సాగర ద్వీపంలో సాహస వీరులు-10

0
8

[box type=’note’fontsize=’16’]’సాగర ద్వీపంలో సాహస వీరులు’అనే పిల్లల నవలను ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]

[dropcap]దా[/dropcap]న్నితన వద్ద భద్రపరచుకున్నాడు విజయుడు.

ఇంతలో రివ్వున ఎగురుకుంటూ వచ్చిన చిలుకను చూసి”వచ్చావా నేస్తం రా” అన్నాడు విజయుడు.

“నిన్న బాగా అలసిపోయానేమో బాగా నిద్రపట్టింది. ఇప్పుడే మెలకువ రావడంతో నిన్ను వెదుకుతూ వచ్చాను. ‘ఆవు చేలో మేస్తె దూడ గట్టునమేస్తుందా?’, నీ వెంటే నేను, ఇప్పుడు నా పరిస్ధితి ‘రెండు మాటలకి ఎక్కువ ఒక మాటకి తక్కువలా ఉంది’. ఎవరు వీళ్లంతా?” అన్నాడు ఇకఇక.

“కోయరాజా ఈ చిలుక పేరు ఇకఇక. సామెతలు, కథలు బాగా చెపుతుంది” అన్నాడు విజయుడు.

“అయితే మాకు మంచి కాలక్షేపమే! భయపడకు చిలకయ్య” అన్నారు అక్కడి కోయలు.

“సర్లే ‘ఏనుగును ఎక్కినవాడు కుక్క కూతకు జడవడు’, మా విజయుడు ఉండగా నాకేం భయం” అన్నాడు ఇకఇక.

ఇకఇక మాటలకు ఆనందంగా నవ్వారు ఆ గూడెం లోని వాళ్ళు.

“అవును వీళ్ళంతా మనవాళ్ళేనా? చూడ్డానికి వీళ్ళు మనవాళ్ళే అంటున్నావు. చూడబోతే ‘పిర్రగిల్లి జోలపాడే వాళ్ళలాగా ఉన్నారే’. ఏమిటో అంతా అయోమయంగా ఉంది. ‘అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందంట’. అలా ఉందిప్పుడు. ఇందరు ఉండీ ఏం లాభం? నాభార్య బెకబెక ఎక్కడ ఉందో ఎలా ఉందో కదా” అన్నాడు ఇకఇక.

“దిగులు పడకు మిత్రమా దేనికైనా సమయం రావాలి. నా మిత్రుడు జయంతుని వెదుకుతున్న సమయంలో నీ భార్యను కూడా వెదుకుదాం! నీకు తప్పిపోయిన నీ భార్యను చూపించే బాధ్యత నాది” అన్నాడు విజయుడు.

“అయినా ‘ఇప్ప పూవుకు వాసన వెదకాలా’, అక్కడ నా బెకబెక ఎలా ఉందో, మా రాజకుమారి సుగంధి వద్ద ‘నే ఆడింది ఆట పాడింది పాట’. అయినా ‘కోడలు కంటానంటే అత్త వద్దంటుందా’. నువ్వు వెదికి పెడతానంటటే నేవద్దంటానా? నీపైనే భారంవేసి నీ తోటే ఉంటా” అన్నాడు ఇకఇక.

అందరు కలసి సంతోషంగా కోయగూడెం చేరారు.

ఆసనంపై కూర్చున్న విజయునితో, కోయరాజా “ఏలికా ఇప్పుడు చెప్పండి తమరు ఎందుకు ఇంతదూరం వచ్చారు? ఆ పని ఏమిటి” అన్నాడు.

జరిగిన విషయమంతా వివరించాడు విజయుడు.

“ఏలికా ఈ ద్వీపంలో మాలాంటి పలు జాతులువారు, అవతామీలు, బడగాలు, బైగాలు, భోటియాలు, బిర్‌హారులు, చెంచులు, చూటియాలు, గడ్డీలు, గల్లంగులు, గారోలు, గోండులు, సవరులు, జరవాలు, ఖాసులు, ఖాశీలు, ఖోండులు, కోలులు, కోలములు, కోటాలు, కుకీలు, లేప్పాలు, లుషాయీలు, మినాలు, మురియాలు, ముకిరలు, నాగాలు, అంగామీలు, సెమీలు, ఆవోలు, తంఘుకూలు, లాయోరాలు, ఒయారాన్లు లేదా కురుకులు, అంజులు, సంతాలులు, సెంటినలీలు, షాంపెన్లు, తోడాలు, భిల్లులు, ఉరలీలు, వర్లీలు వంటి తెగలు ఎన్నో ఉన్నాయి. అందరితోనూ మేము స్నేహంగానే ఉంటాం. మీ మిత్రుడు ఎక్కడ ఉన్నా తప్పక అతని జాడ మనం తెలుసుకునేందుకు మనుషులను పంపుతాను. పది రోజుల్లో జయంతుని జాడ తప్పక మనం తెలుసుకుంటాం. తమరు ముందు విశ్రాంతీ పొందండి, అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాను” అన్నాడు కోయరాజు.

“అంతేనంటారా? ‘అయ్యవారు వచ్చేదాక అమావాశ్య ఆగుతుందా’, సరే ‘ఊరంతా వడ్లు ఎండబెడితే నక్క తన తోక ఎండబెట్టుకుందట’. మీరంతా మా జయంతుని వెదికే సమయంలో పనిలో పనిగా మాటలు నేర్చిన చిలుక నా భార్య బెకబెక కూడా మీ వాళ్ళకు కనిపిస్తుందేమో చూడమనండి” అన్నాడు ఇకఇక.

“అలాగే నీ భార్య బెకబెకను కూడా వెదకమని మా వాళ్లకు చెపుతాను. అయినా నువ్వు మా ఏలిక నేస్తానివి కదా! బెకబెక, జయంతుల జాడ తెలిసేదాక మీరు కూడా మా ఏలికతోపాటే ఉండండి, నువ్వు కథలు బాగా చెపుతావంటగా, మాపిటేల రోజు మావాళ్ళకి మంచి కథలు చెప్పుతూ ఉండు” అన్నాడు కోయరాజు.

”అంతేలే కోయరాజా, ‘తలలు బోడైనా తలపులు బోడైతాయా’, అంతెందుకు ‘తల్లిని చూసి పిల్లను, పాడిని చూసి పసువును తెచ్చుకోవాలంట’. అలాగే మీవాళ్ళకు మంచి కథలు చెపుతూ కాలంగడుపుతాలే” అన్నాడు ఇకఇక.

తనకు కేటాయించిన గుడెసె లోనికి వెళ్ళాన విజయుడు, కోయరాజు ఇచ్చిన వస్తువు మూతను ఊడదీసి దానిలో ఉన్న వస్తువును చూస్తూ ఆలోచనలో మునిగిపోయాడు.

అది చూసిన ఇకఇక “ఏందబ్బ ఇది ‘తిక్కలోడు తిరునాళ్ళకు పోతే ఎక్కదిగ సరిపోయిందంట’. అలా ఉంది నాకు ఇదంతా చూస్తుంటే” అన్నాడు.

ఇకఇక మాటలకు నవ్వుకున్న విజయుడు నిద్రకు ఉపక్రమించాడు.

మరునాడు ఇకఇక చిలక పలుకులు వినడానికి చాలామంది గూడెం జనం వచ్చారు.

“ఆ అందరు వచ్చారా? ‘కొండ నాలుకకు మందువేస్తే ఉన్న నాలుక ఊడిందట’. మీకేం తెలుసు నా బాధ? ‘వళ్ళు వంగనమ్మ కాలి మెట్టెలు తీయడానికి కంది పోయిందంట’. అలా ఉంది ఇప్పుడు నా పరిస్ధితి. సరే వచ్చినోళ్ళు ఎలాగూ వచ్చారు, మీకు ఇప్పుడు ‘దిష్టి కొట్టిన దెబ్బ’ అనే కథ చెపుతాను వినండి….

మెడలో చిన్న తప్పెట వేళ్ళాడదీసుకుని దానిపై దరువేస్తున్న కుందేలు “వినండహో ఇందుమూలంగా మన అడవిలోని జంతువులన్నింటికి తెలియజేయడ మేమనగా, రేపు మన సింహరాజుగారి పుట్టినరోజు. కనుక అందరూ వచ్చి సింహరాజుగారికి ఘనంగా కానుకలు ఇచ్చి రాజుగారి అభిమానానికి పాత్రులు కావాలని మనవి. అక్కడ గాడిదన్న పాట, ఎలుగుబంటి ఆట వంటి కార్యక్రమాలు ఉంటాయి” అంటూ అడవి అంతా దండోరా వేయసాగాడు.

అది విన్న కోతిబావ “కుందేలు మామా రేపు ఉదయం ఇటురా, మనం నీ తప్పెట మేళంతో రాజుగారికి పూమాల, దిష్టి బూడిద గుమ్మడికాయా తీసుకు వెళదాం! నీ కష్టం ఉంచుకోనులే, నాలుగు ఎర్రదుంపలు ఇస్తాలే” అన్నాడు కోతిబావ. “అలాగే అల్లుడూ” అంటూ వెళ్ళిపోయాడు కుందేలు మామ.

‘సింహరాజు గారికి నేను ఎంత బాగా నృత్యం చేస్తానో రేపు తెలియజేస్తాను’ అనుకుంటూ కోతిబావ ఆలోచిస్తూ ఉండగా, “తెగ చించుతున్నాడు ఏమిటో బావకోతి” అంది పిల్ల రామచిలుక. “తప్పు అలా అనకూడదు కోతిబావ ఏమిటో తెగ ఆలోచిస్తున్నాడో అనాలి” అంది తల్లి రామచిలుక. వాటికేసి కోపంతో చూసాడు కోతిబావ.

తెల్లవారుతూనే వచ్చి కుందేలు మామ తప్పెట వాయిస్తుండగా, తను సిధ్ధం చేసిన పూమాల భుజాన ఉంచుకుని, తలపై రకరకాల బొట్టులతో ఉన్న దిష్టి బూడిద గుమ్మడికాయ పెట్టుకుని, తప్పెట తాళానికి తగిన విథంగా చిందు వేస్తూ, సింహరాజు వద్దకు వెళ్ళిన కోతిబావ, అక్కడ ఉన్న అడవి జంతువుల పిల్లలను చూస్తూ “పిల్లలూ, ఈ బూడిద గుమ్మడికాయ నిండుగా బహుమతులు ఉన్నాయి. ఇది పగులకొట్టిన మరుక్షణం మీకు దొరికే వస్తువుల కొరకు ఎగబడాలి” అన్న కోతిబావ, తన భుజంపై ఉన్న పూలమాలను సింహరాజు మెడలో వేసి…

“కుందేలుమామా దరువు వేయి, నీ దరువుకు తగిన విధంగా నేను నృత్యం చేస్తూ రాజుగారికి దిష్టి తీస్తా” అన్నాడు. తన తప్పెడను దడదడ లాడించసాగాడు కుందేలు మామ. కోతిబావ నెత్తిన ఉన్న దిష్టి బూడిద గుమ్మడికాయను గట్టిగా పట్టుకుని తప్పెట దరువుకు తగిన విధంగా చిందువేస్తు, కాలికింద ఉన్న తేలును గమనించకుండా తొక్కాడు. తేలు రెండుసార్లు కుట్టడంతో ఆ బాధ భరించలేక తలపైన ఉన్న దిష్టి గుమ్మడికాయను సింహరాజు తలపై వేసి పగలకొట్టాడు కోతిబావ.

దానిలోని బహుమతుల కోసం అక్కడ ఉన్న పిల్ల జంతువులన్ని, సింహరాజును పచ్చడి పచ్చడిగా తొక్కుతూ పగిలిన గుమ్మడికాయలోని బహుమతుల కోసం ఎగబడ్డాయి.

కోతిబావ తేలు కుట్టి బాధతో చిందులువేస్తున్న విషయం ఎవరికి తెలియదు. తన దరువుకే కోతిబావ ఆడుతున్నాడని మరింత ఉత్సహంగా దరువేయసాగాడు కుందేలు మామ .

కోతిబావ గోలకి కొపం వచ్చిన సింహరాజు కోతిబావ తోకపట్టి పైకిలేపి లాగిపెట్టి పిర్రలపై బలంగా తన్నాడు.

ఆ దెబ్బకు కోతిబావ ఎదురుగా ఉన్న చెట్టుపైన ఉన్న పెద్దతేనె తుట్టెపై వెళ్ళపడ్డాడు. కోపంతో కసిగా దొరికిన వాటిని దొరికినట్లు జంతువులను కుట్టసాగాయి తేనెటీగలు.

జంతువులు అన్ని ప్రాణభయంతో పరుగులు తీసాయి. అప్పటి వరకు వాయించిన తప్పెటను తలపై పెట్టుకుని వెనుతిరిగి చూడకుండా పరుగుతీసాడు కుందేలు మామ.

తేనెటీగల దాడి తప్పుకోవడానికి, ఆ పక్కనే ఉన్న నీటి మడుగులో గొంతువరకు కూర్చుని తల తేనెటీగలకు కనిపించకుండా తామరపూవ్వు ఆకులు అడ్డం పెట్టుకున్నాడు కోతిబావ.

“దెబ్బ దిష్టి ఉంది ఎలా బావకోతి” అన్నది పిల్లరామచిలుక.

“తప్పు, అలా అనకూడదు. కోతిబావ ఎలా ఉంది దిష్టిదెబ్బ అనాలి” అన్నది తల్లి రామచిలుక.

“అవసరంలేని విషయాలలో తలదూరిస్తే ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అయినా మరో అవకాశం రాక పోతుందా, అప్పుడు నా ప్రతిభ మన రాజుగారికి చూపించక పోతానా” అన్నాడు కోతిబావ.

‘దురద కత్తి కందకు పీటకు ఎందుకు లేని’ అని ఎగిరిపోయింది పిల్లరామచిలుక.

పిల్లరామచిలుక ఏమందో ఆలోచించసాగాడు కోతిబావ.

“భలే భలే బాగుంది కథ” అన్నారు గూడెం వాసులు.

“సరే ‘ఆకలి రూచి ఎరుగదు నిద్ర సుఖం ఎరుగదంట’. మీరంతా వెళితే నేను ఓ కునుకుతీస్తా. మా విజయుని స్నేహితుడు జయంతుని, నాభార్య బెకబెక జాడ తెలుసుకునే ప్రయత్నం వేగవంతం చేయండి” అన్నాడు ఇకఇక.

“చిలుకయ్య మరో రెండురోజుల్లో జయంతుని జాడ తప్పక తెలుస్తుంది, అలాగే నీ జత జాడ కూడా త్వరలో తెలుస్తుందిలే” అన్నారు గూడెం జనం.

”అయ్యలు, ‘గొరంతదీపం కొండంత వెలుగు’. ఇప్పుడు నా పరిస్ధితి ‘కుక్కతోకపట్టి గోదారి ఈదినట్లు’ ఉంది. ఏమిటో ‘నీట ముంచినా పాల ముంచిన మీదే భారం’. మీరే మాకు సహాయం చేయాలి. ఏమిటో ‘అదుగో పులి అంటే ఇదుగో తోక అంటున్నారు'” అన్నాడు ఇకఇక .

***

జయంతుడు పిల్లనగ్రోవి వంటి వస్తువు మూత తీసి చూడగా అందులో చక్కగా బొమ్మలు, రహస్య సందేశాలతో పలుమాటలు రాయబడి ఉన్నాయి. దాన్ని ఎప్పటిలా ఉంచి భద్రపరచాడు.

మూడురోజుల అనంతరం భిల్లురాజు జయంతుని వద్దకు వచ్చి “నాయనా, ఈయాల మా కొండదేవత కాళీమాత సంబరం చాలా అబ్బరంగా జరిపిస్తాం. మీరు తప్పక చూడాలి. నాతో రండి” అన్నాడు.

“భిల్లురాజా, మొన్న దొంగలగుంపు వాళ్ళు ఈ రోజు మీ గూడెంపై దాడి చేయాలని మాట్లాడుకోవడం గతంలో నేను విన్నాను. మీ వాళ్ళందరిని హెచ్చరికగా ఉండమను” అన్నాడు జయంతుడు.

“ఆహా ఈ రోజు వాళ్ళకు మూడిందే!” అని ఆ విషయం గూడెం వాళ్ళకు తెలియజేసి, “పద నాయనా” అని గుడికి దారితీసాడు భిల్లురాజు.

భిల్లురాజును అనుసరించాడు జయంతుడు, తన చేతిలోని ధనస్సుతో, అతని వెంటే కోతి నడవ సాగింది.

అమ్మవారి సంబరం అద్బుతంగా సాగుతుంది. రకరకాల పండ్లు, పలురకాల పానియాలు, తేనె వంటివాటిని నైవేద్యంగా ఉంచారు. పలురకాల పుష్పమాలలతో అమ్మవారి ఎతైన విగ్రహాన్ని అలంకరించారు. అమ్మవారి ముందుభాగాన దిగువన గణపతి, లక్ష్మి, సరస్వతి, శ్రీకృష్ణుడు వంటి పలువురు దేవతామూర్తులను చక్కగా అమర్చారు. కర్పూరం, పునుగు, జవ్వాజి వంటి సుగంధ పరిమళాలు అమ్మవారిపై చల్లడంతో ఆ ప్రదేశమంతా ఘుమ ఘమలాడుతూ అహ్లాదకరంగా ఉంది.

యువకులు పలురకాల వాద్యాలు పలికిస్తుండగా యువతులు ఆ సంగీతానికి అనుగుణంగా నృత్యం చేయసాగారు.

ఇంతలో కొందరు తలపాగా ధరించిన నాగరీకులు కేకలు వేసుకుంటూవచ్చి భిల్లువారిపై ఆయుధాలతో దాడిచేసారు.

“జయంతా, నువ్వు చెప్పినట్లే దొంగలు వచ్చారు జాగ్రత్త” అంటూ కత్తితో వాళ్ళకేసి పరుగుతీసాడు భిల్లురాజు. అప్పటికే యువకులు, యువతులు ఆయుధాలు చేతబట్టి శత్రువులతో పోరాడసాగారు.

ఎతైన వేదికపై ఉన్న జయంతుడు శత్రువుల శరీరాలలో తను బాణాలను నాటసాగాడు. జయంతుని దాడి ఊహించని శత్రువులు అప్పటికే మూడువంతులు మంది గాయపడగా వారిని తీసుకుని వెళ్ళిపోయారు.

“భిల్లు రాజా ఎవరు వీళ్ళు, మీపై ఎందుకు దాడిచేసారు?” అన్నాడు జయంతుడు.

“నాయనా, వాళ్ళు మాకే కాదు ఈ అడవిలో ఉన్న పలు తెగలవారికి శత్రువులే!, ఇక్కడి చుట్టుపక్కల దేశాలవారు తమ రాజ్యంలో నేరప్రవృత్తి కలిగిన వారందరిని శిక్షగా ఈ ద్వీపం తెచ్చి వదలిపెట్టి వెళుతుంటారు. వాళ్ళు తిరిగి వెళ్ళడం నాటుపడవలతో అసాధ్యం, అందుకని వాళ్ళు మాలాంటి తెగలవారిపై దాడి చేస్తుంటారు. వాళ్ళు మాపై దాడి చేసిన ప్రతిసారి ఇరువర్గలవారికి ప్రాణనష్టం జరుగుతుంది. వాళ్ళు నరరూప రాక్షసులు. ఈసారి నీ సహాయం వలన మరింతమంది గాయపడ్డారు” అన్నాడు భిల్లురాజు.

“ఈ దుర్మార్గుల నివాసం ఎక్కడో నీకు తెలుసా భిల్లుదొరా?” అన్నాడు జయంతుడు.

“ఓ తెలుసు పాతాళ బిలంలోని గుహలలో వీళ్ళంతా సామూహికంగా ఉంటారు. వాళ్ళు చాలామంది ఉంటారు” అన్నాడు భిల్లుదొర.

“భిల్లురాజా, ఇంతకాలం వాళ్ళు మన గూడేలకువచ్చి మిమ్మల్ని వేటాడసాగారు. ఇప్పుడు మనవంతు వచ్చింది. మరికొన్ని గూడేలలోని యువకులను ఆయుధాలతో రమ్మనండి, మూడురోజుల్లో వాళ్ళ స్ధావరంలోనే వాళ్ళను వేటాడదాం. ఈ అడవికి శాశ్విత శాంతిని ప్రసాదిద్ధాం” అన్నాడు జయంతుడు.

మూడవ రోజున పలుగూడేల యువకులు భిల్లుగూడెం చేరుకున్నారు. స్ధానిక భిల్లుగూడెం యువకులతో కలుపుకుంటే దాదాపు రెండువందలమంది ఉంటారు.

అందరిని సమావేశపరచిన జయంతుడు “మిత్రులారా ఆ నరరూప రాక్షలబారి నుండి ఈ అడవితల్లికి విముక్తి కలిగిద్దాం, ఎప్పుడు ఏవైపునుండి దాడిచేస్తారో తెలియక అనుక్షణం భయపడుతూ ఉండవలసిన పని మీకు లేకుండా చేయడానికే మనం వారిపైన దాడిచేస్తున్నాం. ఈ దాడిలో మన ప్రాణాలు పోయినాసరే, వాళ్ళలో ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలకూడదు” అన్నాడు జయంతుడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here