అతి విలువైన పఠనానుభవం అందించే ‘సాఫల్యం’

1
11

[పాణ్యం దత్తశర్మ రచించిన సీరియల్ సాఫల్యం సంచికలో సీరియల్‍గా ప్రచురితమై సూపర్ హిట్ సీరియల్ గా నిలచింది. విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఈ నవల అతి త్వరలో ‘సదరన్ స్ప్రింగ్స్ పబ్లిషర్స్, తార్నాకా’ వారిచే పుస్తక రూపంలో వెలువడనుంది. ఆ పుస్తకానికి కస్తూరి మురళీకృష్ణ రాసిన ముందుమాట ఇది.]

[dropcap]వి[/dropcap]జయనగరానికి చెందిన రచయిత, ప్రచురణకర్త, మిత్రుడు ఎన్.కె. బాబు నాకు పాణ్యం దత్తశర్మను పరిచయం చేసినప్పుడు, పాణ్యం దత్తశర్మ నాకు అత్యంత సన్నిహితుడవుతారని కానీ, ‘సాఫల్యం’ నవల ‘సంచిక’లో ప్రచురితమైన నవలన్నింటిలోకీ అత్యంత పాఠకాదరణ పొంది ‘సూపర్ హిట్’ నవలగా నిలుస్తుందనీ అనుకోలేదు.

‘సాఫల్యం’ నవలను ‘సంచిక’లో సీరియల్‍గా ప్రచురించేకన్నా ముందు స్క్రిప్టు రూపంలో చదువుతున్నప్పుడే ఇదొక విశిష్టమైన రచన అన్నది స్పష్టమయింది. ఇటీవలి కాలంలో ఇలాంటి నవలలు తెలుగులో ఎవరూ రాయటం లేదు. ఉత్తమ రచయితలుగా చలామణీ అవుతున్నవారు, ఏదో ఓ వాదానికో, ఉద్యమానికో కట్టుబడి, ఆయా ఉద్యమాల, వాదాల సంస్థలకు చెందినవారి మెప్పు పొందుతూ అలాంటి ఒకే రకమయిన రచనలు చేస్తున్నారు. అణచివేతలు, అన్యాయాలు, ద్వేషాలు, ఆవేశాలు, సంప్రదాయ దూషణ, వికృత సంబంధాల సమర్థన – అలాంటి రచనలలో ప్రధానంగా కనబడే అంశాలు. ప్రజాదరణ పొందుతున్న ఆసక్తికరమైన రచనలు చేసే రచయితలు ప్రధానంగా ఆసక్తికరమైన అంశాలు కేంద్రంగా రచిస్తూ పాఠకులను ఆకర్షించే రచనలు చేస్తున్నారు. మొదటి రకమైన రచయితలకు పదిమంది పాఠకులు లేరు. సాహిత్య పెద్దలు, విమర్శకులు పదే పదే ప్రస్తావిస్తూ ఇలాంటి రచయితలకు, రచనలకు ఓ రకమైన ప్రామాణికతను ఆపాదిస్తున్నారు. కానీ పాఠకులను ఆకర్షించే రచయితలు, రచనల పట్ల వీరికి తూష్ణీంభావం. దాంతో పేరున్న రచయితలకు పాఠకులు లేక పాఠకులున్న రచయితలకు సాహిత్య పెద్దల ఆమోదం లభించని  ఒక విచిత్రమైన పరిస్థితి తెలుగు సాహిత్య జగత్తులో నెలకొంది.  ఫలితంగా సాహిత్యానికి దూరమయ్యారు. విమర్శకులు అధ్యయనం లేక, కళ్ళకు గంతలు కట్టుకుని, తమ చుట్టూ గీసుకున్న పరిధులు దాటి  చూసే ప్రయత్నాలు చేయక, తెలుగులో నవల చచ్చిపోయిందనీ, చక్కటి నవలలు రావడం లేదనీ, పదే పదే ప్రకటిస్తూ, కొన్ని ఎన్నారై సంస్థలు ప్రచురించే నవలలు మాత్రమే ఉత్తమమైనవన్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో మానవ జీవితంలోని విభిన్నమైన పోరాటాలను, సందిగ్ధాలను, వైరుధ్యాలను, తాత్త్వికతను ప్రదర్శిస్తూ ఒక వ్యక్తి – శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఎదుగుదలను – బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అత్యంత సరళంగా, హృద్యంగా అరుదైన గాఢతతో, నిజాయితీగా రచించే నవల ఓ తెలుగు రచయిత రాయటం అనూహ్యమైన విషయం. ముఖ్యంగా, రచయిత పీడితుల పక్షాన మాత్రమే ఉండాలన్న నియమం ఏర్పరిచి, అలాంటి వారే రచయితలు, వారు రాసేవే రచనలు అని శక్తివంతమైన ముఠాలు తెలుగు సాహిత్యంలో స్థిరపరుస్తున్న తరుణంలో, మానవ జీవితం, మానవ మనస్తత్వం, మానవ జీవితంలోని ఆవేదనలు, సంవేదనలు, సంఘర్షణలు కేంద్ర బిందువుగా రచనలు రావటం అరుదు నుంచి అసంభవం స్థాయికి దిగజారి అంతరించిపోయే (extinct) సమయంలో పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ నవల, తెలుగు సాహిత్య ప్రపంచంలో ‘రచన’ సజీవంగా ఉందని నిరూపిస్తుంది. ఎవరెన్ని రకాలుగా సృజనాత్మక బీజాన్ని నలిపివేసి యాంత్రిక మూస సృజనకు పట్టం కట్టాలని చూసినా సరస్వతీ స్వరూపమైన సృజనాత్మక సాహిత్యం సజీవ నదిలా పరవళ్ళు తొక్కుతూ, మలుపులు తిరుగుతూ ప్రవహిస్తూనే ఉంటుందని నిరూపిస్తుంది ‘సాఫల్యం’ నవల.

ఈ నవల సంచికలో ప్రచురితమవుతున్నంత కాలం, వెల్లువలా విరుచుకుపడ్డ పాఠకాదరణ, నీటి చుక్క కోసం తపిస్తున్న ఎడారి భూమిని తలంపుకు తెచ్చింది. ఒక చక్కని రచనను అందిస్తే, దాని ఔన్నత్యాన్ని గుర్తించి తెలుగు పాఠకులు స్వీకరిస్తారన్న సత్యాన్ని ‘సాఫల్యం’ పొందిన పాఠకాదరణ స్పష్టం చేస్తుంది. అంతేకాదు, తెలుగులో పాఠకుల సంఖ్య ‘పరిమితం’ అన్న వాదన కూడా డొల్ల అనీ, పాఠకులు చదివేట్టు చేసే రచనలు రచయితలు సృజిస్తే, చదివే పాఠకులు అత్యధిక సంఖ్యలో ఉన్నారనీ, సీరియల్‍గా ప్రచురితమవుతున్నంత కాలం, పాఠకుల నుంచి లభించిన స్పందన నిరూపిస్తే, సీరియల్ పూర్తయిన తరువాత ‘మొత్తం పుస్తకంగా ఎప్పుడొస్తుందని’  పాఠకులు పదే పదే ప్రశ్నిస్తుండటం తెలుగులో పుస్తకాలు కొని చదివే వారి సంఖ్యనూ అధికమే అని స్పష్టం చేస్తుంది. తను ఖర్చు పెట్టే ప్రతి పైసకు విలువ కట్టే తెలుగు పాఠకుడికి, తాను చెల్లించే మూల్యం కన్నా అధిక మొత్తంలో అతి విలువైన పఠనానుభవాన్ని అందిస్తుంది ‘సాఫల్యం’ నవల.

‘సాఫల్యం’ నవలను మెచ్చటంలో వస్తువు అడ్డు రాలేదు పాఠకుడికి. అణచివేతలు, అన్యాయాలు, ఆవేశాలు లేవీ నవలలో. నవలను పాఠకులు ఆదరించటంలో నవల నిడివి ప్రతిబంధకం కాలేదు. నవలలో ఉత్తేజం కలిగించే అంశాలు, ఉద్రేకం కలిగించే అంశాలు ఏవీ లేకున్నా ఆసక్తిగా చదవటంలో ఎలాంటి లోటూ రాలేదు. ఇందుకు ప్రధాన కారణం ‘సాఫల్యం’ కథానాయకుడు ‘పతంజలి’ పాత్ర ఆరంభంలోనే పాఠకుల హృదయాలను ఆకర్షించటం. ఒక్కసారి ప్రధాన పాత్ర పాఠకులను ఆకర్షించిందంటే, వారి  నిత్య జీవితంలో అతడు భాగమవటం స్వాభావికంగా జరిగే ప్రక్రియ. ఆపై పతంజలి ఎదుగుదలను, సమస్యలను, సంఘర్షణలను, విజయాలను అన్నిటినీ పాఠకుడు తనవిగా అనుభవిస్తాడు. రచనతో మమేకం చెందుతాడు. ‘సాఫల్యం’ విషయంలో అదే జరిగింది.

1964లో ఎనిమిదేళ్ల పతంజలి, ఆలంపురం క్షేత్రంలో తుంగభద్ర నదిలో సంధ్య వార్చటంతో ఆరంభమయిన ‘సాఫల్యం’ నవల, అనేకానేక మలుపులు తిరిగి, గాణుగాపురంలో దత్తాత్రేయ స్వామి పవిత్ర క్షేత్రంలో, పతంజలి – జీవితానికి అర్థం ఏమిటన్నది గ్రహించటంతో ముగుస్తుంది. ఓ వైపు గత 50 ఏళ్ళలో సమాజంలో, సామాజిక మనస్తత్వంతో, సాంఘికంగా, ధార్మికంగా, సాంస్కృతికంగా వచ్చిన మార్పులను ప్రదర్శిస్తూ, మరో వైపు ప్రవహించే నది ఎలా ప్రతిబంధకం ఎదురైనప్పుదు వంగి, మలుపు తిరిగి ప్రవహిస్తుందో, అలా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తన ఆలోచనా సరళిని, జీవన విధానాన్ని మార్చుకుంటున్నా మౌలిక లక్షణాన్ని కొనసాగిస్తూ పతంజలి సాగించిన జీవన ప్రయాణన్ని అత్యద్భుతంగా చిత్రిస్తుంది ‘సాఫల్యం’ నవల.

ముఖ్యంగా, ఆరంభంలో ఆచార వ్యవహారాలు పాటిస్తూ, వ్యవసాయం చేస్తూ, సాంప్రదాయ విద్య నేర్చుకుంటూ, ఉత్తమ విలువలను ఉగ్గుపాలతో నేర్చుకున్న పతంజలి; అంచెలంచెలుగా వ్యవసాయానికి దూరమవటం, తను పుట్టిన ఊరికి దూరమవటం, తండ్రి వద్ద నేర్చిన విద్య కాక, లౌకిక విద్య నేర్చుకుని జీవిక సాగించటం వంటివి చదువుతుంటే, సామాజిక పరిణామ క్రమం, మన సమాజం రూపాంతరం చెందిన విధానం, వ్యక్తుల జీవితాలపై ఈ మార్పులు చూపిన ప్రభావాలు బోధపడటమే కాదు, ప్రతి వ్యక్తినీ తనలోకి తాను చూసుకునేట్టు చేస్తాయి. పతంజలి జీవితానికి సమాంతరంగా తన జీవితాన్ని నిలిపి పోల్చుకుని, విశ్లేషించేట్టు చేస్తాయి. పతంజలి పాత్రతో మమేకమై, సహానుభూతిని పొందేట్టు చేస్తాయి. ఇదీ ‘సాఫల్యం’ రచనలో పాణ్యం దత్తశర్మ సాధించిన విజయం. ‘సాఫల్యం’ నవల సఫలమైన నవలగా నిలవటానికి ప్రధాన కారణం.

ఈ నవలలో భాగంగా పాణ్యం దత్తశర్మ వర్ణించిన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఉద్యోగ విషయాలు, వ్యవసాయ పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులలో వ్యవసాయం వదిలి ఇతర కార్యకలాపాలపైవు మళ్ళాల్సి వచ్చిందో వివరణలు, మానవ సంబంధాలు, మానవ సంబంధాలలోని ఆరోగ్యకరమైన అనుబంధాలు, ఉత్తమ వ్యక్తిత్వాలు.. ఇలా అనేకానేక మణులు, మాణిక్యాలు, రత్నాలు పొదిగిన ఒక అందమైన నవలను తెలుగు సాహిత్య ప్రపంచానికి అందించారు పాణ్యం దత్తశర్మ.

అయితే, ఇలాంటి వ్యక్తి జీవితాన్ని కేంద్ర బిందువుగా రచించిన రచనల విషయంలో పాఠకులు అభిప్రాయాన్ని ఏర్పచుకునే విధంగానే ‘సాఫల్యం’ నవలలో ప్రధాన పాత్రధారి ‘పతంజలి’, రచయితకు ‘కాల్పనిక రూపం’గా భావించారు. ఒక దశలో పాణ్యం దత్తశర్మను ‘పతంజలి’ గా సంబోధించారు కూడా! గమనిస్తే, ప్రపంచ సాహిత్యంలో విశిష్టమైన స్థానాన్ని పొంది ‘క్లాసిక్’లుగా గుర్తింపు పొందిన రచనలలో అధిక భాగం రచయితల స్వీయ జీవితానుభవాల ఆధారంగా సృజించిన రచనలే. చార్లెస్ డికెన్స్ నవల ‘డేవిడ్ కాపర్ ఫీల్డ్’ ,  జేమ్స్ జాయిస్ నవల ‘పోర్ట్రయిట్ ఆఫ్ ఏన్ ఆర్టిస్ట్ యాజ్ ఎ యంగ్ మేన్’; డి. హెచ్. లారెన్స్ నవల ‘సన్స్ అండ్ లవర్స్’;  సోమర్‍సెట్ మామ్ రచన ‘ఆఫ్ హ్యూమన్ బాండేజ్’; ఎర్నెస్ట్ హెమింగ్వే నవలలు, తల్‌స్థాయ్, దస్తయెవ్‌స్కీ, మక్సిమ్ గోర్కీ, నట్ హామ్సన్, బాల్జాక్, మపాసా తో సహా పేరు పొందిన రచయితల ప్రఖ్యాతి పొందిన రచనలు ప్రధానంగా స్వీయ జీవితం ఆధారితమైన ఆత్మకథాత్మక కాల్పనిక రచనలే. తెలుగులో విశ్వనాథ వారి ‘వేయి పడగలు’లో పలు పాత్రలను గుర్తించటమే కాదు, ధర్మారావు పాత్ర విశ్వనాథ వారే అని వాదించే వారున్నారు. దీన్ని బట్టి తెలిసేదేమిటంటే, తన అనుభవాలను ఆధారం చేసుకొని దాని చుట్టూ కాల్పనిక రంగులద్ది, సృజనాత్మక సరస్సులో స్నానమాడించి – వెలువరించిన రచనలు అమితమైన పాఠకాదరణ పొందటమే కాదు ‘క్లాసిక్’ స్థాయిని పొందుతాయనీ.  ‘సాఫల్యం’ కూడా ఈ కేటగిరీకి చెందిన నవల అనటంలో సందేహం లేదు. ‘పతంజలి’లో పాణ్యం దత్తశర్మను పాఠకులు చూడడం, రచయితగా తాను సృజించిన కాల్పనిక ప్రపంచం పాఠకులను  నిజ జీవితంగా భ్రమించి, నమ్మే రీతిలో సృజించటం పాణ్యం దత్తశర్మకు రచయితగా విజయం. ఆయన సృజనాత్మక ప్రతిభకు తిరుగులేని నిదర్శనం. ‘సాఫల్యం’ నవల చివరలో ఒక వ్యక్తి మరొకరికి అన్యాయం చేయకుండా కొడుకుగా, తండ్రిగా, భర్తగా, ఉద్యోగిగా, పౌరుడిగా తన కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వహించటం, బాధ్యతగా జీవించటం వ్యక్తి జీవితం ‘సఫలం’ అయేందుకు నిదర్శనమని నిరూపించారు పాణ్యం దత్తశర్మ. ఆయన సమర్థవంతంగా, నిజాయితీగా, చిత్తశుద్ధితో సృజించిన బాధ్యతల జాబితాలలో మరొకటి చేరుతుంది. సృజనాత్మక రచయితగా తన బాధ్యతను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తూ రచయితగా కూడా తన రచనా జీవితాన్ని సాఫల్యం చేసుకుంటున్నారనవచ్చు. ముఖ్యంగా, తన రచనలో ద్వేషం, ఆవేశం లేకుండా, సమాజంలో విషం చిలికించకుండా, స్నేహమూ, సౌభ్రాతృత్వ భావనలు, ప్రేమ భావనలను ప్రదర్శిస్తూ రచించిన అత్యంత ఆరోగ్యవంతమూ, ఔచితీవంతమూ, ఉన్నతమూ అయిన ‘సాఫల్యం’ నవల ద్వారా పాణ్యం దత్తశర్మ తన బాధ్యతను సంపూర్ణంగా నిర్వహించారు. ఒక ఉత్తమ రచనను పాఠకులకు చేరువ చేసే బాధ్యతను సాహిత్య వేదిక ‘సంచిక’ సమర్థవంతంగా నిర్వహించింది. ఇప్పుడీ  నవలను చదివి, పదిమందిచే చదివించి, ఉత్తమ రచనను తెలుగు పాఠకులు ఆచరించటమే కాదు, భవిష్యత్తు తరాలకు సజీవంగా అందిస్తారని నిరూపించాల్సిన బాధ్యత తెలుగు పాఠకులపై ఉంది. రచయిత తమపై ఉంచిన విశ్వాసాన్ని పాఠకులు వమ్ము చేయరని ఆశిస్తూ..

‘సాఫల్యం’ చదవండి. ఆలోచించండి. ఇతరులతో చదివించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here