రోమా: ఇద్దరు స్త్రీల గాథ

2
9

[box type=’note’ fontsize=’16’] “1970లలోని మెక్సికో రాజకీయ వాతావరణం, విద్యార్థుల తిరుగుబాటును అణచడం వంటి పెద్ద చిత్రాన్ని నేపథ్యంలో వుంచి వో కుటుంబ గాథను, వో స్త్రీ గాథను మన ముందు పెడతాడు దర్శకుడు” అంటున్నారు పరేష్ ఎన్. దోషిరోమా” చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]

[dropcap]2[/dropcap]018 లో వచ్చిన చిత్రం రోమా. దర్శకుడు ఆల్ఫొన్సొ కురోన్. ఇతని చిత్రం గ్రావిటి కి 2014 లో ఆస్కర్ వచ్చింది. ఈ యేడు కూడా దర్శకత్వం తో కలుపుకుని పది కేటగిరీలలో ఆస్కర్ కు నామినేట్ అయి వుంది. ఈ చిత్రానికి ఇప్పటికే వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అవార్డు వచ్చి వుంది.

మెక్సికో నగరానికి దగ్గరలో వున్న రోమా అన్న వూళ్ళో వో యెగువ మధ్య తరగతి కుటుంబం గాథ. భర్త ఆంటోనియో వో డాక్టరు. బయోకెమిస్ట్రి చదువుకున్న భార్య సోఫియా ప్రస్తుతం గృహిణి. నలుగురు పిల్లలు. వాళ్ళ అమ్మమ్మ. ఇంట్లో పని చేసే ఇద్దరు ఆడపిల్లలు అడెలా, క్లియొ. ఇద్దరూ రోజంతా పని చేసి ఆ ఇంట్లోనే వుండే యేర్పాటు. కథనం క్లియో దృష్టికోణం నుంచి. కాంఫరెన్స్ కోసం కెబెక్ కు వెళ్ళిన భర్త తిరిగి వస్తాడు. అతని రాకకోసం యెదురు చూస్తున్న భార్యా పిల్లలూ చాలా సంతోషిస్తారు. అయితే ఆ ప్రాజెక్టు పని పూర్తి కాలేదని అతను మరలా కెబెక్ కు వెళ్తాడు. భార్య కన్నీళ్ళతో, ముద్దులతో అతనికి వీడ్కోలు చెబుతుంది. కొన్ని వారాలేగా వచ్చేస్తాగా అంటాడు. ఎడెలా, క్లియో ఆ ఇంటిలో బండెడు చాకిరీ ఇష్టంగానే చేస్తారు. క్లి యో కు ఆ పిల్లలతో చనువు యెక్కువ. ఆ చిన్న దాన్నైతే రాత్రిళ్ళు కథలు చెప్పి, ముద్దు పెట్టి మరీ నిద్ర పుచ్చుతుంది. ఎడెల్ కు రామన్ అన్న ప్రేమికుడు వుంటాడు. వొకసారి శలవరోజున ఎడెలా, క్లియోలు బయటికి వెళ్తారు. అక్కడ రామన్ తన మిత్రుడు ఫర్మిన్ తో వస్తాడు. ఫర్మిన్ క్లియో ల మధ్య్ ఆకర్షణ. ఎడెలా రామన్ లు సినెమా కెళ్తే ఫర్మిన్, క్లియోలు హోటెల్లో రూం తీసుకుంటారు యేకాంతం కోసం. అక్కడ ఫర్మిన్ తన మార్షల్ విద్యలు ప్రదర్శిస్తాడు. తనను చిన్నప్పటి నుంచీ స్నేహితులూ ఇతరులూ ఆట పట్టించి అవమాన పరుస్తూ వుంటే ఈ విద్యే తనకు అండగా చేతికొచ్చిందంటాడు. అప్పటి ఆ హోటెల్లో ఆ దగ్గరితనమే క్లియో ను గర్భవతిని చేస్తుంది. తర్వాత వాళ్ళు సినెమాలో కలిసినప్పుడు తను కడుపుతో వున్నానని చెబుతుంది. నేను బాత్రూంకెళ్ళాలి అర్జంటుగా ఇప్పుడే వస్తానంటూ బయటికెళ్తాడు ఫర్మిన్. మళ్ళీ తిరిగి రాడు. అతని కోసం వేచి వేచి ఇంటికెళ్తుంది క్లియో.

మనసులో ఆమెకు భయం ఈ విషయం తెలిస్తే తనను పనిలోంచి తీసేస్తారేమోనని . భయం భయంగానే సోఫియాతో విషయం చెబుతుంది. తనను పనిలోంచి తీసెయ్యరుగా అని అడుగుతుంది. లేదు లేదు, నువ్వు లేకపోతే ఈ ఇల్లు నడవదు, అలాంటి భయాలు పెట్టుకోవద్దంటుంది. దగ్గరుండి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ డాక్టర్ పరీక్షలు చేసి గర్భం అని ఖాయం చేస్తుంది.

సోఫియా తన పిల్లలతో పాటు క్లియో ను తన స్నేహితురాల వూరుకు తీసుకెళ్తుంది, కొత్త సంవత్సరానికి. క్లియో కి కాస్త మనసు డైవర్ట్ అవుతుందని. అక్కడ అంతా భూములను గురించి జరుగుతున్న గొడవల కారణంగా నెలకొన్న ఉద్రిక్తత గురించి మాట్లాడుకుంటూ వుంటారు. ఆ కొత్త సంవత్సర వేడుకల్లోనే అక్కడి అడవిలో మంటలు వ్యాపించడం, అందరూ పిల్లా పెద్దా కలిసి నీళ్ళు పోసి చల్లార్చడమూ జరుగుతుంది.

తర్వాత అందరూ తమ వూరుకు తిరిగి వస్తారు. వో రోజు పిల్లల కోరికపై అమ్మమ్మ అందరినీ మరూన్‌డ్ అనే సినెమాకు తీసుకెళ్తుంది. అక్కడ ఆంటోనియో మరో స్త్రీతో వెళ్ళడం చూస్తారు. ఇంట్లో పరిస్థితి మారిపోయింది. పెద్ద కొడుకు తల్లి మాటలు చాటుగా విని విషయం అర్థం చేసుకుంటాడు. అతన్ని ఈ విషయం తమ్ముళ్ళు, చెల్లెలితో చెప్పవద్దని చెబుతుంది. ఇక తనే పిల్లలకు తల్లీ తండ్రి అన్నీ. యేదన్నా పని చూసుకుని ఇంటి భారం తలకెత్తుకోవాలని నిర్ణయిస్తుంది. పెద్ద కారును అమ్మేసి చిన్న కారు కొంటుంది.

రామన్ సహాయంతో ఫర్మిన్ వుండే ప్రదేశం తెలుసుకుని వెళ్ళి అతన్ని నిలదీస్తుంది క్లియో. బిడ్డ నాది కాదు, నువ్వు మళ్ళీ నా జోలికి వచ్చావంటే బాగుండదు అని పరుష వాక్యాలు చెప్పి వెళ్ళిపోతాడు. నెలలు నిండుతున్నాయి. పుట్టబోయే బిడ్డకోసం ఉయ్యాల కొనడానికి అమ్మమ్మ క్లియో వెళ్తారు. ఆరోజు విద్యార్థుల ఆందోళన వుండడం వల్ల ట్రఫ్ఫిక్ జాం యెక్కువగా వుంటుంది. ఇది ఈ మధ్య తరచుగా జరుగుతున్నదే అనుకుంటారు వాళ్ళు. షాప్ లో వుండగా బయటినుంచి అల్లర్లు, పరుగులు, అరుపులు, కొట్టడాలు ఈ శబ్దాలు విని అందరూ కిటికీల నుంచి చూస్తారు. పారిపోతున్న విద్యార్థులను వెంటపడి కొడుతున్నారు. ఇంతలో ఇద్దరు గన్నులు పట్టుకుని లోనకొస్తారు. మొదటివాడు వో మనిషిని షూట్ చేస్తాడు. రెండవ వాడు అమ్మమ్మా క్లియోల దగ్గరికి వస్తాడు. అతను మరెవరో కాదు ఫర్మిన్. యేమీ చేయకుండానే వెనుతిరిగి వెళ్ళిపోతాడు. ఆ షాక్లో క్లియో ఉమ్మనీటి సంచి పగిలి, ఉమ్మనీరు కారిపోతుంది. ఇక కానుపుకి యెక్కువ సమయం ప్రమాదకారి. ట్రాఫిక్ జాం కారణంగా ఆసుపత్రికి వెళ్ళడం రెండు గంటలు పడుతుంది. కానుపులో ఆమె వో మృత ఆడ శిశువుని కంటుంది.

ఆ కుటుంబం మరోసారి ఇల్లొదిలి వో బీచ్ కు వెళ్తారు. తాము లేనప్పుడు ఆంటోనియో ఇంటికెళ్ళి తన సామానేదో తను తీసుకుని వెళ్ళేందుకు ఈ యేర్పాటు. అక్కడ బీచ్ లో పిల్లలిద్దరు వద్దంటున్నాసముద్రం లోపలికి వెళ్ళి అలల తాకిడికి మునిగిపోబోతారు. ఈత కూడా రాని క్లియో చప్పున వెళ్ళి యెలాగోలా వాళ్ళను కాపాడి వొడ్డుకు చేరుస్తుంది (పాత్రకే కాదు నటికి కూడా ఈత రాదు). నెమ్మదిగా సోఫియా తన పిల్లలకు తనూ భర్తా విడిపోయిన విషయం చెబుతుంది. క్లియో కూడా యేడుస్తూ తను ఈ పాపను కనాలని అనుకోలేదంటుంది. “స్త్రీలు యెప్పుడూ వొంటరివారే” అంటుంది సోఫియా. అందరూ తిరిగి ఇల్లు చేరేసరికి పుస్తకాల బీరువా వగైరా సామాను మినహా అంతా కొత్తగా వుంటుంది. వరండాలో కుక్క మలాన్ని యెత్తేసే పనిలో పడుతుంది క్లియో.

ఈ సినెమా చూస్తున్నప్పుడు చాయాగ్రహణం యెంత అందంగా వుంటుందంటే మొత్తం నలుపు తెలుపులలో వున్నది అన్న విషయం చప్పున స్ఫురించదు. సినెమా మొట్ట మొదటి సన్నివేశమే ఆ వరండా, నెమ్మదిగా దాని మీద నీళ్ళు పోయడం, శుభ్రపరచడం. ఇదంతా టైటిల్స్ పడుతుండగా. అదే వరండాలో కుక్క బొర్రాస్ వుండేది. యేవరొచ్చినా తోకూపుకుంటూ గేట్ దగ్గరికి వెళ్ళడమే కాదు, యెగురుతుంది, గెంతుతుంది. తలుపు తీసిన ప్రతిసారీ యెవరో వొకరు దాన్ని పట్టుకోవాలి, మరొకారు గుర్తు చేస్తుండాలి బొర్రాస్ బయటికి వెళ్తుందేమో జాగ్రత్త అని. వొక సారి అంత పనీ చేస్తుందా కుక్క, వెంటనే పరుగెత్తుకెళ్ళి పట్టుకొస్తారు. దాన్ని బయటే పోనివ్వరు, ఇక మల మూత్రాదులు యెక్కడ చేయాలి? ఆ వరండాలోనే చేస్తుంది అది. మొదటి సారి ఆంటోనియో వచ్చినప్పుడు ఆ కారు మలం మీదుగా లోపలికి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు చిరాకు పడతాడు కూడా, ఈ విషయమై. సోఫియా ఆ చిరాకును క్లియో పైకి బదిలీ చేస్తుంది. చివరిలో వాళ్ళు ఇంటికోచ్చేసరికి మళ్ళీ ఆ వరండాలో కుక్క మలాలు. మళ్ళీ శుభ్ర పరచడం.

ఈ చిత్రంలో చాయాగ్రహణం చాలా బాగుంది. చాలా సన్నివేశాలు కుడి నుంచి యెడమకో యెడమ నుంచి కుడికో ట్రాక్ షాట్స్. మొదటి సారి ధ్యాసంతా కథ మీద వుంటుంది కాబట్టి దాని వెనుక స్కీం ను పట్టుకోలేకపోయాను. ఆ ఇంటి వ్యవస్థలో భాగంగా క్లియో ను యెడంగా చూపించి, తర్వాత్తర్వాత దగ్గర నుంచి చూపిస్తాడు. రెండు సన్నివేశాలు ముఖ్యంగా చెప్పుకోవాలి. వొకటి ఆమె బిడ్డను కనేటప్పుడు, రెండు సముద్రంలో పిల్లలని కాపాడేటప్పుడు. ఈ రెండూ మెదడులో అలా ముద్ర పడి పోతాయి. అంత అందంగా చిత్రీకరించాడు. ఇక 1970 నాటి మెక్సికో యెలా వుండేది, అప్పటి జీవితం యెలా వుండేదీ నాకు తెలీదు కాబట్టి వ్రాయలేను. అక్కడి పెద్ద వయసు వారు చెప్పగలగాలి. దర్శకుడు కూడా తన బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఈ కథ వ్రాసుకున్నట్టు వొక చోట చెబుతాడు. ఈ క్లియో పాత్రకు కూడా అతను నిజ జీవితంలో చూసిన వో మనిషే.

దీనికి కథ, దర్శకత్వం, చాయాగ్రహణం అన్నీ ఆల్ఫొన్సో కురోనే. చాలా బాగా చేశాడు. క్లియోగా చేసిన అపారిసియో కి ఇది తొలి చిత్రం. అయినా చాలా బాగా చేసింది. సోఫియా గా చేసిన మరీన దేతవీరా కూడా బాగా చేసింది. పిల్లలు పిల్లలలాగా ఉత్సాహంగా ఉరుకులు పెడుతూ కనపడుతారు. ఇది సాంకేతికంగా అన్ని విధాలా బాగున్న చిత్రం.

ఇద్దరు స్త్రీలు. ఇద్దరూ భంగపడ్డవారే. ముఖ్యంగా కథ క్లియో దైనా, నేపథ్యంలో ఇది సోఫియా కథ కూడా. ఇద్దరూ కుప్పకూలిపోయి దిక్కుతోచని స్త్రీలలా జీవితాన్ని యెదుర్కోరు. చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. జెండర్ పరంగా ఇది బాగానే చెప్పినట్టు. మెలోడ్రామా అస్సలు లేదు. అయితే ఆ ఇద్దరు స్త్రీల సామాజిక స్థాయీ భేదాలున్నాయి. యజమాని, కార్మికురాలు. ఈ చిత్రంలో సోఫియా, ఆమె తల్లి ఎడెలా, క్లియోలను బాగా చూసుకుంటారు. నిజమైన ప్రేమతోనే. అయితే దాని వెనుక మరో కారణం కూడా వుంది, అది వాళ్ళ తప్పనిసరి అవసరం. సినెమాను చూపించినవిధంగా నమ్మితే నచ్చుతుంది. కాని మనసులో క్లియో యెందుకు అంత మౌనంగా వున్నది లాంటి ప్రశ్నలు వస్తే గనుక తత్తరపాటు తప్పదు. వొక సన్నివేశం లో ఎడెలా అంటుంది కూడా : క్లియో వాళ్ళు మీ అమ్మ భూమిని కబ్జా చేసేశారు, అని. దానికి నేను యేం చేయగలను అంటుంది నిస్సహాయంగా క్లియో. అంతే. 1970 ప్రాంతాల మెక్సికోలో రాజకీయ వాతావరణం, విద్యార్థుల తిరుగుబాటును అణచడం వగైరా అంతా లీలగా నేపథ్యంలో వుంటుంది, చర్చకు పెద్దగా రాదు. ఆ పెద్ద చిత్రాన్ని నేపథ్యంలో వుంచి వో కుటుంబ గాథను, వో స్త్రీ గాథను మన ముందు పెడతాడు దర్శకుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here