సామెత కథల ఆమెత-11

0
11

[తెలుగు సామెతల ఆధారంగా అల్లిన చిన్న కథల ఫీచర్ నిర్వహిస్తున్నారు శ్రీమతి మద్దూరి బిందుమాధవి.]

గోటితో పోయేదానికి గొడ్డలి!

[dropcap]“ఈ[/dropcap] పూట కూర మాడిపోయింది. స్టవ్ మీద కూర పడేసి ముఖ పుస్తకం చూస్తూ కూర్చున్నావా? ఆ వాట్సాప్ ఒకటి.. ఎవరి టైమయినా పీచు మిఠాయి లాగా తినేస్తుంది.”

“నిన్న రాత్రి చపాతి మాడ్చావు. ఉదయం దోశ ఆస్ట్రేలియా మ్యాప్ అయింది. అసలు ఏమయింది నీకు” అన్నాడు శివ చిరాగ్గా!

“మూడు రోజుల నించి చెబుతున్నా వంట గదిలో లైట్ వెలగట్లేదు.. ఎలెక్ట్రీషియన్ని పిలవండి అని. ఊహుఁ ఇంట్లో వాళ్ళు చెప్పేది చెవికెక్కదు. అది మాడింది.. అది ఉడకలేదు అని కంప్లెయింటొహటి!”

“టైంకి మాత్రం అన్నీ సవ్యంగా కంచంలోకి రావాలి. నేనేమైనా సతీ అనసూయనా.. సౌకర్యాలు.. పదార్ధాలు లేకపొయినా వేళ్టికి కావలసినవి సృష్టించి ఇవ్వటానికి” అంది మాధురి విసురుగా!

“ఓహ్ మర్చిపోయానోయ్.. ఇప్పుడే ఫోన్ చేస్తానుండు” అని ఇక్బాల్‌కి ఫోన్ చేశాడు శివ.

***

“అమ్మా.. కాం హై బోల్కే సాబ్ ఫోన్ కియా” అని సొసైటీ ఎలెక్ట్రీషియన్.. అహ్మద్ వచ్చి తలుపు కొట్టాడు. వస్తూ ఇద్దరు సహాయకులని కూడా తెచ్చుకున్నాడు. అస్త్ర శస్త్రాలతో కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన అర్జునుడల్లే.. వాళ్ళ చేతిలో రెండు ట్యూబ్ లైట్ సెట్స్, స్క్రూ డ్రైవర్స్, టెస్టర్.. ఇంకా కొన్ని పనిముట్లతో దర్శనం ఇచ్చారు.

“వంటింట్లో లైట్ రావట్లేదు” అని చెప్పి మాధురి చేస్తున్న వంటని సగంలో ఆపి.. వాళ్ళు చేసే పని పర్యవేక్షించటానికి ఓ కుర్చీ లాక్కుని కూర్చుంది.

ముందుగా మెయిన్ కనెక్షన్ ఆఫ్ చేసి.. తరువాత వంటింటి స్విచ్ బోర్డ్ స్క్రూలన్నీ విప్పారు. వైర్లన్నీ డిస్కనెక్ట్ చేసి ..ట్యూబ్ లైట్ విప్పి, కొత్త ట్యూబ్ బిగించారు. ఇంతలో విద్యుచ్ఛక్తి శాఖ వారు వారి ప్రతాపం చూపించారు. కరెంట్ బంద్.

“అమ్మా.. మైనే ట్యూబ్ ఫిక్స్ కియా. అభి ప్రాబ్లెం సాల్వ్ హువా. మగర్ టెస్ట్ కర్నే కే లియే బిజిలీ నహీహై” అన్నాడు.

ప్రాబ్లెం హయ్యో.. నహీ హయ్యో తెలుసుకోవటం ఎలా? అలా వాడిని ఎంత సేపు కూర్చోపెడుతుంది. ఇంట్లో పనులకి ఇబ్బంది. మాధురి ట్యూబ్ తాలూకు డబ్బు వెయ్యి రూపాయలు ఇచ్చి పంపేసింది.

వంట గట్టు నిండా వైర్లు, ట్యూబ్ తాలూకు పై కవరు.. ఇంకా ఇతర చెత్తా!

కరెంట్ వచ్చింది.. చెత్త శుభ్రం చేసి.. సగంలో ఆపిన వంట పూర్తి చేద్దామని లైట్ వేసింది మాధురి. అది మాధురిని చూసి కన్నుకొట్టి ‘నేనంత త్వరగా లొంగుతానా’ అని లైట్ ఒక్క వెలుగు వెలిగి ఆరిపోయింది.

***

మధ్యాహ్నం టీ కప్పు పుచ్చుకుని టీవీ ముందు కూలబడ్డ శివ.. టీ నోట్లో పెట్టుకుని “ఏంటోయ్ టీలో పాలు పొయ్యటం మర్చిపోయినట్టున్నావ్” అని గట్టిగా కేకేశాడు.

“వంటింట్లో గట్టు మీద కిటికీ లోనించి వెలుతురు సరిగ్గా పడదు. చీకటి. సరైన లైటింగ్ పెట్టించమని మొత్తుకున్నా మీరు పట్టించుకోరు” అని “పట్టండి.. కాసిని పాలు పోస్తా” అని వేడి పాలు తెచ్చి టీ కప్పులో పోసింది.

“అవును.. నిన్న అహ్మద్ ట్యూబ్ లైట్ బిగించటానికి మనింటికి వచ్చానని ఫోన్ చేశాడే! మళ్ళీ లైట్ లేదు చీకటి అంటావేంటి” అన్నాడు టీవీ మీద నించి దృష్టి మళ్ళించి.

“ఏమో వాడున్నప్పుడు కరెంట్ లేదు. అతనటు వెళ్ళగానే కరెంట్ వచ్చింది. లైట్ వేద్దును కదా అది ఒక వెలుగు వెలిగి నాకు కన్నుకొట్టి ఆరిపోయింది. దానికి నా మీద అలకేమో!” అంది మాధురి.

“పని చిన్నదైనా.. ఎలెక్ట్రీషియన్స్, ప్లంబర్స్, కార్పెంటర్స్ 20-30 సార్లు ఫోన్ చేస్తే కానీ రారు. వాళ్ళొచ్చినప్పుడు అన్నీ చూసుకుని పని చేయించుకోవాలి. నీకన్ని ఆషామాషీనే! ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే వాడెప్పటికొస్తాడో! పని అయిందో లేదో చూసుకోకుండా డబ్బు మాత్రం ఇచ్చి పంపేశావ్” అన్నాడు కోపంగా.

“ఏం చెయ్యమంటారు.. కరెంటాఫీసు వాళ్ళకి మనమీద అంత కోపమెందుకో నాకేం తెలుసు? ‘పూర్వం వానరాకడ ప్రాణం పోకడ తెలియదు’ అనే వారు. ఇప్పుడు ‘పని వాళ్ళ రాకడ.. కరెంట్ పోకడ తెలియదు’ అనాలి. వాడున్నంత సేపు కరెంట్ లేదు” అన్నది మాధురి.

***

ఇప్పుడు మళ్ళీ అస్త్ర శస్త్రాలతో అహ్మద్ అసిస్టెంట్ వచ్చాడు.

“ఈ ట్యూబ్ మంచిగ లేదమ్మా. ఇప్పుడు ఈ మోడల్ లైట్స్ వస్తలేవు. లేటెస్ట్‌గ వస్తున్న లైట్ ఇది” అని వాడింకొక లైట్ బిగించి స్విచ్ వేసి “ఇప్పుడు చూడమ్మా.. లైట్ ఎంత మంచిగ వస్తదో” అని వస్తున్న లైట్ చూపించి వాడి చార్జిలతో సహా మరో వెయ్యి రూపాయలు పట్టుకుపోయాడు.

మరీ ఏడిపిస్తే బాగుండదని.. ఆ పూట మాధురి పనయి.. స్విచ్చ్ తీసేసే వరకు ఉన్న లైట్ రాజం.. సాయంత్రం పనికోసం వచ్చి మాధురి స్విచ్చ్ వేసేసరికి అలిగి వెలగనని మోరాయించింది.

ముందు గదిలో టీవీ చూసి వచ్చిన శివ.. క్యాండిల్ల్ లైట్ వెలుతురులో వంటతో కుస్తీ పడుతున్న భార్యామణిని చూసి.. “మళ్ళీ ఏమయింది? ఇందాక ఎలెక్ట్రీషియన్ వచ్చినట్టున్నాడుగా” అన్నాడు ప్రశ్నార్థకంగా మొహం పెట్టి.

“ఏమాటకా మాటే చెప్పుకోవాలోయ్.. క్యాండిల్ లైట్ వెలుతురులో నువ్వు అప్సరస లాగా ఉన్నావ్. కూర మాడితే మాడింది గానీ మసక వెలుతురులో నీ అందం చూసే భాగ్యం కలిగింది” అన్నాడు దగ్గరకి తీసుకుంటూ!

“ఏడిచినట్టుంది.. మీ సౌందర్యోపాసన! ..ఓ పక్క చీకట్లో కళ్ళు పొడుచుకుంటూ వంట చెయ్యలేక నేను చస్తుంటే మీకు అందాలు కనిపిస్తున్నాయా? రేపు లైట్ పెట్టించారా సరే. లేకపోతే రేపటి నించి కిచెన్ బంద్” అన్నది విసుగ్గా మాధురి.

ఎలెక్ట్రీషియన్ అహ్మద్ బృందంతో లాభం లేదని.. మరునాడు ‘అర్బన్ క్లాప్’ వారిని పిలిచాడు.

మూడు ఫోన్లు.. ఆరు మెసేజిలతో సంప్రదించి ఎట్టకేలకి శివ ఇంటికి వచ్చిన సదరు ‘అర్బన్ క్లాప్’ ఎలెక్ట్రీషియన్.. నిముషంలో విషయం గ్రహించి.. పది నిముషాల్లో పాత స్విచ్చ్ స్ప్రింగ్ పోయి పాడయిందని చెప్పి కొత్త స్విచ్ వేసి దాని తాలూకు డబ్బు.. విజిట్ తాలూకు డబ్బు తీసుకుని.. శివని.. మాధురిని వెర్రివాళ్ళ లాగా చూసి వెళ్ళిపోయాడు.

‘గోటితో పోయే దానికి గొడ్డలి’ అంటే ఇదే!

“పదిహేను రూపాయలతో అయ్యే పనికి రెండు వేలు డబ్బు వదిలింది”.

“వాళ్ళు చేసిపోయిన ఆగం బాగు చేసుకునేటప్పటికి దుంప తెగింది.”

“ఎక్కడి సమస్యని అక్కడే వదిలేసి పోయారు.”

“ఇలాంటివి మనకి తెలియదు.. వాళ్ళని పిలవక తప్పదు.. ఇదీ వరస” అనుకుంటూ చాలా కాలం తరువాత వంటింట్లో కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుతురులో కర కరమనే ఆలుగడ్డ వేపుడు చెయ్యటానికి సిద్ధమయింది మాధురి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here