోపల మన అంగీకారం తెలపకపోతే కుర్షీద్ వేరే సంబంధాల వైపు మొగ్గు చూపే ప్రమాదముంది” అన్నాడు తన భార్యతో.

భార్యాభర్తలిద్దరూ అవకాశం దొరికినపుడల్లా పెళ్ళి చేసుకోవాల్సిన ఆవశ్యకతను అనీస్‌కి అర్థమయ్యేలా చెప్పడంతో చివరికి రెండో పెళ్ళికి తన అంగీకారం తెల్పింది.

జమీల్‌కు ఉత్తరం రాసి జావేద్ తలాక్‌నామా తెప్పించాడు.

అనీస్, సలార్ నిఖా చాలా నిరాడంబరంగా జరిగింది.

***

ఉస్మాన్‌ఖాన్ యింట్లో అతని కొడుకూ కోడలు, మనవడూ, మనవడి భార్య, ఇద్దరు మునిమనవరాళ్ళతో పాటు దాదాపు నలభై ఐదేళ్ళ వయసున్న కూతురుంది. కొడుక్కి కుడిచేయి మోచేతికిందినుంచి లేదన్న విషయం షరీఫ్ మొదటి రోజే గమనించాడు. అతని పేరు ఖాలిద్. ప్రభుత్యోద్యోగి. వారం క్రితం వరకూ వాళ్ళకో డ్రైవర్ ఉండేవాడు. అతనే రోజు ఖాలిద్‌ని ఆఫీస్‌కి పిల్చుకెళ్ళి, తిరిగి యింటికి తెస్తుండేవాడు. కొడుక్కి ఫైసలాబాద్‌లో ఉద్యోగం దొరకడంతో అతను పని మానేసి సంసారాన్ని ఫైసలాబాద్‌కి మార్చేశాడు. అతని కొడుక్కి ఉద్యోగం దొరకడం వల్లనే తనకీ యింట్లో అతను వదిలేసి వెళ్ళిన ఉద్యోగం దొరికే అదృష్టం కలిగిందనుకున్నాడు. షరీఫ్.

ఉస్మాన్‌ఖాన్ కూతురు మదీహాకు మతి స్థిమితం లేదు. రోజూ ఉదయం, సాయంత్రం ఉస్మాన్‌ఖానే కూతుర్ని తెచ్చి తోటలో కూచోబెడ్తాడు. ఆమె చూపులో బెదురు.. పరిసరాల్ని భయంభయంగా చూస్తో ఉంటుంది. మొదట్లో షరీఫ్ కన్పించినా “దగ్గరకు రాకు. వెళ్ళిపో.. వెళ్ళిపో” అంటూ పెద్ద పెద్దగా అరిచేది.

ఉస్మాన్‌‌‌ఖాన్ లాంటి దయార్ద్రహృదయుడికి కుడిచేయి లేని కొడుకుని, మతిస్థిమితం లేని కూతుర్ని అల్లా ఎందుకు ప్రసాదించాడో అర్థం కాక షరీఫ్ బాధపడని రోజు లేదు.

ఖాలిద్‌ని రోజూ ఆఫీస్‌కి పిల్చుకెళ్ళి, తిరిగి తీసుకురావడం, ఆదివారాలు కుటుంబాన్ని షైర్‌కి తీసుకెళ్ళడం, సాయంత్రాలు పనిఉంటే బజార్‌కి తీసుకెళ్ళడం.. చాలా తక్కువ పనుంటోంది. ఉస్మాన్‌ఖాన్ కుటుంబం తన యెడల చూపిస్తున్న ఆదరాభిమానాలకు తను చేస్తున్న సేవ చాలా తక్కువనిపిస్తోంది.

కారూ డ్రైవరూ ఉన్నా మునిమనవరాళ్ళని స్కూల్‌కి టాంగాలో ఎందుకు పంపుతున్నారో అర్థం కాక ఓ రోజు ఉస్మాన్‌ఖాన్‌ని అదే విషయం అడగబోయి ఆగిపోయాడు. తనలా అడగంగానే “సరే రేపటి నుంచి నువ్వే స్కూల్లో పిల్లల్ని దింపొచ్చాక అబ్బాయిని ఆఫీస్‌కి పిల్చుకెళ్ళు” అని ఉస్మాన్‌ఖాన్ అంటే ఎలా? తన కెంతో మేలు చేసిన ఇస్మాయిల్ పొట్ట కొట్టినట్టవుతుంది కదా అని ఆలోచించాడు. అందుకే ఉస్మాన్‌‌ఖాన్‌ని అడక్కుండా ఓ రోజు ఇస్మాయిల్నే ఈ విషయం అడిగాడు.

ఇస్మాయిల్ చిన్నపిల్లాడిలా నవ్వుతూ చెప్పాడు. “హుజూర్ గారు కష్టపడి పైకొచ్చిన మనిషి. వారికి ఆదర్శాలెక్కువ. పిల్లల్ని చిన్నప్పటినుంచి కార్లలో తిప్పి విలాసవంతమైన జీవితానికి అలవాటు చేయకూడదని వారి అభిప్రాయం. పిల్లలకు బచ్‌పన్ నుంచే కష్టసుఖాలు తెలిసేలా పెంచాలంటారు” అని చెప్పాడు.

వాళ్ళ యింటిపనులన్నీ షరీఫ్ కల్పించుకుని మరీ చేస్తున్నాడు. పూల మొక్కలకు నీళ్ళు పట్టడం, బజారుకెళ్ళి ఏమైనా సరుకులు తీసుకురావాలంటే తనే వెళ్ళి తీసుకురావడం, కూరగాయలు కొనడం.. వీటితోపాటు ఉస్మాన్‌ఖాన్ గారికి సపర్యలు చేయడానికి ఎప్పుడూ తయారుగా ఉంంటున్నాడు. ఉస్మాన్‌ఖాన్ ఆరోగ్యం గురించి, వారి సౌకర్యం గురించి జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రతిసారీ “మీ భార్యా పిల్లలు చాలా అదృష్టవంతులు షరీఫ్.. మీలా శ్రద్ధ తీసుకునే వ్యక్తి లక్షల్లో ఒకరుంటారు” అంటుంటాడు ఉస్మాన్‌ఖాన్.

అతనలా అన్నప్పుడల్లా “వాళ్ళకు నేనూ నాకు వాళ్ళు దూరం కావడం కన్నా దురదృష్టం ఏముంటుంది జనాబ్” అంటాడు షరీఫ్.

“మీలాంటి మంచివాళ్ళకు తప్పకుండా మంచిరోజులొస్తాయి. అల్లా కే ఘర్ మే దేర్ హై లేకిన్ అంధేర్ నహీ” అంటాడు.

“నన్ను మీరు నువ్వనే పిలవండి జనాబ్. మీరు అని గౌరవించక్కర లేదు. మీరు నా యజమాని” అని ఎన్నిసార్లన్నాడో… ఉస్మాన్‌ఖాన్ వేదాంతిలా నవ్వుతూ “మీరు నాకంటే చిన్నవాళ్ళే. నేను మీ యజమానినే. ఐనప్పటికీ నేను మీ మంచితనానికి, సహృదయతకు, సచ్చీలతకు గౌరవం ఇస్తాను. బదనసీబ్ వల్ల మీరు మా దగ్గర పని చేయాల్సి వచ్చింది కానీ లేకపోతే మీ వూళ్లో మీ కింద ఎంతమంది పనిచేస్తూ ఉండేవాళ్ళో!” అంటాడు.

ఉస్మాన్‌ఖాన్‌కి షరీఫ్ అంటే చాలా ఇష్టం ఏర్పడింది. అతను షరీఫ్‌ని తమ వద్ద పనిచేసే డ్రైవర్లా కాకుండా తన కుటుంబంలో ఓ సభ్యుడిలా చూడసాగాడు. కార్లో షికారుకి వెళ్ళినపుడల్లా లాహోర్ గురించిన విశేషాలు చెప్పేవాడు. దానివల్ల షరీఫ్‌కి లాహోర్ గురించి చాలా విషయాలు తెలిశాయి.

పాకిస్తాన్ లోని పంజాబ్ రాషానికి రాజధానియైన లాహోర్‌లో సంపన్న వర్గాలు ఎక్కువే. విద్యాలయాలకు, సాహిత్యానికి, సంగీతానికి, ఖవ్వాలీలకు ప్రసిద్ధిగాంచిన సాంస్కృతిక కేంద్రం లాహోర్. రావీ, వాఘా నదుల ఒడ్డునున్న ఈ నగరంలోని ప్రజలు ఎక్కవగా పంజాబీ ఉర్దూల సమ్మేళనమైన లాహోరీ పంజాబీ మాట్లాడతారు.

ఓ రోజు ఉస్మాన్‌ఖాన్‌ని కార్లో బాద్‌షాహీ మస్జిద్‌కి పిల్చుకెళ్తున్నప్పుడు “ఔరంగజేబ్ కట్టించిన బాద్‌షాహీ మస్జిద్ ఎంత పెద్దదో తెలుసా? ఒకేసారి లక్షమంది అందులో ప్రార్థనలు చేయవచ్చు” అన్నాడు.

లాహోర్ కోటకు పశ్చిమాన మూడు డోమ్‌లు, ఎనిమిది మినార్లు కలిగి పాలరాతితో, రెడ్ శాండ్ స్టోన్‌తో కట్టిన అద్భుతమైన బాద్‌షాహి మస్జిద్‌ని కళ్ళు విప్పార్చి చూశాడు షరీఫ్.

తిరుగు ప్రయాణంలో “అసలీ నగరానికి లాహోర్ అని పేరెలా వచ్చిందో తెలుసా? దాని వెనుక ఓ కథుంది. లాహోర్‌ని పూర్వం లవపురి అని పిల్చేవారు. సీతారాముల కొడుకైన లవుడు ఈ నగరాన్ని స్థాపించాడట. అందుకే ఈ నగరం లవపురి పేరుతో ప్రసిద్ది చెందింది. కాలక్రమంలో అదే లాహోర్‌గా మారింది. మనకు దక్షిణాన కసూర్ అనే నగరం ఉంది. దాన్ని సీతారాముల మరో కొడుకైన కుశుడు స్థాపించడని చెప్పుకుంటారు” అన్నాడు ఉస్మాన్‌ఖాన్.

మరోసారి తన మునిమనవరాళ్ళని తీసుకుని షాలిమార్ బాగ్ చూడటానికి ఉస్మాన్‌ఖాన్ బయల్దేరాడు. పదహారు హెక్టార్ల విస్తీర్ణంలో భూలోక స్వర్గంలా భాసిల్లుతున్న షాలిమార్ బాగ్ చూస్తున్నప్పుడు “దీన్ని కట్టించింది ఎవరో తెలుసా? మొగల్ చక్రవర్తి షాజహాన్” అని తన మునిమనవరాళ్ళతో చెప్తుంటే షరీఫ్ కూడా విన్నాడు.

“లాహోర్‌ని వాల్డ్ సిటీ అని ఎందుకంటారు తెలుసా?” తోటంతా తిరిగి అలసిపోయి, ఓ చోట కూచుని విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఉస్మాన్‌ఖాన్ తన మునిమనవరాళ్ళని అడిగాడు. వాళ్ళ జవాబు కోసం ఎదురుచూడకుండానే “ఒకప్పుడు లాహోర్ చుట్టూతా పదమూడు గేట్లుండేవి. నగరంలోకి ప్రవేశించాలంటే ఆ గేట్ల ద్వారానే రావాలి. ఆంగ్లేయుల పాలన సమయంలో పది గేట్లని వాళ్ళే ధ్వంసం చేశారు.”

“ఎందుకు చేశారు?” అని అడిగిందో పిల్ల.

“చుట్టూ గోడల్తో, పదమూడు గేట్లతో కంచుకోటలా ఉన్నా లాహోర్‌ని బలహీనపర్చడమే వాళ్ళ ఉద్దేశం. వాటిలో ఢిల్లీ గేట్, షా ఆలమీ గేట్, లొహారీ గేట్‌తో పాటు మరో మూడు గేట్లని తర్వాత కాలంలో పునరుద్ధరించారు. దేశ విభజన సమయంలో షా ఆలమీ గేట్ మరోసారి విధ్వంసానికి గురయింది” అన్నాడు ఉస్మాన్‌ఖాన్.

షరీఫ్‌కి ఉస్మాన్‌ఖాన్ ఓ విజ్ఞానఖనిలానే కాకుండా గొప్ప తత్వవేత్తలా కన్పించేవాడు. ఎటొచ్చీ అతని మాటల్లో ఎక్కువగా వైరాగ్యమే కన్పించేది. జీవితం మీద అనాసక్తి.. నిస్పృహ.. నైరాశ్యం…

ఓ రోజు సాయంత్రం మదీహాని తోటలో కొద్దిసేపు తిప్పాక యింట్లోకి పిల్చుకెళ్ళి, తన కోడలికి అప్పగించి, తిరిగొచ్చి వసారాలో పడక్కుర్చీలో కూచున్నాడు ఉస్మాన్‌ఖాన్. అతనో ఉప్పెనలా పొంగుతున్న విషాదాన్ని షరీఫ్ గమనించి “బాధపడకండి జనాబ్. అమ్మాయి ఎప్పటికైనా మామూలు మనిషవుతుంది” అ న్నాడు.

“దానికంత అదృష్టం లేదు షరీఫ్. ఎంతమంది డాక్టర్లకు చూపించామో.. ఎన్ని మందులు వాడామో.. ఎన్ని ఆస్పత్రులు తిరిగామో.. లాభం లేదు. ఇక జీవితాంతం నా కూతురు ఇంకొకరిమీద ఆధారపడి బతకాల్సిందే” కనుకొలకుల్లో వూరిన చెమ్మని తుడుచుకుంటూ అన్నాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here