సాధనమున సమకూరు

0
15

[బాలబాలికల కోసం ‘సాధనమున సమకూరు’ అనే చిన్న కథని అందిస్తున్నారు డా. చెంగల్వ రామలక్ష్మి.]

[dropcap]ఆ[/dropcap]రవ తరగతి చదువుతున్న రాహుల్ ఆ రోజు సాయంత్రం స్కూలు నుంచి చాలా కోపంగా వచ్చాడు. ఇంట్లో ఎవరితోనూ మాట్లాడలేదు. ముభావంగా ఉన్నాడు. వాళ్ళమ్మ వందన “ఏరా, అలా ఉన్నావు? ఒంట్లో బాగా లేదా?” అంటూ నుదుటి మీద చెయ్యేసి చూసింది. ఒళ్ళు వేడిగా లేదు.

“ఏరా, స్కూల్లో ఎవరైనా ఏమైనా అన్నారా? టీచరేమైనా కోప్పడ్డారా? అల్లరి చేసావా?” పక్కన కూర్చుని లాలనగా అడిగింది.

“ఏమీ లేదమ్మా, స్కూల్లో బాగానే ఉంది”, అంటూ పుస్తకాల సంచీ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. ఈ లోపల పక్కింటి రుక్మిణి వచ్చింది.

వందన రాహుల్‌కి పాలు, బిస్కెట్లు ఇచ్చి, “రుక్మిణి ఆంటీ వచ్చింది. నేను వెళ్ళనా? నీకు బాగానే ఉంది కదూ!” అంది.

“బాగున్నానమ్మా, నువ్వు వెళ్ళు” అన్నాడు తెచ్చుకున్న నవ్వు ముఖంతో రాహుల్. లేకపోతే అమ్మ వెళ్ళదని తెలుసు వాడికి. ప్రస్తుతం ఎవరితో మాట్లాడాలనిపించటం లేదు వాడికి. వందన హాల్లోకి వెళ్ళింది.

రాహుల్ బిస్కట్ కొరుకుతున్నాడు. ఆ రోజు తెలుగు క్లాసులో మాస్టారు “ఎన్నిసార్లు చెప్పాలిరా, ఇలా అర్థం కాకుండా రాయకూడదని? ఇదేమైనా కొత్త భాషా? ఎవరైనా చదవగలరా దీన్ని?” అంటూ తన నోట్స్ చూస్తూ వెటకారంగా అనటం, పిల్లలందరూ నవ్వటం గుర్తొస్తుంటే మనసు కుత కుత ఉడికిపోతోంది. మాస్టారు వెళ్ళిపోయాక, రాగిణి తన వంక చూసి, వెక్కిరిస్తూ నవ్విన నవ్వు తలచుకుంటే హృదయం మండిపోతోంది.

ఆ రాత్రి రాహుల్ వాళ్ళ నాన్న టేబుల్ ముందు కూర్చుని కథ రాసుకుంటున్నాడు. నాన్న చేతి రాత ఎంత బాగుంది! అచ్చు గుద్దినట్లు ఉంది. నాన్న దస్తూరి ఇంత ఎలా బాగుంది? నాదెందుకు అంత భయంకరంగా ఉంది? నాన్నలా నేనెందుకు రాయలేను? అనుకుంటూ ఆయన వెనకే నిల్చొని “నాన్నా” అని పిలిచాడు.

ఆయన ముందు పలకలేదు. రచనలో లీనమైపోయాడు  మళ్ళీ పిలిచాడు. అప్పుడు చూసాడు.

“ఏంటిరా, ఇక్కడ నిల్చుని చూస్తున్నావు? హోమ్ వర్క్ చేసేసావా? అమ్మేం చేస్తోంది?” అన్నాడు వాళ్ళ నాన్న సూర్య.

“నాన్నా హోమ్ వర్క్ చేస్తాలే కానీ, నీ పెన్ నాకివ్వవా? నేను దానితో రాసుకుంటాను” అన్నాడు.

సూర్య “ఎందుకురా” అని ఆశ్చర్యంగా అడిగాడు.

“నీ పెన్‌తో రాస్తే నా చేతి రాత కూడా నీ దస్తూరి అంత బాగుంటుంది. ఇవ్వు నాన్నా” అంటూ ఆ రోజు తెలుగు క్లాసులో మాస్టారు అందరి ముందు తిట్టటం, అందరూ నవ్వటం గురించి చెపుతుంటే వాడి కళ్ళలో నీళ్లు తిరిగాయి.

సూర్య పెన్ మూసేసి, రాహుల్‌ని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి, “చూడు రాహుల్, చిన్నప్పుడు నా దస్తూరి కూడా బాగుండేది కాదు. మా మాస్టారు కూడా నన్ను, నిన్ను మీ మాస్టారు తిట్టినట్లే  తిట్టారు. ఆయన రోజూ చూచిరాత రాయమంటే నేను అలాగే రాసేవాణ్ణి. మంచి దస్తూరి అయితే మార్కులు బాగావస్తాయని, ఎంత కష్టపడి చదివినా, గుర్తు పెట్టుకుని రాసినా, చేతి రాత బాగోకపోతే దిద్దేవారికి అర్థం కాక మార్కులు పడవని చెప్పారు.

చేతిరాత చూస్తూనే బాగుండాలి. చదవాలనిపించేలా ఉండాలి అంటే రోజూ శ్రద్ధతో అభ్యాసం చెయ్యాలి. పెన్‌లో ఏం లేదు. నైపుణ్యం అంతా నీ చేతి వేళ్ళ లోనే ఉంటుంది. ఆ నైపుణ్యం రోజూ అభ్యాసం చేయటం లోనే ఉంది. నాకు సమయం దొరికినప్పుడల్లా నీకు చెపుతూనే ఉన్నాను. నువ్వు హోమ్ వర్క్ తొందర తొందరగా రాసేసి ఆటలకు వెళ్లిపోతున్నావని అమ్మ చెప్పింది. ఇంక నీకు మంచి రాత చదువు ఎలా వస్తుంది? ఈ వయసు లోనే నువ్వు రోజూ మంచి దస్తూరి కోసం అభ్యాసం చేయాలి. శ్రద్ధగా చూసి రాయాలి. సాధనతో సాధించలేనిది ఏదీ లేదు.

ఒక శిల్పకారుడు బండరాయిని చెక్కి అందమైన శిల్పంగా మలుస్తాడు. దాని వెనక అతని ఎన్నేళ్ల కఠోర దీక్ష, అభ్యాసం వుంటాయో నీకు తెలుసా? అతని చేతిలో ఉలి, ఇంకా ఇతర పనిముట్లు ఎన్ని ఉన్నా అతనిలో ఆ చెక్కే నైపుణ్యం లేకపోతే వాటివల్ల ఉపయోగం లేదు. ఒక చిత్రకారుడు అనేక రంగులు ఉపయోగించి కుంచెతో అద్భుతంగా దృశ్యాలు చిత్రీకరిస్తాడు. ఆ అద్భుతమంతా అతని కుంచె లోనో, రంగులలోనో లేదు. అతని చేతివేళ్లలో ఉంది. అతని ఆలోచనల్లో ఉంది. ఆ చేతి వేళ్ళకు ఆ నైపుణ్యం ఎలా వచ్చిందంటావు? నిరంతరసాధన వల్ల! కళను సాధించాలనే తపన, పట్టుదల వల్ల! ఆ పట్టుదల లేకపోతే, కేవలం ఆ కుంచె, రంగులు ఏం చేయలేవు.

ఏకలవ్యుడు! నీకు పాఠం ఉంది కదా! ద్రోణచార్యుని బొమ్మని గురువుగా భావించి నిరంతర సాధనతో అస్త్ర విద్యను ఎలా సాధించాడో నువ్వు చదువుకున్నావు కదా!  గాయనీ గాయకుల, వయోలిన్, వీణ వాయించే వాద్యకారుల ప్రోగ్రాంలు మనం చూస్తున్నాం కదా!వాళ్ళు ప్రోగ్రాం ఉన్న రోజున మాత్రమే కాదు, ప్రతి రోజూ భోజనం చేస్తున్నంత, నిద్ర పోతున్నంత, గాలి పీలుస్తున్నంత, సహజంగా సంగీత సాధన చేస్తారు. అందుకే అంత బాగా పాడగలరు, వాయించగలరు.

ఏదైనా ఒక విషయంలో నైపుణ్యం సాధించాలంటే నిరంతర సాధన ఉండాలి. నేర్చుకోవాలనే తపన ఉండాలి. రోజూ కుదురుగా, శ్రద్ధగా నీ పెన్ను తోనే రాయటం అభ్యాసం చెయ్యి. నీకు మంచి దస్తూరి ఎందుకు రాదు? నీ హోమ్ వర్క్ ని కుదురుగా, నెమ్మదిగా చెయ్యి. అందరూ మెచ్చుకునే దస్తూరి వచ్చేలా ఈ రోజు నుంచే అభ్యాసం మొదలుపెట్టు. నిన్ను  చూసి నవ్విన వాళ్లే నీ చేతిరాత చూసి ముక్కున వేలేసుకుంటారు. నీ చుట్టూ చేరి అభినందిస్తారు” అన్నాడు.

రాహుల్ కళ్ళు మెరిసాయి. రాగిణి, ఇంకా తనను చూసి నవ్విన వాళ్లంతా తన చుట్టూ చేరి మెచ్చుకుంటున్నట్లు కళ్ల ముందు దృశ్యం మెదిలింది. ‘నాన్న దస్తూరీ అంత బాగా రాయాలి. అందుకు ఈ క్షణం నుంచే సాధన మొదలుపెడతాను’ అనుకున్నాడు దృఢంగా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here