రేపటి పౌరులు

0
9

[dropcap]ఉ[/dropcap]దయం తొమ్మిది గంటల వేళ. విజయవాడ రైల్వే స్టేషన్ వచ్చి, పోయే రైళ్ళతో, రకరకాల మనషులతో చాలా సందడిగా ఉంది. తాము ఎక్కవలసిన రైలు రావడంతో లగేజ్‌లు మోసుకుంటు పిల్లలు, పెద్దలు ఒకరినొకరు నెట్టుకుంటు రైలు అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. తినుబండారాలు అమ్మేవాళ్ళ రొద చెప్పనే అక్కరలేదు. ఐస్ క్రీంలు, వేరుశనక్కాయలు, టీ, కాఫీలు, సమోసాల లాంటి ఐటమ్స్ – అమ్మేవారి చేత సప్తస్వరాలు పలికిస్తున్నాయి. ఇంతలో నేను ఎక్కాల్సిన ఎక్స్‌ప్రెస్ వచ్చి స్టేషన్‌లో ఆగింది. ప్రయాణికులు రైలు ఎక్కడానికి వారి వారి సామాన్లతో ముందుకు కదిలారు. నేను నా లగేజ్‍ని చేతిలోకి తీసుకుని రైలు ఎక్కడానికి రెడీ అయాను. బ్యాగ్‌లు రెండు బరువుగా ఉండడంతో వాటిని ఈడ్చుకుంటు మందుకు కదిలాను.

ఇంతలో ఓ పదేళ్ళ పిల్లవాడు నా ముందు కొచ్చి “మేడమ్ మీ బ్యాగ్ ఇటివ్వండి మేడమ్, నేను తీసుకెళ్తాను” అంటూ నా వెంటపడ్డాడు. “వద్దులే, నేను తీసుకెళ్తాలే, నువ్వు మొయ్యలేవు. చాలా బరువుగా వుంది” అన్నాను. “లేదు మేడమ్, నాకు రోజు అలవాటే. నెత్తి మీద పెట్టుకుని తీసుకెళ్తాను. పది రూపాయలివ్వండి మేడమ్ చాలు” అంటూ వెంటపడ్డాడు. నాలోని జాలి గుండె వాడికర్థమైంది. అందుకే ఇచ్చేదాక ఊరుకోలేదు. నా చేతిలోని బ్యాగ్ అందుకుని నెత్తి మీద పెట్టుకున్నాడు. “రిజర్వేషన్ ఉందా మేడమ్? సీటు నంబరు ఎంత?” అంటూ నా వెనకే పరుగు లాంటి నడకతో నన్ను అనుసరించాడు. ఎలాగూ రిజర్వేషన్ ఉంది కనుక ఎక్కువ కష్టపడకుండా నా సీటులో కూర్చున్నాను. ఆయాస పడుతూ, పట్టిన చమటను తుడుచుకుంటూ, నేనిచ్చే పది రూపాయల కోసం నిల్చున్నాడా పిల్లవాడు. డబ్బులిస్తూ “నీ పేరు ఏమిటి?” అని అడిగాను. “నా పేరు శీనండీ” అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు. వాడి నవ్వు చూస్తే చాలా జాలేసింది. పది రూపాయల కోసం అంత బరువు మోసుకొచ్చాడు. స్వాతంత్ర్యం వచ్చి డెభై సంవత్సరాలు దాటినా, పిల్లలను కార్మికులుగా మార్చిన, మన సమాజ అసమర్థత మీద జాలేసింది. ఆ సమాజంలో నేనూ భాగస్వామినే కదా! చట్టాలు కేవలం పేరుకే పరిమితమవుతున్నాయి. వ్యవస్థలో ఎలాంటి మార్పు రాలేదు. అందుకే రేపటి పౌరులుగా ఎదుగవలసిన బాల్యం నీరుగారిపోతోంది.

జాలితో నా గుండె బరువెక్కింది. మెడిసిన్ పూర్తి చేసిన నేను తిరుపతిలో ప్రాక్టీస్ పెట్టాలని అక్కడికి బయలుదేరాను. అది సొంత ఊరు కావడంతో అక్కడైతే బాగా డబ్బు సంపాదించ వచ్చనేది నా ఆలోచన. ఎవరికి వారు చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు ఇలా వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇస్తున్నారే గాని సామాజిక సమస్యల నెవరూ పట్టించుకోవడం లేదు అనిపించింది నాకు. ఇంతలో కాఫీ, టీ అని వినిపించింది నాకు. కాఫీ తాగాలనిపించి ‘కాఫీ, కాఫీ’ అని పిలిచాను. రెండు పెద్ద ఫ్లాస్క్‌లు పట్టుకున ఓ అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయికి నిండా పదేళ్లయినా ఉండవేమో. గ్లాస్ నిండా కాఫీ, ఇచ్చి ఐదు రూపాయలిమ్మంది. ‘నీ పేరేమిట’ని అడిగాను. “నా పేరు గౌరి అండి” అంది. “అమ్మితే నీకెంత ఇస్తారు?” అడిగాను. “వందరూపాయలండీ” అంది. “స్కూలుకు వెళ్ళాలని, చదువుకోవాలని లేదా నీకు?” అడిగాను “ఉందండి, కానీ మా నాన్న తాగుతాడండీ, ఇంట్లో డబ్బు లీయడు. మా అమ్మ ఇళ్ళల్లో పనులు చేస్తుంది. చిన్న తమ్ముడున్నాడు. మేమందరం తినాలంటే నేను పని చెయ్యాలి” అని చెప్తుంటే ఆ పిల్ల కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. వందనోటు ఆ అమ్మాయి చేతిలో పెట్టాను. వద్దంటూనే మోహమాటంగా తీసుకుంది. ఇంత చిన్న వయసులో ఏమిటీ కష్టాలు? వీళ్ళిద్దరే కాదు. దారి పొడుగునా ట్రైన్‌లో అమ్మకాలన్నీ పిల్లల చేతి మీదుగానే జరుగుతున్నాయి. ఇంత చిన్న వయసులో జీవితాన్ని భారంగా మోస్తున్న ఈ పసి పిల్లలకు ఏదో చెయ్యాలి అనిపించింది నాకు.

సంవత్సరం క్రితం నా స్నేహితురాలు నన్ను చూడమని ఒక డాక్యుమెంటరీ పంపింది. వీధి బాలలు, బాల కార్మికులకు సంబంధించిన ప్రోగ్రామ్ అది. వివిద కారణాల వల్ల ఇంటికి దూరమైన పిల్లలు, తండ్రి మద్యపానానికి బానిస కావడం, తల్లి అనారోగ్యంతో పని చెయ్యలేకపోవడం, అవిద్య, అనాగరికత, చాలీ చాలని సంపాదన ఇవన్నీ పసి వయసులోనే పిల్లలు కార్మికులుగా మారడానికి కారణాలవుతున్నాయి. పొలాలలో, ఫ్యాక్టరీలలో రోజు వారీ కూలీలుగా, రైళ్ళల్లో, బస్సుల్లో తినుబండారాలు అమ్ముతూ, సైకిల్ షాపుల్లో, హోటల్లలో ఇలా బాల కార్మికులు పని చేస్తూ ఉంటారు. అమ్మ, నాన్న అందించే ప్రేమతో సాగిపోవలసిన బాల్యం, రకరకాల సమస్యలతో కార్మికుడిగా సాగిపోతున్నది. ప్రభుత్వ పథకాలు వీరికి చేరుతున్నాయా? వాటికి ఎంత వరకు వినియోగించుకోగలుగుతున్నారు? అనేది ప్రశ్నార్థకమే. కొన్ని రకాల సంస్థలు వీరికి ఆసరాగా నిలిచి విద్యావకాశాలే కాకుండా పోషణను కల్పిస్తున్నాయి. అలాంటి సంస్థల గురించి ఆ డాక్యుమెంటరీ చాలా మంచి వివరణ ఇచ్చింది. టీ తోటల్లో, కోకో తోటల్లో పని చేస్తూ వాటిని ఒకసారి కూడా రుచి చూడని పిల్లలు, ఒంటి మీద కనీసపు బట్టలకు నోచుకోని పిల్లలు, గనుల్లో పని చేస్తూ, విలువైన సంపదను దేశానికి అందిస్తూ, కనీసపు ఆహారానికి నోచుకొని పిల్లలు, అవన్నీ నేను అప్పట్లో పట్టించుకోలేదు. కానీ అదంతా నా కళ్ళముందు మెదులుతుంటే నా గుండె బాధతో బరువెక్కింది. 20 సంవత్సరాల క్రితం కొన్ని వేల ప్రజలు చేసిన పాదయాత్ర ఫలితంగా బాలకార్మిక వ్యతిరేక చట్టం పుట్టింది. కానీ ఏ దేశం కూడా బాల కార్మికులు లేని దేశంగా నిలబడలేకపోయింది. నాకు అంతా గుర్తుకొచ్చింది. ఇలాంటి పిల్లలకోసం తాను డబ్బు కలెక్ట్ చేస్తున్నాననీ, కొద్ది మంది నైనా ఈ వ్యవస్థ నుండి బయటకు తేవాలని. నా ఫ్రెండ్ చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చాయి. అప్పట్లో చదువు హడావిడితో నేను ఇవన్నీ పట్టించుకోలేదు. కానీ ఈ పిల్లలందరినీ చూసిన తర్వాత అర్థమైంది నాకు. అది ఎంత గొప్ప విషయమో. సమాజంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉండబోతున్న నేను, నా కర్తవ్యం ఏంటో తెలుకున్నాను. నేను నా ప్రెండ్‍తో చేయి కలపాలని నిశ్చయించుకున్నాను.

రేపటి పౌరులుగా ఎదగవలసిన ఈ పిల్లలు పని పిల్లలు కాదని సమాజానికి ఎలుగెత్తి చాటాలనుకున్నాను. నా ఫ్రెండ్ మార్గంలో నేను సాగిపోయి నా లక్ష్యానికి రాచబాట నిర్మించాలనుకున్నాను. పది మంది సహకారంతో ఈ వ్యవస్థ పూర్తిగా సమసిపోవాలనీ కోరుకున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here