రెండు పుస్తకాల ఆవిష్కరణ సభ

    0
    5

    [box type=’note’ fontsize=’16’] డా. వి. గీతానాగరాణి పరిశోధనా గ్రంథం ‘ఆధునిక తెలుగు సాహిత్యంలో ముస్లిం జీవన చిత్రణ’ మరియు సలీం నవల ‘అనూహ్య పెళ్ళి’ ఆవిష్కరణ సభ వివరాలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు సలీం. [/box]

    డా. వి. గీతానాగరాణి పరిశోధనా గ్రంథం “ఆధునిక తెలుగు సాహిత్యంలో ముస్లిం జీవన చిత్రణ” ఆవిష్కరణ సభ మార్చి 30 సాయంత్రం శ్రీ త్యాగరాయ గానసభ కళా దీక్షితులు కళావేదికలో జరిగింది. అదే వేదిక మీద సలీం నవల “అనూహ్య పెళ్ళి’ ఆవిష్కరణ కూడా జరిగింది. సభకు అధ్యక్షత వహించిన నవ్య వారపత్రిక సంపాదకులు శ్రీ జగన్నాధశర్మ గారు ప్రారంభోపన్యాసం చేస్తూ మంచి రచయితల రచనల వల్లే సాహిత్య పత్రికలు మనుగడ సాగిస్తున్నాయన్నారు. పరిశోధనా గ్రంథంలోని రజియా బేగం కవిత్వాన్ని చదివి విన్పించారు. దాంతోపాటు మహెజబీన్ రాసిన ‘నైతికత’ కవితలోని “ఒక అనివార్య యుద్ధం గురించి మాట్లాడుతున్నాను/శీలం రెండు కాళ్ళ మధ్య మాత్రమే ఉందనుకునేవాళ్ళ/ అమాయకత్వం మీద జాలేస్తుంది’ అనే పాదాల్ని ఉటంకిస్తూ మాట్లాడారు. మధ్య మధ్యలో సందర్భానుసారంగా జోకులు విసుర్తూ సభను రంజింపచేశారు.
    ముఖ్య అతిథి, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. యస్వీ సత్యనారాయణ గారు రెండు పుస్తకాల్ని ఆవిష్కరించి, ప్రసంగించారు. సలీం ఇంతక్రితం రాసిన ‘వెండి మేఘం’, ‘కాలుతున్న పూలతోట’ ఇప్పుడు ఆవిష్కరించబడిన “అనూహ్య పెళ్ళి” తెలుగు నవలా సాహిత్యం గురించి మాట్లాడేటప్పుడు తప్పకుండా ఉదహరించవల్సిన ఉత్తమ గ్రంథాలని అన్నారు. గీతానాగరాణి ఎం.ఏ.లో తన విద్యార్థిగా ఉన్నప్పటి విషయాల్ని గుర్తు చేసుకున్నారు. అనూహ్యకు తల్లిదండ్రులు గీతా సలీంలేననీ, వారి అనుభవాల్నే ‘అనూహ్య పెళ్ళి’ నవలగా రాశారని చెప్పారు.

    ప్రముఖ సాహితీవేత్త శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారు మాట్లాడుతూ గీతానాగరాణి రాసిన సిద్దాంత గ్రంథాన్ని, సలీం నవల “అనూహ్య పెళ్ళి” ని కలిపి చదువుకోవాలని చెప్పారు. సిద్ధాంత గ్రంథంలో పొందుపర్చిన విషయాలు, శైలీ ఆసక్తిగా చదివింపచేసేవిగా ఉన్నాయనీ, ‘అనూహ్య పెళ్ళి’ నవల్లో ఆదర్శవాదం ఉందనీ చెప్పారు. ప్రముఖ కవి శ్రీ యాకూబ్ తన ప్రసంగంలో గీతానాగరాణి సిద్ధాంత గ్రంథం చాలా ప్రామాణికంగా ఉందని, ముస్లిం సాహిత్యం గురించిన సమగ్రమైన సమాచారం ఇందులో పొందుపర్చబడి ఉందనీ అన్నారు. బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత, గోద్రా ఘటన తర్వాత జరిగిన గుజరాత్ మారణకాండ తర్వాత వెల్లువెత్తిన ముస్లిం సాహిత్యం, ముస్లింలు ఎదుర్కొన్న అభద్రతా భావం, మతాంతర వివాహం చేసుకున్న దంపతులకు పుట్టే పిల్లలు ఎదుర్కొనే సామాజిక సమస్యలు మొదలైన వాటి గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు.

    ప్రముఖ రచయిత్రి డా. నిడమర్తి నిర్మలాదేవిగారు మాట్లాడుతూ గీతానాగరాణి తన పర్యవేక్షణలో పి.హెచ్.డి పూర్తి చేసి, ఆ సిద్ధాంత గ్రంథాన్ని పుస్తకరూపంలో తీసుకువచ్చినందుకు తన అభినందనలు తెలియచేశారు. సలీం సామాజిక స్పృహ ఉన్న రచయిత అనీ, అతను తన కథల్లో నవలల్లో ఏదో ఒక సామాజిక సమస్యకు సంబంధించిన ఇతివృత్తాన్ని ఎన్నుకుంటాడనీ అన్నారు. కోస్తాంధ్ర ముస్లింల జీవితాల్ని చిత్రించిన ‘వెండిమేఘం’ నవల గురించీ, అందులోని అన్వర్ పాత్ర గురించి, కార్పోరేట్ ఆస్పత్రులు చేస్తున్న దుర్మార్గాలూ దోపిడీల ఇతివృత్తంతో రాసిన “జీవన్మృతులు’ నవల గురించి, కార్పోరేట్ విద్యాసంస్థల నేపథ్యంతో రాసిన ‘పడగనీడ’ గురించి, దూదేకుల జీవిత నేపథ్యంతో రాసిన ‘దూదిపింజలు’ నవల గురించి ప్రస్తావించారు.

    చివర్లో సలీం తన స్పందన తెలియచేస్తూ ‘అనూహ్య పెళ్ళి’ నవల్లో కొంతభాగం తాము ఎదుర్కొన్న వాస్తవిక సమస్యలనీ, మిగతాదంతా కల్పన అని చెప్పారు. గీతానాగరాణి పిహెచ్.డి పట్టా పొందడానికి పడిన శ్రమ గురించీ, యూనివర్శిటీల్లో కొందరు గైడ్లు పి.హెచ్.డి విద్యార్థుల విషయంలో ప్రవర్తించే తీరు గురించి మాట్లాడారు. తమ దంపతులకు డా. యస్వీ సత్యనారాయణగారి కుటుంబంతో, డా. నిర్మలాదేవి గారి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సభకు విచ్చేసి ప్రసంగించిన శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు గారికి, డా. యాకూబ్ గారికి ధన్యవాదాలు తెలియచేశారు. డా. గీతానాగరాణి తన గురువులైన డా. యస్వీ సత్యనారాయణ గారికి, డా. నిడమర్తి నిర్మలాదేవి గారికి శాలువాలు కప్పి సత్కరించారు. పుస్తక రచయితలకు మానస ఆర్ట్స్ ధియేటర్ తరఫున సన్మాన కార్యక్రమం తర్వాత సభ ముగిసింది.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here