రెండు ఆకాశాల మధ్య-47

0
9

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]పం[/dropcap]దొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం.. నవంబర్ పన్నెండు..

ఆ రోజు దీపావళి. పాకిస్తాన్‌లో హిందువులు ఒకటిన్నర శాతానికి మించి ఉండరు. ఒక్క సింధ్ ప్రాంతంలోనే హిందువుల సంఖ్య ఎక్కువ. అక్కడ దాదాపు ఏడున్నర శాతం ప్రజలు హిందువులు. దీపావళి పండక్కి ఆ ప్రాంత ప్రజలకు శెలవిస్తారు. మిగతా పాకిస్తాన్ రాష్ట్రాల్లో కేవలం హిందువులకు మాత్రం శెలవు మంజూరు చేస్తారు.

ఉదయం తయారై ఆఫీస్‌కి వెళ్ళబోతున్న పెద్ద కొడుకు మజీద్ ఖాన్‌తో “సాయంత్రం తొందరగా వస్తావుగా” అంది గోరీబీ.

“ఏమ్మా.. ఏమైనా పనుందా?” అన్నాడతను.

“నువ్వొచ్చాక యిద్దరం కలిసి బజారుకెళ్తాం” అంది.

బైట ఏమైనా పనులుంటే పెద్ద కోడల్నో చిన్న కోడల్నో తోడు పిల్చుకెళ్ళే అమ్మ ఈ రోజు తనతో కలిసి వెళ్ళాలనుకుంటుందంటే ఏదో ప్రత్యేకమైన పనే ఉంటుందనుకున్నాడు.

మంచంలో పడుకుని ఉన్న అస్లంఖాన్ ఏదో అన్నాడు. అతనేమంటున్నాడో మజీద్ ఖాన్‌కి అర్థం కాలేదు. ఏడాది క్రితం అస్లంఖాన్‍కి పక్షవాతం సోకింది. కుడికాలు, కుడిచేయి పడిపోయాయి. నోరు కూడా వొంకరపోయింది. మాటలో స్పష్టత ఉండదు. ముద్దముద్దగా తెగిపడిన అక్షరాలు ఒకటీ అరా తప్ప అతని మాటలు యింట్లో ఎవ్వరికీ అర్థం కావు, ఒక్క గోరీబీకి తప్ప. అతను నోరు విప్పిన ప్రతిసారీ నోట్లోంచి చొంగ కారుతూ ఉంటుంది.

“ఏమంటున్నాడమ్మా నాన్న?” అని అడిగాడు మజీద్ ఖాన్.

“ఏం కొనాలనుకుంటున్నానో, ఎక్కడికెళ్ళాలనుకుంటున్నానో చెప్పి వెళ్ళాలట” అంది గోరీబీ.

“కాళ్ళూ చేతులు పడిపోయినా ముసలోడికి పొగరు తగ్గలేదు. డెబ్బయ్ ఎనిమిదేళ్ళు వచ్చాయి. యింకా ఈ యింట్లో తన అధికారం చెలాయించుకోవాలని చూస్తున్నాడు. కుదరదని చెప్పమ్మా. నేను పెద్ద కొడుకుని. ఈ యింట్లో ప్రతిదీ నా ఇష్ట ప్రకారమే జరుగుతుందని చెప్పు. నోరు మూసుకుని పడుంటేనే యింత ముద్ద పెడ్తామని చెప్పు” కోపంగా అన్నాడు మజీద్.

“తప్పు నాన్నా.. కన్న తండ్రిని అట్లా అనకూడదు.”

“కన్న తండ్రా? ఏనాడైనా తండ్రిలా బాధ్యతలు తీర్చుకున్నాడా అమ్మా? ఆ పాడు నోరేస్కుని అరవడం, తిట్టటం తప్ప మా చదువుల గురించి, మా అభివృద్ధి గురించి ఎప్పుడైనా పట్టించుకున్నాడా? నువ్వు లేకపోతే మేము కూడా ఈయనైనే బట్టలు కుట్టుకుంటూనో, మూటలు మోస్తూనే బతికాల్సి వచ్చేది. నీ వల్లనేగా అమ్మా మేం ముగ్గురం బాగా చదువుకున్నాం. నేను సెక్రటేరియెట్‌లో ఉన్నతమైన హోదాలో, తమ్ముడు బ్యాంక్‌లో ఆఫీసర్‌గా ఉన్నామంటే నీ చలవే కదమ్మా.”

“అవన్నీ ఇప్పుడెందుకులే నాన్నా.. ఎంత కాదనుకున్నా అతను నీ తండ్రి. వృద్ధాప్యంలో జబ్బుతో మంచంలో పడి ఉన్నతన్ని దయగా చూసుకోవడం మన ధర్మం.”

“ఈయన నిన్ను కానీ, పెద్దమ్మను కానీ దయగా చూసుకోలేదుగా అమ్మా. సైతాన్ లానే మిమ్మల్ని సతాయించాడుగా. నాకు పాతికేళ్ళ వయసప్పుడు కూడా నీ పైన చేయి చేసుకున్నాడుగా. ఆ రోజే ఆ చేతిని విరిచేద్దామనుకున్నా. నువ్వే అడ్డుపడ్డావు. పోన్లే. నేను చేయాలనుకున్న పని అల్లానే చేశాడుగా. ఆ చేత్తో పాటు కాలు కూడా పడిపోయిందిగా.”

“వద్దు బాబూ.. అలా మాట్లాడకూడదు. తప్పు.”

“యింకా చాలా అనాలని ఉందమ్మా. ఈయన్ని ఎన్ని తిట్టినా నా కసి తీరదమ్మా. నువ్వు మాకు నేర్పిన సంస్కారం అడ్డు పడ్తోందిగానీ, లేకపోతేనా..”

అతను ఆఫీస్‌కి చేరుకున్నా ఆవేశం మాత్రం తగ్గలేదు. అతనికి నాన్నంటే అసహ్యం.. చిన్నప్పటి నుంచీ పెంచుకున్న అసహ్యం.. తన చిన్నతనంలో అమ్మనూ, పెద్దమ్మనూ నాన్న కొట్టడం ఎన్నిసార్లు చూశాడో… ప్రతి చిన్న విషయానికీ తననూ తమ్ముడ్ని దండించేవాడు. తిట్లూ తన్నులు తింటూనే ఆ యింట్లో తనూ, తమ్ముడూ, చెల్లి పెద్దయిన విషయం తనెప్పటికీ విస్మరించలేడు. నాన్నంటే కోపం.. నాన్నంటే ఏహ్యభావం. అతను పెట్టే హింసను భరించలేకే పెద్దమ్మ ఏడేళ్ళ క్రితం చనిపోయింది. తన పాతికేళ్ళ వయసులో అమ్మ మీద చేయెత్తినపుడు తను ఎదురుతిరిగాడు. ‘అమ్మ జోలికొస్తే నువ్వు నాన్నవని కూడా చూడను. ఖబర్దార్’ అంటూ హూంకరించాడు. అప్పటినుంచే అమ్మను హింస పెట్టడం తగ్గించాడు.

గోరీబీ తలారా స్నానం చేసింది. ఆమెకు చాలా ఉద్వేగంగా ఉంది. ఎన్నాళ్ళనుంచో గుండెల్లో దాచుకున్న కోరికని ఈ రోజు ఎలాగయినా తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఇన్నాళ్ళూ తన కాళ్ళకు ఎన్ని సంకెళ్ళో.. తను బైటికి ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు. బజారుకెళ్ళి ఏం కొనాలన్నా అస్లంఖాన్ తన మొదటి భార్యని తోడిచ్చి పంపేవాడు. లేదా తనే తోడొచ్చేవాడు. అతను పక్షవాతంతో మంచంలో పడే వరకు తనకలాంటి ఆంక్షలు తప్పలేదు.

ఆమె ఎప్పుడూ అతన్ని భర్తగా గౌరవించలేదు. పదమూడేళ్ళ వయసులో అతను చేసిన మానసిక, శారీరక గాయాలు ఇప్పటికీ మానలేదు. ఎప్పటికీ మానవని కూడా ఆమెకు తెలుసు. ఆమెకు తన పెద్ద కొడుకంటే చాలా ఇష్టం. వాడ్ని చూస్తుంటే దేశవిభజనకు ముందే తనకు దూరమైన నాన్నని చూస్తున్నట్టే ఉంటుంది. వాడి నవ్వు అచ్చం నాన్న నవ్వులానే అమాయకంగా, పసిపిల్లాడి నవ్వులా ఉంటుంది. వాడు నవ్వినపుడు బుగ్గల్లో సొట్టలు పడ్డాయి.. ఆ విషయంలో మాత్రం తన పోలికే వచ్చింది.

వాడు నాన్నలా కన్పించడమే కాదు, నాన్నలా ఆదుకుంటాడు కూడా. అందుకే వాడ్ని బాబూ అని పిలవడం కన్నా నాన్నా అని పిలవడమే తనకిష్టం. వాడి చిన్నప్పుడు కూడా అస్లంఖాన్ తనని కొడ్తుంటే ఎన్ని సార్లు అడ్డుపడి వాడు కూడా తన్నులు తిన్నాడో.. వాడికి తనంటే ప్రాణం. అల్లా తర్వాత తను ఆరాధించేది అమ్మనే అని ఎంతమందితో అన్నాడో.. వాడి భార్యకు కూడా చెప్పాడు. అమ్మ తర్వాతే ఎవరైనా అని. మొదట అమ్మ అవసరాలేమిటో కనుక్కున్నాకే మిగతా పనులు చేసుకోమని..

ఈ రోజు తను చేయబోయే పనికి వాడు అడ్డుచెప్పడనే అనుకుంటోంది. ఆమెకు పిల్లలు పెద్దయినప్పటినుంచి జీవితం ఓ గాడిలో పడినట్టనిపిస్తోంది. అస్లంఖాన్ తనని ఎత్తుకొచ్చిన కొత్తలో చచ్చిపోతే బావుండని ఎన్నిసార్లనుకుందో.. పిల్లలు పుట్టాక యికనుంచి వాళ్ళ కోసమే బతకాలనుకుంది. పిల్లల కోసమని అస్లంఖాన్ పెట్టే ఎన్ని హింసల్ని సహించిందో.. ఎన్ని అఘాయిత్యాల్ని భరించిందో..

తను జోరాఫాంలో ఉండి ఉంటే తప్పకుండా చదువుని కొనసాగించేది. తనకు చదువంటే అంతిష్టం. అందుకే పిల్లల్ని బాగా చదివించింది. దాని కోసం అస్లంఖాన్‌తో యుద్ధమే చేయాల్సి వచ్చింది. అతని మొదటి భార్య పిల్లలకైతే అస్సలు చదువులేదు. తన పిల్లల్ని కూడా చదివించకుండా పెద్దోడికి టైలరింగ్ నేర్పించి, రెండో వాడ్ని మెకానిక్ షెడ్డులో పనికి కుదిరిస్తానన్నాడు. తను ఎదురుతిరిగింది.

పిల్లల కోసం ఎన్ని పోరాటాలు చేసిందో… ఎన్ని దెబ్బలు తిందో..

ఇప్పుడు మగపిల్లలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగాల్లో పెద్ద హోదాల్లో ఉన్నారు. కూతుర్ని కూడా చదివించింది. అల్లుడు కూడా ప్రభుత్యోద్యోగే. ముగ్గురికీ పిల్లలున్నారు. కొడుకులూ కోడళ్ళు, కూతురూ అల్లుడు, మనవళ్ళూ మనవరాళ్ళు.. ఇదే తన ప్రపంచం.. దీన్లో అస్లంఖాన్‌కు చోటు లేదు. మజీద్‌కి కోపం వచ్చినపుడల్లా అతన్ని యింట్లోంచి గెంటేద్దామని ఎన్ని సార్లుంటాడో. తనే వాడికి నచ్చచెప్తూ ఉంటుంది. “నిన్నెంతో కష్టపెట్టిన ఇతని మీద ఎందుకమ్మా నీకింత ప్రేమ?” అంటాడు. ప్రేమ కాదు.. జాలి. అందరూ వదిలేస్తే ఈ వయసులో ఏమైపోతాడో అన్న జాలి. కేవలం మానవత్వంతో అతనికి సేవలు చేస్తోంది. అంతే.. నాన్న నుంచి అలవడిన మంచితనం.. ఎలా పోతుంది? అసహాయ స్థితిలో ఉన్న శత్రువునైనా క్షమించి ఆదరించే మంచితనం..

ఆమెకు నాన్నా అమ్మా గుర్తుకు రాగానే ఏడుపొచ్చింది. తను అస్లంఖాన్‌ని క్షమించిందా? లేదు. ఎప్పటికీ క్షమించదు. తన అందమైన బాల్యాన్ని హరించిన రాక్షసుడు.. తనని తన అమ్మానాన్నలనుంచి విడదీసిన దుర్మార్గుడు.. తనను తన మతం నుంచి, తన దేవుళ్ళనుంచి వేరు చేసిన పాపిష్టివాడు.. చివరికి తనకెంతో యిష్టమైన తన పేరుని కూడా తననుంచి లాగేసుకున్న దుష్టుడు.. అతన్ని తను క్షమించే ప్రశ్నే లేదు. అతను తన శత్రువు. కానీ ఇప్పుడు మంచంలో పడి దీనస్థితిలో ఉన్నాడు. అందుకే సాటి మనిషిగా అతన్ని ఆదుకుంటోంది. అంతే..

ఎప్పటికైనా అమ్మా నాన్నల్ని చూడాలని ఎన్నిసార్లు కలలు కందో.. అది జరిగే పని కాదని అర్థమై, తనకంత అదృష్టం లేదని మిన్నకుండిపోయింది. ఇపుడా కోరిక కూడా లేదు. ఎప్పుడో దాని గొంతు నులిమేసింది. అస్లంఖాన్ మొదటి భార్య జహరా చనిపోయినపుడు తను చాలాసేపు ఏడ్చింది. తనకు ఏడుపొచ్చింది జహరా చచ్చిపోయినందుకు కాదు. తన అమ్మానాన్నా కూడా చనిపోయి ఉంటారేమో అన్న ఆలోచన రావడంతో బాధేసి ఏడ్చింది. ఇప్పటికీ ఒకవేళ అమ్మానాన్న బతికుంటే నాన్నకు డెబ్బయ్ రెండేళ్ళుంటాయి. అమ్మకు అరవై యేడో అరవై ఎనిమిదో ఉండొచ్చు. అసలిప్పటివరకూ బతికుంటారా? ఎందుకు బతికుండకూడదు? అస్లంఖాన్‌కి డెబ్బయ్ ఎనిమిదేళ్ళు.. బతికే ఉన్నాడుగా…

ఆమెకు మరో ఆలోచన కూడా వచ్చింది. బతికున్నా తిరగలిగే స్థితిలో ఉన్నారో లేరో? అస్లంఖాన్‍లా అనారోగ్యాలతో మంచాన పడిఉంటే.. ఆ ఆలోచనకే భయమేసింది. తన అన్న, తమ్ముడు, వాళ్ళ భార్యలు అమ్మానాన్నల్ని ఎలా చూసుకుంటున్నారో…

సాయంత్రం మజీద్ ఆఫీస్ నుంచి తిరిగొచ్చేవరకు ఇలాంటి ఆలోచనలోనే అస్థిమితంగా గడిపింది. కొడుకొచ్చాక, అతన్తో కలిసి బైటికెళ్ళడానికి చాలా శ్రద్ధగా తయారైంది. ఇస్త్రీ చేసిన చిలకాకుపచ్చ సిల్క్ చీరని కట్టుకుంది. ఎప్పుడో రెండో కొడుకు పెళ్ళి సమయంలో కొన్న చీర.. చాలా ముచ్చటపడి కొనుక్కుంది. ఆమెకు సల్వార్ కమీజ్‌లు తొడిగీ తొడిగీ విసుగొచ్చింది. ఎప్పట్నుంచో చీరకట్టుకోవాలని కోరిక.. అదీ షిఫాన్ లేదా సిల్క్ చీర కట్టుకోవాలని కోరిక. తండ్రి అనుమతి లేకుండా కొడుకులిద్దరూ కలిసి కొన్న సిల్క్ చీర కట్టుకునే అదృష్టమే కలగలేదు. చీర కట్టుకోడానికి వీల్లేదని అస్లంఖాన్ చాలా గొడవ పెట్టాడు. అందుకే దాన్ని పెట్టె అడుగున దాచి పెట్టేసింది. ఇన్నేళ్ళ తర్వాత మడతలు విప్పి కట్టుకుంటుంటే తన చిన్నప్పుడు ఆప్యాయంగా చుట్టుకున్న అమ్మ చేతుల్లా అన్పించాయి.

అమ్మ చీర కట్టుడులోనే ఓ అందం ఉండేది. ఎంత పాత చీర కట్టుకున్నా, ఆ కట్టుడు వల్ల చీరకే అందం వచ్చేది. చీర కుచ్చెళ్ళని తను సరిచేస్తూ “అమ్మా.. ఈ చీరలో ఎంత బావున్నావో” అంటే అమ్మ సిగ్గుపడిపోతూ “చీరని చుట్టుకోవడం కాదే, కట్టుకోవడం తెలియాలి” అనేది. “నాక్కూడా నేర్పమ్మా” అని తను ఎంత మారాం చేసేదో.. “నువ్వింకా చిన్నపిల్లవేనే.. చీరలు కట్టే వయసు రానీ.. నేర్పుతాను” అనేది అమ్మ. ఆ వయసు రాకముందే తను పరాయి దేశంలో కట్టుబానిసలా బందీ అయిపోయింది. యిప్పుడు అమ్మ ఎదురుగా ఉంటే తను తప్పకుండా అడిగేది “అమ్మా.. నువ్వు కట్టుకున్నట్టే చీరని అందంగా కట్టుకున్నానా?” అని.

ఆమె గదిలోంచి బైటికి రావడంతోనే మజీద్ ఖాన్ కళ్ళు విప్పార్చి ఆమె వైపు చూస్తూ “అమ్మీ.. ఈ చీరలో నువ్వెంతందంగా ఉన్నావో తెలుసా?” అన్నాడు.

గోరీబీకి తన కొడుకు స్థానంలో తనున్నట్టు, తన స్థానంలో తన అమ్మ ఉన్నట్టు అన్పించింది. తను తన అమ్మతో అన్న మాటలే ఇప్పుడు తన కొడుకు తనతో అంటున్నాడు.

“అమ్మీ.. రోజూ నువ్వు చీరలే కట్టుకోవచ్చుగా.. ఇప్పుడు బజార్‌ కెళ్తున్నాంగా. నీకు రెండు చీరలు కొంటాను” అన్నాడు మజీద్.

ఆమె మురిసిపోతూ తన కొడుకు వైపు చూసింది. అదే క్షణంలో అస్లంఖాన్ గొంతులోంచి కోపంతో కూడిన అస్పష్టమైన మాటలేవో వెలువడ్డాయి.

మజీద్ అతని వైపు విసుగ్గా చూసి, అమ్మ వైపు తిరిగి “ఏమంటున్నాడమ్మా?” అని అడిగాడు.

“చీరెందుకు కట్టుకున్నావని కోప్పడుతున్నాడు.. సల్వార్ కమీజే వేసుకుని బైటికెళ్ళాలట.”

మజీద్ అతని వైపు కోపంగా చూస్తూ అన్నాడు. “ఇకనుంచి అమ్మ చీరలే కట్టుకుంటుంది. అర్థమైందా?” అన్నాడు.

అస్లంఖాన్ పెద్ద పెద్దగా అర్థంకాని భాషలో అరిచాడు.

“యిలా అరిచావనుకో.. నోరు మూసుకుని పడుండు అనాల్సొస్తుంది. అమ్మకిష్టం ఉండదని అనడం లేదు. అలా అన్పించుకునే పరిస్థితి తెచ్చుకోకు” కోపంగా అన్నాడు మజీద్.

అస్లంఖాన్ నోరు మూతపడింది.

గోరీబీ స్కూటర్ వెనుక కూచున్నాక “అమ్మీ.. ఎక్కడికెళ్తాం” అని అడిగాడు.

“మాల్ రోడ్, అనార్కలీ బజార్” అంది గోరీబీ.

రెండొందలేళ్ళ చరిత్ర కలిగిన అనార్కలీ బజార్ ఇప్పుడు రెండుగా విభజించబడింది. పాత అనార్కలీ బజార్.. కొత్త అనార్కలీ బజార్. అమ్మనడిగి స్కూటర్ని కొత్త అనార్కలీ బజార్ వైపుకు తిప్పాడు మజీద్. తనెప్పుడూ చూడని ఇరుకైన భీంగల్లీ లోకి వెళ్తూ “అమ్మా.. ఇక్కడేం దొరుకుతాయి? మనం ఎక్కడికెళ్తున్నాం? నీకేం కావాలో చెప్పు” అని అడిగాడు. ఆమె నిశ్శబ్దంగా కూచుంది.

వాల్మీకి మందిరం దగ్గరకు రాగానే “ఇక్కడాపు” అంది. మజీద్ ఆశ్చర్యపోతూ స్కూటర్ని ఆపి, అమ్మ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు.

పన్నెండు వందల సంవత్సరాల పురాతనమైన ఆ మందిరమంతా రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించబడి ఉంది. కాషాయ రంగు జెండాలు గాలికి రెపరెపలాడూ లోపలికి రమ్మంటూ పిలుస్తున్నాయి. గోడలమీద వరసగా పేర్చిన మట్టి దివ్వెలు.. ప్రాంగణంలో కూడా బారులు తీరిన ప్రమిదలు.. లోపల భక్తులు పాడుతున్న భజన మైకులో విన్పిస్తోంది. బాగా అలంకరించుకున్న ఆడవాళ్ళతో, కొత్త బట్టలు తొడుక్కుని మురిసిపోతున్న పిల్లలో, మగవాళ్ళతో మందిరమంతా కోలాహలంగా ఉంది.

వాల్మీకి బస్తీలోని పిల్లలు పెద్దల చేతుల్లో కాకరపువ్వొత్తులు వెలుగు రవ్వలు విరజిమ్ముతున్నాయి. విష్ణుచక్రాలు తిరుగుతున్నాయి. వెన్నముద్దలు వెల్తురు ముద్దలుగా జారిపడున్నాయి. నేలమీద పెట్టిన చిచ్చు బుడ్లు మిణుగురు పురుగులు పూసిన చెట్లలా కాంతిని వెదజల్లుతున్నాయి. ఎటుచూసినా పండుగ వాతావరణం వెల్లివిరిసి కన్నుల పండుగలా కన్పిస్తోంది.

“అమ్మీ.. ఇక్కడికెందుకొచ్చాం? ఇది హిందువుల మందిరం. ఇక్కడ మనకేం పని?” అమ్మ ఆంతర్యం అర్థం కాక సతమతమౌతూ మజీద్ అడిగాడు.

“ఈ రోజు నేనేం చేసినా అడ్డు చెప్పకు నాన్నా. ఈ మందిరంలోకి వెళ్ళాలనేది నేను నలభై యేళ్ళుగా కంటున్న కల.. ఇది ఎన్నేళ్ళుగానో నాలో దాచుకున్న కోరిక బాబూ. నన్ను వెళ్ళనీ” అంది.

“అమ్మా.. నువ్వు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? ఇది కాఫిర్లు చేసే పనమ్మా. మనం ముసల్మానులం” చిరుకోపంతో అన్నాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here