సామెత కథల ఆమెత-26

0
9

[తెలుగు సామెతల ఆధారంగా అల్లిన చిన్న కథల ఫీచర్ నిర్వహిస్తున్నారు శ్రీమతి మద్దూరి బిందుమాధవి.]

చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి

[dropcap]ర[/dropcap]వీందర్‌కి ఆటలంటే ప్రాణం. ఔట్‌డోర్‌లో కబడ్డీ, బాడ్మింటన్, టెన్నిస్ ఇలా.. ఏదో ఒకటి ప్రతి రోజూ స్టేడియంకి వెళ్ళి ఆడుతుంటాడు.

క్యారమ్స్ అన్నా వదలడు.

ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మినహా.. మిగిలిన టైంలో క్రమం తప్పకుండా ఆటలాడతాడు.

స్పోర్ట్స్‌లో ఉన్న ఆసక్తి వల్ల స్కూల్ రోజుల నించీ ఉన్న మిత్ర బృందం.. ఉద్యోగపు రోజుల్లో కూడా కొనసాగుతోంది.

వారం వారం అందరూ కలిసి.. బయట గేమ్స్/ప్రాక్టీస్ మ్యాచెస్ ఏవీ లేకపోతే టీవీలో మ్యాచెస్ చూస్తూ.. వాటి మీద వాడి.. వేడి చర్చ చేస్తూ ఉంటారు.

అదృష్టవశాత్తూ అందరి భార్యలకి వీళ్ళ ఆటలు.. మాటలు ఆనందించే ఆసక్తి.. అలవాటు ఉంది.

భర్తలు ఇలా వారాంతాల్లో కలిసినప్పుడు.. వాళ్ళు కూడా ఒకరితో ఒకరు తమ తమ ఆఫీసు కబుర్లు.. పిల్లల పెంపకం.. కొత్త వంటలు.. ఇత్యాది విషయాలతో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

ఒక్కరికే పని భారం పడకూడదని.. ఒక వారం ఒకరింట్లో.. మరొక వారం మరొకరింట్లో కలుస్తూ ఉంటారు.

***

ముందుగా చెప్పి అనుమతులు తీసుకోవటం లాంటి ఫార్మాలిటీస్ వారి మధ్య లేవు. అలా ఆ ఆదివారం సాగర్ కుటుంబం రవీందర్ వాళ్ళింటికి వెళ్ళారు.

అసలు రాత్రి పడుకునేటప్పుడు తప్ప తలుపులు వెయ్యని రవీందర్ ఇంటి వాకిలి తలుపు వేసి ఉంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బయటికెళ్ళారేమో అనుకుందామంటే కార్ వాకిట్లోనే ఉంది.

ఏమయిందబ్బా అని ఒకింత సందేహంతో కాలింగ్ బెల్ కొట్టాడు సాగర్.

రవీందర్ భార్య మాలతి వచ్చి తలుపు తీసి.. “రండన్నయ్యా. మీ ఫ్రెండ్ నడుం నొప్పి అని ఉదయం నించీ బాధ పడుతున్నారు. మందు వేసుకోమంటే వేసుకోరు. పొజిషన్ కుదరట్లేదని కుషన్ వేసుకుని అటు కూర్చుంటారు.. ఇటు కూర్చుంటారు. నిటారుగా తప్ప ఆయన ఇలా వాలిపోయి కూర్చోవటం నేను ఇంతవరకు చూడలేదు. డాక్టర్ దగ్గరకి వెళదామంటే వద్దంటారు” అన్నది ఆదుర్దాగా!

“ఏమయిందిరా.. ఆవిడ చెప్పేది కూడా వినిపించుకుంటూ ఉండు. ఆవిడేమి నీకు శత్రువు కాదు కదా” అన్నాడు.

“నువ్వు కూడా ఏంట్రా? మనిషన్నాక చిన్నా.. చితకా నొప్పులు వస్తూ ఉంటాయి. మనమేమైనా పదేళ్ళ పిల్లలమా.. ఎగురుకుంటూ తిరగటానికి! నిన్న షటిల్ ఆడుతున్నప్పుడు పట్టేసి ఉంటుంది.. ఏదో మస్క్యులర్ క్యాచ్ అయ్యుంటుంది. మూవ్ స్ప్రే చేసి హాట్ వాటర్ బ్యాగ్‌తో కాపడం పెడితే అదే తగ్గుతుంది. అంతగా తగ్గకపోతే ఏ పారాసిటమాలో వేసుకుంటే సరిపోతుంది” అన్నాడు.

“నువ్వన్నట్టే మనం ఇంకా పదేళ్ళ పిల్లలం కాదు. మనకీ వయసు మీద పడుతోంది. అది వరకు లాగా కాలం సాదా సీదాగా నడవట్లేదురా! సింపుల్‌గా కనిపించే విషయాలు కూడా పెద్ద ఆరోగ్య సమస్యల్లోకి దారి తీస్తున్నాయి.”

“చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనే వాళ్ళు మన పెద్ద వాళ్ళు.”

“సిస్టర్ అన్నట్టే డాక్టర్ దగ్గరకి వెళ్ళొద్దాం పద. ఆయన నోటితో చెబితే మనకి ధైర్యం!” అన్నాడు.

“ఎహే ఊరుకోరా.. మనం స్పోర్ట్స్ పర్సన్స్‌మి. ఆటలతో ఎప్పుడూ ఫిట్‌గా ఉంటాం. అంతేనా.. ఫిట్‌గా ఉండటానికి తరుచు టెస్ట్స్ చేయించుకుంటూ ఉంటాం! రెండు రోజుల క్రితమే మాస్టర్ హెల్త్ చెకప్ చేయించాను. అన్నీ పర్ఫెక్ట్. చెప్పాను కదా.. ఏదో మస్క్యులర్ క్యాచ్ అయుంటుంది. ఇలా చిన్న చిన్న వాటిని భూతద్దంలో పెట్టి చూడకూడదు.”

“ముందు సిస్టర్ చేతి కాఫీ తాగు.. క్యారం బోర్డ్ ఓ గేమ్ ఆడదాం” అన్నాడు.

అలా కూర్చోవటానికి అవస్థ పడుతూనే.. ఒక అరగంట క్యారమ్స్ ఆడారు.. సాగర్.. రవీందర్.

“భోంచేసి కాసేపు విశ్రాంతి తీసుకోరా. వీడికెట్లా ఉందో అడగటానికి సాయంత్రం నేనే ఫోన్ చేస్తాను. ఈ లోపు ఏదైనా అవసరం పడితే ఫోన్ చెయ్యండి సిస్టర్” అని చెప్పి భార్యతో కలిసి సాగర్ వెళ్ళిపోయాడు.

***

డైనింగ్ టేబుల్ దగ్గరకి రాలేనంటే.. భర్తకి ముందుగదిలోకే భోజనం తీసుకెళ్ళి పెట్టింది మాలతి.

భోజనం చేసి సోఫాలోనే పడుకున్నాడు రవీందర్. భర్త టీవీ చూస్తున్నాడు.. ఆ సౌండ్ తన నిద్రకి భంగం అని మాలతి రూంలోకి వెళ్ళి పడుకుంది.

“ఏంటి.. టీవీ చూస్తూ ఇంత సేపు అలాగే పడుకుండిపోయారా” అని తట్టి లేపిన మాలతికి రవీందర్ శరీరం చల్లగా తగిలింది.

రెండు.. మూడు సార్లు పిలిచి.. కుదిపి చూసి కంగారుగా సాగర్‌కి ఫోన్ చేసింది.

ఒక్క ఉదుటున వచ్చిన సాగర్ “ప్రాణం ఎప్పుడో పోయినట్టుంది సిస్టర్!” అని తమ ఇంకొక ఫ్రెండ్ డాక్టర్ శంకర్ కి ఫోన్ చేశాడు.

డా. శంకర్ వచ్చి.. ఉదయం నించి జరిగినదంతా వివరంగా సాగర్, మాలతిల ద్వారా విని ‘కార్డియాక్ అరెస్ట్’ అన్నాడు.

“మొన్న కోవిడ్ వచ్చి తగ్గినప్పటి నించి వీడికి బ్లడ్ థిన్నర్స్ వేసుకోరా అని చెబుతూనే ఉన్నాను. బ్లడ్ క్లాట్స్ ఫార్మ్ అవుతున్నాయి. శరీరం అంతా స్కాన్ చేసినా అవి మామూలు పాథాలజీ టెస్ట్స్‌లో బయటపడట్లేదు. మాకు కేసెస్ చాలా విచిత్రమైన కండిషన్స్‌తో వస్తున్నాయి. భుజం నొప్పి, దవడ నొప్పి, నడుం నొప్పి.. ఇలా ఏ నొప్పి దేనికి దారి తీస్తుందో చెప్పలేక పోతున్నాం!”

“రీసెంట్‌గా వీడు ఎక్కడైనా నొప్పి అని కంప్లెయింట్ చేశాడా” అనడిగాడు.

“ఉదయం నించీ నడుం నొప్పి అంటున్నారు. పైగా అది మస్క్యులర్ క్యాచ్ అని తనకి తనే నిర్ణయించేశారు. సాగర్ అన్నయ్య, నేను ఇద్దరం చెప్పాము.. తేలిగ్గా కొట్టి పడేశారు” అన్నది ఏడుస్తూ మాలతి.

“ఇప్పుడొస్తున్న క్లాట్ ఫార్మేషన్ ఎంత విచిత్రంగా ఉంటోందంటే.. అది నిముషాల మీద హార్ట్‌కి ప్రయాణించి సైలెంట్ కిల్లర్ అవుతోంది” అన్నాడు డా. శంకర్.

“నేను ‘చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి’ అని కూడా చెప్పానురా.. వింటే కదా మానవుడు. కోరి ప్రాణం తీసుకున్నట్టయింది” అన్నాడు సాగర్..

రవీందర్ మాట వినకుండా తనే బలవంత పెట్టి డాక్టర్ దగ్గరకి తీసుకెళితే ఫ్రెండ్ బతికేవాడు అనే అపరాధభావంతో సాగర్ చాలా రోజులు మౌనంగా తనలో తనే బాధ పడుతూ ఉండేవాడు.

[అన్ని పాములు కాకపోయినా.. కొన్ని పాములు విషపు కీటకాలు. ఆ కారణంగా మనకి పాము పేరు చెబితేనే ఒక భయం. విషం కలిగి ఉండే తాచు, జెర్రి గొడ్డు, కట్ల పాము మొదలైన పాములు చిన్నవైనా మనం అప్రమత్తంగా ఉండాలి. దాని ఆకారం.. పరిమాణంతో సంబంధం లేకుండా కనిపించగానే పెద్ద కర్రతో కొట్టి ప్రమాదాన్ని నివారించమని పెద్దల సూచన. రోగమైనా అంతే.. మన అనుభవంతో ఊహాగానాలు చేసి.. నిర్లక్ష్యంగా కొట్టిపడెయ్యక వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకోమని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here