రేపటిని ప్రేమించు

0
7

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో ₹ 2500/- బహుమతి పొందిన కథ. రచన కోపూరి పుష్పాదేవి గారు. ఈ కథకు ప్రైజ్ మనీని అందించిన వారు సంచిక వెబ్ పత్రిక.]

[dropcap]ముం[/dropcap]దర పూల మొక్కలు, పండ్ల చెట్లు వున్న విశాలమైన భవనం. దానికి అందంగా అమరిన పెద్ద గేటు.

డా.హరిప్రసాద్ M.D,D.M., అన్న అక్షరాలతోవున్న ఒక బోర్డు ఆ భవనానికి హుందాతనాన్ని తెస్తోంది.

“ఏమోయ్ బావా ఏం చేస్తున్నావు? నీకేమిటయ్యా భార్య ఆదిలక్ష్మి, కోడలు శ్రీలక్ష్మి. ఇంట్లో ఇద్దరు లక్ష్ములుండగా నీకేం తక్కువ చెప్పు!” అంటూ వచ్చాడు శంకర్రావు సాయంత్రం చల్లబడగానే.

“రావయ్యా శంకరం. నీకోసమే చూస్తున్నా. నువ్వొచ్చేదాకా నాకు టీ కూడా ఇవ్వదుగా మీ చెల్లెలు” భార్య మీద ఫిర్యాదు చేసినట్లుగా అన్నాడు నారాయణమూర్తి.

“శంకరం వచ్చాక తాగుదాములే అని మీరే అంటారు. మళ్ళీ నామీద నింద ఒకటా?” అంటూ నవ్వుతూ ముగ్గురికీ టీ తీసుకువచ్చింది ఆదిలక్ష్మి.

“ఈవేళ వాన వచ్చేటట్లుగావుంది. వాకింగ్ వద్దులే” అంటూ టీ తాగుతూనే చదరంగం బల్లమీద పావులు సర్దసాగాడు నారాయణమూర్తి.

“వాడు వూరికే సరదాకు అంటాడులే అమ్మాయ్” తనూ నవ్వుతూ అని చేతిలోకి తెల్ల బంటును తీసుకున్నాడు శంకరం మొదటి ఎత్తు వెయ్యడానికి.

ఇద్దరిలో ఎవరికయినా ఆటలో క్లిష్ట పరిస్థితి వస్తే చక్కని ఉపాయంతో దానిని దాటిస్తుంది ఆదిలక్ష్మి.

అలా నారాయణ మూర్తి గెలిచినప్పుడు శంకరం, శంకరం గెలిచినప్పుడు నారాయణ మూర్తి అలిగినట్లు నటిస్తూ వుంటారు. రెండు నిముషాల తర్వాత ముగ్గురూ హాయిగా నవ్వుకుంటారు.

శంకరం, నారాయణమూర్తి ఇద్దరూ పి.డబల్యూ.డి.లో ఇంజనీర్లుగా పనిచేసి పదవీ విరమణ చేశారు.

వారిది చిరకాల స్నేహం. అందువల్ల వారిమధ్య కుటుంబ స్నేహమూ ఎక్కువే. ఇద్దరూ సాయంత్రం పూట ఎవరో ఒకరి ఇంట్లో కలుసుకోవడమూ, ఒక గంట సేపు వాకింగ్‌కి వెళ్ళి వచ్చి లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ చదరంగం ఆడుకోవడం వాళ్ళ నిత్యకృత్యం.

నారాయణమూర్తికి ఒక్కడే కొడుకు హరిప్రసాద్. కార్డియాలజిస్టుగా ఒక కార్పొరేట్ హాస్పిటల్లో పని చేస్తున్నాడు. అతనికి ఇద్దరు పిల్లలు. కూతురు ప్రణీత ఇంటర్ సెకండియర్, కొడుకు ప్రణయ్ టెన్త్ క్లాస్ చదువుతున్నారు. ఉమ్మడి కుటుంబం. ‘చీకూ, చింతా లేని సంసారం వాళ్ళది’ అనుకుంటారు అందరూ (లోగుట్టు పెరుమాళ్ళకు ఎరుక).

శంకర్రావుకు ఇద్దరు కూతుళ్లు. ఇద్దరికీ పెళ్ళి అయింది. ఒకరు వైజాగ్ లోనూ, మరొకరు హైదరాబాద్ లోనూ ఉంటున్నారు.

***

“డాడీ నాకు బైక్ కొనివ్వండి. నేను స్కూల్‌కి బస్‌లో వెళ్ళను” ఆరోజు ఉదయం కాఫీ తాగుతున్న తండ్రి దగ్గర బాంబు పేల్చాడు ప్రణయ్.

“అరే ప్రణయ్ నీకు అప్పుడే బైక్ ఎందుకురా? ఇంటర్ అయ్యాక చూద్దాం” అన్నాడు హరిప్రసాద్ చదువుతున్న పేపర్ పక్కనపెట్టి.

“కాదు. నాకిప్పుడే కావాలి. మా ఫ్రెండ్స్ అందరూ బైకుల మీదే స్కూలుకు వస్తున్నారు. అయినా ఫైనల్ ఎక్జామ్స్ ఇంకా మూడు నెలలేగా వున్నాయి, ఆ తర్వాత ఎటూ కాలేజీకి వెళ్ళేటప్పుడు కావాల్సిందే కదా. అందుకే ఇప్పుడే కొనెయ్యండి నాన్నా” అన్నాడు ప్రణయ్ కచ్చితంగా వెంటనే కొనవల్సిందే అన్నట్లు.

“అరే చెప్పేది నీక్కాదూ. నీకు అప్పుడే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు. లైసెన్స్ లేకుండా బండి నడపకూడదు. అందువల్ల ఇప్పుడే నీకు బైక్ కొనను” తనూ గట్టిగా చెప్పాడు హరిప్రసాద్.

“ఎందుకు కొనరు? మా ఫ్రెండ్స్ అందరూ బైక్ వాడుతున్నప్పుడు నేనెందుకు వాడకూడదు?” చిందులు తొక్కాడు ప్రణయ్.

“నువ్వింకా చిన్నవాడివికదా ప్రణయ్. కొంచెం పెద్దయినాక నాన్న తప్పకుండా కొనిపెడతారులే” అంటూ మనవడికి నచ్చచెప్పారు నారాయణమూర్తి.

“బైక్ కొనేదాకా నేను అన్నం తినను. స్కూల్‌కి వెళ్ళను” విసురుగా అన్నాడు ప్రణయ్ తాతగారి మాట లెక్కలేనట్లు.

“అంత మొండితనం పనికిరాదు ప్రణయ్” కోపంగా అన్నాడు హరిప్రసాద్.

“ఏం మీకు మాత్రం అంత మొండితనం ఎందుకు? ఏదో బిడ్డ ఆశపడ్తున్నాడు. వాడి కోరిక తీర్చవచ్చు కదా” అన్నది శ్రీలక్ష్మి కొడుకుని వెనకేసుకువస్తూ.

“నువ్వు కూడా అలా మాట్లాడతావేమిటి లక్ష్మీ, లైసెన్స్ లేకుండా బండి నడపచ్చా? అది రూల్‌కి విరుద్ధం కదా” అన్నాడు హరిప్రసాద్.

“అబ్బో గొప్ప రూలు. అందరూ తెగ పాటించేస్తున్నారు పాపం. వాడికి గనుక మీరు బైక్ కొని పెట్టకపోతే నేను మా నాన్నను అడిగి డబ్బు తీసుకుని వాడికి బండి కొని పెడతాను” అంటూ “నువ్వు రా నాన్నా టిఫిన్ చేద్దువుగాని” అంటూ కొడుకును పిలిచింది శ్రీలక్ష్మి.

తల్లీ, కొడుకూ హరిప్రసాద్‌నూ, నారాయణమూర్తినీ క్రోధంగా చూస్తూ లోపలకు వెళ్ళిపోయారు.

నిశ్చేష్టులవటం ఈ తండ్రీకొడుకుల వంతయింది.

***

బయట ఉరుములు, మెరుపులతో వుంది వాతావరణం.

“అమ్మా ప్రణూ ఎనిమిదిన్నర అయింది. వర్షం వచ్చేట్లుగా కూడా వుంది. ఇంక నిద్ర లేమ్మా, మరో అరగంటలో నువ్వు కాలేజీకి వెళ్ళాలి కదా. ఇంకా స్నానం, టిఫినూ అవ్వాలి” మనుమరాలిని నిద్ర లేపుతూ అన్నది ఆదిలక్ష్మి.

“అబ్బబ్బా. లేస్తాలే నానమ్మా. కాసేపయినా ప్రశాంతంగా పడుకోనివ్వవు” అంటూ మరింత గట్టిగా ముసుగు పెట్టింది ప్రణీత.

“అలా అంటే ఎలారా తల్లీ. మళ్ళీ టైము లేదని టిఫిన్ తినకుండా వెళ్తానంటావు. లే,లేచి స్నానం చెయ్యి” ప్రణీతను కుదుపుతూ అన్నది ఆదిలక్ష్మి.

“అబ్బబ్బ. ఒకటే సొద గదా మీది. ఒక్కపూటకి స్నానం చెయ్యకపోతే ఏమవుతుంది? టిఫిన్ తిని వెళ్తుందిలే. దాని సంగతి అదే చూసుకుంటుంది. మీకెందుకు వదిలెయ్యండి” అంటూ అత్తగారిని మీద గయ్యిమని అరిచింది శ్రీలక్ష్మి.

ఆదిలక్ష్మి మారుమాట లేకుండా గదిలోంచి బయటకు వచ్చేసింది. తరచూ ఇలాంటి సంఘటనలు ఆ ఇంట్లో పునరావృతమవుతూనేవున్నాయి. రోజురోజుకూ పరిస్థితులు ఇంకా ఇంకా క్లిష్టంగా మారుతున్నాయి.

‘ఇది తమ ఇల్లేనా? వాళ్ళు తమ మనుమలేనా?’ అనే సందేహం ఆదిలక్ష్మి మనసులో ముల్లులా కెలుకుతున్నది. ఆ రాత్రి తన మనసులోని వ్యథను భర్తతో పంచుకున్నది.

“ఏమిటండీ, కోడలు మరీ ఇలా తయారవుతున్నది? మనకున్నది వాడొక్కడు. ఆ నలుగురి మీదే ప్రాణాలన్నీ పెట్టుకుని మనం బ్రతుకుతుంటే ఈవిడ మనల్ని పరాయి వాళ్ళలా చూస్తున్నది. మనల్ని అంత దూరంలో నిలబెడుతున్నది. మనతో ఒక్క నాడూ ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడదు. మసలుకోదు. నేను తట్టుకోలేకపోతున్నానండీ” అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నది ఆదిలక్ష్మి.

“ఇదుగో లక్ష్మీ ఈ ప్రపంచంలో బాధలు లేని మనిషి ఉంటాడా చెప్పు. ఒకొక్కరిది ఒకోరకం బాధ. మనకి ఈ రకంగా సంప్రాప్తమయింది. కానీ, ఎప్పటికయినా మనకి మంచిరోజులు రాకపోవు. కోడలి మనసు మారకపోదు. అప్పటిదాకా మనం ఓపిక పట్టాలి. సర్దుకుపోవాలి. మన అబ్బాయి కోసం. పిల్లల కోసం” అంటూ భార్యను ఓదార్చాడు నారాయణమూర్తి.

***

“ఏం నాన్నా హరీ, మీ ఎమ్.డి. గారింట్లో ఫంక్షన్ బాగా జరిగిందా?” హాల్లో కూర్చుని పేపర్ చూస్తున్న కొడుకుని అడిగాడు నారాయణమూర్తి. ఆదిలక్ష్మి కూడా అక్కడే కూర్చుని గోధుమలు బాగుచేస్తున్నది.

కోడలు, పిల్లలు ఎక్కడికో వెళ్ళారు.

“ఫంక్షన్ బాగానే జరిగింది కానీ” అంటూ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు హరిప్రసాద్. అతని ముఖం చిన్నబోయివుంది.

“ఏం నాన్నా ఏమయింది? ఏం జరిగింది నాన్నా హరీ” తల్లీ, తండ్రీ ఇద్దరూ ఒకేసారి గాభరాగా ప్రశ్నించారు.

“ఏమీలేదు” అంటూ అక్కడినుంచి వెళ్ళబోయాడు హరిప్రసాద్.

“ఏమయిందో చెప్పయ్యా. మాకు కాకపోతే ఎవరికి చెప్పుకుంటావు?” బాధగా అడిగింది ఆదిలక్ష్మి.

నారాయణమూర్తి కూడా కొడుకు వైపు ప్రశ్నార్ధకంగా చూశాడు.

ఇక చెప్పక తప్పలేదు హరిప్రసాద్‌కి.

“ఏమీలేదమ్మా అక్కడ మీ కోడలు మా ఎమ్.డి. గారితో నామీద లేనిపోనివన్నీ కల్పించి చెప్పింది. నేను తనను కాల్చుకు తింటున్నట్లూ, నేనూ, నువ్వూ, నాన్న కలిసి తననూ, పిల్లలనూ హింస పెడుతున్నట్లూ ఏవేవో చాలా చాలా చెప్పిందట. ఆయన అవన్నీ నమ్మేసి నలుగురిలోనూ నన్ను పిలిచి చడామడా చీవాట్లు పెట్టాడు. నాకు ఎన్నో నీతులు బోధించాడు. ఈవిడ గారు ఆయనగారి ప్రాణమిత్రుని కూతురు కదా. తప్పు చెయ్యకుండా చివాట్లు తినాలంటే ఎలావుంటుందో చెప్పండి” అంటూ ఎంతో వేదన చెందాడు హరిప్రసాద్.

“ఇన్నాళ్ళూ ఇంటి నాలుగు గోడల మధ్యనే కదా మన భాగవతం అనుకున్నాం. వీధిలోకి కూడా వ్యాప్తి చేస్తున్నదా కోడలు!” ఖిన్నుడైపోయినట్లు కూలబడ్డాడు నారాయణమూర్తి. ఆదిలక్ష్మికి దుఃఖం పొంగుకొచ్చింది. “మనకీ ఖర్మ ఏమిటిరా నాయనా” అంటూ కన్నీళ్ళు నింపుకుంది. హరిప్రసాద్‌లో కూడా ఎన్నాళ్ళుగానో దాగిన వేదన ఒక్కసారిగా పెల్లుబికింది.

“ఇంకా మీకు అన్ని సంగతులూ తెలియవు. మీరు బాధపడతారని చెప్పను. నన్నసలు భర్తగా చూడదు. బానిసలా భావిస్తుంది. వాళ్ళ అన్నదమ్ములతో పోలుస్తూ ఎంతో హీనంగా మాట్లాడుతుంది. నేను సంపాదించినదంతా ఆమె దోసిట్లో పోసినా ఆమెకు తృప్తి తీరదు. లక్షలకు లక్షలు అప్పులు చేసి ఆ భారం అంతా నా నెత్తిన పెడుతుంది. మరి, ఆ డబ్బంతా ఏమి చేస్తుందో తెలియదు. ఇంకా ఎన్నాళ్ళమ్మా మనకీ కష్టాలు? పెళ్ళయిన ఈ ఇరవై ఏళ్ళలో ఆమెతో అన్నీ కష్టాలే తప్ప సుఖమన్నది ఎరుగము. బంధువుల్లోనూ, స్నేహితుల దగ్గరా చులకన అయిపోతున్నాం. అవునన్నా తప్పే. కాదన్నా తప్పే. తను మూర్ఖంగా ప్రవర్తించడమే కాకుండా పిల్లలను కూడా పాడు చేస్తోంది. ఇంక నేను ఆమెతో తిప్పలు పడలేను. ఇంక నావల్ల కాదు” రెండు చేతులతో ముఖం కప్పుకుని ఎంతో ఖేదపడ్డాడు హరిప్రసాద్.

“మరి ఏం చేద్దామంటావయ్యా?” అడిగాడు నారాయణమూర్తి కొడుకు భుజంమీద చెయ్యివేసి.

“విడాకులు ఇచ్చి పారేస్తాను. మనకీ పీడ విరగడ అవుతుంది. ఆ తర్వాత మనం మనశ్శాంతిగా బ్రతకచ్చు” అన్నాడు హరిప్రసాద్ ఆక్రోశంతో.

కొడుకు మాటలు విని ఆదిలక్ష్మి ఉలిక్కిపడింది.

గాభరాగా అతని వంక చూసింది. “తప్పు నాన్నా కలలో కూడా అలాంటి ఆలోచన రానివ్వకు. అదే గనుక జరిగితే అభంశుభం తెలియని పిల్లలు అన్యాయమైపోతారు. వాళ్ళ కోసం మనం ఎన్ని బాధలైనా సహించాలి. ఎన్నెన్ని ఇక్కట్లైనా ఎదుర్కోవాలి” అన్నది ఆదిలక్ష్మి కొడుకు పక్కన కూర్చుంటూ.

నారాయణమూర్తి కూడా భార్య మాటను సమర్ధించాడు. పిల్లల గురించి ఆలోచించి విడాకుల మాట ఎత్తవద్దన్నాడు.

తల్లిదండ్రులు చెప్పిన విషయం గురించి చాలా ఆలోచించిన హరిప్రసాద్ ఆ ఆలోచనను తన మనసు లోంచి చెరిపివేశాడు.

***

ఆరోజు శంకర్రావు గారింట్లో వాళ్ళ మనుమరాలికి మెచ్యూర్ ఫంక్షన్ జరుగుతోంది. ఆ ఫంక్షన్‌కి శ్రీలక్ష్మి రానని చెప్పింది. ఆదిలక్ష్మి, నారాయణమూర్తి కారులో బయలుదేరారు. శంకర్రావు గారింటికి కొద్ది దూరంలో వీళ్ళ కారుకు యాక్సిడెంట్ జరిగి పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది. అతి వేగంగా దూసుకువచ్చిన లారీ ఒకటి వీళ్ళ కారును బలంగా గుద్దింది.

ఆ దెబ్బకు కారు పల్టీలు కొట్టింది. ఆదిలక్ష్మికి, డ్రైవరుకు బలమైన గాయాలయ్యాయి. తలకు తగిలిన దెబ్బవల్ల నారాయణమూర్తి అక్కడికక్కడే అశువులు బాశాడు.

***

నారాయణమూర్తి గారి దశదిన కర్మలన్నీ పూర్తయిపోయాయి. బంధువులందరూ వెళ్ళిపోయారు.

ఆదిలక్ష్మి ఈ పదిరోజులకే చిక్కిసగమైపోయింది. భర్త మరణాన్ని ఆమె జీర్ణించుకోలేక పోతున్నది. ఆహారం ముట్టదు. నిద్రపోదు. ఇరవైనాలుగు గంటలూ దుఃఖ సముద్రం ఆమెను ఆవరించి వున్నట్లే ఉంటోంది.

నెలలు గడుస్తున్నా ఆమె పరిస్థితిలో కొంచెం కూడా మార్పు రాలేదు. కోడలు గానీ, పిల్లలు గానీ ఆమెను అసలు పట్టించుకోవడమే లేదు.

హరిప్రసాద్‌కు తండ్రి మరణం ఒకపక్కన, తల్లి పడుతున్న వేదన మరోప్రక్కన అంతులేని వ్యధను కల్గిస్తున్నాయి. అడకత్తెరలో పోకచెక్కలా నలిపేస్తున్నాయి. తల్లిని తిరిగి మామూలు మనిషిని ఎలా చేయాలో అతనికి అర్థం కావడం లేదు. ఈ విషయంలో అతనికి భార్య తోడ్పాటు ఎంత మాత్రమూ లభించడం లేదు. లభిస్తుందన్న ఆశ కూడా అతనికి లేదు.

***

హరిప్రసాద్ వద్దని ఎంత వారించినా వినకుండా శ్రీలక్ష్మి పిల్లలిద్దరినీ హాస్టల్లో చేర్చింది. ఏవో పనులున్నాయని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎన్ని రోజులు గడిచినా ఆమె తిరిగి రాలేదు. ఆమెను వచ్చెయ్యమని హరిప్రసాద్ ఎన్ని ఫోన్లు చేసినా జవాబు లేదు. ఆమె ఇటు తిరిగి చూడడం లేదు.

పైపెచ్చు అత్తగారితోనూ, భర్తతోనూ బాధలు పడలేక పోతున్నాననీ, అత్తగారికి సేవలు చెయ్యలేకపోతున్నాననీ అందువల్ల హరిప్రసాద్‌కు విడాకులు ఇచ్చేస్తానని ఒక బంధువు ద్వారా కబురు చేసింది.

ఆవార్త విని హరిప్రసాదూ, ఆదిలక్ష్మీ శిలాప్రతిమలయ్యారు. నోట మాట రానట్టుగా అయ్యారు. కొద్దిసేపటికి తేరుకున్న హరిప్రసాద్ వాళ్ళ మామగారికి ఫోన్ చేస్తే ఆయన ఇంకా మూర్ఖంగా మాట్లాడాడు.

***

హరిప్రసాద్ నిబ్బరంగా వుండగలిగినా, కోడలి చర్య ఆదిలక్ష్మికి గొడ్డలిపెట్టు అయింది. భర్త మరణానికి తోడు ఈ సంఘటన ఆమెకు గోరుచుట్టుపై రోకటిపోటులా తాకింది. తీరని ఆ మనోవేదన పక్షవాతం రూపంలో ఆమెను కాటు వేసింది. ఎడమ చెయ్యి, కాలు చచ్చుబడిపోయాయి. మాట కూడా నంగిగా వస్తోంది.

తల్లికి దాపురించిన పరిస్థితికి హరిప్రసాద్ తల్లడిల్లి పోయాడు. నిలువునా నీరైపోయాడు. అతని హృదయం ద్రవించి పోతోంది. కోడలినీ, పిల్లలనూ ఇంటికి తీసుకురమ్మని ఆదిలక్ష్మి కొడుకుని సైగలు చేస్తూ అడుగుతోంది. కన్నీరు కారుస్తోంది. కానీ, భార్య విషయంలో అతను నిస్సహాయిడు.

“అమ్మా జీవితాన్ని ప్రేమించలేనివాళ్ళే మూర్ఖంగా ఆలోచిస్తారు. వాళ్ళు సుఖపడరు. ఎవరినీ సుఖపడనివ్వరు. నీ కోడలికి ఒక్క మూర్ఖత్వమే కాదు, అదరగణ్ణమూ, గయ్యాళితనమూ లాంటి సర్వ అవలక్షణాలూ పుష్కలంగా ఉన్నాయి. ఆమెకు ఎవరూ నచ్చచెప్పలేరు. ఎవరూ ఆమె మనసు మార్చలేరు. ఒక్క కాలమే ఆమెకు గట్టి సమాధానం చెప్పగలదు. ఒకవేళ ఆమె మనసు మార్చుకుని వస్తే గనుక ఆమె కోసం ఈ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే వుంటాయి” అన్నాడు హరిప్రసాద్ తల్లితో.

అంతటి మూర్ఖురాలిని కూడా తేలికగా క్షమించగలిగిన కొడుకుని చూస్తూ ‘వీడింత మంచివాడు. కానీ ఏం లాభం? మంచితనానికి ఇవి రోజులు కావు’ అనుకుంటూ గాఢంగా నిట్టూర్చింది ఆదిలక్ష్మి.

శరీర వేదన కంటే మానసిక వేదన మరీ ప్రమాదకరం అని అందరూ అంటూ వుంటారు. అటువంటి మానసిక వేదనతో కృంగిపోతున్న ఆదిలక్ష్మికి ఏ మందులూ పనిచెయ్యడం లేదు. ఏ వైద్యమూ ఫలించడం లేదు. హరిప్రసాద్ మాత్రం తల్లిని తిరిగి మామూలు మనిషిని చెయ్యడం కోసం తన శాయశక్తులా కృషి చేస్తున్నాడు. విశ్వప్రయత్నం చేస్తున్నాడు. కానీ, అతని ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరు చందం అవుతున్నది.

హరిప్రసాద్ తను డ్యూటీకి వెళ్ళినప్పుడు తల్లికి హెల్పర్‌గా ఒక నర్సును ఏర్పాటు చేశాడు. కానీ ఆమె ఒక రోజు వేస్తే రెండు రోజులు వచ్చేది కాదు. రాకపోవడానికి ఏవో కారణాలు చెప్పేది. వచ్చిన రోజయినా సరిగ్గా చేసేది కాదు. మరొక మనిషిని పెడితే ఆమె కూడా అలాగే చేసింది. ఇలా ఐదారుగురిని మార్చినా ఫలితం లేకుండా పోయింది.

ఇక ఇలా లాభం లేదని, తన ఉద్యోగానికి మూడు నెలలు శెలవు పెట్టాడు హరిప్రసాద్. ఈలోపు తల్లిని పూర్తి ఆరోగ్యవంతురాలిగా చెయ్యాలని అతని కృషి, పట్టుదల!

తనకు స్నానం చేయిస్తూ, డైపర్లు మారుస్తూ సేవలు చేస్తున్న కొడుకుని చూస్తూ విలవిలలాడిపోయేది ఆదిలక్ష్మి. సిగ్గుతో ఆమె ప్రాణం చితికిపోయేది.

కొడుకుతో అలాంటి పనులు చేయించుకోలేకా, అంతకంటే గత్యంతరం కనబడకా ‘ఇలాంటి బ్రతుకును ఎందుకిచ్చావు దేవుడా? ఆయనతో పాటు నేనుకూడా చనిపోయి వుంటే ఎంత బాగుండేది’ అనుకుంటూ ఆమె దుఃఖించని క్షణం ఉండేదికాదు.

తల్లి పడుతున్న మానసిక వేదనను అర్థం చేసుకున్న హరిప్రసాద్ ఆమెకు ఎన్నో విధాల నచ్చచెప్పే వాడు.

“అమ్మా పసివాళ్ళకు, వృద్ధులకు ఆడా, మగా అని తేడావుండదు. అదే నాన్నకు అవసరం అయితే నేను చేసేవాడిని కాదా? అందులోనూ నేను వైద్యుణ్ణి కనుక మాకు వయసుతో సంబంధం ఉండదు. స్త్రీలనీ, పురుషులనీ భేదంగా చూడుము. అలాంటి తేడా చూపిస్తే మేము వృత్తికి అర్హులం కాము. అమ్మా వైద్యుడు తన వృత్తిని ప్రేమించాలి. అలా ప్రేమించగలిగినప్పుడు, ఎంతో నిబద్ధతతో వృత్తి ధర్మాన్ని నిర్వహించేటప్పుడు ఆ వైద్యునికి ఏమీ అడ్డం రావు. ఏమీ అవరోధం కావు. అంతేకాదమ్మా, రోగి కూడా ‘నాకు చాలా పెద్ద జబ్బు వచ్చింది. ఇంక ఇది తగ్గదు. ఇక నా బ్రతుకు ఇంతే’ అనుకుంటూ నిరాశా భావంతో వైరాగ్యం పెంచుకోకూడదు. జీవితం మీద విరక్తిగా ఉండకూడదు. రోగి తన జీవితాన్ని ప్రేమించాలి. సంపూర్ణ ఆశాభావంతో ఉండాలి. వైద్యునికి సంపూర్తిగా సహకరించాలి. అప్పుడు ఏ రోగమూ ఏ రోగినీ ఏమీ చెయ్యలేదు. రోగం తోక ముడుచుకుని పారిపోతుంది.

అమ్మా నువ్వు ఏమీ ఆలోచించకుండా దైవ స్మరణలో నీ మనసుని లగ్నం చెయ్యి. ప్రశాంతత లభిస్తుంది. మనసుని స్థిరం చేసుకుని మంచి ఆహారం తీసుకుంటే అప్పుడు మందులు చక్కగా పని చేస్తాయి. ఇలా చేస్తే ఒక్క నెలలోనే మామూలు మనిషివి అయిపోతావు. చక్కగా లేచి తిరుగుతావు. నాకు చక్కగా వంట చేసి పెడతావు. నిన్ను పిల్లల హాస్టల్‌కి తీసుకువెళ్ళి వాళ్ళను చూపిస్తాను. శ్రీలక్ష్మి కూడా మనసు మార్చుకుని తిరిగి రావచ్చు. అన్ని పరిస్థితులు చక్కబడతాయని ఆశాభావంతో ఉండాలమ్మా. నమ్మకంతో ఉండాలి. నువ్వు ఏమీ ఆలోచించకుండా ధైర్యంగా వుంటే నాకు ఎంతో సహాయం చేసినట్లమ్మా. అలా చేస్తానని నామీద ఒట్టు వెయ్యి” అంటూ బలహీనమైపోయిన తల్లి చేతిని తన తొలి మీద పెట్టుకున్నాడు హరిప్రసాద్.

కొడుకు మాటలు విన్న ఆదిలక్ష్మి హృదయం చలించిపోయింది. ద్రవించిపోయింది.

బంగారంలాంటి భర్తనూ, ఇంటినీ తృణీకరించి వెళ్ళి పోయిన భార్య పట్ల కోపం గానీ, ద్వేషం గానీ పెట్టుకోని పెట్టుకోని కొడుకు ఔన్నత్యం ఆమెకు హిమాలయంలా గోచరించింది. ‘ఇటువంటి అమృతమూర్తినీ, ఆణిముత్యాన్నీ కాలదన్ని వెళ్ళిపోయిన కోడలు ఎంత దురదృష్టవంతురాలో కదా’ అనుకుంటూ విచారించింది ఆదిలక్ష్మి.

“నిన్నటిని వదిలేసి, ఈ రోజును బాధ్యతతో ముడివేసి, రేపటిని ప్రేమించే వారికి అపజయం ఉండదమ్మా” నవ్వుతూ అన్నాడు హరిప్రసాద్ తల్లిని దగ్గరకు తీసుకుంటూ.

‘ఒకప్రక్కన భార్య వల్ల బాధ పడుతున్న కొడుకును మరోప్రక్క అనారోగ్యంతో నేను హింస పెడుతున్నాను. వాడన్నట్లు ఇకనుంచి నేను ధైర్యంగా ఉంటాను. శాంతిగా ఉంటాను. అప్పుడు ఈ రోగం నన్ను విడిచి ఆమడదూరం పారిపోతుంది. నేను నా బిడ్డకు చేతనయినంతలో ఆలంబన అవుతాను’ కృతనిశ్చయం చేసుకున్న ఆమె కళ్ళలోకి వెలుగు వరదలా దూసుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here