భద్రవీణ – ‘రుద్రరాగాలు’ పుస్తకానికి శ్రీ ముదిగొండ వీరభద్రయ్య ముందుమాట

0
14

[dropcap]ఈ[/dropcap] ‘రుద్రరాగాలు’ చదవకండి! చదివితే మీరు మీరుగా ఉండరు. మీరు మారిపోతారు. మీలో దాగి ఉన్న మరో మనిషిని, నిజమైన మనిషిని వెలికితీసి ప్రపంచంలో నిలబెట్టుతుందీ కవితలరాశి. మారాల్సిన వాళ్లు మారాలనుకుంటే దీన్ని చదవండి! భాస్కరయోగివర్యుడు అచ్చమైన కవి. వస్తువు వీరిని పిండి పిప్పి చేసింది. వస్తువుతో వీరు తపస్సు చేయలేదు. వస్తువే వీరిని తపింపజేసింది. ఆ తపఃఫలమే వీరి యీ ‘రుద్రరాగాలు’ అన్న కవితారాశి. కలం ఆగుతుందా? అని మొదలుపెట్టి –

“భావాల పరంపర బ్రద్దలై

లావాలా తన్నుకు వస్తుంటే

కవిత్వమెందుకు రాదు?”

అన్న వీరు అచ్చమైన కవి కాక మరేమౌతారు?

లావాలా కారుతుంది. వీరి కవిత్వం. కన్నీటిలా రూపాంతరమూ పొందుతుంది. అభివ్యక్తం కాని మౌనదశలోని వీరి వాక్కు ‘భూగోళాన్ని మింగేయడమూ ఖాయ’మని హెచ్చరిస్తుంది. “అవమానాల్ని సహిస్తూ నిద్ర నటిస్తున్న అమాయకుల్ని జాగృతం” చేస్తుంది. “కోమలమైన కాళిదాసు కవిత్వమూ, పరశురాముని పదునైన గండ్రగొడ్డళ్లూ” రెండూ ఉన్న ఒక విచిత్ర సృజన వీరి కవిత్వం.

వీరి యీ కవితా ప్రవాహం ఒక వరదలాంటిది. నిజం! ఇది వరదయే. కొట్టుకొనిపోతారు. అట్లాగే వరాలను పొందుతారు. నిద్రను ఝాడించి, దులిపేస్తుందీ వరద. మరో చైతన్యాన్ని వరంగా ప్రసాదిస్తుంది. ఇదీ వీరి కవితారాశి మహిమ. మధుర స్వప్నాలు కన్నవాడే భాస్కరయోగివర్యుడు. వాటిల్లో రమించిన వాడే.

“స్వప్నంలోని మధురక్షణాలను

అలాగే అదిమిపట్టే విద్యను

ఏ గంధర్వుడో నాకందిస్తే ఎంత బాగుండును?”

అని అనుకొన్నవాడే. కాని ఆ గంధర్వుడు రాకముందే ధర్మదేవత వీరిని ఆవహించింది.

“నా కలం ఇప్పుడు రక్తాన్ని కక్కుతున్నదో

నిప్పులను వర్షిస్తుందో నాకే తెలీదు”

“కన్నీటి బిందువులు రక్తపు ముద్దలుగా మారడం”

“అగ్నిలా నేను నాలుక తెలుచుకొని

ఘృతం కోసం ఎదురుచూస్తున్నా”

“ఇపుడు నా ప్రయాణం

స్వజాతీయ కుండలినీ శక్తితో

ఊర్థ్వగమనం వైపు మళ్లింది

కన్యాకుమారి మూలాధారం నుంచి

కాశ్మీర సహస్రారం వైపు”

ధర్మదేవత ఆవహించి ఉండకపోతే ఇట్లా రాయగలిగే ఉండేవారా ఈ భాస్కరుడు? భరత జాతి ఆత్మ మకరందం ఈ కవిత్వపు పూలలో తొణికిస లాడడం లేదూ! “నేను ఋషిని” అన్న కవితలో ఈ జాతి ప్రాణాన్ని ఆవిష్కరిస్తూ రాసిన ఈ భాస్కరయోగివర్యుడు ధర్మదేవత చేతిలోని బంగారు ఘంటమే సుమా!

ఒకటి రెండు చోట్ల నైరాశ్యం ప్రకటించినా, వీరు పరమ ఆశావాదులే. “మృత్యువునే జీవంగా మార్చే భాష” వీరిది.

జాతి ప్రాణాన్ని కళ్లులేని కబోదులకు ఎత్తి చూపుతూ చైతన్యపరుస్తున్న సత్కవి భాస్కరయోగి. కవిగా మృదుత్వాన్ని, కోమలత్వాన్నీ వదలని మహామానవుడే అయినా, జాతిని కాపాడుకోవడంలో రాజసాన్నీ, కర్తవ్యదీక్షాపరత్వాన్ని వదలుకోని సుప్రజ వీరు. కత్తిని ఝళిపించినా కారుణ్యాన్ని వదలుకోని సన్మానవుడీయన. భారత చరిత్ర పై దొమ్మీలు జరిగినవి. దొంగతనానికి వచ్చి యజమానులను బైటకు తరిమేసిన ఘనులు సామర్థ్యండీయులు. ఈ వర్తమానం ఆనాటి వలె ఓటమిలో కూరుకొని పోనీయదు.

“ఇపుడు దేశం నిండా సిందూరం అలదుకొన్న

సింహాల పిల్లలు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి”

అని నేటి యుగ చైతన్యం ఏమిటో, భారత యువతలో పొంగిపొరలుతున్న ధర్మాగ్రహరీతి ఏమిటో లోతుగా తెలిసిన కవి వీరు. అయినా వీరి ఆగ్రహంలో, వీరి రౌద్రంలో, క్రోధంలో విశిష్ట మార్దవం ఉన్నది.

“చరిత్రను చెరిపేసిన

కరకు కరవాలాలను, కలాలను

ఎదిరించి పెల్లుబికిన వెన్నెల పాటను”

అన్న మాటలే దీనికి గుర్తు.

“నేనిప్పుడు శాంతి సమరం చేసే కృష్ణుణ్ణి” అన్న మాటలు భాస్కరయోగి వ్యక్తిత్వాన్ని తెలిపే మాటలు. ఈ భారత జాతి వ్యక్తిత్వానికి భాస్కరయోగి ప్రతినిధి. జాతిని నిర్వీర్యజాతిగా భావించేవారికి, భావిస్తున్న స్వదేశీ దుర్మార్గులకు ‘జాతి శక్తిని’ తన స్వర్ణాక్షరాలలో తెలిపిన కవివర్యుడు భాస్కరయోగి.

“నన్ను ప్రాచీనమైన మనిషి మాత్రమే అని తలచేరు

నేను కళ్లు మూసుకొని విశ్వాత్మను అనుసంధానిస్తే

నక్షత్రాల గుంపులు నల్లుల్లా రాలిపోతాయి”

“గజనీలను గజాల దూరంలో నిలబెడతా

సనాతన గంగకు వారధినై

గగనం దాకా దూసుకుపోతా”

“ఆత్మవంచనతో, ఏమీ తెలియనట్లు నటిస్తున్న

నన్ను చూసి నేనే నవ్వుకుంటున్నాను”

అన్న న్యూనతా స్థితి నుంచి సనాతన గంగకూ వారధి అయి ఎవరికీ అందని ఎత్తుల్లోకి ఈ జాతిని ఎగిరించాలని అనుకుంటున్న మహాకవి భాస్కరయోగి. ఆయనలాగా అధిరోహించాలనుకున్న వారే ఈ రుద్రరాగాలు చదవాలి. స్వదేశీ దుర్మార్గులను కూడా శస్త్రచికిత్స లేకుండానే వారి రోగాలను మార్చివేయగలిగే గొప్ప శక్తి ఈ ‘రుద్రరాగాలు’ కలిగి ఉంది.

“నీటిలో మునిగింది, తేలింది

వెలుగులో మబ్బు సెందురుడల్లె

మనిసిలో మనిసల్లే” అంటారు నండూరి సుబ్బారావుగారు. ఈ కావ్య పఠితకూ అదే సద్గతి ప్రాప్తిస్తుంది. కావ్యప్రయోజనమే అది కదా!

ఏదో పొడిపొడిగా రాయలేని కవి ఈయన. ఇందులోని కవిత్వీకరణాన్ని గురించి రాయడానికి చాలానే ఉంది. వక్తగా, పాత్రికేయునిగా అగుపించే ఈ భాస్కరయోగి గారిలో ఇన్ని అగ్నిపర్వతాలున్నాయని కానీ, ఇంత లావా ఉబికించే ప్రతిభ ఉన్నదనీ ఎవరూ ఊహించి ఉండరు. ఈ ‘రుద్రరాగాలు’ కవితా పుష్పరాశి ద్వారానే వీరి ప్రతిభాసౌరభాలు కానీ, వారి అమూల్యత కానీ తెలిసి వస్తున్నది. వేరే సందర్భంలోని కవిత్వ పంక్తులే అయినా ఈ కింది పాదాలు వారి కవితా వ్యక్తిత్వానికీ, చక్కగా అన్వయమౌతాయి.

“ఆకుల మూల్యం కోకిలకు తెలియదు

కోకిల మూల్యం కొమ్మలకు తెలియదు

దాపుల విలువ మొక్కలకు తెలియదు

చూపుల విలువ కన్నులకు తెలియదు”

నిజం సుమా! అట్లాగే భాస్కరయోగి విలువ చాలామందికి తెలియదు.

శబ్దం నిశ్శబ్దం నుంచే పుడ్తుంది. ఆ నిశ్శబ్దాన్ని ఒక్కో కళారీతి వారు ఒక్కోరీతిగా ఉపాసిస్తుంటారు. చిత్రకారునికి అది వర్ణాలుగా సాక్షాత్కరిస్తుంది. కవికి అది అలంకృత శబ్దాలుగా రూపాంతరమౌతుంది. కవిత్వానికి ప్రయోజనం లేదనే వానికి, కవిత్వ మహత్తు తెలియనివాడు, కళ కళ కోసమే అనేవాడు ఎందుకూ ‘పనికిరాని’ వాడు. కళాప్రయోజనం అన్నది కళ కళ అయినప్పుడు కాని సిద్ధించదు. కవిత్వం, కవిత్వం అయినప్పుడు కల్గించేదే కలిగేదే ఆనందం. అది లోపిస్తే వస్తువు ఎంత గొప్పదైతేనేం అది ప్రయోజన శూన్యమైనదే. కవితను కవితగా చేసేది ఈ ఆనందం అనే అంశమే. అదే దాని చోదకశక్తి. ఈ రహస్యం తెలీనివాడు రాసే కవిత వ్యర్థం. భాస్కరయోగి గారి కవితాపుష్పాలన్నీ ‘ఆనంద సౌరభాన్ని’ ప్రసరిస్తున్నవే. అందుకే అవి శక్తిమంతాలు.

కన్నీటి బిందువులు రక్తపు బిందువులుగా మార్చడం, కళ్లు నిప్పుల వర్షం కురియడం, తులసిచెట్టుతో తుపాకీ తయారు చేయడం, పుట్ట నుండి వాల్మీకి పుడ్తాడనుకుంటే ఎర్రవిషాన్ని కక్కే నాగుపాములు పుట్టుకురావడం వంటివన్నీ వీరి కవిత్వీకరణ ప్రతిభకు మచ్చుతునకలు. పఠితను వశీకరించుకొనే దినుసులు ఇవే.

ఫలశ్రుతిగా వీరు రాసిన చివరి కవితా కుసుమాలు ఆనందావస్థ, బ్రహ్మైక్యం అన్నవి ఇదంతా ఏకకావ్యమా! అన్న స్ఫురణ కలిగిస్తూ గొప్ప ఆనందానుభూతిని కలిగిస్తున్నవి. కవి ఎక్కిన, ఎక్కదలచుకొన్న ఆధ్యాత్మిక శిఖరాలను దిఙ్మాత్రంగా ఇవి చూపుతూ, వీరి కవితాశక్తికి పతాకలుగా నిలుస్తున్నవి.

భాస్కరయోగి గారి ‘రుద్రరాగాలు’ని తెలుగు సాహిత్యలోకంలోకి సాదరంగా స్వాగతిస్తున్నాను.

జాతీయకవిగా వీరు మన్నిక పొందాలని ఆశిస్తున్నాను. వీరిని మనసారా అభినందిస్తున్నాను. నాకీ నాలుగు మాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ…

ముదిగొండ వీరభద్రయ్య

***

రుద్రరాగాలు

(కవితా సంపుటి)

రచన: డా. పి. భాస్కరయోగి

పేజీలు: 145

వెల: రూ. 150

ప్రచురణ: విజ్ఞాన సేవా ప్రచురణలు

ప్రతులకు: నవోదయ, ఇతర ప్రముఖ పుస్తక దుకాణాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here