సామెత కథల ఆమెత-2

0
11

[తెలుగు సామెతల ఆధారంగా అల్లిన చిన్న కథల ఫీచర్ నిర్వహిస్తున్నారు శ్రీమతి మద్దూరి బిందుమాధవి.]

చిచ్చుగలమ్మ చిత్రాంగి.. పాత్ర గలమ్మ పనిమంతురాలు

[dropcap]“ని[/dropcap]న్న కాక మొన్న.. నిజంగా మొన్నే కదా రైతు బజార్‌కి వెళ్ళి నాలుగు వందల రూపాయల కూరలు తెచ్చాను. మళ్ళీ కూరలంటావేంటే” అన్నాడు శంకర్ చిరాగ్గా భార్య గౌరితో!

“ఆఁ మీది మరీ చోద్యం. కూరలన్నీ నేనొక్క దాన్నే వండుకు తింటున్నానంటారా. లేకపోతే కూరలన్నీ ఫ్రిజ్ తినేసిందా? మీరూ రెండు పూట్లా తింటూనే ఉన్నారుగా. మా వాళ్ళకి చాటుమాటుగా పంపుతున్నాననుకోవటానికి వాళ్ళెవరూ ఈ ఊళ్ళో లేను కూడా లేరు. మీకూ తెలుసు ఆ విషయం!” అన్నది గౌరి చేతులు తిప్పుతూ!

“ఇరుగు పొరుగులకి పందేరాలు చేస్తున్నాననుకోవటానికి.. వాళ్ళు పొద్దున పోతే రాత్రికి గానీ రాని ఉద్యోగస్థులు. నెలకి రెండు మూడు సార్లు వాళ్ళ మొహాలు చూస్తే అక్కడికి ఎక్కువ!”

“అది సరే.. అవన్నీ నాకెందుకు. ఎవ్వరికీ ఉపకారం చెయ్యద్దనీ నేననలేదు. నిన్ను తినద్దనీ అనలేదు. ఉన్నది లింగు-లిటుకు అంటూ ఇద్దరం. అన్ని కూరలు రెండే రోజుల్లో ఎలా అయిపోయాయని ఆశ్చర్య పోతున్నానంతే! ఆ మాటే పైకి అన్నాను” అన్నాడు శంకర్ గొంతు తగ్గించి.

“మొన్న ఉదయం అరిటికాయ.. నిమ్మకాయ పిండి ఉప్మా కూర చేశాను. దోసకాయ పచ్చడి, మెంతాకు పప్పు, బెండకాయ.. సొరకాయ.. ములక్కాడ వేసి పులుసు పెట్టాను. రాత్రికేమో బెండకాయ వేపుడు చేసి పొట్ల కాయ పెరుగు పచ్చడి చేశానా.. టొమాటొ వేసి కమ్మగా చారు కాస్తే లొట్టలేసుకుంటూ తాగారు. పొట్లకాయ పెరుగు పచ్చడి నాకు మిగల్చకుండా శుభ్రంగా నాకేశారు.. గిన్నె తోమే అవసరమే లేకుండా” అన్నది ఉక్రోషంగా దెప్పుతూ గౌరి.

“బావుంది.. అంత రుచిగా ఆవ పెట్టి పెరుగు పచ్చడి చేస్తే ఎవరైనా అలాగే తింటారు” అన్నాడు మళ్ళీ ఆ రుచి గుర్తు తెచ్చుకుంటూ కళ్ళల్లో వచ్చిన మెరుపుతో!

“నిన్నటికి నిన్న వంకాయ వేపుడు.. గోరు చిక్కుడు పాఠోళి, గోంగూర పప్పు, గుమ్మడికాయ పులుసు, మామిడల్లంతో మెంతి బద్దలు.. ఆవురావురుమంటూ లాగించేశారు. గంట గడిచిందో లేదో.. ‘ఆలు బజ్జీలేస్తావేంటి’ అని ధాత నామ సంవత్సరంలో పుట్టిన వారిలాగా (ఆ సంవత్సరం కరువు సంవత్సరంగా చరిత్రలో గణుతికెక్కింది లెండి.. పెద్దలు ఇలా వాడతారు) మళ్ళీ నస మొదలెట్టారు” అంది మూతి మూడు వంకరలు తిప్పుతూ!

“ఏం చెయ్యమంటావు.. పోయిన పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి కూరల షాపులు బంద్! రైతు బజార్‌కి వెళ్ళలేము. ఇంట్లో ఉన్న కూరల స్టాక్ అయిపోయిందని.. ఆఖరికి కంద.. చేమ లాంటి దుంపలు కూడా లేవని నువ్వు ప్రకటించేసరికి ఇంట్లో నించి బయటికెళ్ళ లేను. కూరలు లేవని నువ్వు పెట్టిన పచ్చడి మెతుకులు తిని తిని కడుపులో మంట! అందుకే అలా లాగించాను. ఆ మాత్రానికే అంత దెప్పాలా” అన్నాడు.

“నేననేది అదే! నాలుగు రకాలు వండి పెడితే ‘ఇన్ని పదార్ధాలు ఎందుకు వండావ్’ అని ఒక్క మాట కూడా మాట్లాడకుండా సుష్ఠుగా తిన్నారు. మీకు వైన వైనాలుగా వెరైటీలు కావాలి! ఇప్పుడేమో కూరలన్నీ ఏమయ్యాయి అంటారా?”

“నాకు మాత్రం చేవ చచ్చినట్టు అన్నం ఒక్కటి వండి పచ్చడి వేసుకు తినటం బావుంటుందా? అందుకే చిన్నప్పుడు మా అమ్మ ‘చిచ్చు గలమ్మ చిత్రాంగి.. పాత్ర గలమ్మ పనిమంతురాలు’ అన్నట్టు నాలుగు రకాల కూరలు కనిపించేసరికి ప్రాణం లేచొచ్చింది. హాయిగా చేతికొద్దీ వండి మీకింత పెట్టి నేనింత తిన్నాను. ఇద్దరమూ పది రోజులు కూరలు లేని భోజనం చేసిన వెలితి తీర్చుకున్నాం” అన్నది.

“అవును కానీ ఇందాక నువ్వు చెప్పిన సామెతకి అర్థం ఏంటి” అన్నాడు అమాయకంగా మొహం పెట్టి.

“ఓహ్ అదా.. చిచ్చు అంటే వంట చెరకు. పూర్వం కట్టెల పొయ్యి మీద కుండలతో, రాచిప్పలతో వంట చేసే వారు. అన్నప్పుడల్లా ఎండు కట్టెలు దొరక్క.. పచ్చి కట్టెలతో పొయి మండక.. కళ్ళు మండి ఇల్లాళ్ళు నానా అవస్థ పడేవారు. ఇక పాత్రల విషయానికి వస్తే కుండలు సమయానికి చిల్లులు పడటమో.. పగిలి పోవటమో జరిగి చాలా ఇబ్బంది పడేవారు.”

“ఈ గండాలన్నీ గడిచి గట్టెక్కి వంట చేసి ఇంటిల్లి పాదికి విస్తట్లో భోజనం పెట్టేసరికి గృహిణి తల ప్రాణం తోకకి వచ్చేది. ఇంతట్లో పని ఆలస్యమయిందని అత్తల దెప్పుళ్ళు.. మొగుళ్ళ చిరాకులు.. పాపం ఆ రోజుల ఆడవాళ్ళ గురించి తల్చుకుంటేనే జాలేస్తుంది.”

“ఆడవాళ్ళ పనితనం తెలియాలంటే వంటకి సంబంధించిన అన్ని వస్తువులు సక్రమంగా ఉండాలి అనే ఈ సామెత అప్పుడే వాడుకలోకి వచ్చి ఉంటుంది” అన్నది గౌరి దీర్ఘ నిస్వాసం విడిచి.

“మాట్లాడింది చాలు కానీ లేచి తెమలండి.. రైతు బజార్‌కి వెళ్ళి కూరలు తెస్తేనే ఈ పూట వంట” అన్నది.

“తప్పుతుందా.. దేవి గారి ఆజ్ఞ” అని సంచి పుచ్చుకు బయలుదేరాడు శంకర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here