రుద్రాక్ష చెట్టు

0
17

[డా. కందేపి రాణీప్రసాద్ గారు రచించిన ‘రుద్రాక్ష చెట్టు’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]ప్ర[/dropcap]పంచ వారసత్వ సంపదగా గుర్తించ బడిన, మరియు అత్యంత ప్రాచీన శివాలయమైన పశుపతినాథ దేవాలయాలను చూడటానికి మేము నేపాల్ దేశం వెళ్ళాము. నేపాల్ జాతీయ పుష్పమైన ఎర్రని రోడో దేండ్రాన్ పువ్వును గురించి ఒక వ్యాసం రాశాను. ఇప్పుడు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రుద్రాక్ష చెట్టు గురించి తెలియజేయాలను కుంటున్నాను.

నేపాల్లోని బౌద్ధాలయాలు, శివాలయాలలో ఎక్కడ చూసినా రుద్రాక్ష మాలలు వందల, వేల సంఖ్యలో లభిస్తాయి. ఏమిటి ఇన్ని ఎక్కువగా కనిపిస్తున్నాయి అనుకుంటే రుద్రాక్షల చెట్లు నేపాల్ దేశంలోనే ఎక్కువగా పెరుగుతాయని తెలిసింది. మన ఇళ్లలోని దేవుడి గదిలో కనిపించే రుద్రాక్షల గురించి తెలుసుకుందామా!

ఏకముఖి, పంచముఖి రుద్రాక్షలు అంటూ ఇంట్లో పెద్దవాళ్ళు చెపుతుంటే వినటమే గానీ ఈ చెట్టు గురించి నాకూ తెలియదు. ఇక్కడ ఆ చెట్లను చూసినప్పుడు చాలా ఆశ్చర్యమేసింది. రుద్రాక్ష చెట్లను చూపించినప్పుడు ఫోటోలు తిసుకోవాలనుకున్నాను కానీ కొండల మీదున్నాయి. కాబట్టి నేను చెట్టుతో ఫోటోలు తీసుకోవడం కుదరలేదు. మా అమ్మ గాయత్రీ మంత్రం జపించేటపుడు చేతిలో తిప్పుతూ ఉంటుంది. మా నాయనమ్మ మెడలో ఎప్పుడూ రుద్రాక్ష మాల ఉండేది. మా నాన్న ఏకముఖి రుద్రాక్షను ధరిస్తారు. ఇలాంటి రుద్రాక్ష చెట్టును గురించి తెలుసుకుందామా!

రుద్రాక్ష చెట్లకు నేపాల్ దేశం ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో దొరికే రుద్రాక్షల కన్నా నేపాల్ రుద్రాక్షలకు విలువ ఎక్కువ. అందరూ నేపాల్ దేశం నుంచి రుద్రాక్షలను కొనుక్కొచ్చుకున్నారు. మేము రుద్రాక్ష చెట్ల గురించి వివరాలు తెలుసుకుని వచ్చాం. హిమాలయాల పాదాల చెంత కొండల్లో ఎక్కువగా ఈ చెట్టు పెరుగుతుంది. ఖాట్మండు, కావ్రె, సింధుపాల్ చౌక్, భోజ్ పూర్ వంటి చోట్ల రుద్రాక్షలు బాగా పెరుగుతున్నాయి. హిందువులు, బౌద్ధులు, సిక్కులు పవిత్రంగా భావించే రుద్రాక్షలు అనేక ముఖాలతో ఉంటాయి.

రుద్రాక్ష చెట్టు యొక్క శాస్త్రీయనామం ‘ఎలియోకార్పస్ గానిట్రస్’. ఇవి సతత హరిత వృక్షాలకు సంబంధించిన జాతి. హిందూ సంస్కృతిలో విపరీతమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. ఇందులో 35 విభిన్న ఉపజాతులు ఉంటాయి. గంగా మైదానాల నుండి హిమాలయాల వరకు ఈ చెట్లు విస్తరించి ఉన్నాయి. మూడు సంవత్సరాల వయసు నుండి పండ్లను ఇవ్వటం మొదలు పెడుతుంది. ఈ పండ్లు ఎండిపోయాక రుద్రాక్షలు అవుతాయి. ఈ పండ్లు ఎండిపోయే క్రమంలో ఏర్పడే ముడతల వలననే రుద్రాక్షలకు ముఖాలు ఏర్పడతాయి. ఫలంగా ఉన్నపుడు బులుగు రంగులో గుండ్రంగా ఉంటాయి. అలాంటపుడు చెట్లను చూసిన వారు చాలా మంది దీనిని బ్లూ బెర్రీ చెట్లని భ్రమ పడుతుంటారు. కాని రుద్రాక్ష చెట్టని తెలుసుకోలేరు. ఎండిన పండ్లకు రంధ్రం పెట్టి హారంగా మారుస్తారు. వీటికి వైద్య లక్షణాలు ఉన్నాయని ఔషధ మొక్కల విభాగంలో చేర్చారు.

రుద్ర అంటే శివుడు అనీ, అక్ష అంటే కన్ను అని అర్థం. అంటే శివుడు యొక్క కళ్ళని ఈ రుద్రాక్షల అర్థం. 108 పూసలతో రుద్రాక్ష మాలను తాయారు చేస్తారు. ఈ రుద్రాక్ష చెట్లను, చక్క బేగర్ అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు పదిహేను మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని కాండం ఐదు నుంచి పది మీటర్ల వెడల్పు ఉంటుంది. రంపపు నిర్మాణం కలిగిన పొడవాటి ఆకులు ఉంటాయి. ఇవి మామిడాకుల్ని పోలి ఉంటాయి. ఆకులు రాలిపోయే ముందు ఎరుపు రంగులోకి మారతాయి. 60 మి.మీ ల నుంచి 180 మీ.మి పొడవు గల అకులుంటాయి. దీనిని విత్తనాల ద్వారా మాత్రమే కాక కాండం కత్తిరింపు ద్వారా కూడా కొత్త మొక్కల్ని పుట్టించవచ్చు. ఈ మధ్య కాలంలో కుండీలలో కూడా పెంచుకునే సౌకర్యం కల్పించారు. ఈ మొక్క ఎక్కువగా ఉష్ణాన్ని తట్టుకోలేదు. అందువలననే ఇవి ఎక్కువగా చలి ప్రదేశాల్లో పెరుగుతాయి. మంచి సారవంతమైన నేల కూడా అవసరం. అందువలననే కొండల మీద సారవంతమైన నేలల్లో సేంద్రియ పోషకాలతో పెరుగుతుంది ఎండిన కొమ్మల్ని కత్తిరించడం వాళ్ళ ఎక్కువ పండ్లను ఉత్పత్తి చేయవచ్చు.

రుద్రాక్ష చెట్టు ఆకు యాంటీ బాక్టిరియల్, మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరి లక్షణాలను కలిగి ఉంటుంది. మైగ్రేన్, మూర్చ, తలనొప్పి, గాయాల వంటి వాటి చికిత్సకు ఈ చెట్టు ఆకుల్ని ఉపయోగిస్తారు. ఈ గింజల్ని మెత్తగా రుబ్బి, రోజ్ వాటర్‌తో కలిపి చర్మ సమస్యలున్న ప్రాంతంపై పూస్తే తగ్గుతుందని నమ్ముతారు. ఒత్తిడి, టెన్షన్ వంటి వాటికీ రుద్రాక్ష పూసల వల్ల ఉపశమనం ఉంటుందని భావిస్తారు. ఆయుర్వేద శాస్త్రంలో రుద్రాక్ష గింజలు రక్తాన్ని శుధ్ధి చేయడానికి పనికొస్తాయని రాసి ఉన్నది.

గంట ఆకారంలో ఉన్న తెల్లని పువ్వులు పూస్తాయి. వేసవి కాలం మొదలయ్యే ముందు ఇవి పూయటం మొదలు పెడతాయి. నీలం రంగులో గుండ్రంగా ఏర్పడిన కాయలు పండిన వెంటనే రాలిపోతాయి. ఒక్కొక్క చెట్టు 10 నుంచి 15 కేజీల దాకా రుద్రాక్షలను ఇస్తుంది. ఈ చెట్టును ‘హిమాలయన్ ప్రేయర్స్ బీడ్స్’ అని, ‘బ్లూ మార్బుల్ రుద్రాక్ష ట్రీ’ అని అంటారు. రుద్రాక్ష చాలా గట్టిగా ఉంటుంది. ఈ చెట్టు ‘ఎలియో కార్పేసి’ కుటుంబానికి, ‘అక్సాలిడేల్స్’ క్రమానికి చెందిన మొక్క. ఎలియో కార్పస్ అనే పదం గ్రీకు భాష నుంచి తీసుకోబడింది. గ్రీకు భాషలో ఎలియో కార్పస్ అంటే ఆలివ్ పండ్లు అని అర్థం. దాదాపు 488 జాతులు ఉన్నాయని అంచనా. భారతదేశంలో సైతం అక్కడక్కడా రుద్రాక్షను పండిస్తున్నారు. ఇవి రుద్రాక్షల విశేషాలు.

Images Source: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here