రెండు ఆకాశాల మధ్య-50

0
6

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]మ[/dropcap]ళ్ళా ఎప్పుడు తన వాళ్ళను చూసుకునే అవకాశం దొరుకుతుందో.. అసలు దొరకుతుందో లేదో.. అప్పటివరకు నాన్న బతికుంటాడో లేదో.. నాన్నను మరోసారి చూసుకునే అదృష్టం తనకుందో లేదో..

షామ్లీ మనసులో సుళ్ళు తిరుగుతూ ఇవే ఆలోచనలు..

దూరమౌతున్న షామ్లీని చూస్తూ శంకర్‌లాల్ మెల్లగా తనలో తను గొణుక్కుంటున్నట్టు “తన పేరు గోరీబీ అయితేనేం… అది నా కూతురు” అనుకున్నాడు.

***

పందొమ్మిది వందల తొంభై.. మార్చి నెల..

తన వూరికెళ్ళడానికి షరీఫ్ అన్ని సన్నాహాలు చేసుకుంటున్నాడు. అటారీ స్టేషన్ వరకు స్లీపర్ క్లాస్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్‌లో కొనిచ్చాడు ఖాలిద్. ప్రయాణానికి మరో పది రోజుల సమయం ఉంది. టికెట్ చేతికొచ్చిన క్షణం నుంచి షరీఫ్ సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఎన్నేళ్ళ కలో.. యింకో పది రోజుల్లో నిజం కాబోతోంది.

అతని మనసంతా ఖాలిద్ మీద కృతజ్ఞతతో నిండిపోయింది. తన కోసం ఎంత కష్టపడ్డాడో.. భారత హై కమీషనర్ ఆఫీస్ చుట్టూ, పాకిస్తాన్ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగాడో.. వీసా అనుమతి కోసం తను కూడా ఎన్నిసార్లు తిరిగాడో.. వీసా అనుమతి తిరస్కరించబడిన ప్రతిసారీ ఎంత కుంగుబాటుకు లోనయ్యాడో..

ఉస్మాన్‌ఖాన్ బతికున్న రోజుల్లో వొంట్లో సత్తువ లేకున్నా షరీఫ్‌ని వెంటబెట్టుకుని కార్యాలయాల చుట్టూ తిరిగేవాడు. ఐదేళ్ళ క్రితం ఉస్మాన్‌ఖాన్ చనిపోయాక ఆ బాధ్యతని ఖాలిద్ తన పైన వేసుకున్నాడు. తన తండ్రిలానే అతనిక్కూడా షరీఫ్ అంటే గౌరవం. వృద్ధాప్యం వల్ల సంక్రమించే రకరకాల అనారోగ్యాలతో ఉస్మాన్‌ఖాన్ మూడేళ్ళు మంచానికే పరిమితమయ్యాడు. అతను చనిపోయే క్షణం వరకు షరీఫ్ అతన్ని కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఓ తల్లిలా మారి సపర్యలు చేశాడు. ఉస్మాన్‌ఖాన్ ఆరోగ్యంగా ఉన్న రోజుల్లో కూతురు మదీహాని ఎలా చూసుకునేవాడో, షరీఫ్ కూడా ఆమెను అలా చూసుకున్నాడు. ఆ కృతజ్ఞత మనసులో ఉండబట్టే షరీఫ్‌ని వాళ్ళ వూరికి పంపించడానికి ఖాలిద్ శతవిధాలా ప్రయత్నించాడు.

భారతదేశం వెళ్ళి కొన్ని రోజులుండి, బంధుమిత్రుల్ని కల్సుకుని తిరిగి వచ్చేయాలనుకునే పాకిస్తానీయులకు కూడా వీసా అనుమతి లభించని పరిస్థితి.. షరీఫ్ విషయంలో ఎదురైన అసలైన సమస్య ఏమిటంటే అతను తిరిగి పాకిస్తాన్‌కి రావాలనుకోవడం లేదు. హిందూస్తాన్‌లో భాగమైన హుందర్మాన్ గ్రామంలో తన చివరి శ్వాస వరకు ఉండిపోవాలనుకుంటున్నాడు. పందొమ్మిది వందల డెబ్బయ్ ఒకటి యుద్ధం తర్వాత ఆ గ్రామాన్ని భారతీయ సైనికులు హస్తగతం చేసుకున్నాక అక్కడ నివసించే వాళ్ళందరికీ భారతీయ పౌరసత్వం ఇవ్వబడింది. షరీఫ్ ఆ సమయంలో బ్రోల్మోలో ఉండిపోయాడు కాబట్టి అతను ప్రస్తుతం పాకిస్తానీ పౌరుడు. అతనికి భారత ప్రభుత్వం తమ దేశ పౌరసత్వాన్ని ఇవ్వడానికి అంగీకరిస్తే తప్ప అతను హుందర్మాన్ వెళ్ళడానికి వీల్లేని పరిస్థితి..

మొదట అతనికి ఎదురైన పెద్ద సమస్య తను హుందర్మో గ్రామస్థుడినేనని నిరూపించుకోవడం.. షరీఫ్ దగ్గర దాన్ని రుజువు చేసుకునే ఆధారాలేమీ లేవు. పందొమ్మిది వందల డెబ్బయ్, డిసెంబర్ నెలలో పాకిస్తాన్‌లో జరిగిన జనరల్ ఎలక్షన్ల సమయంలో తను కూడా ఓటు వేశాననీ, హుందర్మో గ్రామ పంచాయతీలోని ఓటర్ల జాబితాని పరిశీలిస్తే అందులో తన పేరు నమోదై ఉంటుందని, షరీఫ్ అనేక మార్లు వ్రాతపూర్వకంగా నివేదించుకోవడంతో, ప్రభుత్వాధికార్లు సదరు ఓటర్ల జాబితాను తెప్పించుకుని పరిశీలించారు. అందులో షరీఫ్ పేరు నమోదై ఉంది. అందులో అతను పుట్టిన తేదీతో పాటు అతని తండ్రి పేరు కూడా రాసి ఉంది.

అందులో ఉన్న ఫోటోకి, ప్రస్తుతం షరీఫ్ తన వినతిపత్రంతో పాటు సమర్పించిన ఫోటోకి మధ్య పోలికే లేకపోవడం వల్ల అతనే ఓటర్ల జాబితాలో నమోదైన షరీఫ్ అని రుజువులు చూపించమని అధికార్లు అడిగారు. ఓటర్ కార్డ్‌లో ఉన్న పుట్టిన తేదీని రుజువు పరిచే పత్రాలు కానీ, లేదా అతని తండ్రి పేరుని ధృవపరిచే పత్రాలు కానీ షరీఫ్ వద్ద లేవు. ఖాలిద్ కూడా ప్రభుత్యోద్యోగి కావడంతో తనకు ఉన్నతాధికార్లతో ఉన్న పరిచయాల్ని ఉపయోగించుకుని కిందా మీదా పడి చివరికెలాగైతేనేం ఇరు ప్రభుత్వాల అనుమతిని సంపాదించడానికి ఇంత సమయం పట్టింది.

ఇన్నాళ్ళూ జైల్లో ఉండి మరో పది రోజుల్లో విడుదలౌతున్నట్టు అనుభూతి షరీఫ్‌కి.. తన భార్యాబిడ్డల్నుంచి దాదాపు ఇరవై యేళ్ళ ఎడబాటుకి చరమగీతం పాడే అద్భుతమైన సమయం ఆసన్నమైంది. ఇకనుంచి ఒంటరితనానికి తను బందీ కాడు. తనకు అత్యంత ప్రియమైన హసీనాతో కలిసి తన చివరిక్షణం వరకు గడపబోతున్నాడు. తనకు ప్రాణప్రదమైన ఆస్‌మాని, మిగతా పిల్లల్లి చూసుకుంటూ బతకబోతున్నాడు. ఆ ఆలోచనే ఎంత మధురంగా ఉందో.. ఇన్నాళ్ళూ జీవం లేనట్టు బతికాడు. ఇప్పుడు మళ్ళా తనలో జీవితేచ్ఛ కన్నెవాగులా ఉరకలు వేస్తోంది.

అనార్కలీ బజార్ కెళ్ళి హసీనాకోసం నెమలి కంఠం రంగు కమీజ్, తెల్లటి పాలనురగ రంగులో ఉన్న షల్వార్ కొన్నాడు. దాని పైకి లాల్ దుపట్టా కొన్నాడు. ఆస్‌మా కోసం గులాబీ రంగులో ఉన్న షల్వార్ కమీజ్ కొన్నాడు. సందూక్‌లో తన బట్టల్తో పాటు వాటిని సర్దుకున్నాడు.

అతను ప్రయాణం చేయాల్సిన రోజు రానే వచ్చింది. ఆ రోజు ఉదయం నాల్గింటికే లేచి తలకు స్నానం చేశాడు. తన గదిలోనే దుప్పటి పరిచి దానిమీద నమాజ్ చేశాడు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ లాహోర్ జంక్షన్ నుంచి ఉదయం ఎనిమిదిన్నరకు బయల్దేరుతుందనీ, భద్రతా కారణాల దృష్ట్యా తనిఖీలుంటాయి కాబట్టి కనీసం గంట ముందైనా స్టేషన్లో ఉండటం మంచిదని ఖాలిద్ చెప్పి ఉండటంతో ఆరింటికే తయారై, తన సందూక్ పట్టుకుని బైటికొచ్చి, గదికి తాళం వేశాడు. వసారాలో పడక్కుర్చీలో కూచుని ఉర్దూ పేపర్‌ని ఎడం చేత్తో పట్టుకుని చదువుతున్న ఖాలిద్‌ని చూడగానే అతనికి పదమూడేళ్ళ క్రితం అదే కుర్చీలో విశ్రాంతి తీసుకుంటున్న ఉస్మాన్ ఖాన్ ముందు వినయంగా నిలబడి తనకు అద్దెకు గది కావాలని అడిగిన విషయం, ఆ తర్వాత అతను తన యెడల చూపించిన ఔదార్యం, మంచితనం గుర్తొచ్చి కళ్ళు చెమర్చాయి.

“ఖాలిద్ సాబ్.. నేను గదిని ఖాళీ చేశాను. ఇదుగో తాళం చెవి” అతని ముందు నిలబడి గద్దద స్వరంతో అన్నాడు.

పేపర్లోంచి తలయెత్తి చూసిన ఖాలిద్ ఆశ్చర్యపోతూ “అప్పుడే ఏం తొందరొచ్చిందని? ట్రెయిన్ బయల్దేరేది ఎనిమిదన్నరకు కదా. యింకా చాలా సమయం ఉంది. ఇక్కడినుంచి స్టేషన్‌కి పది నిమిషాల ప్రయాణం. ఇప్పుడు ఆరేగా అయింది. ఏడున్నరకు బయల్దేరినా చాలు” నవ్వుతూ అన్నాడు ఖాలిద్.

“ఏదైనా అవాంతరమొచ్చి, స్టేషన్‌కు చేరుకోవడం ఆలస్యమై, రైలు తప్పిపోతుందేమోనని భయమేస్తోంది జనాబ్. యిక్కడ కూచునే బదులు స్టేషన్లోనే కూచుంటే సరిపోతుందని ముందుగానే బయల్దేరాను” తన తొందరపాటుకు సిగ్గుపడిపోతూ సంజాయిషీగా అన్నాడు షరీఫ్.

ఖాలిద్ ఈసారి పెద్దగా నవ్వాడు. “వూరెళ్ళి మీ కుటుంబాన్ని చూసుకోవాలన్న తొందరని నేను అర్థం చేసుకోగలను భాయీసాబ్. ఇరవైయేళ్ళ ఎడబాటు కదా. సహజం” అంటూ తన భార్యను కేకేసి “బైటికిరా. నీతోపాటు దీదీని కూడా పిల్చుకురా. షరీఫ్ భాయ్ వూరెళ్తున్నారు. అల్విదా చెప్పడానికొచ్చారు” అన్నాడు.

వసారాలోకొచ్చి నిలబడిన ఖాలిద్ భార్యకు మొదట సలాం చెప్పి, “నేను మా వూరెళ్తున్నానమ్మా. ఈ పదమూడేళ్ళు మీ యింట్లో నాకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు, స్వంత అన్నలా చూసుకున్న మీ ఆదరాభిమానాలకు ఎన్ని షుక్రియాలు చెప్పినా తక్కువే. ఖుదా హాఫీజ్” అన్నాడు.

మదీహాకు మతిస్థిమితం లేకున్నా, తనను ఎనిమిదేళ్ళుగా తండ్రిలా చూసుకున్న వ్యక్తి వెళ్ళిపోతున్నాడని అర్థమైందేమో, అతనికి సమీపంగా వచ్చి, అతని చేతుల్ని తీసుకుని కన్నీళ్ళతో తడుస్తున్న తన కళ్ళకద్దుకుంది. తనలో భావోద్వేగాలేవీ లేనట్టు కన్పించే ఖాలిద్ కూడా తన కళ్ళు చెమర్చడాన్ని ఆపుకోలేకపోయాడు.

అప్పుడే ఇస్మాయిల్ టాంగాని బైట ఆపి, లోపలికొచ్చి ఖాలిద్‌కి అభివాదం చేశాడు.

“మీరొచ్చారేమిటి?” ఆశ్చర్యపోతూ అన్నాడు ఖాలిద్.

పిల్లల చదువులైపోయి, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా ఐపోయాక ఆ యింటితో ఇస్మాయిల్ కున్న సంబంధాలు దాదాపు తెగిపోయాయి. అందుకే ఈ సమయంలో ఇస్మాయిల్ ఎందుకొచ్చాడో అర్థం కాలేదు. వెంటనే ఏదో ఆలోచన వచ్చి “బహుశా షరీఫ్ గారికి ఖుదా హాఫిజ్ చెప్పడానికొచ్చి ఉంటారు” అన్నాడు.

షరీఫ్ కల్పించుకుని “లేదు జనాబ్. ఇస్మాయిల్ గారిని నేనే రమ్మన్నాను. నేను లాహోర్ స్టేషన్లో దిగి బైట కాలుపెట్టాక ఇస్మాయిల్ గారి టాంగాలోనే అద్దె యిళ్ళకోసం వెతుక్కుంటూ వూరంతా తిరిగాను. ఆ టాంగాలోనే మీ యింటికొచ్చాను. మీ ఇంటినుంచి వెళ్ళేటప్పుడు కూడా అదే టాంగాలో వెళ్ళాలని కోరిక.. అందుకే నేనే ఇస్మాయిల్ గార్ని పిలిచాను.. నన్ను స్టేషన్ దగ్గర దింపడానికి” అన్నాడు.

ఖాలిద్ లేచి నిలబడ్డాడు. “ఓ పావు గంట వసారాలో కూచోండి షరీఫ్ భాయ్. బట్టలు మార్చుకుని వస్తాను. నేను కూడా స్టేషన్ దాకా వచ్చి మిమ్మల్ని దింపుతాను” అన్నాడు.

షరీఫ్ ఏదో చెప్పేలోపలే అతను యింటిలోపలికి వెళ్ళిపోయాడు. అతని వెనకే అతని భార్య కూడా వెళ్ళింది. అరవై యేళ్ళ వయసున్నా పసిపాపలా అమాయకమైన కళ్ళతో అక్కడే నిలబడి ఉన్న మదీహాను చూడగానే షరీఫ్‌లో వాత్సల్యం పొంగుకొచ్చింది. ఆమె తనకన్నా కేవలం ఏడేళ్ళు చిన్నది. ఐనా తనకళ్ళకు ఆమె ఏడేళ్ళ వయసులో ఉన్న ఆస్‌మా లానే అన్పిస్తుంది. పావుగంట సమయం ఉంది కాబట్టి చివరిసారిగా ఆమెను తోటలో తిప్పాలనిపించింది.

మదీహా చేతిని పట్టుకుని మెల్లగా నడిపించుకుంటూ తోటలోకి తీసుకెళ్ళాడు. అక్కడ పూల మొక్కల మీద ఎగుర్తున్న సీతాకోకచిలుకని చూడగానే మదీహా చిన్నపిల్లలా నవ్వుతూ, చప్పట్లు కొడుతూ, దాన్ని పట్టుకోడానికి వెంట పడింది. అది దొరక్కపోవడంతో కోపమొచ్చి షరీఫ్‌తో “నాకీ తితలీ వద్దు. నేను దాన్తో ఆడుకోను” అంది. కొన్ని నిమిషాల క్రితం కన్నీళ్ళు పెట్టుకుని, ఆ వెంటనే కిలాకిలా నవ్వి, ఇప్పుడు కోపంతో రుసరుసలాడున్న మదీహాను వదిలి వెళ్ళడమే అతనికి చాలా బాధగా ఉంది. తను లేకపోతే ఈ వయసు ముదిరిన పసిపిల్లని ఎవరు చూసుకుంటారు? అతనికి చప్పున కన్నీళ్ళు ఉబికాయి. ఆమెను జాగ్రత్తగా తీసు కొచ్చి వసారాలో వదిలి పెట్టాడు.

ఖాలిద్ బైటికొచ్చేలోపలే ఓ కొత్త వ్యక్తి వచ్చి కారు దగ్గర నిలబడ్డాడు. ఖాలిద్ అతన్ని పరిచయం చేస్తూ “కొత్త డ్రైవర్. మీరు వూరెళ్తున్నారుగా. అందుకే ఈ రోజు నుంచే పనిలో చేరమని చెప్పాను” అంటూ డ్రైవర్తో “షరీఫ్ భాయ్ చేతిలో ఉన్న సందూక్‌ని డిక్కీలో పెట్టండి” అన్నాడు.

షరీఫ్ కంగారుగా “నేను టాంగాలో వస్తాను జనాబ్. ఇస్మాయిల్ని రమ్మంది అందుకేగా ” అన్నాడు.

ఖాలిద్ నవ్వుతూ “పదమూడేళ్ళు మమ్మల్ని కారులో తిప్పారుగా. ఈ రోజు మిమ్మల్ని అదే కారులో స్టేషన్ వరకూ దింపాలని కోరిక. కాదనకండి” అన్నాడు.

షరీఫ్ ఇబ్బందిగా ఇస్మాయిల్ వైపు చూశాడు.

“ఇస్మాయిల్ గారు టాంగాలో స్టేషన్ వరకు వస్తారు. మేమిద్దరం ట్రెయిన్ కదిలేవరకు మీతోపాటు ఉండి మీకు వీడ్కోలు చెప్తాం. సరేనా” అన్నాడు ఖాలిద్.

“ఎందుకు జనాబ్ మీకు శ్రమ?” మొహమాటపడూ అన్నాడు షరీఫ్.

“ఇదంతా నా సంతోషం కోసం చేస్తున్నాను షరీఫ్ భాయ్. ఇది శ్రమ కాదు నా బాధ్యత. నాన్నగారు బతికున్నా తప్పకుండా స్టేషన్ వరకు వచ్చి మీకు వీడ్కోలు యిచ్చి ఉండేవారు. దయచేసి వచ్చి కార్లో కూచోండి” అన్నాడు.

షరీఫ్ ఇబ్బందిగానే కదిలి, ముందు తలుపు తీసి, డ్రైవర్ పక్క సీట్లో కూచోబోయాడు.

“మీరు కూచోవాల్సింది అక్కడ కాదు భాయ్. నా పక్కన.. వెనక సీట్లో” అన్నాడు ఖాలిద్.

షరీఫ్ వెనక సీట్లో కూచున్నాక అటు వైపు తలుపు మూసి, చుట్టుతా తిరిగి మరో వైపు నుంచి కార్లోకి ఎక్కి అతని పక్కన కూచున్నాడు ఖాలిద్.

కారు బయల్దేరాక ఇస్మాయిల్ కూడా స్టేషన్ వైపుకు తన టాంగాను పోనిచ్చాడు.

***

ఆరు స్లీపర్ బోగీలు, ఒక ఏ.సి త్రీ టైర్ బోగీని లాక్కుంటూ సంఝౌతా ఎక్స్‌ప్రెస్ సరిగ్గా ఎనిమిదిన్నరకు బయల్దేరింది. ప్లాట్‌ఫాం పైన నిలబడి చేతులూపుతున్న ఖాలిద్, ఇస్మాయిల్లు కనుమరుగయ్యేవరకు షరీఫ్ కూడా చేయి వూపుతూ వాళ్ళకు వీడ్కోలు చెప్పాడు.

కిటికీ పక్కన కూచుని కనుమరుగవుతున్న లాహోర్ నగరాన్ని చూస్తుంటే అతనికి దుఃఖం పొంగుకొచ్చింది. పదమూడేళ్ళు తనను అక్కున చేర్చుకున్న నగరం.. హుందర్మో అనే చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన తను లాహోర్ నగరానికి వచ్చాక చాలా విషయాలు నేర్చుకున్నాడు. లాహోర్ అంటే ఎంత ప్రేమో తనకు.. కానీ తన వాళ్ళను చేరుకోవాలంటే లాహోర్‌ని వదలక తప్పదు.. ఈ ప్రయాణం చేయక తప్పదు..

జీవితమంటేనే ప్రయాణం.. కోరుకుని సంతోషంగా చేసే ప్రయాణాలు కొన్నయితే, తప్పని పరిస్థితుల్లో అయిష్టంగా చేసే ప్రయాణాలు కొన్ని.. తన జీవితంలో ఎన్ని మజిలీలో.. అనూహ్యంగా చోటు చేసుకుని, తన జీవితాన్ని అతలాకుతలం చేసిన సంఘటనలెన్నో.. తనెప్పుడైనా వూహించాడా.. తన భార్యాబిడ్డలకు దాదాపు ఇరవై యేళ్ళు దూరమౌతానని? తను పుట్టి పెరిగిన నేలనుంచి విడిపోయి పరాయి చోట తల దాచుకోవాల్సి వస్తుందని ఎన్నడైనా కల కన్నాడా? పీడకల..

ఎవరో చిన్న పాప కిలకిలా నవ్వినట్టు విన్పించడంతో అప్పటివరకూ కిటికీలోంచి బైటికి చూస్తూ ఆ లోచనల్లో మునిగి ఉన్న షరీఫ్, తలతిప్పి తనతోపాటు ప్రయాణిస్తున్న వ్యక్తుల్ని గమనించాడు. ఎదురు బెర్త్‌లో భార్యాభర్తల్తో పాటు ఏడేళ్ళ పాప కూచుని ఉంది. వాళ్ళ పక్కన కొద్దిగా ఎడంగా పాతికేళ్ళ కుర్రవాడు కూచుని ఉన్నాడు. తన బెర్త్‌లో వేర్వేరు వయసులో ఉన్న ముగ్గురు మగవాళ్ళు కూచుని ఉన్నారు. ఆ భార్యాభర్తల మొహాల్లో తప్ప మిగతా అందరి మొహాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి. పాప మాత్రం ఉరికే జలపాతంలా సందడి చేస్తోంది. స్థిమితంగా ఒక చోట కూచోమని వాళ్ళమ్మ ఎంత మందలించినా విన్పించుకోకుండా తూనీగలా బోగీ అంతా తిరుగుతూనే ఉంది.

విరిసిన తెల్ల కలువల్లాంటి విశాలమైన కనుదోయి.. దానిమ్మ గింజల్లా అందమైన పలువరుస.. పల్చటి ఎర్రటి పెదాలు.. వాటిమీద లాస్యం చేస్తున్న అద్భుతమైన నవ్వు.. చూడగానే షరీఫ్‌కి ఏడేళ్ళ వయసులో తన మనోహరమైన నవ్వుతో యింటిని జన్నత్‌లా మార్చేసిన ఆస్మా గుర్తొచ్చింది.

“నీ పేరేంటి?” అని పాపను అడిగాడు.

“ఆరిఫా” నవ్వుతూ సమాధానమిచ్చింది పాప.

ఆమె తండ్రి వైపు చూస్తూ “హిందూస్తాన్‌కి ఎవర్ని కల్సుకోడానికి వెళ్తున్నారు?” అని అడిగాడు.

“హిందూస్తాన్‌లో మాకెవ్వరూ బంధువులు లేరు జనాబ్” అన్నాడతను. అతని కళ్ళనిండా దిగులు..

“ఐతే అక్కడి సుందర ప్రదేశాలు చూడటానికి వెళ్తున్నారన్న మాట.”

“మాకంత అదృష్టం ఎక్కడిది జనాబ్? పాప వైద్యం కోసం మద్రాస్ వెళ్తున్నాం.”

ఆ మాట వినగానే షరీఫ్ కంగారు పడ్డాడు. “ఆరిఫాకేమైంది?” అన్నాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here