సామెత కథల ఆమెత-31

0
11

[తెలుగు సామెతల ఆధారంగా అల్లిన చిన్న కథల ఫీచర్ నిర్వహిస్తున్నారు శ్రీమతి మద్దూరి బిందుమాధవి.]

కంచె మీద బట్ట చిరగకుండా తియ్యాలి

[dropcap]ము[/dropcap]ళ్ళ కంచె అంటే మొత్తం అడ్డ దిడ్డంగా ముళ్ళుండి ముట్టుకోవటానికి ప్రమాదంగా ఉంటుంది. ఏ మాత్రం వీలుగా ఉండదు. అట్లాంటిది దాని మీద బట్ట పడితే.. తీసే ప్రయత్నంలో ఒక చోట తీస్తే ఇంకొక చోట అది ముల్లు మీద పడుతూ.. తీసేవారికి పరీక్ష పెడుతుంది.

ఓర్పుగా తియ్యలేక లాగితే చిరిగిపోతుంది.

అందుకే ఓర్పుగా చెయ్యాల్సిన పనిని ‘కంచె మీద బట్ట’తో పోలుస్తారు.

***

“ఒరే అబ్బాయ్ ఇవ్వాళ్ళ పేపర్లో సాఫ్ట్‌వేర్ కంపెనీల వాళ్ళు వేలల్లో ఉద్యోగులని తీసేస్తున్నట్టు రాశారు. మనవాడి ఉద్యోగానికి ఏం ఢోకా లేదు కదా” అన్నారు పురుషోత్తం గారు.

రైల్వేస్‌లో ఇంజనీర్‌గా చేసి రిటైర్ అయిన డెబ్భయైదేళ్ళ పురుషోత్తం గారు దినపత్రికని ఓపికగా ఆసాంతం చదువుతారు. అన్ని విషయాలని తెలుసుకుంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానిస్తూ ఉంటారు.

“ఆఁ వరుణ్‌కి కూడా సమస్య రావచ్చు నాన్నా. అదే వాడూ ఆందోళన పడుతున్నాడు” అన్నాడు ఎల్ & టి లో ఇంజనీర్‌గా పని చేస్తున్న వాసుదేవరావ్.

“ఇంతమందిని ఉద్యోగాల్లోంచి తీసేసేటప్పుడు.. ఉద్యోగార్థుల నించి పోటీ పెరుగుతుంది కనుక మళ్ళీ అదే జీతంతో ఉద్యోగం వెంటనే దొరకటం కూడా కష్టమే కావచ్చు” అన్నాడు కొనసాగింపుగా వాసుదేవరావు.

“రెండు.. మూడు నెలలు ఫరవాలేదు కానీ.. ఆ తరవాతే ఎలాగా అని ఆలోచిస్తున్నాను” అన్నాడు అప్పుడే అక్కడికొచ్చిన వరుణ్ సాలోచనగా.

“దేని గురించి నువ్వనేది” అన్నారు పురుషోత్తం గారు.

“నెల నెలా హౌసింగ్ లోన్ వాయిదా కట్టాలి తాతగారూ! అదే ఆలోచిస్తున్నాను. అప్పుడు ఇన్‌కం టాక్స్‌కి ఉపయోగపడుతుందని గేటెడ్ కమ్యూనిటీలో విల్లా కొన్నాం. ఇప్పుడు ఈ లే ఆఫ్‌లో నా ఉద్యోగానికి ఎసరు వస్తే నేను వాయిదాలు కట్టటం కొంచెం కష్టం కావచ్చు. అందులో ఉంటున్న వాళ్ళు అద్దె భరించలేక ఖాళీ చెయ్యచ్చు. వెంటనే కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఉండకపోవచ్చు” అన్నాడు.

“అన్నిటికీ అలా భయపడితే ఎలా? సమస్య వచ్చినప్పుడే ఆలోచించాలి. నేను ఉద్యోగం చేసినప్పుడు.. రిటైర్ అయినప్పుడు కూడా నా దగ్గర చేబదుళ్ళు పుచ్చుకున్న మన దగ్గర చుట్టాలు కొంతమంది ఉన్నారు. ఈ మధ్యన ఒకటి రెండు సార్లు గుర్తు చేసి అప్పు తీర్చమని నేను, మీ నాన్న కూడా అడిగాం. ఇదిగో.. అదిగో అంటూనానుస్తున్నారు. ఇప్పుడు తీర్చెయ్యమని గట్టిగా చెబుతాను” అన్నారు పురుషోత్తం గారు.

***

“‘బాబాయ్ పిల్ల పెళ్ళి కుదిరింది. అనుకున్న డబ్బు సమకూరలేదు. నీ దగ్గర ఉంటే సర్దుతావా. మళ్ళీ నాలుగైదు నెలల్లో సర్దేస్తాను’ అని మా అన్నయ్య కొడుకు మధు అడిగితే నాలుగేళ్ళ క్రితం వాడికి ఓ మూడు లక్షలు ఇచ్చాను.”

“‘పెదనాన్నగారూ.. ఫ్లాట్‌కి చివరి ఇన్స్టాల్మెంట్ కట్టాలి.. వచ్చే నెల్లో గృహప్రవేశం చేసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు డబ్బు కట్టటం ఆలస్యమయితే బిల్డర్ టైం కి ఇల్లు ఇవ్వడు’ అని సాయిరాం అడిగితే వాడికి నా టర్మినల్ బెనిఫిట్స్‌లో నించి రెండు లక్షలు ఇచ్చాను.”

“‘మావయ్యా.. అమ్మకి వెంటనే హెస్టెరెక్టమీ ఆపరేషన్ చెయ్యాలిట. పది రోజుల క్రితమే పిల్లవాడికి కాలేజి ఫీజు కట్టాను. నువ్వు పెద్ద మనసు చేసుకుని కొంత సర్దుబాటు చేస్తే.. బోనస్ వచ్చినప్పుడు ఇచ్చేస్తా’ అంటే రమణకి లక్షరూపాలిచ్చాను.”

“వాళ్ళలో ఒక్కొక్కరికే ఫోను కలుపు మాట్లాడతాను” అన్నారు పురుషోత్తం గారు.

***

“బాబాయ్ నేను పిల్ల పెళ్ళి కోసం నీ దగ్గర డబ్బు తీసుకున్న మాట నిజమే. కానీ నువ్విచ్చింది మూడు లక్షలు కాదు. ఆ రోజు నీ బ్యాంక్ అకౌంట్‌లో అంత లేదు అని రెండు లక్షలే ఇచ్చావు. గుర్తుందా” అన్నాడు మధు.

“అలాగా.. నాకు గుర్తు లేదు. చూసి చెబుతాను. కానీ వచ్చే వారంలో తెచ్చి ఇచ్చెయ్యి. ఈ లోపు నేను నా డెయిరీ చూస్తాలే” అని ఫోన్ పెట్టేశారు పురుషోత్తం గారు.

“గృహ ప్రవేశానికి వచ్చినప్పుడు మీకు ఒక లక్ష ఇచ్చాను. ఇంకొక లక్షే ఇవ్వాలి. తరవాత ఇవ్వచ్చులే అన్నారని ఊరుకున్నాను” అన్నాడు సాయిరాం.

“నాన్నగారూ మీరు చెప్పిందానికి.. వాళ్ళు చెబుతున్న దానికి ప్రతి ట్రాన్సాక్షన్ లోనూ తేడా కనిపిస్తోంది. మీరు మర్చిపోయారా.. వాళ్ళు అబద్ధం చెబుతున్నారా? అందుకే డబ్బిచ్చేటప్పుడు ఎక్కడైనా నోట్ చేసుకుని వాళ్ళ చేత సంతకాలు పెట్టించుకుంటే ఏ పేచీ ఉండదు.”

“డబ్బుతో వ్యవహారం అంటే.. అందులోను దగ్గర బంధువులైతే ‘కంచెమీద బట్టలాగా’ చిరగకుండా జాగ్రత్తగా తియ్యాలి”.

“సహాయం పొందినప్పుడు ఎవరికీ చెప్పరు కానీ.. తిరిగి తీర్చమన్నప్పుడు.. మన గురించి ఉన్నవీ.. లేనివీ చెప్పి అయిన వాళ్ళ మధ్య మన గురించి చెడు ప్రచారం చేస్తారు” అన్నాడు వాసుదేవ రావు.

***

“అబ్బాయ్ నా డెయిరీ.. బ్యాంక్ పాస్‌బుక్ ఇట్లా పట్రా. నాకు పెద్ద వయసు వచ్చింది.. మరుపొచ్చి ఉంటుందని ఒక్కొక్కడు వెధవ్వేషాలు వేస్తున్నారు. డబ్బు తీసుకునేటప్పుడు దీనంగా మొహాలు పెడతారు. తీర్చాలనేటప్పటికి వీళ్ళ అసలు రంగులు బయట పడతాయి. వీళ్ళ సంగతి చెబుతా” అన్నారు పురుషోత్తం గారు.

“బాబాయ్ ఇదిగో నీ లక్ష” అన్నాడు నాలుగు రోజుల తరువాత వచ్చిన మధు.

“ఒరేయ్ మధు ఇలా కూర్చో. నీకు నేనిచ్చింది మూడు లక్షలు. ఇదిగో ఆ రోజు నా డెయిరీలో నువ్వు సంతకం పెట్టావు. బ్యాంక్ అకౌంట్‌లో కూడా నీ పేరున ఇచ్చిన మూడు లక్షల చెక్కు డెబిట్ అయినట్టు కనిపిస్తోంది.. చూడు. తీసుకున్న అసలే మూడు లక్షలు. ఇక వడ్డీ కలిపితే ఆరు లక్షలు సుమారుగా అవుతుంది. పోనీలే పిల్ల పెళ్ళిఅన్నావు.. నాలుగు నెలల్లో తీర్చేస్తానన్నావు అని వడ్డీ లేకుండా ఇచ్చాను. నాలుగు నెలలు కాదు.. నాలుగేళ్ళైనా నేను అడిగితే కానీ నీలో బాకీ తీర్చాలనే చలనం రాలేదు.”

“ఈ బాబాయ్ తోనా చెలగాటాలు. ఆ లక్ష ఇక్కడ పెట్టి, వెళ్ళి మిగిలిన రెండు లక్షలకి చెక్కు పట్రా. అన్నిటికీ కలిపి ఒకేసారి నీ బాకీ చెల్లుబాటైనట్టు సంతకం పెట్టి ఇస్తాను” అంటూ “నేను నీలాగా కాదురోయ్.. డబ్బు విషయంలో న్యాయంగా, నిక్కచ్చిగా ఉంటాను” అన్నారు పురుషోత్తం గారు.

***

“పెదనాన్నగారూ.. నేను తీసుకున్న రెండు లక్షల్లో వరుణ్ పెళ్ళప్పుడు ఒక లక్ష ఇచ్చాను. ఇంకొక లక్ష రేపిస్తాను. ఆమాటే చెప్పి పోదామని వచ్చాను” అన్నాడు సాయిరాం.

“ఓరి నీ దుంప పిలకెయ్య! భలే చెప్పావురా.. నేను డబ్బు ఇచ్చినా.. పుచ్చుకున్నా చెక్కుల ద్వారానే! ఆ విషయం మన బంధువులందరికీ తెలుసు. నువ్వు లక్ష ఇచ్చానంటున్నావు.. నా అకౌంట్‌లో కనిపించాలి కదా! కాకి లెక్కలు చెప్పక రేపు రెండు లక్షలకి చెక్కు పట్టుకురా” అని “అమ్మాయ్ వీడికొక కప్పు కాఫీ పట్టుకురా. నీ చేతి కాఫీ తాగితే అయినా మర్చిపోయిన విషయాలు గుర్తొస్తాయేమో” అన్నారు లోపలికి చూసి కోడలిని కేకేస్తూ.

“వెళ్ళొస్తా పెదనాన్నగారూ” అన్నాడు సాయిరాం చిన్నబుచ్చుకున్న మొహంతో!

“మావయ్యా ఇదిగో మీరిచ్చిన లక్ష రూపాయలు. నిన్ననే బోనస్ వచ్చింది. సమయానికి ఆదుకున్నందుకు చాలాచాలా థాంక్స్. మీకు అమ్మ ఆరోగ్యం పట్ల అక్కర ఉండదని కాదు. అమ్మ మీకు చెల్లెలే.. నాకు తల్లి. నాకుండే కంగారు వేరు” అన్నాడు డబ్బు తిరిగిస్తూ మేనల్లుడు రమణ.

“అమ్మని అడిగానని చెప్పు. రేపో.. ఎల్లుండో చూడటానికి వస్తానులేరా” అని మేనల్లుడి భుజం నిమిరారు ఆప్యాయంగా పురుషోత్తం గారు.

అదండీ అప్పులిచ్చి పుచ్చుకునే విషయంలో అందరూ పాటించవలసిన జాగ్రత్తలు. ఆనక బాధ పడితే ప్రయోజనంఉండదు. ‘ఏట్లో పోసేటప్పుడైనా ఎంచి పొయ్యాలి’ అంటారు పెద్దలు.

ఏమంటారు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here