రోబో

0
7

[dropcap]“హ[/dropcap]లో, సైంటిస్ట్ అప్పారావుగారేనా మాట్లాడేది?”

“ఎస్. ఇంతకీ మీరెవరు? నా గురించి మీకెలా తెలుసు?”

“నేనొక విలేకరిని సార్. మీ గురించి అంతర్జాలంలో చదివాను. అందులో ఇవ్వబడిన ఫోన్ నంబర్ చూసి మీకు ఫోన్ చేస్తున్నాను. మీ శిష్యులు చాలా కాలం క్రితమే మీ జీవిత చరిత్ర మొత్తం అంతర్జాలంలో ఉంచారు. దాన్ని బట్టి నాకు అర్థమైందేమంటే వందేళ్ళ క్రితం మీరొక గొప్ప శాస్త్రవేత్త. మరణాన్ని జయించటం కోసం మీ పైన మీరే ప్రయోగం చేసుకున్నారు. అందులో భాగంగా మీరు అచేతనావస్థలోకి వెళ్లిపోయారు. వందేళ్ళ తర్వాత మీరు స్పృహలోకి వస్తారని మీ శిష్యులు పేర్కొన్నారు. సరిగ్గా ఈ రోజుకి వందేళ్లు పూర్తయ్యాయి. మీరు స్పృహలోకి వచ్చారో లేదో తెల్సుకోవటానికే నేను ఫోన్ చేశాను. మీరే ఫోన్ రిసీవ్ చేసుకున్నారు కాబట్టి మీ ప్రయోగం విజయవంతమైందని నాకర్థమైంది. కంగ్రాట్స్ సార్! మరణాన్ని జయించి నూరేళ్ళ తర్వాత మళ్ళీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్న మీకు స్వాగతం పలుకుతున్నాను.”

“థాంక్యూ! సరిగ్గా అర్థరాత్రి పన్నెండు గంటలకే నేను స్పృహలోకి వచ్చాను. నా మెమోరీ మొత్తం బ్యాకప్ కావటానికి పది గంటల సమయం పట్టింది. మొత్తానికి నూరేళ్ళ క్రితం నాకున్న జ్ఞాపకాలన్నీ తిరిగొచ్చాయి. నేనొక శాస్త్రవేత్తననీ, నూరేళ్ళ క్రితం నా శిష్యుల సాయంతో నా పై నేను చేసుకున్న ప్రయోగం వల్ల నేను అచేతనావస్థలోకి వెళ్ళి ఈ రోజే మళ్ళీ స్పృహలోకి వచ్చానని నాకు గుర్తొచ్చింది. కాని నేను కళ్ళు తెరిచినప్పుడు ఇక్కడ మనుషులెవరూ లేరు. ఈ ల్యాబ్‌లో ఉన్న రోబోలే నన్ను చేతనావస్థలోకి తీసుకొచ్చాయి. నా శరీరానికి అమర్చి ఉన్న పరికరాలను తొలగించి నాకు మంచి నీరు, ఆహారం అందించాయి. ఆ రోబోలను నా శిష్యులే ఏర్పాటు చేసి ప్రయోగాన్ని కొనసాగించారని నాకు అర్థమైంది. కాని నా కోసం అన్ని ఏర్పాట్లు చేసిన నా శిష్యులు నేను స్పృహలోకి వచ్చే రోజు ఇక్కడ లేకపోవటం చూసి నాకు ఆశ్చర్యం కలిగింది.”

“ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు సార్. మీరు అచేతనావస్థలో నూరేళ్ళు ఉన్నారు కదా. మీ శిష్యులు అంతకాలం జీవించే అవకాశముందా? వాళ్ళెప్పుడో చనిపోయి వుంటారు.”

“అవును కదా! ఆ సంగతే మర్చిపోయాను. చావును జయించింది నేను గాని నా శిష్యులు కాదు కదా. నూరేళ్ళ ప్రయోగం ద్వారా నేను అనుకున్నది సాధించాను. ఇప్పుడు నేను మృత్యుంజయుణ్ణి. నా విజయాన్ని చూడటానికి నా శిష్యులు లేకపోయినా కనీసం వారి వారసులైనా ఉండాలి కదా. కాని ఈ ప్రయోగశాలలో రోబోలు తప్ప మనుషులే కన్పించటం లేదు. మనుషులతో మాట్లాడాలని మనసు తహతహలాడుతోంది. అనుకోకుండా మీ ఫోన్ రావటంతో మనసుకి కాస్త ఊరట కలిగింది. ఇంతకీ మీ పేరేమిటి?”

“నా పేరు రాంబాబు. అందరు సరదాగా నన్ను ర్యామ్ బో అని పిలుస్తారు. మీరు కూడా అలా పిలవ్వొచ్చు. నేను కూడా మీరు ఉంటున్న నగరంలోనే ఉంటున్నాను. మిమ్మల్ని ఇంటర్వ్యూ చెయ్యటానికి ఫోన్ చేశాను. మీ గత జీవితం గురించీ, మీరు చేపట్టి విజయం సాధించిన ఈ ప్రయోగం గురించీ మా పాఠకులకు వివరంగా చెబుతారా?”

“చెబుతాను. నూరేళ్ళ క్రితం నేనొక ప్రముఖ శాస్త్రవేత్తని. చావును జయించటానికి నా జీవితాంతం రకరకాల ప్రయోగాలు చేశాను. మనిషి జీవకణాల్లో శక్తి కేంద్రాలుగా పనిచేసే మైటోకాండ్రియా సామర్థ్యం తగ్గటం వల్లనే మనిషిలో శక్తి సన్నగిల్లి చివరికి మరణం సంభవిస్తుందని కనుగొన్నాను. ఓ జీవి సంపూర్ణ ఆయుష్షుకు సమానమైన కాలం పాటు ఆ జీవిని అచేతనావస్థలో ఉంచి ఆ జీవి కణాల్లోని మైటోకాండ్రియాకు నిరంతరం శక్తిని అందిస్తే ఇక ఆ జీవికి మరణమే ఉండదని నేను తెలుసుకున్నాను. కాని నా మాటల్ని ఎవరూ నమ్మలేదు. దాంతో నేను ముందుగా అల్పాయుష్షులైన ఎలుకలపై ప్రయోగాలు చేశాను. వాటి ఆయుష్షుకు సమానమైన కాలం వాటిని అచేతనావస్థలో ఉంచి వాటి కణాల్లోని మైటోకాండ్రియాకు నిరంతరం శక్తిని అందించాను. తర్వాత వాటిని చేతనావస్థలోకి తీసుకొచ్చాక అవి చిరంజీవులయ్యాయి. తమ ఆయుష్షు తీరినా మరణించలేదు. వాటికి వృద్ధాప్యమే రాలేదు. అయితే నా ప్రయోగ ఫలితాల్ని నా సమకాలీన శాస్త్రవేత్తలు నమ్మలేదు. నన్ను కోతలరాయుడు అంటూ ఎగతాళి చేశారు. ఇలా కాదని ఈ ప్రయోగాన్ని నేను నేరుగా మనుషులపై చేయటానికి పూనుకున్నాను. కాని ప్రభుత్వం నుంచి నాకు అనుమతి లభించలేదు. పైగా అలా చెయ్యటం ప్రకృతి విరుద్ధమని ప్రపంచంలోని ప్రముఖ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అదీగాక నా ప్రయోగాల కోసం నూరేళ్ళు తమ శరీరాన్ని అప్పగించటానికి ఎవరూ ముందుకు రాలేదు. నేను పంతం వీడలేదు. చివరికి నా పైన నేనే ప్రయోగం చేసుకోవటానికి సిద్ధమయ్యాను. నేను చెప్పినట్టు చెయ్యటానికి నా శిష్యులు ఒప్పుకున్నారు. ముందుగా వారు నన్ను అచేతనావస్థలోకి తీసుకెళ్ళారు. తర్వాత కృత్రిమ మేధ ద్వారా నా శరీరంలోని కణాల్లో వుండే మైటోకాండ్రియాకు నిరంతరం శక్తిని అందించే ఏర్పాట్లు చేశారు. తర్వాత వారు లేకపోయినా నూరేళ్ళ వరకు ల్యాబ్ లోని రోబోలే ఈ ప్రయోగాన్ని కొనసాగించాయి. సరిగ్గా నూరేళ్ళకు నేను చేతనావస్థలోకి వచ్చేలా ప్రోగ్రామ్‌ని సెట్ చేసి ఉంచటం వల్ల నేనీ రోజు స్పృహలోకి వచ్చాను. మొత్తానికి నాపైన నేను చేసుకున్న ఈ ప్రయోగం నూటికి నూరుపాళ్లు విజయవంతమైంది. కాకపోతే నా విజయానికి కారకులైన నా శిష్యులు ఇప్పుడీ  లోకంలో లేకపోవటం బాధ కలిగిస్తోంది. కనీసం నా ప్రయోగాన్ని విమర్శించిన నా సమకాలీన శాస్త్రవేత్తలైనా జీవించి ఉంటే బావుండేది. నేను చెప్పినదంతా నిజం కావటం చూసి వారు తమ తప్పును ఒప్పుకొనేవారు.”

“ఎవరూ వున్నా లేకపోయినా మీ ప్రయోగం విజయవంతమైన విషయాన్ని నేను ప్రపంచానికి తెలియజేస్తాను సార్. మీ పేరు ప్రపంచంలో మారుమోగేలా చేస్తాను.”

“థాంక్యూ ర్యామ్‌ బో! అన్నట్టు నేను నూరేళ్ళ సుదీర్ఘ కాలం అచేతనావస్థలో వున్నాను కదా. ఈలోగా ప్రపంచంలో ఎలాంటి మార్పులొచ్చాయో నాకు తెలియదు. నేను ల్యాబ్ నుంచి బయటికెళ్ళి ప్రపంచాన్ని చూడాలనుకున్నాను. కాని ల్యాబ్ తలుపులు తెరుచుకోలేదు. నేను ఇక్కడి కిటికీ అద్దాల్లోంచి చూస్తే బయట ఇళ్ళు, ఇళ్ళ చుట్టూ చెట్లు కనిపించాయి కాని మనుషులు మాత్రం కన్పించలేదు. కారణమేమిటి?”

“మీరు నూరేళ్ళు అచేతనావస్థలో వున్నారు గనుక ఈ నూరేళ్ళలో ప్రపంచం ఎలాంటి మార్పులకు గురైందో మీకు తెలియదు. మీకు బయట కనిపించిన చెట్లు నిజం చెట్లు కావు. అవి ఆక్సీజన్‌ని ఉత్పత్తి చేసే కృత్రిమ చెట్లు. ఈ నూరేళ్ళలో భూవాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువులు విపరీతంగా పెరిగిపోవడం వల్ల గాలిలో ఆక్సీజన్ శాతం బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం మనిషికి అవసరమైనంత ఆక్సీజన్ గాలిలో లేకపోవటం వల్ల ప్రతి ఇంటి చుట్టూ ఆక్సీజన్‌ని ఉత్పత్తి చేసే కృత్రిమ చెట్లను ఏర్పాటు చేయటం జరిగింది. ఆ కృత్రిమ చెట్లు నిజమైన చెట్ల మాదిరిగానే సూర్యరశ్మి సాయంతో  కార్బోహైడ్రేట్, ప్రోటీన్ వంటి పోషకాలతో పాటు స్వచ్ఛమైన ఆక్సీజన్‌ని కూడా ఉత్పత్తి చేస్తాయి. ప్రత్యేక వ్యవస్థ ద్వారా ఇవి ఇంటికి సరఫరా అవుతాయి. ఇప్పుడు మీకు లభిస్తున్న స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం ఆ కృత్రిమ చెట్లు ఉత్పత్తి చేసినవే. మనుషులకు ఇంట్లో ఉన్నంత సేపు మాత్రమే ఆక్సీజన్ అందుతుంది. ఇల్లు దాటి బయటికి వెళ్ళాలంటే ఆక్సీజన్ సిలిండర్ అవసరం. అలాగే రేడియేషన్ నుంచి కాపాడుకోవటానికి స్పేస్ సూట్ ధరించక తప్పదు. కాబట్టి మునుపటిలా ఇప్పుడు బహిరంగ ప్రదేశాల్లో తిరగటం సాధ్యం కాదు.”

“నూరేళ్ళలో ప్రపంచం కాలుష్య రహితంగా మారుతుందని నేను ఆశించాను. ఇలా జరుగుతుందనుకోలేదు. మన నాయకులు, శాస్త్రవేత్తలు పొల్యూషన్, రేడియేషన్ లను ఎందుకు నివారించలేకపోయారు?”

“ఆ విషయం పూర్తిగా అర్థం కావాలంటే మీరు నూరేళ్ళుగా ప్రపంచంలో జరిగిన పరిణామాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయాలన్నీ నేను మీకు వివరంగా చెబుతాను. నూరేళ్ళ క్రితం ప్రపంచం అత్యంత వేగంగా అభివృద్ధి చెందటం మొదలైంది. రెండు దశాబ్దాల్లోనే ప్రపంచ జనాభా వెయ్యి కోట్లు దాటిపోయింది. ప్రతి రంగంలో టెక్నాలజీ ప్రవేశించింది. కృత్రిమ మేధ వల్ల పనులు సులువుగా, వేగంగా జరగసాగాయి. భూమిపై ట్రాఫిక్ పెరగటంతో మొదట డ్రోన్లు, తర్వాత కార్లు కూడా విమానాల మాదిరి గాలిలో ప్రయాణించసాగాయి. ఇక విమానాలయితే ధ్వని కన్నా మూడు రెట్లు అధిక వేగంతో ప్రయాణించాయి. కంపెనీలు, ఫ్యాక్టరీల్లోని ఉద్యోగులు, కార్మికుల స్థానాన్ని అంచెలంచెలుగా రోబోలు ఆక్రమించాయి. చివరికి రోబోలే వ్యవసాయం కూడా చెయ్యసాగాయి. చైనా సూపర్ పవర్ కావటంతో అమెరికా, చైనాల మధ్య అణు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ప్రపంచం రెండు శిబిరాలుగా చీలిపోయింది. ప్రభుత్వాలు మారణాయుధాల కోసం చేసిన ఖర్చును కాలుష్య నివారణ కోసం చెయ్యలేదు. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగటం వల్ల పంటలు దెబ్బతిన్నాయి. అడవులు నశించాయి జంతువులు, పశువులు అంతరించాయి. అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆకలి చావులు మొదలయ్యాయి. ఆహార కొరత తీర్చటానికి శాస్త్రవేత్తలు టెక్నాలజీ సాయంతో కృత్రిమ ఆహారాన్ని, మాంసాన్ని ఉత్పత్తి చేశారు. కాని దానివల్ల ధనవంతులే లబ్ధి పొందారు. మరోపక్క వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువులు పెరగటం వల్ల ఓజోన్ పొర పూర్తిగా క్షీణించింది. దానివల్ల ధ్రువ ప్రాంతాల్లోని మంచు వేగంగా కరిగి తీరప్రాంతాల్లోని మహా నగరాలన్నీ నీట మునిగాయి. అదొక్కటే కాదు. ఓజోన్ పొర క్షీణించడం వల్ల అతినీలలోహిత కిరణాలు నేరుగా చర్మాన్ని తాకటంతో ప్రజలు క్యాన్సర్ బారిన పడి మరణించసాగారు. ఇలాంటి పరిణామాలతో వెయ్యి కోట్ల ప్రపంచ జనాభా వంద కోట్లకు తగ్గిపోయింది. జనాభా తగ్గటానికి మరో కారణం కూడా ఉంది. మితిమీరిన టెక్నాలజీ వినియోగం వల్ల మనుషుల్లో భావుకత తగ్గి యాంత్రికత పెరిగింది. దాంతో వారి మధ్య బాంధవ్యాలు, ప్రేమాభిమానాలు తగ్గిపోయాయి. పెళ్ళి పట్ల, సంతానం పట్ల విముఖత ఏర్పడింది. అప్పటికే కృత్రిమ మేధ విషయంలో టెక్నాలజీ గొప్ప పురోగతి సాధించింది. మనిషి ఆలోచనలకు అనుగుణంగా నడచుకొనే రోబోలు వచ్చాయి. మనుషులు తమ లైంగిక అవసరాలను కూడా వాటి ద్వారా తీర్చుకోసాగారు. పిల్లల్ని కనటానికి ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో జనాభా వేగంగా తగ్గిపోయింది. అదే సమయంలో రోబోల జనాభా బాగా పెరిగింది. పైగా మనుషుల్లా సొంతంగా ఆలోచించే రోబోల సృష్టి జరిగింది. కొన్ని సంఘ విద్రోహ శక్తులు వాటిలో వైరస్ లను జొప్పించటంతో కొన్ని రోబోలు తీవ్రవాదుల్లా మారి మనుషుల్ని చంపసాగాయి. అంతేకాదు. అవి తమ వంటి డూప్లికేట్ రోబోలను సొంతంగా తయారుచేసుకోసాగాయి. దాంతో ప్రపంచంలోని చాలా దేశాలు రోబోల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. మరోపక్క అంతరిక్షయానం సులభంగా, చౌకగా మారటం వల్ల ధనవంతులు విహార యాత్రలకు మార్స్ గ్రహానికి వెళ్ళేవారు. వారి కోసం ఆ గ్రహంపై కాలనీలు, హోటళ్ళు వెలిశాయి. భూమిపై ఉష్ణోగ్రతలు, కాలుష్యం, రేడియేషన్ పెరగటంతో పాటు రోబోల దాడులు పెరగటంతో ధనవంతులు భూమిని వదిలేసి శాశ్వతంగా మార్స్ గ్రహానికి వలస వెళ్ళిపోయారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న పేదవారు, మహాసముద్రాల మధ్య గల దీవుల్లో నివసించే ఆదివాసీలు మాత్రమే ఇప్పుడు భూమిపై మిగిలారు. ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం మన భూమిపై మనుషుల జనాభా పదివేల ఏళ్ళ క్రితం ఉన్న జనాభా కన్నా తక్కువ ఉంది. త్వరలోనే భూమి మనుషులకు నివాసయోగ్యం కాని గ్రహంగా మారుతుందని శాస్త్రవేత్తల అభిప్రాయం.”

“…………………………..”

“సార్, నా మాటలు వింటున్నారా?”

“వింటున్నానయ్యా! నీ మాటలు వింటుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. అందుకే కాస్సేపు మాట్లాడలేకపోయాను. ఈ విశ్వంలోనే భూమి ఒక అందమైన గ్రహం. మనిషి దాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాడు. ఈ నూరేళ్ళలో అది భూలోక స్వర్గంగా మారుతుందనుకున్నాను. మృత్యుంజయుడిగా మారి ఈ అందమైన భూమిపై శాశ్వతంగా నివసించాలనుకున్నాను. కాని ఇప్పుడీ భూమి నరకంగా మారిందని తెలిశాక నేను పడిన శ్రమ అంతా వృథా అన్పిస్తోంది. ఇక్కడ ఒక్క రోజు కూడా జీవించటం కష్టమైనప్పుడు నేను శాశ్వతంగా ఎలా జీవించగలను? నేను చావుని జయించి ఏం లాభం? ఇది నా గెలుపు కాదు ఓటమి అన్పిస్తోంది. నిజానికి మన భూమి నరకంగా మార్చటంలో నా వంటి శాస్త్రవేత్తల పాత్ర కూడా ఉంది. ఎప్పుడూ కొత్త కొత్త సౌకర్యాల కోసం మేం ఆవిష్కరణలు చేశామే తప్ప అదివరకే మనకు ప్రకృతి ప్రసాదించిన అద్భుత సౌకర్యాలను కాపాడుకోవటానికి ప్రయత్నించలేదు. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు ముట్టుకొని ఏం ప్రయోజనం? ఈ నరకంలో నేను ఉండలేను. నేను కూడా మార్స్ గ్రహం పైకి వలస వెళ్లిపోతాను. రాంబాబూ, ఈ విషయంలో నువ్వు నాకు సాయం చెయ్యగలవా?”

“సారీ సార్, ఈ విషయంలో నేనేమీ చేయలేను. ఇప్పటికే మార్స్ గ్రహంపై ఉన్న వనరులకు సరిపోయే జనం కన్నా ఎక్కువ మంది అక్కడికి చేరుకున్నారు. దాంతో ఆ గ్రహంపైకి ఇంకెవరూ రాకుండా అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. అందువల్ల మీరు అక్కడికి వెళ్ళలేరు.”

“అలాగైతే ఎలా? మరో మనిషి తోడు లేకుండా నేనెలా వుండగలను? ఒంటరితనం వల్ల ఇప్పటికే నాకు పిచ్చెక్కేలా ఉంది. ఎలాగైనా ఈ ల్యాబ్ తలుపులు తెరిచి దగ్గిట్లో మనుషులు ఉన్న ఏదో ఒక ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను.”

“అది వృథా ప్రయత్నం సార్. నెట్‌లో ఉన్న సమాచారం ప్రకారం మన నగరంలోని మనుషుల్లో చాలామంది చనిపోయారు. మిగతావారు మార్స్ గ్రహం పైకి వెళ్లిపోయారు. మీ చుట్టుపక్కల ఉన్న ఒక్క ఇంట్లోనూ మనుషులు లేరు.”

“అంటే ఇంత పెద్ద నగరంలో మనుషులే లేరా? ఇప్పుడీ నగరంలో మేమిద్దరమే మిగిలి ఉన్నామా?”

“ఇద్దరు కూడా కాదు సార్, ఒక్కరే!”

“ఒక్కరా? అంటే నువ్వు మనిషివి కాదా?”

“కాదు సార్. నేను కూడా మనిషి సృష్టించిన రోబోని.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here