సామెత కథల ఆమెత-16

0
6

[తెలుగు సామెతల ఆధారంగా అల్లిన చిన్న కథల ఫీచర్ నిర్వహిస్తున్నారు శ్రీమతి మద్దూరి బిందుమాధవి.]

రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళ మీదే నడుస్తుంది

[dropcap]“అ[/dropcap]మ్మా మీరు సానానికి ఎల్లినప్పుడు మీ ఫోన్ మోగింది” అన్నది యాదమ్మ.

అప్పటి వరకు వసంత తను పంపిన కథ ప్రచురించామని పత్రిక వాళ్ళు పంపిన మెయిల్ చూసి.. అలాగే ముఖ పుస్తకంలో ఒకటి.. రెండు కథలు చదివి, స్నానానికి వెళుతూ ఫోన్ చార్జింగ్‌కి పెట్టి వెళ్ళింది.

“సరే నే చూస్తాలే. డైనింగ్ టేబుల్ దగ్గర వాష్ బేసిన్ కడిగావా. బెడ్ రూంలో చెత్త బుట్ట నిండింది, ఖాళీ చెయ్యి. రోజూ చెప్పాలంటే ఎట్లా యాదమ్మా” అన్నది.

ప్రత్యేకం చెబితే తప్ప.. తనంత తానుగా అన్ని పనులు చెయ్యదు. చెప్పినా కూడా కొన్ని ఎగ్గొట్టేస్తూ ఉంటుంది.

ఎందుకు చెయ్యలేదని మరునాడు అడిగితే “నేను పని జేసే ఇంకో అమ్మ రైతు బజార్‌కి ఎల్దాం అంటే జల్ది జల్ది ఎల్లినా. అవు గానీ ఉసిరికాయలు ఎంతకి తెచ్చిన్రమ్మా” అన్నది.

మాటలు మొదలు పెడితే యాదమ్మ వాగ్ధాటికి అడ్డు – ఆపు ఉండదు. చీపురు పక్కకి పెట్టి.. ఏదో ఒకటి చెబుతూనే ఉంటుంది.

వసంత కూడా అప్పుడప్పుడు యాదమ్మ మాటల మాయలో పడిపోయి.. ఆమె వదిలేసిన పనులు అడగటం మర్చిపోతూ ఉంటుంది.

ఒక రోజు బాత్ రూం కడగటం మానేస్తుంది. ఒక రోజు ఇల్లు తడి బట్ట వెయ్యకుండా ఇంట్లో వాళ్ళని కబుర్లల్లో పెట్టి వెను తిరిగి చూసే లోపు వెళ్ళిపోతుంది.

***

మిస్డ్ కాల్ చూసి డ్రైవర్ రమణకి ఫోన్ చేసింది. “అమ్మా ఇవ్వాళ్ళ గంట లేట్‍గా వస్తాను. నిన్న స్కూల్ నించి వస్తూ మా యమ్మాయి కాలికి దెబ్బ తగిలించుకు వచ్చింది. డాక్టర్ దగ్గరకి వెళ్ళొస్తాను” అన్నాడు.

“నేను పదింటికల్లా ఉప్పల్ లో ఉండాలి. నిన్న చెప్పాను.. గుర్తుందా” అన్నది వసంత.

“అట్నేలే అమ్మా” అన్న పెద్దమనిషి పన్నెండు అయినా.. రెండయినా పత్తా లేడు. ఫోన్ స్విచాఫ్ చేసి పెట్టాడు.

ఇలా ఏదో ఒక కారణం చెప్పి వారంలో రెండు సార్లు లేట్‌గా రావటాలు.. ఒకో రోజు అసలే రాకుండా డుమ్మా కొట్టడం డ్రైవర్ రమణకి అలవాటే!

తిట్టుకుంటూ టెంపొరరీ డ్రైవర్‌ని మాట్లాడుకోవటమో.. క్యాబ్ బుక్ చేసుకోవటమో తప్పదు వసంతకి.

అలాగే ఆ రోజు తను వెళ్ళాలనుకున్న పూజకి ఉప్పల్‌కి క్యాబ్ బుక్ చేసుకోవలసి వచ్చింది వసంత.

“పూజ అయిపోయి ఇప్పుడే హారతి ఇచ్చామండి. అయినా ఫరవాలేదు. భోజనాల టైం కి అందుకున్నారు” అన్నారు మహలక్ష్మి దంపతులు.

“భోజనాలదేముందండి.. ఈ పూజ చూడాలని చాలా అనుకున్నాను. మా డ్రైవర్ మహాశయుడు గంట లేట్‍గా వస్తానని.. మొత్తానికే డుమ్మా కొట్టేశాడు. వాడి కోసం చూసీ చూసీ క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేసరికి ఆలస్యమయింది” అన్నది.. దేవుడికి దణ్ణం పెట్టుకుంటూ.

“మన దగ్గర నెల జీతాలు తీసుకుంటూ.. మధ్య మధ్యలో పర్మిషన్లు పెట్టి బయట డ్యూటీలకి పోతారుటండి ఈ డ్రైవర్లు. వాళ్ళు చెప్పే జాలి కథలు విని.. వాళ్ళు వాడుకునే పర్మిషన్లు గంటలు చొప్పున లెక్క వేసి మనం జీతాలు కోసెయ్యనూ లేము. ఆదివారాలు కాక.. ఇలా తీసుకునే ఒకటి రెండూ రోజుల డుమ్మాలని లెక్కేసి ఎక్స్‌ట్రా డ్యూటీ చేయించనూ లేము.”

“అసలు డ్యూటీకే దిక్కు లేదు. ఇంకా ఎక్స్‌ట్రానా?”

“రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళ మీదే నడుస్తుందంటారు” పెద్దలు అన్నది వీళ్ళ సంభాషణ విన్న ఉష.

“మనం కార్లో కూర్చుని పర్సనల్ విషయాలన్నీ మాట్లాడేస్తూ ఉంటాం! డ్రైవర్ సైలెంట్‌గా అన్నీ వింటూ ఉంటాడు. ఆ వివరాలు ఉపయోగించుకుని వాడు ఎవరితో ఏ లాలూచీలు పడతాడో అని భయం. అందుకే తరచు డ్రైవర్లని మార్చలేము. వాడు ఎన్ని వేషాలేసినా known devil is better than unknown angel అంటారు” అన్నది వసంత.

“అవునండి.. సైడ్ వ్యాపకాలు.. సంపాదనలకి అవకాశాలు వచ్చాక అన్ని రకాల పని వాళ్ళు ఇలాగే ఉన్నారండి. ‘ఇవ్వాళ్ళ పూజ తలపెట్టుకున్నాం.. ఇల్లంతా తడి బట్ట వెయ్యాలి త్వరగా రా’ అని చెబితే.. పూజ మొదలయ్యాక కానీ రాలేదు మా పనమ్మాయి. అదేమంటే మాకు ఇళ్ళు, వాకిళ్ళు లేవా.. మేం మాత్రం మనుషులం కాదా? మాకు రోగాలు రావా? అని లాజిక్కులొకటి..ఏం చేస్తాం?”

“మన అలవాట్లు.. నమ్మకాలు.. ఆచారాలు మనవి! మనని చూసి వాళ్ళూ ఇవన్నీ చెయ్యటం మొదలు పెట్టారు. దాని కోసమే అడపా దడపా డుమ్మాలు కొట్టటం తమ హక్కు అనుకుంటున్నారు. మనమే మారటం నేర్చుకోవాలి” అని ముక్తాయించింది మహలక్ష్మి ప్రసాదం చేతిలో పెడుతూ!

[గుర్రం చాలా వేగంగా పరుగెత్తుతుందని మనందరికీ తెలుసు. గుర్రపు వేగం దాని మీద ఎక్కి సవారీ చేసే రౌతు నైపుణ్యం మీద ఆధారపడుతుంది. అటూ ఇటూ చుసుకుంటూ వెళితే అంత వేగంగా వెళ్ళలేదు. అందుకే ఎదురు భాగం తప్ప పక్క దృశ్యాలు కనపడకూడదని గుర్రం కళ్ళకి గంతలు కడతారు.

అలా సహజంగానే వేగంగా పరుగెత్త గల గుర్రం.. తనని నడిపించే రౌతు మెత్తని వాడయితే నాలుగు కాళ్ళని ఉపయోగించి పరుగెత్తకుండా మూడు కాళ్ళ మీదే నిదానంగా అటూ ఇటూ చూసుకుంటూ నడుస్తుంది. ఇక గమ్యం ఎప్పుడు చేరుతుందో ఆ పై వాడికే తెలియాలి.

చేతకాని యజమాని ఉంటే వారి కింద పని చేసే వాళ్ళ గురించి చెప్పాలంటే ఈ సామెత వాడతారు.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here