సామెత కథల ఆమెత-30

0
10

[తెలుగు సామెతల ఆధారంగా అల్లిన చిన్న కథల ఫీచర్ నిర్వహిస్తున్నారు శ్రీమతి మద్దూరి బిందుమాధవి.]

నవ్విన వాళ్ళముందే కాలు జారి పడ్డారు

[dropcap]కొం[/dropcap]త మందికి స్వాతిశయం, అహంకారం, గర్వం  ఎక్కువగా ఉంటాయి. తమ హోదానే ఎక్కువని, తమ పిల్లలు బాగా చదువుకుంటారని.. ఎదుటి వారి పిల్లలు మొద్దులని అనేస్తూ ఉంటారు. అలా మాట్లాడటానికి ముందు కొంచెం కూడా ఆలోచించరు.

రేపు కాలం తిరగబడి తన పరిస్థితి మారిపోవచ్చు. అప్పుడు అంతకు ముందు తాము ఎవరిని కించపరిచారో వాళ్ళ దగ్గరికే అవసరానికి వెళ్ళాల్సి వస్తే వాళ్ళ పరిస్థితిని వివరించటానికి ఈ సామెత వాడతారు.

***

“అత్తయ్యా మంజు ని కూడా ఇంజనీరింగ్‌లో చేరమను. ఇద్దరం కలిసి కంబైండ్ స్టడీ చేసుకోవచ్చు” అన్నది ఆడపడుచు కూతురు వందన.

“ఆఁ అందరికీ నీ లాగా ఇంజనీరింగ్ చదివే తెలివితేటలుండద్దూ? చదివించే స్తోమత తల్లిదండ్రులకుండద్దా? అత్తయ్యా వాళ్ళ పుట్టింటి వైపు ఇంజనీరింగుల్లాంటి చదువులు చదివిన వాళ్ళెవరూ లేరు. అందరూ ఏదో స్కూల్ టీచర్స్.. బ్యాంకు ఉద్యోగాలు!”

“మా అన్నయ్య ‘ఆడపిల్లలకి టెక్నికల్ కోర్సులెందుకూ’ అంటాడు. వచ్చే ఏడు వాళ్ళబ్బాయి కిరణ్ రెడీ అవుతున్నాడు. ఇద్దరిని ఇంజనీరింగు చదివించే స్తోమత లేకే ఆడపిల్లలకి ఇంజనీరెందుకు అనుంటాడు.”

“అయినా ఊరికే దాన్నెందుకు పీకుతావు. నీ సంగతి నువ్వు చూసుకోక” అన్నది రత్నమాల విసుగ్గా కూతురు వందనతో.. అన్నయ్య స్తోమత గురించి లోకువ.. మేనకోడలి తెలివితేటల గురించి చులకన భావంతో!

వీళ్ళ సంభాషణ మౌనంగా వింటూ కూర్చుంది నాగలక్ష్మి.. తన అభిప్రాయం చెప్పవలసిన అవసరం లేదన్నట్టు.

మొదటి నించి తనన్నా, తన పిల్లలన్నా ఆడపడుచు రత్నమాలకి లోకువే. ఆవిడకి తన భర్త హోదా, తనకున్న ఆస్తిపాస్తుల గురించిన స్వాతిశయం ఎక్కువ.

తన కొడుకు సంపత్ అందమైన వాడని.. కూతురు వందన తెలివైనదని.. అవసరమున్నా లేకపోయినా మాటల్లో మాటగా చెబుతూ ఉంటుంది.

అవకాశం వచ్చినప్పుడల్లా అన్నయ్య అని కూడా చూడకుండా ఏదో ఒక మాట అనే తీరుతుంది.

***

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సంపత్ హఠాత్తుగా తనని చూడటానికి వచ్చేసరికి గోపాల్ ఆశ్చర్యపోయాడు.

“హాయ్ సంపత్.. ఎక్కడి నించి రాక? హఠాత్తుగా ఊడిపడ్డావ్? అమెరికా నించి ఎప్పుడొచ్చావ్? ఎన్నాళ్ళుంటావ్? అమ్మా.. నాన్నా కులాసాయేనా? పని మీద వచ్చావా” అని మేనల్లుణ్ణి ప్రశ్నల్లో ముంచెత్తాడు.

“వచ్చి నాలుగు రోజులయింది మావయ్యా. వీసా స్టాంపింగ్‌కి వచ్చాను. స్లాట్స్ దొరకలేదు. తిరుగు ప్రయాణం ఎప్పుడో ఇంకా తెలియదు. అమ్మ నిన్ను చూసి రమ్మన్నది” అన్నాడు సంపత్ పొడిగా.

“లక్ష్మీ సంపత్ వచ్చాడు.. ముందు మంచి నీళ్ళు, తరువాత కాఫీ పట్రా. భోజనంలోకి మంచి ఐటమ్స్ చెయ్యి. అక్కడ పిజ్జాలు, బర్గర్లు తిని నోరు చవి చచ్చి ఉంటాడు. నీ చేతి మజ్జిగ పులుసు, కొబ్బరి పచ్చడి చిన్నప్పుడు ఇష్టంగా తినేవాడు” అన్నాడు గోపాల్ మేనల్లుడి వంక ఆప్యాయంగా చూస్తూ!

“కిరణ్ ఇప్పుడు ఫైనల్ ఇయరేమో కదా మావయ్యా! క్యాంపస్ సెలెక్షన్‌కి వెళ్ళాడా? ఏ కంపెనీలో చేరుతున్నాడు” అన్నాడు సంపత్.

“లేదురా.. వాడిని ఆ కాలేజిలోనే ఫాకల్టీగా చేరమన్నారుట. వాడికి కూడా టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఒక ఏడాది వర్క్ చేశాక ఐఐటి లో పిహెచ్‌డికి ప్లాన్ చేస్తానంటున్నాడు. సాఫ్ట్‌వేర్ కంపెనీల ఉద్యోగం మీద వాడికి పెద్దగా మోజు లేదు” అన్నాడు గోపాల్.

***

“అప్పుడే మీ మేనల్లుడు అమెరికా నించి వచ్చి సంవత్సరం అయింది. ఇదిగో అదిగో అంటూ మాట దాటేస్తోంది మీ చెల్లెలు. ఉద్యోగం పోయుంటుందంటారా” అన్నది నాగలక్ష్మి భర్త గోపాల్‌తో.

“ఏమో లక్ష్మీ.. దాని మాటలకేం గానీ.. పాపం వాడెంత ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడో? పూర్వం.. చదువులని వానాకాలపు చదువులు అనే వారు కానీ.. ఈ కాలపు ఉద్యోగాలు నిజంగా ‘వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియవు’ అనే చందంగా ఉన్నాయి. అంతలో ఐదంకెల్లో జీతాలిచ్చి సింహాసనం మీద కూర్చో పెడతారు.. ఇంతలో ఉద్యోగం పోయింది.. ఇంటికి పొమ్మంటారు” అన్నాడు మేనల్లుడి గురించి జాలిగా నిట్టూరుస్తూ గోపాల్.

***

“రత్నా పండక్కి ఇక్కడికి రండి. బావగారికి కూడా ఫోన్ చేస్తాను. వందన కులాసాగా ఉన్నదా? వీలైతే దాన్ని కూడా రమ్మను. సంపత్ ప్రయాణం ఏమయినా తెలిసిందా” అన్నాడు గోపాల్ చెల్లెలు రత్నమాలకి ఫోన్ చేసి.

“ఈ సారికి రాలేంలే అన్నయ్యా.. వాడు ఎక్కడికి వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. వందన పోయిన నెల ఉద్యోగం మానేసింది. అల్లుడు గారికి ఇప్పట్లో ట్రాన్స్‌ఫర్ రాదుట. పిల్లలని పెట్టుకుని అది ఒక్కతే మేనేజ్ చేసుకోలేక పోతున్నది. ఈ నెల పదో తారీకు అది గుజరాత్ వాళ్ళాయన ఉండే చోటుకి వెళుతున్నది” అన్నది రత్నమాల.

ఆమె మాటల్లో అదివరకటి దర్పం, అహం లేవు.

“వదినకి ఇక్కడికి రావటానికి మొహం చెల్లట్లేదండి. మన మంజుని ఇంజనీరింగులో చేరమని వందన గొడవ చేస్తే.. తన కూతురికున్న తెలివితేటలు మేనకోడలికి లేవని, ఇంజనీరింగ్ గట్టెక్కించలేదని.. మనకి దాన్ని చదివించే స్తోమత లేదని ఎంత లోకువగా మాట్లాడిందనీ? ఆవిడ నమ్మకానికి విరుద్ధంగా.. ఇప్పుడు మంజు ఎమ్మెస్సీ  ఎలెక్ట్రానిక్స్ చదివి డిఫెన్స్ ల్యాబ్‌లో పెద్ద హోదాలో ఉందని.. తన కూతురు వందన ఉద్యోగం మానేసిందని చెప్పవలసి వచ్చినందుకు ఆవిడ మనసులో చాలా కించపడి ఉంటుంది. అందుకే పండక్కి రాననంటున్నది.”

“‘నవ్విన వాళ్ళ ముందే కాలు జారి పడ్డట్టయింది’ ఆవిడ పరిస్థితి. ”

“వాళ్ళు పై మెట్టు మీద ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు తన కంటే తక్కువగా ఉన్నారనే లోకువ భావం మంచిది కాదు. ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? అందుకే మాట్లాడేటప్పుడు నోరు సంబాళించుకోవాలి” అన్నది నాగలక్ష్మి.. ఆడపడుచు దగ్గర తనకి గతంలో జరిగిన చేదు అనుభవాలని నెమరేసుకుంటూ!

“అది తప్పు చేస్తే మనం కూడా చెయ్యాలనేముంది లక్ష్మీ! నీ మటుకు నువ్వు అలా ఆలోచించకు. ఎవరి నుదుటి రాతని ఎవరు నిర్ణయించగలరు? దానికీ మంచి రోజులొస్తాయనుకుందాం. అది తప్పుగా మాట్లాడితే.. పిల్లల జీవితాలకి అది శాపం కాకూడదు.”

“అందరూ బావుండాలి.. అందులో మనం ఉండాలి అనుకో. మన సానుకూల ఆలోచనా విధానమే మనకి శ్రీరామరక్ష.” అన్నాడు గోపాల్ చెల్లెలిపట్ల సానుభూతుతో కూడిన ప్రేమతో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here