సామెత కథల ఆమెత-19

0
10

[తెలుగు సామెతల ఆధారంగా అల్లిన చిన్న కథల ఫీచర్ నిర్వహిస్తున్నారు శ్రీమతి మద్దూరి బిందుమాధవి.]

కాకి పిల్ల కాకికి ముద్దు

[dropcap]“ఏం[/dropcap]టోయ్ మాడిపోయిన బల్బ్ మొహం పెట్టావ్” అన్నాడు కాంతారావు భార్య వెంకట లక్ష్మితో.

“ఆ పత్రిక ఎడిటర్ నా రచన తిప్పి పంపేశాడండి! వాళ్ళేదో పేద్ధ ..గోప్ఫ ..రచనలే వేసుకుంటున్నట్టు.. నాది ఆ ప్రమాణాల్లో లేనట్టు!”

“కనీసం ఎందుకు వేసుకోలేదో చెప్పచ్చు కదా! ఊహూఁ ‘మీ రచన ప్రచురించటం లేదు’ అని పొడి పొడిగా ఒక మెయిల్ ఇచ్చాడు” అన్నది వెంకటలక్ష్మి అక్కసు అంతా మొహంలో వెలిబుచ్చుతూ!

“నువ్వలా నిరుత్సాహ పడకూడదోయ్. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు. ఎప్పుడో ఒకనాడు పాఠకులు నీకు, నీ రచనలకి బ్రహ్మరథం పడతారు. అయినా పుడుతూనే ఎవ్వరూ నడిచెయ్యరు.. మొదలు పెడుతూనే పెద్ద రచయితలైపోరు. ఎంత దూర ప్రయాణమైనా ఒక అడుగుతోనే మొదలవుతుంది అని ఒక పెద్దాయన ఆ మధ్య చెప్పలా!” అన్నాడు భార్యని ప్రోత్సహించే ధోరణిలో కాంతారావు.

“ఆఁ, అలా అనుకునే ఆంధ్ర సంచిక, విమల, కధా కేళి, కవితా మయం.. ఇలా ఒకటా రెండా.. ఎన్నిటికి పంపినా ఒక్కడూ వేసుకోడే! కొత్త వారిని ఇలా నిరాదరించి నిరుత్సాహ పరిస్తే కొత్త రచయితలెక్కడి నించి వస్తారు? ఆ ఇంగితమైనా ఉండట్లేదు ఈ సంపాదకులకి! ఎప్పుడూ పాత చెత్త.. పాత ఆలోచనలేనా? కొత్త వారికి అవకాశం ఇస్తేనే కదా కొత్త భావాలూ.. ఆలోచనలూ.. కొత్త భాష.. కొత్త కొత్త ప్రయోగాలు కథలు.. కవితల రూపంలో ప్రజల్లోకి వెళ్ళేది? ఏమిటో.. ఒక్కోసారి ఈ రచనా వ్యాసంగం ఆపేసి కొత్త దారి ఏదయినా వెతుక్కుంటే బాగుంటుందేమో అనిపిస్తోందండి” అన్నది తల పట్టుక్కూర్చుని.

“మరీ అంతలా నిరుత్సాహ పడకోయ్. నలుగురిని చంపనిదే డాక్టర్ కాలేడుట. నాలుగు బ్రిడ్జిలు పడిపోనిదే ఇంజనీరూ కాలేడు. అలాగే ఓ వంద రచనలన్నా తిరిగి రానిదే చెయ్యి తిరిగిన రచయిత కాలేరు. నేను చెప్పేది విను.”

“మన చిన్నప్పుడు మన దేశంలో ఒక ప్రముఖ వ్యక్తి భార్య చేసే రచనలు.. అవి తమ పత్రికలో తప్పనిసరిగా వేసుకోవలసిన పత్రిక యాజమాన్యం నిస్సహాయత గురించి అందరూ తెగ మాట్లాడుకునే వారు.. నీకు గుర్తు ఉందో.. లేదో!”

‘క’ మలం నీటిలో విరుస్తుంది

‘ఖ’ గం ఆకాశంలో ఎగురుతుంది

‘గ’ గనంలో మబ్బులొస్తాయి

‘ఘంట కొట్టగానే రైలు బయలు దేరుతుంది..

“ఇలా ఆవిడ కవితలు.. ఒక దిన పత్రికలో రోజూ పడేవి.”

“నువ్వు అంతకంటే తక్కువేం కాదు వెంకట లక్ష్మీ.. నేను చెబుతున్నా విను.. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అన్నారు పెద్దలు.. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు. ఎప్పుడో ఒకప్పుడు ఒక తెలివైన సంపాదకుడు నువు రాసిన వన్నీ ‘ఇదొక కొత్త ట్రెండ్’ అనే శీర్షికతో నీ రచనలన్నీ రోజుకొకటి చొప్పున ప్రచురించేస్తాడు.”

“క్షీర సాగర మథనంలో ముందుగా విషమే వచ్చింది.. అంటే నీ రచనలు తిరస్కరించటమన్న మాట. ఓర్పుగా చిలుకుతూ వెళితేనే ‘అమృతం’ వచ్చింది” అని తన శాయశక్తులా వెంకట లక్ష్మిని ప్రోత్సహిస్తూనే ఉన్నాడు కాంతారావు.

***

ఒక రోజు కాంతారావు ఆఫీసు నించి వచ్చేటప్పటికి ఆకాశవాణిలో వాడే ఇయర్ ఫోన్స్ లాంటివి తలకి పెట్టుకుని, చేతిలో కాయితాలు పట్టుకుని కళ్ళు మూసుకుని.. చుట్టు పట్ల పరిసరాలు గమనించకుండా వెంకటలక్ష్మి ఏదో కవితా పఠనం చేస్తోంది.

తలుపు చప్పుడుకి తల తిప్పి చూసి.. తను రికార్డింగ్ చేస్తున్నానని ..నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళిపొమ్మని.. కళ్ళతో సైగ చేస్తూ చేత్తో గది వైపు చూపించింది.

ఓ అరగంట తరువాత.. ఇయర్ ఫోన్స్ పక్కన పెట్టి, గదిలోకొచ్చి “కాఫీ ఇవ్వనా” అంది.

“ఆ ఇయర్ ఫోన్స్ ఏంటి? ఏం చేస్తున్నావు? ఎప్పుడు కొన్నావు” అన్నాడు ఆశ్చర్యంగా మొహం పెట్టి.

“మన సందు చివర ఉన్న కంప్యూటర్ సెంటర్‌లో అబ్బాయితో మాట్లాడి సెకండ్ హాండ్ ల్యాప్‌టాప్ తెప్పించుకున్నానండి. అందులో అతని చేతే నా పేరుతో యూ ట్యూబ్ చానెల్ ఒకటి ప్రారంభించి అందులో నా కవితలు.. కథలు నేనే ఆడియో చేసి అప్‌లోడ్ చేస్తున్నాను.”

“ఈ పత్రికల వాళ్ళు వేసుకోకపోతే నాలో కట్టలు తెంచుకుంటున్న సృజనాత్మకత ఏం కావాలి? నలుగురికి తెలియకుండానే మసిబారిపోవాలా? ఇప్పుడు అందరూ ఎవరికి వారే ఒక యూట్యూబ్ చానెల్ పెట్టేసుకోవచ్చుట! ఆ మధ్య మా బాబాయి గారబ్బాయి వచ్చినప్పుడు చెప్పాడు. ఆ పని నేనెందుకు చెయ్యకూడదు అనిపించింది. వెంటనే నా ఆలోచనకి కార్య రూపం ఇచ్చేశా” అన్నది ఉత్సాహంగా.

“ఇప్పటికి ఇలా ఎన్ని అప్‌లోడ్ చేశావ్” అన్నాడు పట్టు వదలని విక్రమార్కుడి లాంటి భార్యలోని గాఢమైన కోరిక గల రచయిత్రిని మనసులోనే అభినందిస్తూ!

“మీరు ఆఫీసుకెళ్ళాక, నా రూం అంతా ‘సౌండ్ ప్రూఫ్’ చేసుకుని.. రోజుకో నాలుగు చొప్పున రికార్డ్ చేస్తున్నానండి. ఇప్పటికి ఆరు కవితలు.. రెండు కథలు అప్‌లోడ్ చేశాను. శ్రోతల స్పందన ఇంకా ఏమి రాలేదు” అన్నది నిరుత్సాహాన్ని దాచుకుంటూ!

“శ్రోతల స్పందన రావటానికి కొంచెం టైం పడుతుందిలే! అయినా నీ బోటి ఆవిడ తన కడుపు పండాలని దేవుడికి మొక్కుకుని ప్రదక్షిణలు చేస్తూ ‘ఒక ప్రదక్షిణ చేసి కడుపు పట్టుకు చూసిందిట’. ఇలా మొదలు పెట్టగానే అలా శ్రోతలు పెరిగిపోరు! కాకపోతే పత్రికల్లాగా ఎవరి అనుమతి వీటికి అక్కరలేదు. వ్యూయర్స్ లేరని.. స్పందనలు రావట్లేదని నిరుత్సాహ పడకు!”

“‘కాకి పిల్ల కాకికి ముద్దు’ గానే ఉంటుంది. అందరికీ ముద్దుగా కనిపిస్తేనే అది నిజంగా ముద్దుగా ఉన్నట్టు. అలాగే నీ రచనలు నీకు బావుంటే సరిపోదు. మిగిలిన వాళ్ళకి కూడా బావుంటేనే చదువుతారు.. వింటారు. అర్థం అవుతోందా” అన్నాడు.

“కొన్ని రోజులు చిత్త శుద్ధితో ప్రయత్నించు. స్పందన ఉంటే సంతోషం. లేకపోతే నిరుత్సాహపడకు” అన్నాడు వెంకట లక్ష్మి పట్ల ప్రేమగల భర్త కాంతారావు, నిజాయితీతో.

“అలాగే” అని తలూపి తన రికార్డింగ్ రూం లోకి వెళ్ళింది వెంకట లక్ష్మి కొత్త కథ రికార్డింగ్ చెయ్యటానికి.

[ఎవరి పని వారికి మాత్రమే నచ్చి.. ఇతరుల మెప్పు పొందలేనప్పుడు ఈ సామెత వాడతారు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here