వర్షం కోసం ఆలపించిన పాట – ‘ఓ నీల జలదమా! కనికరాన ఈ ధరా చరించవా!’

0
12

[‘ఋష్యశృంగ’ సినిమాలోని ‘ఓ నీల జలదమా! కనికరాన ఈ ధరా చరించవా!’ అనే పాటని విశ్లేషిస్తున్నారు శ్రీ గోనుగుంట మురళీకృష్ణ.]

[dropcap]తె[/dropcap]లుగు సినిమా తొలిరోజుల్లో అన్నీ పౌరాణిక సినిమాలే వచ్చేవి. యన్.టి.రామారావు రంగప్రవేశంతో పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రాత్మక చిత్రాలు ఎన్నో వచ్చేవి. నటనారంగంలోనూ, గాయకులలోనూ, రచయితలు కవులలోనూ అన్ని రంగాలలోనూ అత్యున్నత ప్రతిభావంతుల చేతుల్లో ఆణిముత్యాల వంటి చిత్రాలు రూపొంది, కళాఖండాలుగా నిలిచిపోయాయి. అలాంటి వాటిలో ఒకటి ‘ఋష్యశృంగ’ చిత్రం. దీనిని గీతా పిక్చర్స్ వారు నిర్మించగా 1961లో విడుదల అయింది. దీనికి సీనియర్ నటుడు ముక్కామల కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి మకుటాయమానం అనదగిన ఒక పాటను ఇప్పుడు చూద్దాం. ముందుగా పాట నేపథ్యం ఏమిటంటే —-

విభాండకుడు అనే ముని నదిలో స్నానం చేస్తుంటే చిత్రలేఖ అనే అప్సరస అదే నదిలో జలక్రీడలు ఆడుతూ ఉంటుంది. ఆమెని చూసి మోహావేశం చెందిన విభాండకుడికి రేతఃపతనం అవుతుంది. మునిని చూసిన చిత్రలేఖ భయపడి లేడి రూపం దాల్చుతుంది. ఆ రేతస్సు నీటిలో తేలుకుంటూ లేడి దగ్గరకు వచ్చేసరికి అప్రయత్నంగా దాన్ని మింగేస్తుంది. వెంటనే లేడి సద్యోగర్భం (అప్పటికప్పుడు వచ్చిన గర్భం) వలన ఒక బాలుడికి జన్మనిస్తుంది. అయితే సినిమాలో ఆ విషయాన్ని సింబాలిక్‌గా చూపిస్తారు. విభాండకుడు భరించలేని తాపంతో వేడి చల్లార్చుకోవటానికి నదిలో మునకవేస్తాడు. అయన మెడలోని పూలహారం తేలుకుంటూ వచ్చి లేడిమెడలో పడుతుంది. వెంటనే లేడికి పుత్రుడు జన్మిస్తాడు.

బాలుడు పుట్టుకతోనే తలలో శృంగం(కొమ్ము)తో జన్మిస్తాడు. “ఈ బాలుడు నీ కుమారుడే! ఇప్పటినుంచీ ఋష్యశృంగుడు అని పిలవబడతాడు” అని ఆకాశవాణి విభాండకుడితో చెబుతుంది (‘ఋశ్యశృంగుడు’ అనేది సరైన ఉచ్చారణ, కానీ సినిమా మొత్తం ‘ఋష్యశృంగుడు’ అనే పిలుస్తారు). ఆ బాలుడిని తన ఆశ్రమానికి తీసుకువచ్చి పెంచుకుంటూ ఉంటారు. చుట్టుపక్కల ప్రజలు అది చూసి విభాండకుడిని శంకించి నిందలు వేస్తారు. ఆయన అక్కడ ఉండటానికి మనస్కరించక కుమారుడిని తీసుకుని అరణ్యంలోకి వెళ్లి వంటరిగా నివసిస్తూ ఉంటాడు.

ఇలా ఉండగా అంగరాజ్యాన్ని ఏలే రాజు రోమపాదుడు ఒక సందర్భంలో దానం కోసం వచ్చిన ఒక బ్రాహ్మణుడు అనుచితమైన కోరిక కోరినందుకు కోపగించి సభలో నుంచీ వెళ్లగొట్టిస్తాడు. అతడికి ఆగ్రహం కలిగి “నువ్వు, నీ ప్రజలు దుర్భర క్షామంతో అల్లాడుగాక!” అని శపించి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచీ వర్షాలు లేక, పంటలు పండక ప్రజలు కరువుతో అల్లాడిపోతూ ఉంటారు. “దీనికి పరిహారం ఏమిటి?” అని రోమపాదుడు కులగురువు అయిన వశిష్ఠ మహర్షిని అడిగితే “పాదాల్లో శంఖుచక్రాలు గల వ్యక్తి అంగరాజ్యంలో అడుగుపెడితే వర్షాలు కురుస్తాయి. అలాంటి వ్యక్తి విభాండక మహర్షి కొడుకు ఋష్యశృంగుడు. కానీ విభాండకుడు ముక్కోపి. పైగా నాగరీకులు అంటే అసహ్యంతో అడవులలో ఒంటరిగా నివసిస్తూఉన్నాడు. ఋష్యశృంగుడు తండ్రిని తప్ప మరో మనిషిని ఎరగడు. తండ్రి మాటంటే వేదవాక్కు. ఎలాగైనా ఋష్యశృంగుడిని ఇక్కడికి రప్పించగలిగితే దేశం సస్యశ్యామలం అవుతుంది” అని చెబుతాడు.

కానీ శపిస్తాడేమో అనే భయంతో విభాండకుడి దగ్గరకు వెళ్ళటానికి ఎవరూ సాహసించరు. రాజనర్తకి ‘మాయ’ మాత్రం తాను వెళ్లి ఆ మహర్షిని తీసుకువస్తాను అని చెబుతుంది. రోమపాదుడు ఆమెకి కావలసిన పరిచారకులను, సైనికులను ఇచ్చి పంపిస్తాడు. విభాండకుడి ఆశ్రమానికి సమీపంలో గుడారం వేసుకుని మాయ అక్కడ ఉంటూ ఉంటుంది. విభాండకుడు ఆశ్రమంలో లేని సమయంలో అక్కడికి వెళుతుంది. ఆమె ఆభరణాలు, కిరీటం చూసి ఆమె వైకుంఠం నుంచీ వచ్చిందని అనుకుని అతిథి సత్కారాలు చేస్తాడు ఋష్యశృంగుడు. అప్పటివరకు తండ్రి తప్ప మరో మనిషి తెలియదు అతడికి. తన వయ్యారాలతో, వంపుసొంపులతో ఆకట్టుకునే ప్రయత్నం చేసి, విభాండకుడు వచ్చే సమయానికి సంధ్యానుష్టానానికి వేళయిందని చెప్పి అక్కడినుంచీ చల్లగా జారుకుంది మాయ.

ఆ మర్నాడు ఆమెనే తలుచుకుంటూ వెతుక్కుంటూ శిబిరం దగ్గరకి వచ్చిన ఋష్యశృంగుడిని చూసి ఆనందంగా ఆహ్వానించింది మాయ. పరిచారికలు పూలుచల్లి, గంధంపూసి, పన్నీరుచల్లి మర్యాదలు చేశారు. అక్కడి అలంకారాలు, ఆసనాలు, పట్టుతెరలు అన్నీ ఆశ్చర్యంగా చూస్తూ “వైకుంఠవాసీ! మీ ఆశ్రమం చాలా బాగుంది. వీరెవరు? నాట్యతాపసులా!” అని అడిగాడు పరిచారికల వంక చూస్తూ. అవునన్నట్లు నవ్వుతూ తలూపింది మాయ.

“స్వామీ! మీ ఆశ్రమంలో పళ్ళు సమృద్ధిగా దొరుకుతాయా!” పలకరింపుగా అడిగింది మాయ.

“ఓ! మామిడిపళ్ళు, రేగుపళ్ళు, అరటిపళ్ళు, వెలగపళ్ళు, ద్రాక్షపళ్ళు ఇంకా ఎన్నోరకాలు దొరుకుతాయి. ఇవేమిటి? వైకుంఠఫలాలా!” అని అడిగాడు అక్కడ ఉన్న పిండివంటలు చూస్తూ.

“అవును. ఇది గారెఫలం, ఇది బూరెఫలం, ఇది లడ్డుఫలం, ఇది జిలేబీఫలం. ఆరగించండి స్వామీ! ఈ పూర్ణాఫలం తింటే మీ వెలగపండు వేపపండులా అనిపిస్తుంది” నవ్వుతూ అన్నది.

ఋష్యశృంగుడు పూర్ణం తింటూ “అరె! తొక్కలేదు, గింజలేదు, చాలా రుచిగా ఉందే!” అన్నాడు.

ఫలహారం అయిన తర్వాత “అలా వెన్నెలలోకి వెళ్లి గానతపస్సు, నాట్యతపస్సు చేద్దాం రండి” అని చేయి పట్టుకుంది. ఆమె స్పర్శ తగలగానే అతడి ఒళ్ళు ఝల్లుమంది.“వైకుంఠవాసీ! మీరు నా చేయి పట్టుకుంటే చాలా ముచ్చటగా ఉంది” అన్నాడు. గుడారం బయటకు తీసుకువచ్చి అతని ముందు పాటపాడుతూ నాట్యంచేసింది మాయ. ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు. “ఈ నాట్యతపస్సు చాలా బాగుంది. ఇంత నిరామయమైన ఆనందం నేనెప్పుడూ ఎరగను. మా నాన్న చెప్పే తపస్సు అస్సలు బాగుండదు. ఎప్పుడూ కళ్ళు మూసుకుని ధ్యానం చేయమంటాడు” అన్నాడు. మాయ అతని నుదుటిమీద జుట్టు సవరించింది.

అలా ఎంతసేపు కుర్చున్నారో ఇద్దరికీ కాలం తెలియలేదు. పరిచారిక వచ్చి “అమ్మా! చంద్రుడు అస్తమిస్తున్నాడు. గూట్లో గువ్వలు కదులుతున్నాయి. తెల్లవారుజాము అవుతున్నది. విభాండకమహర్షికి తెలిస్తే ప్రమాదం” అని హెచ్చరించింది.

మాయ అతడి మీద పన్నీరు చిలకరించింది. “వాన.. వాన..” అంటూ ఉలిక్కిపడి లేచాడు. “మీ కోసం మీ తండ్రిగారు వెతుకుతూ ఉంటారు. ఆయనకి కోపం వస్తే ప్రమాదం. ఇక వెళ్లిరండి” అన్నది.

ఋష్యశృంగుడు వెళ్ళిపోయాడు. మాయ ఆలోచనలోపడింది. ఇలా ఎన్నాళ్ళు? తను ఋష్యశృంగుడిని వెంటబెట్టుకుని వస్తుందని రాజ్యంలో అందరూ ఎదురుచూస్తుంటారు. ఈ నాటకం ముగించాలి అనుకుంది. రెండురోజుల తర్వాత వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు విభాండకుడు సమీపంలోని ఋష్యాశ్రమానికి యాగం నిర్వహించటానికి వెళ్ళాడు. మాయ ఋష్యశృంగుడి దగ్గరకు వెళ్లి “మేం వైకుంఠం వెళ్ళిపోతున్నాం. మా గురువుగారు కబురు చేశారు. ఇక తిరిగిరాము” అన్నది. “వైకుంఠం బాగుంటుందా!” అడిగాడు.

“ఓ! సుందర ఉద్యానవనాలు, సుదీర్ఘ తటాకాలు, సురుచిర సుమాలు, ఆ సుమాల నుంచీ జాలువారే సుగంధ మకరందాలు.. ఆహా! తలచుకుంటేనే ఎంత హాయి!” అన్నది. “అయితే అక్కడికి నేను కూడా వస్తాను” అన్నాడు. మాయ మనసు ఆనందతరంగిణి అయింది. “ఓ! అలాగే!” అన్నది.

గుడారాలు ఎత్తేయమని భటులని ఆదేశించింది. తాను ఋష్యశృంగుడిని వెంటబెట్టుకుని వస్తున్నట్లు వర్తమానం పంపించింది. ఇద్దరూ రథం మీద అంగరాజ్యం చేరుకున్నారు. ఎక్కడ చూసినా నెర్రెలు విచ్చిన భూములు, ఆ నెర్రెలను కొమ్ములతో తవ్వుతూ నీటికోసం వెతుకుతున్న పశువులు, బక్కచిక్కి ఎముకల గూళ్ళులాగ ఉన్న మనుషులు, కరువుతో కన్నుమూసిన బిడ్డలను తలచుకుని విలపిస్తున్న తల్లులు, చనిపోయిన కళేబరాల కోసం ఆకాశంలో ఎగురుతూ ఉన్న రాబందులు, ఎండిమోళ్ళు అయిన వృక్షాలు. ఋష్యశృంగుడు అవన్నీ చూస్తూ “ఇదేం వైకుంఠం, ఇంత భయంకరంగా ఉంది? ఈ నరకం లోకి నన్నెందుకు తీసుకువచ్చావు? చెప్పు వైకుంఠవాసీ!” అన్నాడు.

రథం ఆగిపోయింది. “నేను వైకుంఠవాసిని కాను. సామాన్య మానవ స్త్రీని” అన్నది.

“స్త్రీ అంటే..”

“తల్లి, చెల్లి, ఇల్లాలు.”

“మానాన్న నాకివన్నీ చెప్పలేదే!”

“మీ నాన్నగారు తన పామరత్వంతో మిమ్మల్ని మోసంచేశారు”

“నన్ను అందరూ మోసం చేశారు. నేనిక్కడ ఒక్కక్షణం కూడా ఉండను” రథం దిగి వెళ్ళబోయాడు. అప్పటికే రాజ్యంలోని ప్రజలందరూ అక్కడికి చేరుకున్నారు. “వెళ్ళవద్దు స్వామీ! ఇంతమంది తల్లుల కన్నీరు చూడలేక మిమ్మల్ని ఇక్కడికి రప్పించటానికే నేను ఈ నాటకం ఆడాను. నన్ను మన్నించండి” అంటూ పాదాలు పట్టుకుంది మాయ.

ఇంతలో రోమపాదుడు మంత్రులు, సైనికులు, కుమార్తెతో సహా అక్కడికి వచ్చాడు. “అభివాదనము మహాభాగా!” అంటూ నమస్కరించాడు. “స్వామీ! మీరు మా రాజ్యంలో అడుగుపెడితే గానీ వర్షాలు కురవవు అని గురుదేవులు చెప్పారు. అటు చూడండి చావు దేవుడు చేస్తున్న విలయతాండవం! సాటి మనుషుల హాహాకారాలు చూస్తూ కూడా వెళ్ళిపోతారా! మమ్మల్ని, మా ప్రజలను కాపాడండి” అంటూ చేతులు జోడించాడు.

ఋష్యశృంగుడు చుట్టూ చూశాడు. అందరూ కళ్ళలో జీవం నింపుకుని అతడి వంకే ఆశగా చూస్తున్నారు. అతడి మనసు ఆర్ద్రమై పోయింది. ఇలా ప్రార్థిస్తున్నాడు.

“హే సురేశా! సుఖ జీవన దాతా! పయోధర వాహనా! పర్జన్యా!”

సురలు అంటే దేవతలు, దేవతల ప్రభువు వరుణుడు (ఇంద్రుడు ఒక్కడే కాదు, దిక్పాలకులు అందరూ దేవతలకు ప్రభువులే!). మానవ నివాసాలు అన్నీ నదీతీరాలలోనే అభివృద్ధి చెందాయి. నీరే ప్రాణాధారం. నీరే జీవాధారం. అందుకే సుఖమైన జీవనాన్ని ప్రసాదించేవాడా అని సంభోదిస్తున్నాడు ఇక్కడ కవి. పయోధర వాహనా అంటే పయస్సు అంటే పాలు, నీరు అనే రెండు అర్థాలు ఉన్నాయి. నీటిని ధరించేది మేఘం. మేఘానికి మరో పేరు పర్జన్యం. అంటే నీటిని ఇచ్చే వరుణదేవుడిని సంబోదిస్తున్నాడు. పాటలో ఈ భాగాన్ని ‘సాకీ’ అంటారు. సాకీ తర్వాత పల్లవి వస్తుంది.

“నభోలోక నాయకా! ప్రభో నీర దాయకా! కావరా! మొరాలకించరా!”

నభోమండలం అంటే ఆకాశం. ఊర్ధ్వలోకనాయకా! నీటిని ప్రసాదించే ప్రభూ! ఒక్కసారి ఇటు చూడు, కాపాడు, మా మొర ఆలకించు అని ప్రార్థిస్తున్నాడు.

“గోడుగోడున ఘోషించే ప్రజల గొంతు నీకు వినిపించలేదా!

హాహాకారాల అల్లాడే ప్రజల ఆర్తి నీకు కనిపించలేదా!

ఓ అరుగు పవనమా! నీల జలదమా! కనికరాన ఈ ధరా

చరించరే! జలాల నించరే!”

నీటిచుక్క కోసం ఆకాశం వంక చూస్తూ గోడుగోడున విలపించే ప్రజల గొంతులు నీకు వినిపించటం లేదా! తాగటానికి నీరులేక, తినటానికి తిండిలేక అల్లాడిపోయే ప్రజల ఆవేదన నీకు కనిపించటం లేదా అని అడుగుతున్నాడు. ఇక్కడ నీలజలదమా! అని సంభోదిస్తున్నాడు. సంస్కృతంలో నీలం అంటే తెలుగులో నల్లని అని అర్ధం. శ్రీకృష్ణుడు నీలిమేఘ శ్యాముడు. అంటే నల్లటి రంగుకలవాడు. “నల్లనివాడు, పద్మనయనంబుల వాడు, కృపారసంబు పై జల్లెడి వాడు..” అంటూ వర్ణిస్తాడు పోతన భాగవతంలో.

అంతేకానీ నీలిమేఘం అంటే నీలిరంగులో ఉండే మేఘం కాదు. మేఘాలు రెండు రంగులలో కనిపిస్తాయి. తెల్లమబ్బులు, నల్లమబ్బులు. తెల్లమబ్బులలో నీళ్ళు ఉండవు. దుమ్ము, ధూళి ఉంటాయి. అవి తేలికగా ఉండి భూమికి చాలా ఎత్తుగా ప్రయాణిస్తూఉంటాయి. నల్లమబ్బులు నీటితో నిండి ఉంటాయి. అవి నీటి బరువుతో నెమ్మదిగా భూమికి దగ్గరగా కదులుతూ ఉంటాయి. చల్లటిగాలులు సోకినప్పుడు నల్లమబ్బులు వర్షిస్తాయి. ఇక్కడ ఓ ప్రయాణించే గాలిదేవుడా, నల్లమబ్బుల్లారా, మా మీద కనికరంతో ఈ భూమికి దగ్గరగా ప్రయాణించరా. ఈ భూమిని నీటితో నింపి వేయరా! అని వేడుకుంటున్నాడు ఋష్యశృంగుడు. ఇంకా ఇలా అంటున్నాడు.

“బీటలు వారిన ఈ హృదయాల ఆరాటాలు ఆలించవేల?

కన్నీటి జాలే ప్రవహించు నేల పన్నీటి జల్లై వర్షించవేల?

ఓ! వరుణ దేవతా! వర్ష దేవతా! కనికరాన ఈ ధరా

చరించవా! జలాల నించవా!”

నీటికోసం ఎదురు చూసి, చూసి పంటలు పండక, ఆహారం దొరకక ఎముకల గూడులాంటి శరీరారలతో బీటలు వారిన గుండెలతో ఆరాటం చెందే వీరి గోడు వినవేల? ఈ భూమిలో ఎక్కడా నీటిచుక్క లేదు, ప్రజల కళ్ళల్లో తప్ప! అవి కూడా క్రమక్రమంగా ఇంకిపోతున్నాయి. కన్నీళ్ళతో తడిసిన నేలను పన్నీటి జల్లులాంటి వర్షపు జల్లుతో నింపవెందుకని? వరుణదేవుడా, వర్షానిచ్చే దేవతా (దేవత అనే పదం స్త్రీపురుషులు ఇద్దరికీ ప్రయోగించవచ్చు) దయతో ఈ రాజ్యం మీద నుంచీ ప్రయాణించవా! నీటితో నింపివేయవా! అని అడుగుతున్నాడు.

“ఘళం ఘళం మనోజ్ఞ చంచల ప్రకాశమా!

ఫెళఫెళమని గర్జించు ఘనాఘన నిర్ఘోషమా!

ఝలఝలఝల గలగలగల ఘల్లని వర్షించరే!

ఈ ఇల తనియించగ తరియించగ వర్షించరే!”

నిర్ఘోషము అంటే ధ్వని, తనియు అంతే తృప్తిపడటం అని అర్థాలు. తళాతళా మెరుపులు మెరుస్తూ ఆకాశం మిరుమిట్లు గొలిపేటట్లు మెరుపులతో, ఫెళఫెళ మని ధ్వనులతో గర్జనలు చేస్తూ, జలజల గలగలా ప్రహిస్తూ గల్లుగల్లున నాట్యం చేస్తున్నట్లుగా వర్షించండి. ఈ భూమి తరించి పోయేటట్లు, తనిసి (పులకించి) పోయేటట్లు వర్షించండి అంటూ వరుణదేవుడిని ప్రార్థిస్తున్నాడు ఋష్యశృంగుడు.

వెంటనే ఆకాశంలో నీలిమేఘాలు ఏనుగుల గుంపులా తరలివచ్చాయి. తళతళమని మెరుపులు మెరిసాయి. వర్షం కురవటం మొదలైంది. ప్రజలందరూ ఆనందంగా ఒకరినొకరు కౌగలించుకున్నారు. తడుస్తూ గంతులు వేశారు. పాటలు పాడారు ఇలా –

“కురిసిందోయ్! అహ కురిసిందోయ్! వానవాన జడివాన

ఆకాశానికి బొక్క పడినదోయ్! ఏకధాటిగా జోరుజోరుగా!

చెరువులు నిండి చేలు పండునోయ్! కరువులు గిరువులు తీరిపోవునోయ్!

సిరుల తులతూగి దేశము స్వర్గ ధామమై శోభించేనోయ్!”

కుమారుడిని వెతుక్కుంటూ వచ్చిన విభాండకుడికి స్వాగతం చెప్పాడు రోమపాదుడు. “విశ్వకళ్యాణానికై శాంతా ఋష్యశృంగుల వివాహం అనివార్యం. ఆశీర్వదించు” అని ఆకాశవాణి పలికింది.

‘ఋష్యశృంగ’ చిత్రంలోని ఈ గీతాన్ని సముద్రాల రామానుజాచార్య రచించగా, ఒళ్ళు గగుర్పొడేటట్లు గానం చేశారు ఘంటసాల. టి.వి.రాజు సంగీత సారధ్యం చేశారు. ఇందులో ఋష్యశృంగుడిగా హరనాద్, మాయగా రాజసులోచన, విభాండకుడిగా గుమ్మడి ప్రధానపాత్రల్లో నటించారు. ఇంకా రోమపాదుడిగా నాగయ్య, శాంతాదేవిగా లత, చిత్రలేఖగా కుచలకుమారి, ఇంద్రుడిగా రఘురామయ్య మొదలైన వారు నటించారు. చివరలో వానలో గంతులు వేసే పౌరుడిగా దర్శకుడు ముక్కామల మెరుపులా మెరవటం విశేషం.

(ఒకసారి నేను బస్ లో వెళుతుంటే దారిలో పొలాల్లో రైతులు వర్షాలులేక, ఎలాగైనా పంటలను కాపాడుకోవాలని బిందెలతో తెచ్చి పోస్తూ చేలను తడపటం చూశాను. ఈ పాట గురించి రాయటానికి ఆ దృశ్యమే ప్రేరణ – గోనుగుంట మురళీకృష్ణ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here