[శ్రీ రొద్దం హరి రచించిన ‘రూపాలు మార్చిన రూపాయి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]అ[/dropcap]ది అనంతపురంలో లక్ష్మీనగర్. మధు, మహి మధ్యతరగతి చిరుద్యోగులు. ఒక చిన్న స్థలం కొని, అప్పుచేసి ఒక చిన్న ఇంటికి వారు యజమానులయ్యారు. కళ్ళనిండా కలలతో, మదినిండా ఆశలతోనే వాళ్ళ జీవితం పెనవేసుకుంది. వారికి ఒక అమ్మాయి. పేరు లక్ష్మి, సర్కారీ బళ్ళో ఆరవ తరగతి చదువుతోంది. వారిరువురికీ ఆ అమ్మాయంటే పంచప్రాణాలు. సాంప్రదాయబద్ధంగా పెంచుతున్నారు. లక్ష్మి వాళ్ళ అమ్మ మహికి శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉండడం వలన ప్రతిరోజూ తన కూతురికి ఆధ్యాత్మిక పరమైన పాటలు నేర్పించేది. లక్ష్మికి పేరుకు తగ్గట్టుగానే లక్ష్మీదేవి అంటే అపారమైన భక్తి. అనునిత్యం సాయంత్రం ఇంట్లో దీపారాధన సమయంలో ‘భాగ్యాద లక్ష్మీ బారమ్మా’ పాటను రాగయుక్తంగా ఆలపించేది. మధుకు కూడా విపరీతమైన దైవభక్తి. ప్రతి ఆదివారం లక్ష్మికి శంకరాచార్యుల వారి ‘కనకధారా స్తోత్రం’, భగవద్గీత’ నేర్పించేవాడు. వారిరువురూ లక్ష్మిని లక్ష్మీదేవి వరప్రసాదంగా భావించేవారు.
వారి జీవితం సముద్రంలో ఒక చిన్న నావలాగా సాగిపోతుండేది. లక్ష్మికి ఒక చిన్న అలవాటుండేది. అదేమంటే అమ్మా, నాన్న తనకు బిస్కెట్లు, చాక్లెట్లు కొనడానికని ఇచ్చిన డబ్బులో ప్రతిరోజూ ఒక రూపాయి నాణాన్ని దాచుకొని, అలా దాచుకున్న ఏడు నాణేలను ప్రతి శుక్రవారం అమ్మవారివద్ద ఉంచిన హుండీలో వేసేది. అలా పోగయిన డబ్బుతో కొల్హాపురంలో కొలువైవున్న మహాలక్ష్మీ అమ్మవారిని కుటుంబసమేతంగా దర్శించుకోవాలని ఆ అమ్మాయి కోరిక. ఆ అలవాటు రావడానికి గల కారణమేమంటే, ఒకరోజు వాళ్ళ నాన్న లక్ష్మితో కొల్హాపురంలో కొలువైవున్న మహాలక్ష్మీ అమ్మవారు చాలా మహిమగలదనీ, కొల్హాపురం జీవితంలో ఒక్కసారైనా మనమందరం కలిసి చూసి రావాలని చెప్పడం, దానికి లక్ష్మి అమాయకంగా, “దానిదేముంది నాన్నా, వెంటనే మనం వెళ్దాం” అని అనడం, దానికి వాళ్ళ అమ్మ “మనం వెళ్ళాలంటే డబ్బు దండిగా కావాలి” అనడం, అన్నీ విన్న లక్ష్మి అమ్మా, నాన్న తనకి రోజూ ఇచ్చే పాకెట్ మనీలో ఒక రూపాయను దాయడం, తను డబ్బుని దాచుకుని ఆ డబ్బుతో అమ్మా, నాన్నలను కొల్హాపురం తీసికెళ్ళాలనుకోవడం.
ఇదిలావుంటే అమ్మవారికి కూడా లక్ష్మి అంటే మహా ప్రేమ. ప్రతిరోజూ ఆ అమ్మాయి నన్నే తలుస్తూ ఉంటుంది కదా మరి నేను ఆ అమ్మాయికి కలలో కనిపిస్తే ఎలావుంటుందన్న ఆలోచన అమ్మవారికి కలిగింది. ఇంకేముంది, శుక్రవారంనాడు సాయంకాల పూజ పూర్తి అయిన తర్వాత లక్ష్మి వాళ్ళ ఇంట్లో అందరూ అల్పాహారం తిని పడుకున్నారు. లక్ష్మి అమ్మవారినే తలుస్తూ పడుకుంది. బాగా పొద్దుపోయిన తర్వాత లక్ష్మికి ఘల్లు ఘల్లు మని గజ్జెల శబ్దం, “లక్ష్మీ” అని తననెవరో పిలిచినట్లుగా మరియు ప్రతిరోజూ తను పాడుకునే తనకిష్ఠమైన పాట “భాగ్యాద లక్ష్మీ బారమ్మా” రాగయుక్తంగా వినిపించసాగాయి. తన్మయత్వంతో వింటూ మైమరచిపోయింది. ఇంతలో రెండు పెద్ద ఏనుగులు, వాటి మధ్యలో బంగారు మయంతో వెలిగిపోతున్న అమ్మవారు పద్మములో కూర్చొని చిరు దరహాసంతో తననే చూస్తున్నట్టుగా అనుభూతి. అమ్మా, అమ్మా అని పిలిచింది. అమ్మవారు, “లక్ష్మీ నేను ఈరోజు నీతో గడుపుదామని మీ ఇంటికి వచ్చాను” అని ఆప్యాయంగా లక్ష్మిని తన దగ్గరకు తీసికొని ముద్దాడింది. లక్ష్మికి ఎన్నెన్నో విషయాలు అమ్మవారిని అడిగి తెలుసుకోవాలనుకుంది. అమ్మవారికి మొదట ఆ రోజు తమ ఇంట చేసిన వంటకాలన్నీ పెట్టింది. అమ్మవారు లక్ష్మి పెట్టిన నివేదననంతా ఆరగించి, తృప్తిగా లక్ష్మిని దీవించింది.
తరువాత నింపాదిగా అమ్మవారిని ఇలా అడిగింది. “అమ్మా, నీవు అందరికీ అమ్మవే కదా, ధనమంతా నీ కృపయే కదా, అందరినీ నీవే ధనవంతుల్ని చేయవచ్చుకదా, మరి ఎందుకు పేద, ధనిక తారతమ్యం సృష్థించావు” అని. అందులకు లక్షీదేవి బదులిస్తూ, “లక్ష్మీ, అందరికీ అన్నీ ఊరికెనే ఇస్తే ఇక ఈ ప్రపంచంలో కష్థపడేవారే ఉండరు. అంతా సోమరిపోతుల సామ్రాజ్యంగా తయారవుతుంది. ఎవ్వరూ ఏ పనీ చేయరు. ఆహారాన్ని పండించే వాళ్ళుండరు. చెట్లను పెంచేవారు గానీ, చెట్టుపై కాయలు కోసే వారు కానీ ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరి జీవితం కర్మ సిద్ధాంతం పైనే ఆధారపడి ఉంటుంది. కర్మ సిద్ధాంతం అంటే నీవు చేసిన పనికి ప్రతిఫలం. అంటే, నీవు పంట పండిస్తే నీతో పాటు నీతో కష్టపడిన వాళ్ళకు కూడా తినడానికి తిండి దొరుకుతుంది. ఆయాచితంగా ఏదీ రాదు. వచ్చినా అది మనతో ఉండదు. సరే, నేను నీకొక చిన్న పనిని అప్పగిస్తాను. నీవు పూర్తి చేస్తావా” అని అమ్మవారు లక్ష్మిని అడిగింది. అందుకు లక్ష్మి వెంటనే సంతోషంతో తల ఊపింది. “ప్రతి శుక్రవారం నా హుండీలో వారం రోజులుగా నీవు దాచుకున్న ఏడు నాణేలనూ వేస్తావు కదా, ఈ వారం మాత్రం ఆ ఏడు నాణేలనూ మీ ఇంటికి వచ్చే వారికి ఏడుమందికి ఒక్కొక్క నాణేన్ని ఇచ్చి, ఆ నాణేన్ని వివేకంగా వాడమని చెప్పు” అని చెప్పి అమ్మవారు అంతర్ధానమయ్యింది. లక్ష్మి కలవరింపులు విని వాళ్ళ అమ్మా, నాన్న “లక్ష్మీ, లక్ష్మీ తెల్లవారిందమ్మా, లే” అని నిద్ర లేపారు. లక్ష్మికి అప్పుడర్థమయ్యింది, తను కలగన్నానని. ఆ కల గురించి లక్ష్మి అమ్మా, నాన్నలతో చెప్పి, అమ్మవారు తనకప్పగించిన పని గురించి వారికి వివరించింది. వాళ్ళు కూడా “అలాగే చేద్దాం లేమ్మా” అని లక్ష్మికి చెప్పారు. వేచి చూస్తున్న శుక్రవారం రానే వచ్చింది. తను ఈ వారం రోజులు దాచుకున్న ఏడు రూపాయి నాణేల్ని అమ్మవారి ముందుంచింది.
ఆ రోజు అమ్మవారు తనకు కలలో చెప్పిన ప్రకారం తమ ఇంటికి వచ్చిన వాళ్ళకే ఆ నాణేల్నివ్వాలి. మరి ఈ రోజు ఆ ఏడు మంది వ్యక్తులు వస్తారా? ఒక వేళ రాక పోతే ఏమి చేయాలి? ఒకవేళ ఎక్కువ మంది వ్యక్తులు వస్తే ఏమి చేయాలి? ఈ ప్రశ్నలు ఆ ముగ్గురిలో తొలుస్తున్నాయి. ఇంతలో సాయంసమయమయ్యింది. పూజ పూర్తి అయ్యింది. ఇంకా ఎవరూ రాలేదు. ఎలా? అని వారనుకుంటుండగానే, మొదట మధు ప్రాణ స్నేహితుడు వరుణ్ తన భార్య చారుమతితో కలిసి మిత్రుడిని కలసి వెళ్దామని వచ్చాడు. వరుణ్ షేర్ లావాదేవీలలో దిట్ట. కాకపోతే ఈ మధ్యే అతను స్టాక్ మార్కెట్ ఆటుపోట్లకు బలై పోయాడు. చాలా డబ్బు పోగొట్టుకున్నాడు. చారుమతి ఇంటిపట్టునే ఉంటుంది. ఆమె మహిళామండలి అధ్యక్షురాలు. కొద్దిసేపటికి పక్కింటి ఇందుమతి మహిని పేరంటానికి పిలవడానికి వచ్చింది. ఆమె ఇంట్లోనే చీరల వ్యాపారం చేస్తుంటుంది. ఆమె వ్యాపారం కరోనా పుణ్యమా అని తగ్గుముఖం పట్టింది. వారు మాట్లాడుకుంటూ ఉండగానే మహి స్నేహితురాలు విజయలక్ష్మి తన భర్త రామంతో కలిసి వచ్చింది. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉన్నత భావాలు, సేవా గుణం కలిగిన వ్యక్తులు. వారి సమక్షంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్న శుభసందర్భంగా పిలవడానికి వచ్చారు. లక్ష్మి స్నేహితురాలు రమ వాళ్ళ అమ్మ వసంత, వాళ్ళ నాన్న శ్రీధర్‌లు కూడా అదే సమయానికి వాళ్ళ చిన్నబ్బాయి నామకరణానికి పిలవడానికి వచ్చారు. వసంత యోగా అధ్యాపకురాలు. శ్రీధర్ ఆధ్యాత్మికవేత్త.
కుశల ప్రశ్నలు, ఫలహార, పానీయాలు సేవించిన తరువాత లక్ష్మి అమ్మవారిదగ్గర తను ఉంచిన ఏడు నాణేలనూ తీసికొని వచ్చి తలా ఒక నాణేన్ని ఇచ్చి అమ్మవారు తనకు కలలో కనిపించి చెప్పమన్నట్టుగా వివేకంతో ఆ నాణేన్ని వినియోగించాలని వారందరికీ చెప్పింది. వారందరూ ఆ నాణేలను మహాప్రసాదంగా స్వీకరించి తమ తమ ఇళ్ళకు వెళ్ళారు.
వరుణ్ తను నమ్ముకున్న షేర్ మార్కెట్ లోనే ఆ రూపాయిని పెట్టుబడిగా పెట్టదలచి ఆ ఒక్కరూపాయకు మరో 99 రూపాయలను జోడించి మొత్తం వంద రూపాయలకు ఐదు పైసలుగా ఉన్న ఒక కంపెనీ 2000 షేర్ లను కొన్నాడు. అతను కొన్న షేర్లు ఒకప్పుడు మార్కెట్‌ను శాసించాయి. ఐతే ఆ కంపెనీ యజమానుల మధ్య భేధాభిప్రాయాలతో కంపెనీ మూతపడే స్థాయికి చేరుకుంది. వరుణ్ దశ తిరిగింది. ఆ కంపెనీ యజమానుల మధ్య సయోధ్య కుదరడంతో ఆ కంపెనీ షేర్ ధర ఊహించని విధంగా పుంజుకుని మళ్ళీ మార్కెట్‌ను శాసించే స్థాయికి చేరుకుంది. ఈ విజయంతో వరుణ్ మళ్ళీ వెనుకకు తిరిగి చూడలేదు. వరుణ్ భార్య చారుమతి తనకిచ్చిన రూపాయను ఏవిధంగా ఉపయోగించాలి అని వంద మంది సభ్యులు కల తన మహిళామండలి సభ్యులతో కలిసి ఆలోచించి ప్రతి సభ్యురాలు కనీసం వందమందితో ప్రతి ఒక్కరూ రోజుకు ఒక్కరూపాయ ఇచ్చేటట్టుగా ఒప్పించి ఆ వచ్చిన సొమ్ముతో ఒక వృద్ధాశ్రమాన్ని స్థాపించి ఎవరూ లేరని బాధపడే వృద్ధులకు నేనున్నానంటూ చేయూతనందించి ఆ కృషిని నిరంతరాయంగా కొనసాగించి భర్త మరియు దాతల సహకారంతో వృద్ధులకు సేవచేస్తూ, రాష్థ్ర, కేంద్ర స్థాయిలో ఎన్నో పురస్కారాలను అందుకుంది.
ఇందుమతి తనకిచ్చిన రూపాయతో తనవద్దనున్న కొంతమొత్తాన్ని మరియు కొంత మొత్తం అప్పుగా తెచ్చి తన చీరల వ్యాపారాన్ని నూతన వస్త్ర వ్యాపారంగా మార్చుకొని తన కష్థంతో, తెలివితేటలతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది. తక్కువ లాభంతో నాణ్యమైన వస్త్రాలు అమ్మడం మొదలు పెట్టింది. ఇతర దుకాణాలతో పోలిస్తే ధరలు తక్కువగా ఉండి, వ్యాపారం కళకళలాడటంతో ఇందుమతి చేతినిండా డబ్బు. అలా న్యాయంగా సంపాదించిన సొమ్ముతో నూతనంగా నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద ఒక ఉచిత భోజనశాలను ఏర్పాటు చేసింది. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చుట్టుపక్కల తినడానికేమీ దొరకని పరిస్థితి. అక్కడికి వచ్చే రోగులు మరియు వారి బంధువులు ఆహారం దొరక్క చాలా ఇబ్బందులు పడేవారు. ఒక వేళ హోటల్లో తిన్నా డబ్బు పుష్కలంగా ఖర్చయ్యే పరిస్థితి. ఇందుమతి ప్రారంభించిన ఉచిత భోజనశాల వల్ల ఇప్పుడు రోగులు వారి బంధువులు ఆకలితో అలమటించే పరిస్థితులు లేవు.
విజయలక్ష్మి మరియు రామంలు మంచి ఉపాధ్యాయులు. అంకిత భావంతో పనిచేసేవారు. ఇరువురూ ఉన్నత ఉపాధ్యాయులుగా ఎన్నో పురస్కారాలు అందుకొన్నారు. ఇరువురూ తమ తమ రూపాయలతో ఏదైనా మంచి పని చేయ తలచి తమ జీతంలో కొంత భాగం కలుపుకొని మరికొంత భాగం తమ సహోద్యోగుల సహకారంతో ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి తమ విద్యాలయంలో చదివిన పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు మరియు ఉద్యోగాల కోసం నిర్వహించే పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి కావలసిన పుస్తకాలను మరియు ఆర్థిక వనరులను సమకూర్చారు. అలా వారి సహాయాన్ని పొందిన కొందరు విద్యార్థులు మంచి ఉద్యోగాలు సంపాదించి ఉన్నత స్థానాల్లో స్థిరపడగా మరికొంతమంది విద్యార్థులు తమ సొంత వ్యాపారాల్లో స్థిరపడి కొన్ని వందల మందికి ఉపాధిని కల్పించే ప్రతిభావంతులయ్యారు.
వసంత తనకిచ్చిన ఒక్క రూపాయను మరుసటిరోజు తన యోగా క్లాస్ నందు ఒక పీఠంపైన ఉంచి వచ్చే ప్రతి యోగాభ్యాసకులతో అది అమ్మవారి ప్రసాదమని దానికి ప్రతిఒక్కరూ తమకు చేతనైనంత మొత్తమును చేర్చి అలా ప్రోగైన డబ్బుతో మానసిక ఒత్తిడి (డిప్రెషన్)కి లోనైన అభాగ్యులను చేరదీసి వారికి యోగాభ్యాసం గురించి మరియు దాని యొక్క లాభాల గురించి వివరించి వారిని మంచి యోగాభ్యాసకులుగా తీర్చిదిద్దాలని చెప్పింది. దానితో ప్రతి క్లాస్‌కు వచ్చే యోగాభ్యాసులందరి నుండి అధిక మొత్తంలో ధనము ప్రోగైంది. ఆ ధనాన్ని ఉపయోగించి తన యోగాభ్యాసకుల సహాయంతో ఊళ్ళో ఉన్న ఆసుపత్రులన్నీ తిరిగి మానసిక ఒత్తిడి లోనున్న వ్యక్తులను గుర్తించింది. వారి కుటుంబసభ్యులతో మాట్లాడింది. వారిలో చాలా మంది వ్యక్తులది చాలా దయనీయ పరిస్థితి. డబ్బు నీళ్ళమాదిరిగా ఖర్చవుతోంది. అప్పు తెచ్చి వారికి చికిత్స ఇప్పిస్తున్నారు. అప్పు పెరిగి పోతోంది కానీ వారి రోగం నయం కావడంలేదు. కుటుంబసభ్యులకు నచ్చచెప్పి ఒక ప్రయత్నం చేయడానికి నాకు అవకాశమివ్వమని వారిని వేడుకొని మానసిక ఒత్తిడిలో ఉన్నవారిని తన యోగా కేంద్రానికి తరలించి వారికి అన్ని సదుపాయాలు కల్పించి వారికి యోగా మరియు ధ్యానం నేర్పించి నిత్యం వారితో సాధన చేయించి వారిని తిరిగి మామూలు మనుష్యులుగా మార్చింది. మామూలు మనుష్యులుగా మారిన వారి కుటుంబసభ్యుల ఆనందోత్సాహాలకు అవధులు లేవు.
శ్రీధర్ మంచి వక్త మరియు ఆధ్యాత్మిక వేత్త. ఆయన ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తుంటారు. ఆయన తనకిచ్చిన రూపాయను అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజించి ఏదైనా మంచి పని చేయదలచి తన శిష్యులతో కలిసి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఒక హుండీని ఏర్పాటు చేసి తన ప్రవచనాలకు వచ్చే వారితో తలా ఒక్క రూపాయ రుసుమును ఆ హుండీలో వేయమని చెప్పాడు. అలా వచ్చే నిధులతో నేరం చేసి చెరసాల నుండి విడుదలైన వ్యక్తులను తన శిష్యుల సహాయంతో గుర్తించి వారికి పునరావాసం కల్పించి వారికి నచ్చిన వృత్తిలో వారికి శిక్షణ నిప్పించి వారి మనస్సులను తన ప్రవచనాలతో ఆధ్యాత్మికతవైపు మళ్ళించి వారు తాము చేసిన నేరాలకు పశ్చాత్తాప పడేలా చేసి తిరిగి వారు నేరం చేయకుండా మార్చి వారిని సంఘంలో ఉన్నత వ్యక్తులు గా తీర్చిదిద్దాడు.
మూడు సంవత్సరాల తరువాత మళ్ళీ అందరూ లక్ష్మి వాళ్ళ ఇంటిలో కలుసుకున్నారు. అందరూ ఉన్నత స్థానాలకు చేరి వారికి తోచిన రీతిలో వారు సమాజసేవ చేస్తున్నారు. వారి వల్ల లభ్యపడిన వారు కూడా ఇతోధికంగా సమాజానికి సేవ చేస్తున్నారు. ఇదంతా లక్ష్మి వల్ల తమకు కలిగిన భాగ్యమని అందరూ కలిసి లక్ష్మిని, వాళ్ళ అమ్మానాన్నలను కొల్హాపురం తీసికెళ్ళి ఆ లక్ష్మీదేవిని దర్శింపజేశారు. లక్ష్మి చెమ్మగిల్లిన కళ్ళతో అమ్మవారిని చూస్తూ తన మనస్సులోనే ధన్యవాదాలు తెలియజేసుకుంది. అమ్మవారు తనవైపే చూస్తూ చిరునవ్వుతో ఏదో చెబుతున్నట్టుగా లక్ష్మికి అగుపించింది. చెవులు రిక్కించి తదేకంగా అమ్మవారిని చూస్తూ మైమరచి పోయింది. చూశావా లక్ష్మీ, నేను నీతో “ఒక్క రూపాయని వివేకంతో ఆలోచించి ఖర్చుపెట్టమని వీరందరికీ చెప్పించిన మాట సమాజంలో ఎంత మార్పుకు కారణమయ్యిందో? ఆ మాట చెప్పకుండా అమ్మవారి ప్రసాదమని నీవు వీళ్ళకు ఇచ్చివుంటే ఆ రూపాయ కేవలం వారి పూజాగృహాల్లోనే పూజలందుకొనే ఒక విగ్రహంగా ఉండి ఉండేది” అని అమ్మవారు తనతో అన్నట్టుగా లక్ష్మికి అనిపించింది. “లక్ష్మీ, లక్ష్మీ” అన్న అమ్మ పిలుపులతో ఈ లోకంలోకి వచ్చిన లక్ష్మి మరొక్కసారి అమ్మవారికి కృతజ్ఞతా పూర్వక నమస్కారాలు సమర్పించి సంతోషం మరియు సంతృప్తి నిండిన మనస్సుతో అందరితో కలిసి తమ ఊరికి తిరుగు ప్రయాణమయ్యింది.