రూల్స్ పాటించాలి

0
5

[బాలబాలికల కోసం ‘రూల్స్ పాటించాలి’ అనే చిన్న కథని అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]

[dropcap]హ[/dropcap]రీష్, ప్రియాంక పిల్లలిద్దరినీ తీసుకొని చెక్‌ఇన్‌లో నిలబడ్డారు. లైన్లో చాలా మంది ఉన్నారు. ఈ రోజు వీకెండ్స్ కావటం వాళ్ళ రష్ ఎక్కువగా ఉంది. హ్యాండ్ లగేజి స్కాన్ లోని ట్రే లో పెట్టి సెక్యూరిటీ చెక్ దగ్గర పాపను తీసుకొని నిలబడింది ప్రియాంక. బాబుతో హరీష్ మగవాళ్ళ లైనులో నిలబడ్డారు. పాప రియాకు ఆరేళ్ళు ఉన్నాయి. బాబూ రితిష్‌కు ఎనిమిదేళ్ళు. హైదరాబాద్ నుంచి పూనా వెళుతున్నారు. హరీష్ పూనాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేస్తున్నాడు. పిల్లల్ని చూసుకోవాలనే ఉద్దేశంతో ప్రియాంక ఉద్యోగం మానేసింది.

సెక్యూరిటీ చెక్‌ఇన్ పూర్తయి ఎయిర్ పోర్టు లాంజ్‌లో కూర్చున్నారు. పది నిమిషాల్లో బోర్డింగ్‌కు పిలుస్తారు. రియా రితిష్ ఇద్దరూ చెరో ఫోన్ తీసుకొని తమకు కావాల్సిన ఆటలు ఆడుకుంటున్నారు. ఇంతకుముందు కంప్యూటర్లో, ప్లే స్టేషన్లో ఆడే ఆటలన్నీ ఇప్పుడు ఫోన్ల లోనే ఉంటున్నాయి. ఆటలే కాదు కార్టున్ పిక్చర్స్ కూడా ఫోన్లలోనే అందుబాటులోకి వచ్చాయి. రియాకు చోటా భీమ్ అంటే ఇష్టం, తెగ చూస్తుంది. అన్ని రకాల కార్టున్ షోలనూ వదలకుండా చూస్తుంది. రితిష్‌కు కార్ రేసింగ్‌లూ, బైక్ రేసింగ్‌లూ ఇష్టం, అవే చూస్తుంటాడు.

బోర్డింగ్‌కు పిలవడంతో విమాన మెక్కి కూర్చున్నారు. ప్రియాంక పిల్లలిద్దరూ త్రీ సీటర్‌లో కూర్చోగా హరీష్ వెనక సీట్లో కూర్చున్నాడు. విమానం టేకాఫ్ అవుతుందని లాప్‌టాప్‌లు మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేయమని ఎనౌన్స్‌మెంటు చేస్తున్నది ఎయిర్ హోస్టెస్.

ప్రియాంక వెంటనే రియా ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసింది. రితిష్‌నూ చేయ్యమంది. “ఉండు మమ్మీ ఫైవ్ మినిట్స్” అంటూ చూస్తూనే ఉన్నాడు. ప్రియంక చెప్తూనే ఉంది. రితిష్ ఫోన్ ఆపటం లేదు. “నేను ఫ్లైట్ మోడ్‌లో పెడతాను. విమానం టేకాఫ్ అవగానే అడుకుందువు. అప్పటి దాకా ఫోన్ ఆపెయ్యి” అన్నది ప్రియాంక. రితిష్ ప్రియాంక మాటలు పట్టించుకోలేదు. విమానం పైకి లేవబోతుండగా ప్రియాంక కోప్పడింది రితిష్‌ను.

“ఏంటి మమ్మీ! ఆ పక్కనున్న అంకుల్ ఫోన్ ఆపలేదు, పాటలు వింటూనే ఉన్నాడు. మన ముందున్న ఆంటీ చూడు! యూట్యూబ్‌లో సినిమా చూస్తూనే ఉంది. వాళ్ళని ఎయిర్ హోస్టెస్ ఏమీ అనలేదు నువ్వు నన్నెందుకు వెంట బడుతున్నావు” విసుగ్గా అడిగాడు రితిష్ ఫోన్ లాక్కుంటున్న ప్రియాంకతో.

“చూడు కన్నా రితిష్! రూల్స్ అనేవి ప్రతి వారూ పాటించాలి. విమానంలో ఉన్న రెండు వందల మందిలో ఇద్దరో ముగ్గురో ఉంటారు నువ్వు చెప్పినట్లు ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేయని వాళ్ళు. వాళ్ళని చూసి మనం నేర్చుకోకూడదు. రూల్స్ పాటించే వాళ్ళనే మనం అనుకరించాలి. అదుగో చూడు ఎయిర్ హోస్టెస్ వాళ్ళని మందలిస్తోంది. ఇప్పుడు ఆపేశారు కదా! అలా వాళ్ళ చేత చెప్పించుకునే దాకా ఉండకూడదు.

విమానానికి అందే రాడార్ సిగ్నల్స్‌కు మన ఫోన్‌కు వచ్చే సిగ్నల్స్ అడ్డం పడతాయి. దాని వల్ల ప్రమాదాలు సంభవించ వచ్చు. అందుకే విమానంలో ఉన్నప్పుడు ఫోన్లు ఆపేయాలని సూచిస్తారు. మన భద్రత కోసమే ఈ ఏర్పాట్లన్నీ కూడాను. మరి మనం మన జాగ్రత్త కోసం రూల్స్ పాటించాలా? వద్దా! నువ్వే చెప్పు! సమాజంలో ఎప్పుడూ మంచి పనులకు వ్యతిరేకంగా కొందరుంటారు. మనం వాళ్ళనెప్పుడు చూడకూడదు. మంచి పనులు చేసి పేరు తెచ్చుకున్న వాళ్ళనే అనుసరించాలి తప్ప చెడ్డ పనులు చేసే వాళ్ళని కాదు. అయినా ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చి టేకాఫ్ తీసుకోగానే అన్ చేసుకొని గేమ్స్ ఆడుకునే వీలుంది. ఏరోప్లేన్ మోడ్‌లో పెట్టుకుని ఏమైనా చూడవచ్చు. కాసేపు ఆగితే నష్టమేమీ లేదు. మంచి మార్గాన పయనించాలి. విమానం టేకాఫ్ తీసుకునేటప్పుడూ, ల్యాండ్ అయేటప్పుడూ ఫోన్లు ఆపేయాలి. నువ్వు గుడ్ బాయ్ కదా!” అంటూ ప్రియాంక చక్కగా వివరించి చెప్పింది.

రితిష్‌కు ఇప్పుడు అర్థమయింది “ఎందుకు ఫోన్ ఆపేయమంటారు అనుకున్నాను మమ్మీ. ప్రమాదాలు జరక్కుండా ఉండేందుకు అని తెలీదు. ఇంకెప్పుడూ విమానం టేకాఫ్ తీసుకునే సమయంలోనూ ల్యాండింగ్ సమయంలోనూ ఆన్ చేసి ఉంచను” చాలా నిజాయితీగా చెప్పాడు రితిష్.

“మా బంగారు కొండ, ఇట్టే అర్థం చేసుకుంటాడు” అని ప్రియాంక వాడిని ముద్దు పెట్టుకున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here