నిరాశ పరచిన RX100

0
7

[box type=’note’ fontsize=’16’] “ఇది వొక హారర్ చిత్రం కాదు, పోర్న్ చిత్రం కాదు, ప్రేమ చిత్రం కాదు, సాంఘిక చిత్రం కాదు, వీటిలో యేదో వొకటైనా చూసిన తృప్తి వుండేది” అని “Rx100” సినిమాని సమీక్షిస్తున్నారు పరేష్ ఎన్. దోషి. [/box]

[dropcap]ఈ[/dropcap] మధ్య తెలుగులో మంచి సినిమాలొస్తున్నాయని, కొత్తగా మంచి చిత్ర దర్శకులొస్తున్నారని సంతోషపడుతున్న తరుణంలో వచ్చిన ఈ చిత్రం RX100 నిరాశ పరిచింది. కొత్త దర్శకుడు అజయ్ భూపతి.

గోదావరి జిల్లాలో వో పల్లె ఆత్రేయపురం. శివ (కార్తీకేయ) చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోతే డాడి (రాంకి)ప్రేమతో చేరదీస్తాడు. మూడేళ్ళ క్రితం అతని ప్రేమ విఫలమైనప్పట్నించీ అతను తాగుడుకి, డ్రగ్స్ కి బానిసవుతాడు. కొన్నాళ్ళపాటు ఈ అర్జున్ రెడ్డి అవతారాలు తప్పవేమో తెలుగు తెరకు. ప్రపంచంలోని తీరికంతా చేసుకుని ఆ ప్రేమ గాథను చెబుతాడు దర్శకుడు. ఆ గ్రామంలో వుండే ముఠా కక్షలు వొక పక్క, శివ-ఇందు (పాయల్ రాజ్‌పూత్) ల “ప్రేమ” కథ మరో పక్క. మొదటి సారే ఆమె కళ్ళకు అతని సిక్స్ పేక్ కనబడటం, మొహించడమో ప్రేమించడమో మొదలైపొవడం జరుగుతుంది. తనే చొరవ తీసుకుని అతన్ని దగ్గరకు తీసుకుంటుంది. ఇద్దరూ ప్రేమలో, శృంగారంలో మునిగి తేలుతుంటారు. కాని అతనికి అర్థంకాని, తెలియని కొన్ని కారణాలవల్ల ఆమె పెళ్ళి వేరొకతనితో అవుతుంది. దాన్ని అతను ఆపకుండా శివని గూండాలు చావగొట్టి, వో గోడవునులో పడేస్తారు ఆ సమయమంతా.

Spoiler alert చిత్రం చూడని వారు ఈ వొక్క పేరా దాటెయ్యండి. మూడేళ్ళతర్వాత ఆ వూరుకొస్తుంది ఇందు. శివ ఆమె తనకోసమే వచ్చిందన్న భ్రమలో వుంటాడు. చాలా నాటకీయ సన్నివేశాల తర్వాత తేలే విషయం యేమిటంటే ఆమె అతన్ని ప్రేమించలేదు, కేవలం అతని శరీరాన్ని మోహించింది, అబధ్ధాలు చెప్పి తనకు అనుకూలంగా వున్నన్నాళ్ళు వాడుకుంది అని. ఇక ఇలాంటి కథలకు అనుకున్నట్టే gory ముగింపు ఇచ్చాడు దర్శకుడు. మామూలుగా వచ్చే ప్రేమ కథా చిత్రాలలో ఈ వొక్క విషయంలోనే ఇది కాస్త భిన్నంగా వున్నది. అలాంటి వాళ్ళు కూడా సమాజంలో వుండొచ్చు కాని కథనం ఈ విషయానికి తక్కువ, మిగతా వాటికి యెక్కువా ఫుటేజ్ ఇచ్చారు. చిత్రం మొదట్లో పోలీసు స్టేషన్లో వొక టైప్ రైటరు చూబిస్తారు. దాని బట్టి ఇది పాతకాలంలో సాగే కథ అనుకున్నా. తర్వాత స్మార్ట్ ఫోన్లు చూపిస్తే ప్రస్తుత కాలం అని అర్థమవుతుంది. మరి కథ, కథనం ప్రస్తుత కాలానికి తగ్గట్టు వున్నాయా? న్యాయం యే పాత్రకైనా జరిగిందా? ఇలాంటి విషయమ్మీద హిందీ లో బీ గ్రేడ్ సినెమాలు One Night Stand లాంటివి దీనికంటే నయం. లేదూ సీరియస్‌గా తీసిన చిత్రం అంటే ఈ మధ్యే వచ్చిన Lust Stories అన్న నాలుగు కథల సంకలనం వచ్చింది నెట్‌ఫ్లిక్స్ లో. దీనికంటే నయం. ఇది వొక హారర్ చిత్రం కాదు, పోర్న్ చిత్రం కాదు, ప్రేమ చిత్రం కాదు, సాంఘిక చిత్రం కాదు, వీటిలో యేదో వొకటైనా చూసిన తృప్తి వుండేది.

ఇక చిత్రాన్ని యెలా విశ్లేషించాలి. ముందైతే ఈ మూడు గంటల నిడివి గల చిత్రంలోంచి కనీసం రెండుగంటల నిడివి తగ్గించవచ్చు. నేర్పు వుంటే చక్కగా లఘు చిత్రమే తీయవచ్చు. రచయితకు తను తీసిన ప్రతి పదమూ మురిపెంగా వుండి యెక్కడా ఎడిట్ చేసుకోకున్నా, దర్శకుడు తను షూట్ చేసిన చిత్రంలో వొక్క బిట్ కూడా ఎడిట్ చేయకపోయినా ఆ పనితనం దారుణంగా వుంటుంది. అకిరా కురసావా షూటింగ్ రేషియో చాలా వుండేది (అంటే అతను షూట్ చేసిందాట్లో చాలా భాగం ఎడిట్ అయిపోతుంది) , వొకటి కంటే యెక్కువ కెమెరాలు యేకకాలంలో పెట్టి చిత్రీకరించేవాడు. అదంతా అంతిమంగా తన రూపకల్పనకు వీలైనంత దగ్గరగా వచ్చే చిత్రం రావాలని. హిందీలో ఆశుతోష్ గోవారీకర్ చాలా షూట్ చేస్తాడు. అతనితో కూడా ఎడిటింగ్ ఇబ్బంది వుంది. అతని “లగాన్” ని చూసినట్లుగా, “జోధా అక్బర్” ని చూసినట్లుగా తర్వాతి చిత్రాలు జనం చూడలేదు. ఇప్పటి ప్రేక్షకుడికి attention span, patience తక్కువ. వుంటే వరసగా ముద్దులు, లేదంటే గుద్దులు, ఇంకా లేదంటే రక్తమోడుతున్నా, కొస వూపిరితో వున్నా భారీ సంభాషణల పరంపర, అదీ లేదంటే పేరు పెట్టుకున్నందుకు బైక్ మీద వొకటే తిరగడం, ఇలా ఇన్ని చెప్పే బదులు దీన్ని తెలుగు లో తొలి OCD చిత్రంగా గుర్తిస్తే సరిపోతుంది. సంగీతం, పాటలు, మాటలు ఇతర అంశాలన్నీ ఇప్పుడు మిగతావాళ్ళు యేర్పరచిన బెంచీ మార్కులు అందుకోవు. కార్తీకేయకి సిక్స్ పేక్, కండలూ వున్నాయి; పాయల్ అందంగా వుంది. రావు రమేశ్, రాంకీల నటన బాగుంది.

ప్రతి సారీ ప్రతి చిత్రం విశ్రాంతి తర్వాత “రెండు గాజులు అమ్ముకోవలసి వచ్చింది”, “చక్కగా వుండండి పొగాకుకు దూరంగా వుండండి” చూడాల్సి వస్తుంది. మామూలుగా అయితే ఆ సమయంలో మొబైల్ తీసి వాట్సప్ చూస్తా. ఈ సారి అది చూస్తే, అందులో ప్రజల మేలు కోసం సందేశమున్నట్టు అది కూడా క్లుప్తంగా, నేరుగా చెప్పినట్లనిపించింది. వీటినే మంచి ad film-maker చేత తీయించివుంటే ఇంకా గొప్పగా వుండును, అది వేరే కథ. అయినా ad film అన్నది సిసలైన చాలెంజేమో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here