మంచి మార్గం చూపే బాలల కథలు

0
10

[dropcap]శ్రీ[/dropcap]మతి పి.యస్.యమ్. లక్ష్మి గారు రచించిన బాలకథల సంపుటి ‘రేపటి తరం సైంటిస్ట్’. పిల్లలకు సులువుగా అర్థమయ్యేలా, చిన్న చిన్న వాక్యాలలో సత్ప్రవర్తన నేర్పే కథలివి. ఇంట్లో పెద్దలూ, బడిలో ఉపాధ్యాయులు కూడా పిల్లలకి చదివి వినిపించదగ్గ కథలు ఇవి.

ఈ పుస్తకంలో 15 కథలు ఉన్నాయి. కథలకి తగిన అందమైన చిత్రాలను కోయిలాడ రామ్మోహన్ గీశారు. ప్రముఖ చిత్రకారులు శ్రీ బాలి పుస్తకం ముఖచిత్రం గీశారు. పిల్లలను, పెద్దలను ఆకట్టుకునే ఈ కథల గురించి తెలుసుకుందాం.

***

‘రేపటి తరం సైంటిస్ట్’ అనే కథలో ఆరీ, నివీన్‌లకు వాళ్ల అమ్మ పర్యావరణ సంరక్షణ, చెట్లను పెంచటం వంటి మంచి పద్ధతులను బాగా నేర్పడమే కాక వాళ్లకి కొన్ని వీడియోస్, T.Vలో కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఏవి ఉపయోగకరమో అవి వాటిని చూపించేది. దీని వల్ల పిల్లల్లో సృజనాత్మక శక్తి పెరుగుతుంది. వాళ్లు వాళ్ల అమ్మ చూపించిన వీడియోస్ వల్లనో, బడిలో విన్నారో గాని సముద్రంలో చెత్త పేరుకు పోతోందని దాని వల్ల జల కాలుష్యంతో పాటు జలచరాలకు ముప్పు అని తెలుసుకొంటారు. తాను ఒక మెషీన్‌ని కనిపోడతామని, అది సముద్రంలోని చెత్తనంతా తీసివేసి స్పేస్ షటిల్ ద్వారా ఔటర్ స్పేస్‌లో పడేసి, అక్కడే దాని నాశనం చేస్తుందని చెప్తాడు ఆరీ. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నా చిన్న బుర్రకి ఇటువంటి ఆలోచన రావడం అభినందనీయం.

‘వడ్రంగి పిట్ట తెలివి.. పిట్ట కొంచెం తెలివి ఘనం’ కథ వడ్రంగి పిట్ట, పులి మధ్య జరుగుతుంది. ఒక రోజు పులి ఆహారాన్ని తీసుకుంటున్న సమయంలో ఒక ఎముక దాని నోట్లో ఇరుక్కుంది. దానిని తీయటానికి చాలా ప్రయత్నం చేసింది. అక్కడే వున్న వడ్రంగి పిట్ట దాన్ని చూసి జాలితో పులితో తాను ఆ ఎముకను తీసేస్తానని అయితే తనవి రెండు షరతులు అని చెబుతుంది. అవి ఒకటి పులి ఎముకను తీసేసమయంలో తనని తినరాదు. రెండవది  పులి తెచ్చుకున్న ఆహారంలో తనకి కొంత పెట్టాలి అని. పులి అందుకు అంగీకరిస్తుంది. వడ్రంగి పిట్ట పులి నోట్లోని ఎముకని తీసేస్తుంది. పులి కూడా తన మాట నిలుపుకుంటుంది. ప్రతి రోజూ తన ఆహారంలో కొంత వడ్రంగి పిట్టకి ఇచ్చేది. అయితే కొంతకాలానికి పులి అంత చిన్న పిట్టకు తను సహాయం చేయటం ఏమిటని మానుకుంటుంది. వడ్రంగి పిట్ట అది గమనించి పులి నిద్రపోతున్నప్పుడు పులి కన్నును పొడుస్తుంది. పులికి కోపం వస్తుంది. అప్పుడు వడ్రంగి పిట్ట నువ్వు నీ వాగ్దానాన్ని నిలపుకోలేదని అంటుంది. ఎవరైనా వాగ్దానం చేసినప్పుడు దానిని నిలుపుకోవాలని ఈ కథ చెబుతుంది.

‘ఐకమత్యమే మహా బలము’ కథ తెలంగాణాలో నిజంగా జరిగింది. ఒక గేద తన దూడను చిరుతపులి నుండి కాపుడుకోడానికి తను చేసిన సాహసానికి తోటి గేదెలు కూడా సాయం రావటంతో పులిని ఎదిరించి దాని బారినుండి దూడను రక్షించుకుంటుంది. అందుకే ఐకమత్యమే మహా బలం అంటారు. బద్దెన గారు వ్రాసిన ‘బలవంతుడ నాకేమని..’ అనే పద్యాన్ని సందర్భోచితంగా కథలో ఉపయోగించారు రచయిత్రి.

‘గాడిద సంగీతం’ అనే కథలో ఒక గాడిద తన యజమానితో సమానంగా కష్టపడుతూ ఊరి వారి బట్టలు మోయటంలో సహాయపడుతుంది. యజమాని పేదవాడు కావడంతో తనకు కూడా సరైన భోజనం వుండేది కాదు. ఒకసారి ఆ గాడిదకు నక్కతో స్నేహం కుదిరింది. నక్క పక్కనున్న పొలంలో దోసకాయలు బాగా వున్నాయని, తిందామని అంటే రెండూ కలిసి ప్రతిరోజూ రాత్రి పూట వాటిని తింటూంటాయి. ఒక రోజు గాడిద తాను చాలా సంతోషంగా వున్నానని పాడతానని చెబుతుంది. అది విని నక్క వద్దని వారిస్తుంది. గాడిద పట్టు వదలదు. అప్పుడు నక్క తెలివిగా తప్పుకుంటుంది. గాడిద తాను పాడటం మొదలు పెడుతుంది. పొలం యజమాని వచ్చి చావబాదుతాడు. సమయానుకూలంగా ఎలా ప్రవర్తించాలో తెలిసి వుండాలని ఈ కథ హెచ్చరిస్తుంది.

‘భూత దయ’ కథలో పిల్లవాడైన రామూ చేసిన మంచి పనిని సోమూ ద్వారా తెలుసుకున్న టీచరు రాము క్లాసుకి రాగానే మెచ్చుకుంటారు. అందరు పిల్లలతో రాము చేసిన పని గురించి చెబుతూ – రాము తాను స్కూల్‌కి వస్తున్న దారిలో గాయపడిన కుక్కకు ప్రథమ చికిత్స చేసి రావటం చాలా మంచి పని అని, భూత దయ కలిగి వుండాలని చెబుతారు టీచర్.

‘దెయ్యాన్ని పారదోలిన ఈజా – ఊజా’ కథ రెండు ఎలుకల మధ్య నడుస్తుంది. అవి ఒక బేకరీలో వుండేవి. అక్కడ తయారయ్యేటప్పుడు కింద పడే పదార్థాలను స్వేచ్ఛగా తినేవి. ఆయితే ఒక పుకారు వల్ల ఆ బేకరీ మూతపడే స్థితికి వచ్చింది. ఆ పుకారు అక్కడి మఱ్ఱి చెట్టు పైన దైయ్యం వుందని. అప్పుడు ఆ ఎలుకలు తమ యజమని తాము ఎలా తిరిగినా ఇబ్బంది పెట్టలేదని, అతనికి సహాయం చేయాలని తలచి ఆ దయ్యం సంగతి తేల్చాలని అనుకుంటాయి. ఆ దెయ్యం ఎవరైనది కనిపెట్టి దానిని ఎలా పంపించి వేశాయో కథ చదివి తెలుసుకోవాలి.

‘భయం పోయింది’ అనే కథలో టెడ్డీ అనే ఒక ఎలుగుబంటి పిల్ల చాలా బిడియంగా ఉంటూ, తన తోటి వారితో ఎవరితోనూ కలవకుండా ఉంటుంది. తన ఒంటి మీద వున్న బొచ్చు చూసుకొని తన తోటి జంతువులు తనను ఏమనుకుంటాయో అని అనుకుంటూ వుండేది. తల్లి ఎంత చెప్పినా వినదు. అది ఒకసారి ఆదమరిచి నిద్రపోయినప్పుడు దాని పక్కన చేరి మిగతా జంతువులు ప్రవర్తించిన తీరు చూసి తన భయాన్ని పోగొట్టుకుంటుంది.

ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైన కథ ‘మార్గదర్శి’. కథ చాలా బాగుంది. కార్తీక్, ప్రవీణ్ ఒకే స్కూల్‌లో చదువుకునే పిల్లలు. కార్తీక్ జ్వరం వల్ల నాలుగు రోజులు స్కూల్‌కి వెళ్లలేకపోతాడు. తనకి లెక్కలు అంటే భయమని ప్రవీణ్‌ని తనకు లెక్కలు చెప్పమని అడుగుతాడు. కార్తీక్ ప్రవీణ్ ఇంటికి వెళ్లి నప్పుడు ప్రవీణ్ వాళ్ల అమ్మా నాన్నా రావడం; ప్రవీణ్ వాళ్లతో ప్రవర్తించే తీరు, వారి సహాయపడటం, తన దినచర్య గురించి తెలుసుకుని తాను కూడా తన తల్లిదండ్రులకు సహాయపడాలని, మంచిగా చదువుకోవాలని, తీర్మానించుకోవడం బాగుంది.

‘సమయం విలువ’ కథలో ఒక చిన్న పిట్ట ద్వారా సమయం విలువను తెలిపారు. ఒక పిట్ట చాలా బాగా పాడుతుంది. అడవిలో ఒక రోజు ఒక వేటగాడు ఆ పిట్టను వలలో బంధిస్తాడు. అప్పుడు అది ఒక ఎలుక సహాయంతో బయటపడుతుంది. కాని దానికి పగటి పూట పాటం భయం వేసి రాత్రి పూట పాడటం మొదలు పెడుతుంది. దానితో మిగతా పిట్టలు దానికి రాత్రి పూట పాట పాడటం వల్ల జరిగే పరిణామాలు చెప్పి సమయం పాటించాలి అని బుద్ధులు చెబుతాయి.

సరైన మందు’ కథ ఇప్పటి పరిస్థితులకు సరిగ్గా సరిపోతుంది. సోమయ్యకు స్వామీజి ఇచ్చిన మందు, దానిని వాడే విధానం చాలా చక్కగా చెప్పారు. వ్యాయామం వంటికి అవసరమని గట్టిగా చెబుతారు రచయిత్రి.

ఎలుకలా!? మజాకా!??’ కథలో – ఒక ఊరిలోని ఒక మిఠాయి కొట్టులో వున్న ఎలుకలు అక్కడి పదార్థాలను పాడు చేస్తుంటాయి. వాటిని తరమటానికి ఆ కొట్టు యజమాని చేసిన  ప్రయత్నాలు, ఆ ఎలుకలు తెలివిగా తప్పించుకోవడమే కాక ఆ యజమానికి ఎంతటి నష్టాన్ని కలిగించాయో చదివితే ఎలా జాగ్రత్త పడాలో అర్థం అవుతుంది.

ఆరోగ్య సూత్రాలు’ కథలో రంగారావుగారు అనే ఆయన తన తల్లిని చూడటానికి ఊరు వెళ్తారు. అప్పుడు ఒక పిల్లి వారి ఇంట్లోకి జొరపడి మిగిలిన ఆహార పదార్థాలు తింటుంది. దానికి ఎప్పుడు దొరకనంత ఆహారం దొరకడంతో అది బాగా తిని ఆయాసపడుతుంది. ఆ ఆయాసం తనకి వ్యాయామం లేకపోవటం వల్ల అని తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శరీరానికికి వ్యాయమం అవసరమని, మితమైన ఆహారం ఆరోగ్యం అని తెలుసుకుంటుంది ఆ పిల్లి.

శ్రద్ధ అవసరం’ కథలో శ్రద్ధ చాలా అవసరం అని చెప్తారు. శ్రద్ధగా ఏ పనియైనా చేస్తే దాని ఫలితం బాగుటుందని ఒక కాకి కథ ద్వారా తెలిపారు రచయిత్రి. ఈ కథను ఆసాంతం చదివి నీతిని తెలుసుకుంటే మంచిది.

ఇంకా, ఈ పుస్తకంలోని ‘మృగరాజు చిట్టెలుక’, ‘చిన్నోడి తెలివి’ కథలు ఆసక్తిగా చదివిస్తాయి.

***

రేపటి తరం సైంటిస్ట్ (బాల సాహిత్యం)
రచన: పి.యస్.యమ్. లక్ష్మి
పేజీలు: 56
వెల: ₹ 120/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
రచయిత్రి: 9866001629
ఆన్‌లైన్‌లో తెప్పించుకునేందుకు
https://www.amazon.in/Repati-Taram-Scientist-Children-Illustrations/dp/B09X79LCTD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here