సాగర ద్వీపంలో సాహస వీరులు-11

0
9

[box type=’note’fontsize=’16’] ‘సాగర ద్వీపంలో సాహస వీరులు’అనే పిల్లల నవలను ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]

[dropcap]భి[/dropcap]ల్లురాజు జయంతునితో కలసి గూడెం నుండి పాతాళ బిలంకు దారితీయగా, ఆయుధాలు ధరించిన యువకులంతా ఉత్సహంగా ముందుకు కదిలారు.

సాయంత్రానికి అంతా పాతాళ బిలం చేరువకు చేరుకున్నారు.

“భిల్లురాజా వీరిలో కొందరు ఆహార అన్వేషణకో, మరే ఇతర గూడేలపై దాడికో వెళ్ళి ఉంటారు. ఇప్పుడు మనం దాడిచేస్తే మిగిలినవాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంది కనుక రాత్రివరకు మనం వేచి ఉంటే వేటకు వెళ్ళినవాళ్ళు కూడా వస్తారు. అప్పుడు అందరిని కలిపి ఒక్కసారే మన పని ముగించవచ్చు” అన్నాడు జయంతుడు.

“అలాగే” అని సాయుధులైన యువకులను రహస్యంగా చెట్లచాటున దాగమన్నాడు భిల్లురాజు.

పాతాళ బిలం ముఖద్వారం వద్ద నెగళ్ళు వేసి ఉన్నాయి.. కాగడాలు గుహలోపల వెలుగుతున్నాయి.

శత్రువుల చర్యలను గమనిస్తూ దాడి చేసే అనుకూల సమయం కోసం ఎదురు చూడసాగాడు జయంతుడు.

చీకట్లు కమ్ముకు రావడంతో వేటకు వెళ్ళిన యాభైమందికి పైగా వేటగాళ్ళు తాము తీసుకువచ్చిన పలురకాల జంతువులను, ఫలాలను రాకాసి బిలం ముందు ఉంచారు.

జయంతుని సైగతో శబ్దం కాకుండా బిలం చేరువకు వెళ్ళిన సాయుధ యువకులు ఒక్కపెట్టున కేకలు పెడుతూ, అందినవాడిని అందినట్లు తెగవేయ సాగారు.

కొందరు దొంగలు గుహలోనికి పరుగులు తీసారు.

“మీరు ఎవ్వరూ దొంగలను వెదకుతూ గుహ లోపలకు వెళ్ళకండి. వాళ్ళు ఎందరు లోపల ఉన్నారో, వాళ్ళ వద్ద ఎటువంటి ఆయుధాలు ఉన్నాయో మనకు తెలియదు. గుహకు చేరువలో నెగడు వేసి పచ్చి చెట్టు కొమ్మలు నెగడు పైన వేయండి. దానినుండి వెలువడే పొగకు వాళ్ళు గుహలోనుండి వెలుపలకు వస్తారు” అన్నాడు జయంతుడు.

అలానే చేసారు భిల్లు, కోయ యువకులు. గుహలోపలికి పొగ రావడంతో దగ్గుతూ శ్వాస అందక ముప్ఫై మందికి పైగా దొంగలు వెలుపలకు వచ్చి యువకుల చేతిలో మరణించారు.

అలా శత్రుశేషం లేకుండా చేసారు వారు. కాగడాల వెలుగులో గుహ లోపలి భాగం అంతా గాలించి చూసి ఎవ్వరూ లేరని నిర్ధారించుకున్నారు. ఆ దాడిలో జయంతునితో వచ్చిన యువకులకు ఎవరూ మరణించనప్పటికి స్వల్పగాయాలు అయ్యాయి.

ఆ రాత్రి పక్కనే ఉన్న జలాశయంలో స్నానాలు చేసి దొరికిన ఫలాలు ఆరగించి రాత్రంతా ప్రయాణం చేసి భిల్లుగూడెం చేరారు అంతా. ఆ రోజు రాత్రి భిల్లు గూడెంలో పెద్ద సంబరం జరుగుతుండగా, గుర్రంపై వచ్చిన బిల్లు యువకుడు “ఏలికా విజయ మారాజుగారు జాడ తెలిసింది” అన్నాడు.

ఆనందంతో భిల్లురాజు చేతులు పట్టుకున్నాడు జయంతుడు.

“సంతోషకరమైన వార్త, ఏడున్నాడో ఎరికేనా?”అన్నాడు భిల్లురాజు.

“ఏలికా రాజముద్రిక కోయగూడెంలో ఉండారు. ఆ గుడెంమడిసి జయంతు గోరిని ఎతుకుతా వచ్చి నాకు ఎల్లమ్మ కోనలో కనపడ్డాడు. ఇద్దరం ఒకే పనిమీద బయలుదేరి ఉన్నందున ఒకరి ఇసయాలు ఒకరం సెప్పుకున్నాం. వాళ్ళమడిసి ఆళ్ళగూడేనికి చీటికట్టి పావురాయిని వదిలాడు నాకళ్ళముందే” అన్నాడు భిల్లు యువకుడు.

“నాయనా జయంతా గూడేనికి పద. రేపు ఏకువనే మావాళ్ళను కొంతమందిని నీఎంట బెట్టుకుని, రాజముద్రిక గూడానికి వెళుదువుగాని, నువ్వు మీ రాజ్యం తిరుగు ప్రయాణం అయ్యేదాక మావాళ్ళను నీవద్ద ఉండనివ్వు” అన్నాడు భిల్లురాజు.

గూడెం చేరిన జయంతునికి ఆ రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూడసాగాడు.

***

వేకువనే కోయరాజు “ఏలికా మన జయంతుని జాడ తెలిసింది. ఇక్కడకు రెండు రోజుల ప్రయాణ దూరంలో ఉన్న భిల్లు జాతివారి వద్ద అతిథిగా ఉన్నాడట. ఇప్పుడే నేను జయంతుని వెదకమనిపంపిన మా మడిసి పావురాయి సందేశం అంపడు” అన్నాడు కోయరాజు.

మరుదినం సాయంత్రానికి జయంతుడు విజయుడు ఉన్న కోయగూడానికి చేరుకున్నాడు తనకు తోడువచ్చిన పదిహేనుమంది భిల్లు యువకులతో, తన నేస్తం కోతితో కలసి.

జయంతునికి ఘన స్వాగతం ఏర్పాటుచేసాడు కోయరాజు.

జయుంతుని హత్తుకున్న విజయుడు “మిత్రమా కుశలమా?” అన్నాడు.

“బాగుంది, ‘పెళ్ళోళ్ళు పెళ్ళో ఒకటై తినడానికి వచ్చి నోళ్ళను తిట్టారంట’, అలా ఉంది ఇది. మీరు మీరు బాగున్నరు మధ్యలో నా బెకబెక ఏమైనదో కదా?” అన్నాడు ఇకఇక.

“బాగున్నావా ఇకఇక” అన్నాడు జయంతుడు.

“జయంతా ఏం బాగులే, ‘గంతకు తగిన బొంత’ అన్నట్లు నా బెకబెక కనపడని నాటినుండి నా మనసు ఏం బాగోలేదు మిత్రమా!” అన్నాడు ఇకఇక.

అందరి పరిచయాలు పూర్తి అయిన అనంతరం –

“నీ జాడ తెలియడంతో చాలా సంతోషించాను” అంటూ చేతిలోని కత్తి అక్కడ పెట్టబోతూ అక్కడ పరచిన సగం చిత్రపటం చూసి “మిత్రమా ఆశ్చర్యంగా ఉందే, ఇదే చిత్రపటం సగభాగం నాకు వాగులో లభించింది” అని దుస్తుల్లో దాచుకున్న సగం చిత్రపటాన్ని తీసి, అక్కడఉన్న చిత్రపటానికి జోడిండాడు జయంతుడు.

రెండు భాగాలు కలసిన పూర్తి చిత్రపటాన్ని పరిశీలించిన విజయుడు “జయంతా మనం చాలా అదుృష్టవంతులం. ఈ లోకంలో ఎవ్వరికి ఇప్పటివరకు దక్కని అపారనిధిని మనం దక్కించుకోబోతున్నాం! దాదాపు నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం, పొరుగుదేశల వాళ్ళు దనధాహంతో భారతదేశంలోని పలు రాజ్యలపై దాడి చేయడానికి సిధ్ధపడుతున్నసమయంలో, అంగ, వంగ, కళింగ, మళయాళ, ద్రవిడ, కర్ణాట, వంటి పలువురు దక్షిణ దేశాధినేతలు తమ విలువైన వజ్ర, వైఢూర్యాలు, నవరత్నాలతోపాటూ, బంగరు రత్నాలు పొదిగిన నగలు వంటి సంపదను ప్రతి ఒక్కరూ పెట్టెలలో పెట్టి తాళంవేసి, మన రాజ్యపాలకుల నాయకత్వంలో అపారమైన నిధిని ఈ ద్వీపంలో నమ్మకమైన కొందరు సైనికుల ద్వారా ఈ రహస్యప్రదేశంలో దాచమని మనవాళ్ళు కొందరిని పంపారు. వారి ప్రయాణంలో పెనుగాలివానలో వారి పడవ ధ్వంసం అయింది. ప్రాణాలతో బ్రతికి భైటపడినవారు తమవెంట వచ్చిన కుటుంబ సభ్యులతో ఈ ద్వీపంలో స్ధిరపడ్డారు. ఆ నిధిని ఇక్కడే రహస్యంగా దాచారు. అక్కడ మనవారు వీళ్ళకొరకు ఎదురుచూసి వీళ్ళు రాకపోవడంతో ఏదో ప్రమాదం జరిగి ఉంటుందని ఊహించారు. పలువురు రాజ్యనేతలు ఆ రహస్యనిధి కొరకు ప్రయత్నించినప్పటికి ఎటువంటి ప్రగతి సాధించలేక పోయారు. నాడు వాళ్ళు దాచిన అపారనిధికి మార్గం చిత్రపటంగా చిత్రికరించి దాన్ని రెండుభాగాలుగా చేసి ఒకటి రాజముద్రిక గూడెంలో, రెండవది భిల్లుజాతిగూడెంలో భధ్రపరచారు. ఏనాటికైనా అంగ పాలకులకే ఆ నిధి చెందాలి అన్నదే నాటి మనవారి ఆశయం. యాదృచ్ఛికంగా రెండు భాగాలుగా ఉన్న చిత్రపటం మన ఇరువురికి లభించడం మంచిది అయింది. ఇప్పుడు మనం ఈ నిధి వేటకు బయలుదేరాలి. అదృష్టవసాన మనకు ఆ నిధి ఆచూకి కనుగొనగలిగితే వాటిని అక్కడనుండి తరలించడానికి బలిష్టమైన కొందరు వీరులైన కోయ యువకులను మనతో తీసుకువెళ్ళవలసి ఉంటుంది, రేపు మన ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుందాం!” అన్నాడు విజయుడు.

“అలాగే మిత్రమా” అన్నాడు జయంతుడు.

“ఇదే చోద్యం? ‘ఇచ్చానమ్మ వాయనం పుచ్చుకున్నానమ్మ వాయనం’ లా ఉంది, ఈ చిత్రపటాలేందో ఈ ప్రయాణమేందో పైవాడికె తెలియాలి” అన్నాడు ఇకఇక. జామపండు తెచ్చి చిలుకముందు పెట్టాడు కోతి.

“ధన్యవాదాలు కోతిబావ. నువ్వైనా నా బాధను అర్థం చేసుకున్నావు. రేపటినుండి నా ఆహార బాధ్యతలు నువ్వే చూసుకోవాలి. మనకు ‘ముందున్నది ముసళ్ళ పండుగ’ అన్నాడు ఇకఇక.

ఇకఇక మాటలకు అక్కడ ఉన్నవారంతా నవ్వుకున్నారు.

“ఏలికా తమ ప్రయాణానికి ఎటువంటి ఏర్పాట్లు కావాలో చెప్పండి, స్వయంగా నేనే ఏర్పాటు చేస్తాను” అన్నాడు రాజముద్రిక గూడెంకోయరాజు.

మరునాడు ఉదయాన్నే తనకు కావలసిన వస్తువులు తీసుకుని, కొందరు భిల్లు, రాజముద్రిక గూడెం యువకులను సమావేశపరచి “మిత్రులారా మనం సాహసోపేతమైన చర్యలో పాల్గోనబోతున్నాం. ఇందులో జరిగే పోరాటాలలో అంగవైకల్యం కలగవచ్చు, ప్రాణాలకు అపాయం రావచ్చు సాహసవంతులైనవారు ఇష్టపడినవారు, మాత్రమే మాతో రండి” అన్నాడు విజయుడు.

“నాయకా ప్రాణాల కోసం భయపడితే ఈ అరణ్యంలో జీవించగలమా? మేమే కాదు ఈ అడవిలో నివసించే అటవీక తెగలవారు ఎవ్వరూ భయపడరు. శ్వాస ఉన్నంతవరకు పోరాడుతాం! నాయకుడి కోసం, సాటివారి కోసం సంతోషంగా ప్రాణాలు ఇస్తాం” అన్నాడు జగ్గు.

తన ప్రయాణంలో పెద్ద బుట్ట నిండుగా పెంపుడు పావురాలను తీసుకుని బయలుదేరాడు. “ఏలికా, మన క్షేమ సమాచారాలు ఎప్పటికి అప్పుడు మా నాయకుడికి ఈ పావురాళ్ళు జేరవేస్తాయి” అన్నాడు.

“నిజమే నాయకా, చిన్నతనంనుండి భయం అంటే ఏమితో తెలియని జాతిమాది” అన్నాడు శివన్నఅనే రాజముద్రిక గూడెం యువకుడు.

“భలే భలే, ‘ఒకే దెబ్బకు రెండుపిట్టలు’, మీకు నిధి, నాకు నా పెళ్ళాం బెకబెక దొరుకుతుంది” అన్నది చిలుక.

అక్కడ ఉన్నవాళ్ళంతా ఫక్కున నవ్వారు ఇకఇక మాటలకు.

నేలపై పరచిన రెండు ముక్కల చిత్రాన్ని జతచేస్తూ “చూడండి ఇందులో తూర్పుదిశన రెండుకొండల నడుమ సూర్యుడు ఉదయిస్తున్నట్లు ఆ కొండల నడుమ జలపాతం దిగువున ఆలయం ఉంది. మొదటమనం అక్కడికి చేరాలి, అక్కడి సూర్యోదయం మనం చూడాలి” అన్నాడు విజయుడు.

“నాయకా చిన్నతనంనుండి ఈ అడవి అంతా బాగా తిరిగినోడిని, అ కొండలదారి నాకు తెలుసు. జలపాతం దిగువన ఉన్నది జక్కమ్మ గుడి. వేగంగా వెళితే పొద్దుకుంగే ఏళకు మనం అక్కడికి చేరవచ్చు” అన్నాడు జగ్గు.

“అయితే ముందు నువ్వుదారితీయి. నీ వెనుక నేను, మనవాళ్ళందిరి వెనుక జయంతుడు రక్షణగా ఉంటాడు. ఏదైనా ఆపద సంభవిస్తే తలా ఓ దిక్కుకు వెళ్ళవద్దు సంఘటితంగా పోరాడుదాం! పోరాటాలే విజయాలను సాధిస్తాయి” అన్నాడు విజయుడు.

కోలాహలంగా, ఉత్సహభరితంగా, రాజముద్రికగూడెం వాసుల జయధ్వానాలతో బయలుదేరారు అందరు.

దారిలో అడ్డు వచ్చే ముళ్ళ చెట్లు, అడవితీగలను తనచేతిలోని పదునైన గొడ్డలితో తెగవేస్తూ ముందుకు కదిలాడు జగ్గు. అతన్ని అందరూ అనుసరించసాగారు.

విజయుడు, జయంతుడు అప్రమత్తంగా ధనస్సులు చేతపట్టి పరిసరాలను గమనిస్తూ నడవసాగారు.

కొంతదూరం ప్రయాణం చేసాక, రివ్వున వచ్చిన ఓ గండభేరుండ పక్షి ఓ భిల్లు యువకుని తన కాళ్ళతో పట్టుకుని పైకి ఎగిరింది, ఆ భిల్లు యువకుడు బరువైన తాళ్ళు తన భుజాలపై ఉంచుకోవడంతో, ఆ పక్షి తేలికగా లేవలేకపోయింది. మొదట విజయుడు వదలిన బాణం పక్షి కుడికాలును గాయపరచగా, జయంతుడు వదలిన బాణం పక్షి ఎడమకాలును తాకింది. బాధతో అరుస్తూ ఆ భిల్లు యువకుని వదిలిన పక్షి వెళ్ళిపోయింది.

వంటిపైన తాళ్ళు ఉండటంతో పక్షిగోళ్ళ గాయాలు కాకుండా తప్పించుకున్నాడు ఆ భిల్లు యువకుడు.

మధ్యాహ్నం తాము మోస్తున్న వస్తువులన్ని ఓ చెట్టుకింద చేర్చి ఆహారం కొరకు బయలు దేరారు అందరు.

“ఆగండి మీరు ఎంత ప్రయత్నించిన అది ‘అడవి కాచిన వెన్నెలే’, లేకుంటే ‘బూడిదలో పోసిన పన్నిరే’. ఈ చుట్టుపక్కల ఎక్కడా నీరు తప్ప ఆహారం లేదు” అంది కోతిభుజంపై ఉన్న ఇకఇక.

“దానికి రెండు సామెతలు చెప్పాలా?” అన్నాడు శివన్న.

“అలవాటు పడిన ప్రాణం శివన్నా” అన్నాడు ఇకఇక.

“ఇలాంటి పరిస్ధితి వస్తుందనే మా ఏలిక ‘సప్పి రొట్టెలు’ ఇచ్చి అంపినాడు” అని ఒక పెద్ద మూట విప్పగా దానినిండా జొన్నరొట్టెలు వంటివి కనిపించాయి.

“చూసారా ఈ రొట్టె చిన్నముక్క నీళ్ళలో ముంచి నమిలి మింగితే ఆకలి ఉండదు. ఇది ఎన్నో వనమూలికలు, తాటి బెల్లం కలిపి తయారు చేయబడింది” అని అందరికి రొట్టెముక్కలు పంచాడు జగ్గు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here