రెండు ఆకాశాల మధ్య-51

0
10

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]“కు[/dropcap]డికంట్లో ఏదో సమస్య ఉందని లాహోర్‌లోని డాక్టర్లు చెప్పారు. కనుపాప తెల్లగా మారిపోతుంటే అనుమానమొచ్చి డాక్టర్లకు చూపించాం. మద్రాస్‌లోని శంకర నేత్రాలయలో ఈ జబ్బుకి మెరుగైన చికిత్స దొరుకుతుందని చెప్తే, టూరిస్ట్ వీసాల్తో పాటు మెడికల్ వీసా కూడా వచ్చాక, ఇలా బయల్దేరాం.”

“ఏం జబ్బని చెప్పారు?”

“కంటికొచ్చే క్యాన్సర్ లాంటి జబ్బని చెప్పారు. అది చిన్నపిల్లలకే వస్తుందట. నిర్లక్ష్యం చేస్తే కంటి చూపు పూర్తిగా పోయే ప్రమాదముందని కూడా చెప్పారు.” అతని గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. అతని భార్య కళ్ళల్లో నీళ్ళూరాయి.

షరీఫ్‌కి కూడా బాధనిపించింది. యింతందంగా, అమాయకంగా ఉన్న పిల్లకు ఆ జబ్బేమిటి? అది కూడా మరీ అందంగా ఉన్న ఆ పాప కళ్ళకు.. కొన్ని నిమిషాల క్రితమేగా అనుకున్నాడు ఆ పాప కళ్ళూ, నవ్వూ అచ్చం చిన్నప్పటి ఆస్‍మాని గుర్తుకు తెచ్చేవిగా ఉన్నాయని.. ఆ తల్లిదండ్రులకెంత గుండె కోత..

ఏం వినాల్సి వస్తుందోనని భయపడుతూనే అడిగాడు “నయమౌతుందని చెప్పారా?”

“జబ్బు ప్రారంభదశలో ఉన్నప్పుడే గుర్తించారు కాబట్టి తప్పకుండా నయమౌతుందని చెప్పారు.”

షరీఫ్ రెండుచేతులూ దువా చేస్తున్నట్టు పైకెత్తి “అల్లా కా లాఖ్ లాఖ్ షుకర్” అన్నాడు.

నాస్టా చేయకుండా హడావిడిగా స్టేషన్‌కొచ్చిన కొంతమంది తమ వెంట తెచ్చుకున్న పరోటాల్ని తినసాగారు. యింట్లో బయల్దేరే ముందే ఫలహారం చేసొచ్చిన మగవాళ్ళు కొందరు బీడీలు ముట్టించారు. ఆ బోగీలో పరోటాల, కబాబ్ల వాసనలోపాటు బీడీల వాసన కూడా కల్సిపోయి, అదో రకమైన వింత వాసన వేయసాగింది.

నాస్టా చేయడం పూర్తయ్యాక అందరూ కబుర్లలో పడ్డారు. ‘మీరెందుకు వెళ్తున్నారు? ఎక్కడికెళ్తున్నారు? ఎవర్ని కల్సుకోడానికి?’ అనే ప్రశ్నలూ వాటి జవాబులే బోగీనిండా విన్పించసాగాయి. భారతదేశంలో ఉన్న బంధువుల్ని కల్సుకోడానికి వెళ్తున్నామని చెప్తున్నవాళ్ళే ఎక్కువమంది ఉన్నారు. వాళ్ళను చూసి ఎన్నేళ్ళయిందో, వాళ్ళతో తమకున్న అనుబంధం ఏమిటో, ముడిపడి ఉన్న జ్ఞాపకాలేమిటో… గతాన్ని తవ్వితీసి చెప్పుకుంటున్నారు.

ఆరిఫా వాళ్ళ నాన్న పక్కన కూచుని ఉన్న పాతికేళ్ళ కుర్రాడు హిందీ పాటని హమ్ చేయసాగాడు. “రంగ్ భరే బాదల్ పే.. లిఖ్ దియా తేరా నామ్.. చాందనీ.. ఓ మేరి చాందనీ” అని పాడుతుంటే షరీఫ్ పక్కన కూచుని ఉన్న యాభై యేళ్ళ వ్యక్తి “చాలా బాగా పాడుతున్నావే. ప్రయత్నిస్తే మంచి గాయకుడివవు తావు. ఇంతకూ ఎక్కడిదాకా వెళ్తున్నావు?” అని అడిగాడు.

“బాంబేకి” వొలికిపోతున్న ఉత్సాహంతో సమాధానమిచ్చాడు.

“అలాగా.. ఐతే నిజంగానే బాలీవుడ్‌లో నీ అదృష్టం పరీక్షించుకోడానికి వెళ్తున్నావన్న మాట” నవ్వుతూ అన్నాడు.

ఆ కుర్రవాడు సిగ్గుపడూ “లేదు జనాబ్. నాకన్నా బాగా పాడేవాళ్ళు బాంబేలో స్టూడియోల బైట చాలా మంది నిలబడి, తమకో అవకాశం ఇవ్వమని ప్రాధేయపడ్తూ కన్పిస్తారని విన్నాను. నాకలాంటి ఆశలేమీ లేవు. హిందీ సినిమాలంటే ఇష్టం. ఆ సినిమాల్లోని పాటలంటే మరీ ఇష్టం. సమయం దొరకినపుడల్లా పాడుకుంటూ ఉంటాను. అంతే” అన్నాడు.

“మరి బాంబే ఎందుకెళ్తున్నావు?”

“బాంబేలోని పర్యాటక స్థలాలు చూడాలని ఉందని వీసా తీసుకున్నాను జనాబ్. నిజం చెప్పాలంటే నాకు పర్యాటక స్థలాలమీద ఆసక్తి లేదు. కేవలం ఇద్దర్ని చూడటానికి బాంబే వెళ్తున్నా. ఒకరు శ్రీదేవి, రెండో వ్యక్తి అమితాబ్ బచ్చన్. నాకు శ్రీదేవి అంటే ఆరాధన. అమితాబ్ అంటే గౌరవం. వాళ్ళిద్దర్నీ చూస్తే చాలు. నా జన్మ తరించిందనుకుంటా” అన్నాడు.

ఆ కుర్రవాడు తిరిగి “మీరెక్కడికెళ్తున్నారు? ఎవర్ని కలవడానికి?” అని ప్రశ్నించాడు.

“నేను ఢిల్లీ వెళ్తున్నా. అక్కడ మా నాన్నగారి సమాధి ఉంది. దేశ విభజన సమయంలో జరిగిన హింసాకాండలో మా నాన్నని చంపేశారు. మా అమ్మ నన్నూ, నా ఇద్దరు తమ్ముళ్ళనీ తీసుకుని అష్టకష్టాలూ పడి లాహోర్ చేరుకుంది. ఇన్నేళ్ళ తర్వాత నాకు మా నాన్నగారి సమాధిని దర్శించుకునే అవకాశం దొరికింది” అన్నాడతను.

రైలు తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు వాఘా స్టేషన్ చేరుకోవడంతో అందరూ కబుర్లాపి తమ సామాన్లు సర్దుకుని కిందికి దిగారు. పాకిస్తానీ కస్టమ్స్ మరియు ఇమ్మిగ్రేషన్ అధికార్లు ప్రయాణీకుల సామాన్లని స్కానింగ్ మెషీన్లతో, స్నిఫ్ఫింగ్ డాగ్స్‌తో తనిఖీ చేశారు. దాదాపు మూడు గంటల తర్వాత మళ్ళా అందరూ రైలెక్కారు. రైలు మెల్లగా సరిహద్దు రేఖ ‘జీరో పాయింట్’ని దాటుతున్న సమయంలో సాయుధులైన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికార్లు గుర్రాల మీద ఇరువైపులా రైలుని కొంత దూరం అనుసరించారు.

రైలు సరిహద్దురేఖని దాటుతోందని తెలియగానే షరీఫ్ ఉద్రేకానికి లోనయ్యాడు. అసలీ సరిహద్దు రేఖల్ని ఎందుకు గీస్తారు? ఎవరు గీస్తారు? జీవితాల్ని ఛిన్నాభిన్నం చేసే ఇటువంటి అడ్డుగోడలు లేకుండా మనుషులందరూ కలిసిమెలసి బతకొచ్చుగా. పందొమ్మిది వందల నలభై యేడులో దేశాన్ని రెండుగా విభజిస్తూ గీసిన గీత కొన్ని లక్షల మంది ప్రాణాల్ని బలిగొంది. కొన్ని కోట్ల మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, వలస వెళ్ళారు. పందొమ్మిది వందల డెబ్బయ్ ఒకటిలో హుందర్మోకి బోల్మోకి మధ్య గీసిన సరిహద్దు రేఖ తనతోపాటు తనలాంటి ఎంతో మంది జీవితాల్లో నిప్పులు కుమ్మరించింది. దాదాపు ఇరవై యేళ్ళుగా తను ఆ చితిమంటలో దగ్ధమౌతూనే ఉన్నాడు.

అతనికి బ్రోల్మో మీదనుంచి హుందర్మోని తాకుతూ ప్రవహించే షింగో నది గుర్తొచ్చింది. దానికి ఏ సరిహద్దులూ అడ్డురావు. హిందూస్తాన్ నుంచి పాకిస్తాన్ వైపుకు వీచే గాలిని ఇరువైపులా ఉన్న భద్రతా దళాలు అడ్డుకోలేవు. స్వేచ్ఛగా ఎగిరే పక్షులకు సరిహద్దులు సంకెళ్ళుగా మారలేవు. ఒక్క మనిషికే ఈ దౌర్భాగ్యం.. మనిషిగా పుట్టినందుకు శిక్షగా సరిహద్దుల జైలు గోడల మధ్య బందీగా బతకాల్సిందే..

తను ఎంతగానో ప్రేమించిన హసీనాకు ఇన్నేళ్ళు దూరమైనాడు. హసీనానుంచి దూరంగా ఉండటమంటే చావుతో సమానంలా అన్పించేది. కానీ బతికాడు. ఎప్పటికైనా తన భార్యని, పిల్లల్ని కల్సుకోవాలన్న కోరికే తనను బతికించింది. కల్సుకోగలనన్న నమ్మకమే బతికుండేలా చేసింది. హసీనా ఎలా ఉందో… ఇరవై యేళ్ళు.. మనిషి జీవితకాలంలో నాలుగో వంతు.. తమ యిద్దరి జీవితాల్లోంచి ఇరవైయేళ్ళ కాలం రెక్కలు తొడుక్కుని ఎక్కడికో ఎగిరిపోయింది. తిరిగిరాని కాలం.. తిరిగిరాని వయసు.. తమ సుఖసంతోషాల్ని సరిహద్దురేఖ మింగేసింది.

తను ముసలివాడైపోయాడు. ఒంట్లో శక్తి సన్నగిల్లింది. ఇరవై యేళ్ళ క్రితం శరీరంలో ఉన్న బలం కానీ, మానసిక స్థైర్యం కానీ ఇప్పుడు లేవు. ముసలితనం హసీనా మీద కూడా తన పంజా విసిరుంటుంది.

హసీనా రాసిన ఉత్తరం గుర్తొచ్చి, తన కుర్తా జేబులో దాచుకున్న ఆ ఉత్తరాన్ని బైటికి తీశాడు. ఎంత అపురూపంగా దాచుకున్నాడో ఆ ఉత్తరాన్ని.. తను బ్రోల్మోలో అక్క యింట్లో ఉండి రాసిన ఉత్తరానికి, హసీనా యిచ్చిన జవాబు.. పెళ్ళయిన యిన్నేళ్ళలో తన భార్య నుంచి తను అందుకున్న ఒకే ఒక ఉత్తరం..

దాని మడతల్ని జాగ్రత్తగా విప్పాడు. దాదాపు ఇరవై యేళ్ళనుంచి దాచుకుంటున్న ఉత్తరం కాబట్టి మడతల దగ్గర చిరిగిపోయి, నాలుగు ముక్కలుగా విడిపోవడానికి సిద్ధంగా ఉంది. కళ్ళద్దాలు పెట్టుకుని, మెల్లగా చదవసాగాడు. తీయటి ఖీర్‌ని కొద్దికొద్దిగా నోట్లో పెట్టుకుంటూ ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నట్లు, ఒక్కో వాక్యాన్ని చదువుకుంటూ తీయటి అనుభూతికి లోనయ్యాడు. ‘మీ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తుంటా. మీరు రాకుండా నా జనాజా లేవదు. ఇది మాత్రం నిజం’ అని రాసిన చివరి మూడు వాక్యాలు చదవగానే అతని కళ్ళల్లో నీళ్ళూరాయి. ‘నేనూ అంతే హసీనా. నిన్ను చూడకుండా నేను చావను. చావు ముంచుకొచ్చినా దాంతో పోరాడి, నిన్ను చేరుకుంటాను’ అనుకున్నాడు.

తనకు భారతీయ పౌరసత్వాన్ని ప్రదానం చేయబోతున్నట్టు ఉత్తర్వులు అందిన వెంటనే హసీనాకు ఉత్తరం రాశాడు. ‘యింక ఎన్నో రోజులు ఎదురుచూడనవసరం లేదు హసీనా.. నేను వచ్చేస్తున్నా. ఫలానా తేదీన సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరుతున్నా. ఆ మరుసటి రోజు ఉదయానికల్లా నీ కళ్ళముందుంటా. నాకు ప్రియాతిప్రియమైన నిన్ను కళ్ళారా చూసుకుంటా.. మనం మనసారా మాట్లాడుకుందాం. ఈ ఇరవై యేళ్ళ నుంచి గుండెల్లో దాచుకున్న కబుర్లన్నీ కలబోసుకుందాం. ఖుదా హాఫిజ్’ అని రాశాడు. తన రాక కోసం హసీనా ఎదురుచూస్తో ఉంటుందన్న ఆలోచనకే అతని మనసు మేఘాల్లో విహరిస్తోంది. కలలు నిజమౌతాయి. నిజమే.. ఎటొచ్చీ అవి నిజమౌతాయన్న నమ్మకంతో, నిజమయ్యే రోజు కోసం ఓపిగ్గా ఎదురు చూడాలి. అంతే.. అనుకున్నాడు.

రైలు పన్నెండున్నరకు అటారీ స్టేషన్ చేరుకుంది. ప్రయాణీకులందరూ భారతీయ కస్టమ్స్ మరియు ఇమ్మిగ్రేషన్ అధికార్ల తనిఖీ కోసం సామాన్లతో సహా దిగిపోయారు. ఆ తతంగమంతా పూర్తి కావడానికి మూడు గంటల సమయం పట్టింది. ఢిల్లీ వరకు ప్రయాణం చేయాల్సిన వాళ్ళు టికెట్లు కొనుక్కుని, లాహోర్ నుంచి వచ్చిన రైలుని వదిలేసి, అక్కడినుంచి బయల్దేరే మరో రైలెక్కాలి. అటారీకి, ఢిల్లీకి మధ్యలో వచ్చే ఏ స్టేషన్లోనూ రైలు ఆగదు.

ఆరిఫాన్, ఆరిఫా తల్లిదండ్రులో ‘ఖుదా హాఫీజ్’ చెప్పి షరీఫ్ వీడ్కోలు తీసుకున్నాడు. అటారీనుంచి హుందర్మాన్ గ్రామానికి అతని ప్రయాణం మొదలైంది.

***

ఉదయం నుంచి హసీనా చాలా హడావిడి పడిపోతోంది. యింకా కొన్ని గంటలు ఎదురుచూస్తే చాలు.. ఇరవైయేళ్ళ ఎడబాటుకి తెరపడుంది. రేపు ఉదయానికల్లా తన షౌహర్ తన ముందుంటాడు. ఈ రోజు ఒక్క రాత్రిని ఒంటరితనంలో మండిస్తూ గడిపితే చాలు. మిగతా రాత్రులన్నీ చల్లని వెన్నెలరాత్రులే. రేపు రాబోయే భర్త కోసం అతనికిష్టమైన పిండివంటలు తయారుచేయడంలో నిమగ్నమైంది. తన భర్త రాబోతున్నాడని ఫక్రుద్దీన్‌కి కబురు పంపడంతో అతను ఓ రోజు ముందే భార్యాసమేతంగా దిగిపోయాడు. ఆస్‌మా తన పిల్లల్ని తీసుకుని పుట్టింటి కొచ్చేసింది. ఆస్‍మా అక్కలిద్దరు కూడా వచ్చేశారు. యిల్లంతా సందడిగా ఉంది.

తనూ తన భర్తా పడుకునే గదిని ఆస్‌మా అలంకరిస్తుంటే ఆమెకు సిగ్గు ముంచుకొచ్చింది. “మేమేమైనా కొత్తగా పెళ్ళయిన జంటనుకుంటున్నావా? ఎప్పుడో ముసలోళ్ళమైపోయాం” అంది.

“అమ్మీ.. నీకు వయసు పైబడింది నిజమే. కానీ నీ మనసు ఇరవైయేళ్ళ క్రితం అబ్బూ నా పెళ్ళి బట్టలు కొనడానికెళ్ళిన రోజు దగ్గర ఆగిపోయిందిగా” అంది నవ్వుతూ.

“చాల్లే నీ పరాచికాలు… అమ్మతో అలా మాట్లాడొచ్చా?” మురిసిపోతూనే కసురుకుంది హసీనా.

రాత్రయింది. అందరూ భోజనాలు చేసేసి నిద్రకుపక్రమించారు. హసీనాకు తినాలనిపించలేదు. మంచం మీద పడుకుందన్నమాటేగానీ నిద్ర పట్టడం లేదు. ఆలోచనలు.. అనంతమైన ఆలోచనలు.. ఎప్పటివెప్పటివో జ్ఞాపకాలు.. షరీఫ్‌తో తన నిఖా.. సుహాగ్ రాత్.. పిల్లలు.. ఆస్‌మా నిఖా నిశ్చయం కావడం.. పెళ్ళి బట్టలు కొనడానికి బ్రోల్మో వెళ్తూ షరీఫ్ తన వైపు చూసిన చూపు.. గుండెలోకి సూటిగా పూలబాణమేదో వదిలినట్లు..

ఎంత ప్రయత్నించినా నిద్ర కనురెప్పల మీద వాలడం లేదు. ఈ ఇరవై యేళ్ళలో ఇలాంటి నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపిందో.. తన్హాయిలో.. సుదీర్ఘమైన రాత్రులు.. ఎప్పటికీ తెల్లారదేమో అనిపించి భయపెట్టిన రాత్రులు.. ఈ రాత్రి కూడా అలానే మెల్లగా పాకుతోంది. కానీ ఎంత తేడా.. మనసులో దుఃఖం సుళ్ళు తిరగడం వల్ల దూరమైన నిద్ర కాదిది. సంతోషం సాగరకెరటాల్లా ఎగసిపడూ ఉండటంతో దరికిచేరని నిద్ర.. తొందరగా తెల్లారితే ఎంత బావుంటుందో కదా.. తూర్పున ఉదయించే సూర్యుడిలా తన భర్త యింట్లోకి అడుగు పెడ్తాడు.

ఆమె అసహనంగా మంచంమీద అటూఇటూ దొర్లింది. రాత్రి మీద కోపం వస్తోంది. గుర్రాన్ని అదిలించినట్లు చర్నాకోలాతో అదిలించి రాత్రిని కూడా దౌడు తీయించాలనిపిస్తోంది. యింకా కొన్ని గంటలు.. కానీ ఒక్కో గంట ఒక్కో యుగంలా.. నిమిషాల ముల్లు ఎంత భారంగా కదుల్తోందో.. భూమండలాన్నంతా తన నెత్తిమీద మోస్తునట్టు..

అర్ధరాత్రి దాటాక ఆమెకు మాగన్నుగా నిద్ర పట్టింది. కల.. గదిలో తనూ తన షౌహర్.. “బర్సాత్ కీ రాత్ సినిమాలో నర్గీస్‌లా ఉన్నావు తెలుసా?” అంటున్నాడు షరీఫ్.

తను కిలకిలా నవ్వుతూ “అంటే మీరు రాజ్ కపూరా?” అంది.

“సినిమాల్లో హీరోయిన్ని హీరో ఎత్తుకుని గిరగిరా తిప్పుతాడుగా.. అలా తిప్పనా నిన్ను?” అన్నాడు.

“ఏదీ తిప్పండి చూద్దాం” అంది తను.

(ముగింపు వచ్చేవారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here