రోజులు మారాయి

0
9

[dropcap]స[/dropcap]మయం ఉదయం 7గంటల 23 నిమిషాలు.

ఆఫీసుకెళ్ళే టైం అవుతోందని.. ‘షేవింగ్’ చేసుకోవడానికి ఇంటికి వెనక వైపున్న ‘వాష్ బేసిన్’ ముందు నిల్చోని గోడకు వేలాడుతున్న ‘అద్దం’లోకి చూస్తూ… షేవింగ్ క్రీమ్ మూత తీస్తున్నాన్నేను.

గేటు తెరచిన చప్పుడు వినబడి పని మనిషివచ్చుంటుందని అనుకున్నాను.

ట్రింగ్.. ట్రింగ్ అంటూ కాలింగ్ బెల్ మ్రోగటంతో… కిచెన్‌లో వంట చేస్తున్న మా ఆవిడ, “ఏవండీ… ఎవరో వచ్చినట్టున్నారు చూడండి” అంటూ ‘ఆర్డర్’ వేసింది.

షేవింగ్ క్రీమ్‌ను పక్కన పెట్టి ఇంటి ముందుకొచ్చి చూసాన్నేను.

సుమారు 40-45 సంవత్సరాలు వయస్సు ఉంటుంది అతనికి, నన్ను చూడగానే .. “నమస్కారం సర్… గేటు ముందు ‘టూ లెట్’ బోర్డు చూసి వచ్చాను సర్” అన్నాడతను. ఖాకీప్యాంట్, ఖాకీ చొక్క వేసుకొని చామన చాయలో, వయస్సులో నా కంటే పెద్దవాడిలాగే కనిపిస్తున్నాడు.

నేను కూడ “నమస్తేనండీ అని, రూమ్ చూస్తారా” అంటూ అడిగాన్నేను.

“పర్లేదు సార్…” అంటూ మెహమాటంగా అన్నాడతను.

“ఒక్క నిమిషం ఉండండి” అని, కీ తీసుకొస్తానంటూ లోపలికొచ్చాన్నేను..

“ఎవరండీ.. వచ్చింది?” అంటూ అడిగింది మా ఆవిడ.

రెంటు కోసం వచ్చారంటూ కీ తీసుకొని బయటికి వచ్చి…. “మీరేం వర్క్ చేస్తారు?” అంటూ ప్రక్క పోర్షన్ తాళం తీసి, తలుపు తెరుస్తూ అడిగాన్నేను.

“ఆర్.టి.సి.లో కండక్టర్ గా పని చేస్తాను సార్” అంటూ బదులిచ్చాడతను.

లోపలికెళ్ళి “సింగిల్ బెడ్ రూమా…” అంటూ అడిగాడతను.

“సింగిల్ బెడ్ రూమె.. ఒక హాల్, బెడ్ రూమ్, కిచెన్” అన్నాన్నేను.

“మాకు సింగల్ బెడ్ రూమే కావాలి సార్” అన్నాడతను.

“ఒకె అయితే రూమ్స్ చూడండి” అన్నానేను.

ఇల్లాంతా తిరిగి చూసి, బయటకి వస్తూ “రెంట్ ఎంత సార్” అన్నాడతను.

“ముందు మీకు ఇల్లు నచ్చిందా..” అడిగాన్నేను.

“నచ్చింది సార్ కాని…” అంటూ నసిగాడతను.

“రండి, కూర్చోని మాట్లాడుకుందాం..” అంటూ ఆహ్వానించాన్నేను.

“వద్దులెండి సారు” అంటూ వారించాడతను.

సరేనంటూ లోనికెళ్ళి రెండు ప్లాస్టిక్ చైర్స్ తీసుకొచ్చి ఇంటి ముందు ఖాళీ ప్రదేశంలో వేసి ఒక దాంట్లో నేను కూర్చుంటూ, మరోక దాంట్లో అతన్ని కూర్చోమన్నాన్నేను.

అసౌకర్యంగానే కుర్చీలో కూర్చూంటూ.. “మీరు మాకు రెంటుకిస్తారా సార్” అంటూ అడిగాడతను.

అతనెందుకు అలా అడుగుతున్నాడో అర్థంకాక… “రెంటుకివ్వడానికే కదా టు-లెట్ బోర్డు పెట్టింది” అన్నాన్నేను.

“అంటే మీరు ‘రెడ్లు’ కదా సార్, మరి… ‘మా కులపోళ్ళకు’ రెంటుకిస్తారో లేదో” అంటూ తన మనసులో మాటను బయట పెట్టాడతను.

“అయ్యో… మాకట్లాంటి పట్టింపులేం లెవ్వు. ఇల్లు నచ్చితే చెప్పండి, రెంటు మాట్లాడుకుందాం” అన్నాన్నేను. “అయినా మనమేంటో.. మన కులమేంటో… మొహం మీద రాసి పెట్టుండదు కదా..! అయితే మేం రెడ్లమని మీకెట్లా తెలిసింది… ముందున్న నేమ్ ప్లేట్ ను చూసేగా .. మేం ‘రెడ్లమని” మీరు తెలుసుకున్నది, మీకు ఇల్లునచ్చితే చెప్పండి..మీ మేడమ్ ను కూడా తీసుకొచ్చి చూపించండి. తర్వాత రెంట్ మాట్లాడుదాం” అంటూ అన్నాన్నేను.

“ఏం లేదు సార్.. మేం వచ్చింనంక వారానికో పది రోజులకో, నెలకో.. ‘మేమేంటో’ తెలిసి, మళ్ళీ వెంటనే మీరు ఇల్లు ఖాళీ చేయిస్తారేమోనని” సంశయించాడతను.

“అట్లెందుకనుకుంటున్నారు” అన్నానేను.

“ఇప్పుడట్లనే అయితంది సార్.. మేం ఉంటున్న ఇంటి ఓనర్ నెల తిరక్కముందే ఇల్లు ఖాళీ చేయిస్తున్నడు, మా కులమేంటో తెలిసి.

పిల్లలకు స్కూల్ దగ్గరా ఉంటుందని జూన్ నెలలోనే వచ్చినం సార్ ఆ ఇంటికి, పది రోజుల క్రితం ఎస్.సి. కార్పోరేషన్ ఆఫీసు నుండి మా ఆవిడి పేరు మీద ఒక లెటర్ వచ్చింది సార్… మేం ఫస్టు ఫ్లోర్‍లో ఉంటాము, ఆ వచ్చిన లెటరను మా ఓనరమ్మ చూసి మా ఆవిడను పిలిచి మీరు ఎస్.సి కులస్థులా అని అడిగిందట అందరి ముందూ…

అప్పటి వరకు కలుపుగొలుపుగా ఉన్న మిగతా వాళ్ళందరూ ఒకరకంగా చూసేసరికి మా ఆవిడకు చిన్నతనమనిపించి, ఆ రోజు రాత్రి నేను డ్యూటీ నుంచి రాగానే.. జరిగిన విషయం నాతో చెప్పి నన్ను పట్టుకొని ఏడ్చింది సార్..

తెల్లారి పొద్దాల తయారై డ్యూటికీ పోదామని మెట్లు దిగుతూ ఉంటే.. మా ఇంటి ఓనర్ నన్నాపి… ‘నువెవ్వళ్ళవో.. తెల్వక ఇల్లు కిరాయికిచ్చినం. ఇప్పుడు తెలిసినంక కూడ వుంచుకునుడు బాగోదు. మా కాలనీల గన్క ఈ విషయం తెలిస్తే.. మళ్ళేవరూ మా ఇంటికి కిరాయికిరారు.. రేపొచ్చే ఫస్టు తారీఖున ఇల్లు ఖాళీ చేయండీ’ అంటూ హుకుం జారీ చేసిండు ఇంటి ఓనర్, అప్పటి నుండి రోజూ డ్యూటికీ పోయేముందు వచ్చిన తర్వాత ఇండ్లకోసం తిరుగుతూనే ఉన్నాను సార్, స్కూలుకి దగ్గరగా ఎక్కడా కూడ టూలెట్ బోర్డు కనబడలేదు,

మీ ఇంటి ముందున్న బోర్డు చూసి అడగాలా వద్దా అని సంశయిస్తూనే మీ ఇంటికొచ్చాను సార్” అంటూ తనకు జరిగిన అన్యాయాన్ని , అవమానాన్ని, కలిగిన బాధనంతా చెప్పుకున్నాడతను.

ఆ బాధనుండి కొంచెం ఉపశమనం కల్గించడానికని.. “రజిని వాటర్ బాటిల్ తీసుకొనిరా..” అంటూ మా ఆవిడని పిలిచాన్నేను.

రెండు నిమిషాల తర్వాత ఒక గ్లాసు, వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి.. బాటిల్ లోని నీళ్ళు గ్లాసులో నింపి, బాటిల్ నాకిచ్చి, గ్లాస్ తనకందించింది మా ఆవిడ.

బాటిల్ తీసుకుంటూ “రెంటు కోసం వచ్చింది ఈ సారే” అన్నానేను.

గ్లాసందుకుంటూ.. ‘నమస్తే మేడమ్’ అన్నాడతను. మా ఆవిడ కూడా ‘నమస్తే అండీ’ అంటూ “మీ మేడమ్ హౌజ్ వైఫేనా అండీ” అని అడిగింది.

“హౌజ్ వైఫే మేడమ్.. కాని పిల్లలు స్కూల్‌కు వెళ్ళిన తరువాత ఖాళీగా ఇంట్లో వుండటం కంటే ఏదైనా బిజినెస్ చేస్తే బాగుంటుందని బ్యాంక్ లోనకు అప్లై చేసింది కాని లోన్ ఇంకా సాంక్షన్ కాలేదు మేడమ్” అన్నాడతను.

“మంచి ఆలోచన…” అంటూ మీకు పిల్లలెందరూ, ఏం చదువుతున్నారని అడిగింది మా ఆవిడ. “ఒక బాబు పది చదువుతున్నాడు, పాప ఆరు చదువుచున్నది మేడమ్” అన్నాడతను. .

“మా పిల్లలతో కలిసి ఆడుకోవడానికి, చదువుకోవడానికి బావుంటది…. ఒక సారి మీ ఆవిడను కూడా తీసుకొచ్చి ఇల్లు చూపించండి…” అంటూ వాటర్ బాటిల్, గ్లాసు తీసుకొని లోనికి వెళ్ళింది మా ఆవిడ.

“సాయంత్రం మా ఆవిడను తీసుకొచ్చి ఇల్లు చూపిస్త సార్” అంటూ కుర్చింలోంచి లేవబోడాడతను.

“ఒక్క నిమిషం ఉండండి… ‘టీ’ తాగి వెళుదురుగాని” అని అప్పుడే ఇంట్లోకొస్తున్న పని మనిషి సత్తెమ్మతో..

“తొందరగా టీ తీసుకొనిరా సత్తెమ్మ” అని, “అయినా ఈ రోజుల్లో కూడ ఇంకా.. ఈ కులాల పట్టింపులేంటో.. సర్” అన్నాన్నేను.

ఇంతలో “టీ తెచ్చిన సారూ..” అంటూ ట్రైలో రెండు టీ కప్పులు తీసుకొచ్చి ఒకటి తనకు, రెండోది నాకందించి వెళ్ళింది సత్తెమ్మ.

మెల్లగా టీ తాగుతూ.. “ఇంట్లో కిరాయికుండెటోళ్ళకు, పనిచేసేటోళ్ళకు కూడా ‘కులం’ చూస్తే పనులు నడవవుగదా.. ఇప్పుడు మనకు ‘టీ’ ఇచ్చిందే మా పనెమ్మ.. ఆమె 5 సంవత్సరముల నుండి మా ఇంట్లో పనిచేస్తుంది, ఈ రోజు వరకు కూడా ఆమేమిటో మాకు తెలవదు. మేం ‘రెడ్లం… మా ఇంటిలో పనిచేయడానికి ‘రెడ్డి’ కావాలంటే దొరుకుతారా… ఈ ఇల్లు కట్టేటప్పుడు ఎంతమంది పనిచేసిండ్రో…… సుతారోళ్ళు, వడ్రంగులు, వడ్డెరోళ్ళు, ఇలా అందరూ కలిస్తేనే కదా ఈ ఇల్లయింది’, పని చేసేటప్పుడు అన్ని కులాలవాళ్ళు కావాలే.. కాని రెంటుకు మాత్రం మా కులపోళ్ళుకే అంటే ఎట్ల.. “ఎందరి చెమట చుక్కల సమ్మిళితమో కదా ఈ ఇల్లు…..” అందుకే రెంటుకిచ్చేటప్పుడు మీరేంటీ అని మేం ఎవరినీ అడగనే అడగం.. వాళ్ళుగా .. చెప్పినా మేం అభ్యంతరం పెట్టం” అంటూ తాగిన టీకప్పును పెడుతూ తనకు రెంటుకిచ్చేందుకు సమ్మతమేనని భరోసా కల్పిస్తూ అన్నాన్నేను.

డ్యూటీకి టైం అవుతుందని లేచి, “సాయంత్రం మా మిసెస్‌ను తీసుకొచ్చి రూం చూపిస్తాన్ సార్” అని కృతజ్ఞత నిండిన కళ్ళతో… “థ్యాంక్యూ వెరీమచ్..” అంటూ బండి స్టార్ట్ చేసుకొని చిరునవ్వుతో బయలుదేరాడతను.

“మంచిది” అంటూ గేట్ వేసి లోనికి నడుస్తున్నా నేను.. గమ్యం తెలిసిన బాటసారిలా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here