సాఫల్యం-14

6
8

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]“ఈ [/dropcap]ప్రాస్పెక్టస్‌, అప్లికేషన్‌ తీసుకొని వెళ్లు. అన్నీ నింపి ఒరిజనల్స్‌ జతపరచి, ఫోటోలు అతికించి, అటెస్టేషన్‌ చేయించి, హైదరాబాదుకు రిజిస్టర్‌ పోస్టులో పంపు. మరి ఏం సబ్జెక్ట్స్‌ తీసుకుందామని?”

కాంబినేషన్స్‌ చూశారు. సెకండ్‌ లాంగ్వేజ్‌ సంస్కృతం ఉంది. “మా నాన్నగారే చెబుతారది” అన్నాడు గర్వంగా. గ్రూప్స్‌లో ఒక కాంబినేషన్‌ ఆకర్షించింది. ఎకనమిక్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఇంగ్లీష్‌ లిటరేచర్‌.

“దాన్ని Advanced English అంటారు. చాలా కష్టం అది చదివితే, బి.ఎ (Litt‌) అని రాసుకోవచ్చు” అన్నాడు సాగర్‌.

“చదువుతాను బావా! ఇంగ్లీషంటే నాకు ప్రాణం!” అన్నాడు పతంజలి ధృడంగా.

“గుడ్‌. ఆల్‌ దిబెస్ట్‌” అన్నాడు సాగర్‌. “అప్లికేషన్‌ పంపిన తర్వాత హైదరాబాదుకు వెళ్లి పుస్తకాలు తెచ్చుకో అన్నింటికి గైడ్లు దొరుకుతాయి హాయిగా”.

“వద్దు బావా! గైడ్లు చదవడం నాకు యిష్టం ఉండదు. నేనే స్వయంగా నోట్సు ప్రిపేర్‌ చేసుకుంటా” అన్నాడు.

 “అసాధ్యుడిలాగున్నావే!” అన్నాడు సాగర్‌.

“సరేమరి జాగ్రత్తగా వెళ్లు. నాకు ప్రాక్టికల్స్‌కు టైమయింది” అన్ని వెళ్లిపోయాడు.

పతంజలి మనసు పరవళ్లు తొక్కుతూంది. గద్వాల బస్టాండుకు వెళ్ళి కర్నూలు బస్సెక్కి అక్కడ నుండి ప్యాపిలి పాల బస్సులో వెల్దుర్తి చేరుకున్నాడు.

***

1977

రోజులు గడుస్తున్నాయి. వ్యవసాయం పరిస్థితి “నానాటికి తీసికట్టు నాగం భొట్లూ” అన్నట్లుగా ఉంది. వారానికి రెండుసార్లు కర్నూలు మార్కెటుకు రెండు బస్తాలు నిమ్మకాయలు తీసుకొని వెళితే వంద రూపాయలు కూడ రావడం లేదు. హైదరాబాదుకు వెళ్లి బి.ఎ. పుస్తకాలు తెచ్చుకుని, ఫీజు కట్టివద్దామంటే కనీస వెయ్యి రూపాయలు కావాలి. ఇంటి పరిస్థితి చూస్తూ చూస్తూ తండ్రినెలా డబ్బు అడగాలో అర్థం కావడం లేదు.

అప్పటికే సంక్రాంతి దాటి ఫిబ్రవరి వస్తూంది. ఏదో ఒక విధంగా సొంతంగా డబ్బు సంపాదిస్తే, కనీసం తన చదువుకన్నా వస్తుంది. బ్యాంకు అప్పు, శెట్టి అప్పు అలాగే ఉండిపోయాయి. ఇంచుమించు పద్దెనిమిది వేలుండవచ్చు, తండ్రి పెద్దగా కళవళపడుతున్నట్లనిపించడు. ఆయనలోని వేదాంత దృక్పథం దానికి కారణమేమో! చెరువులోని నీటి మట్టం తగ్గిపోయి, వరిమడికి నీరందడం లేదు. ఈసారి తిండిగింజలు వస్తాయో రావో!

మిరపపంట తర్వాత, రాబోయేది వేసవి కాబట్టి కూరగాయలు పండిస్తే బాగుంటుందనుకున్నారు. భూమి దుక్కి చేసి గుంటకతోలి, బోదెలు కట్టి, నీరు పెట్టారు. ఆ ముందు రోజు ‘లద్దగిరి’కి వెళ్లి వంగనారు, టమేటనారు తెచ్చాడు పతంజలి. మంచి పదనులోనే నారునాటారు.

ఒకరోజు లైబ్రరీకి వెళ్లాడు. లైబ్రేరియన్‌ ఎల్లయ్య పతంజలికి పరిచయస్తుడే. రోజూ కర్నూలు నుండి వచ్చిపోతాడు. పతంజలిని చూసి “ఏం స్వామీ, బాగుండావా! ఈ మద్దె రావడం లేదు!” అని పలుకరించాడు. నిజమే. ఈ మధ్య లైబ్రరీకి రావడం లేదు. సాహిత్య పఠనం వెనుకపడింది. “అవును కుదరటం లేదు” అన్నాడు.

“నీవేమిటి తొందరగా వచ్చినావీరోజు” అంటే

“తిరగల్యాక సంసారం వెల్దుర్తికి మార్చిపారేసినా. ఈడనే మసీదుకాడ యిల్లు తీసుకున్యా. ఆయిగా ఉండాది తీ పానానికి” అన్నాడు.

కాసేపు ‘ది హిందూ’ చదివాడు. ఎల్లయ్యనడిగి కొమ్మూరి వేణుగోపాలరావుది “వ్యక్తిత్వం లేని మనిషి” నవల తీసుకున్నాడు. వెళ్లొస్తానని చెప్పి వస్తూంటే ఎల్లయ్య పిలిచాడు.

“స్వామీ, నాకు ఇద్దరు పిల్లలుండారు పెద్దది ఎనిమిది, కొడుకు ఆరు. మన హైస్కూల్లోనే జేర్చినాలే. వాండ్లకు టూసన్‌ చెప్పనీకె నీకు తెలిసినసార్లెవరయినా ఉంటే సూడు” అన్నాడు.

పతంజలి మెదడులోకి అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. “ఎవరో ఎందుకు, నేనే చెబుతే నీకేమయినా అభ్యంతరమా?” అని అడిగాడు “అయ్యో స్వామీ! అంతకంటేనా! ఎప్పట్నుంచి పంపమంటారు?”

“ఎల్లుండి త్రయోదశి, శనివారం. మంచిరోజు ఆరోజు నుండి మొదలుపెడదాం”

 “అయితే ఫీజు మాత్రం తీసుకోవాల. కాదనగూడ్దు” అన్నాడు ఎల్లయ్య. “సరేలే” అన్నాడు పతంజలి నవ్వి.

శనివారం ఉదయం ఆరున్నర గంటలకే పిల్లలిద్దర్నీ తీసుకొని వచ్చాడు ఎల్లయ్య. దీనిపేరు నాగరత్నమ్మ. వీని పేరు సేకర్‌. అని చెప్పాడు. పడసాలలో కూర్చోబెట్టాడు వీళ్లను. తండ్రి ఏం మాట్లాడలేదు.

ఇంగ్లీషు పుస్తకంలో పాఠం చెప్పి కఠిన పదాలకు అర్థాలు భాషా భాగాలు నేర్పించాడు. శంకరయ్యసారు లాగా! లెక్కలు చేయించాడు. వాళ్లతో పాటు క్రిందే కూర్చున్నాడు. ఎనిమిదిగంటలకల్లా ముగించాడు. మళ్లీ సాయంత్రం 6 గంటలకు రమ్మన్నాడు.

వంగ, టమోటా మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. తోటకు వెళ్లి చూసి, కలుపు తీయించాలని నిశ్చయించుకున్నాడు. తోకోని పెండ్లాన్ని సుంకన్న పెండ్లాన్ని, మరో ఇద్దరు కూలీలసు తీసుకురమ్మని చెప్పాడు. గడ్డి వాము తగ్గిపోతూంది. ఎద్దులకు మేత చాలదు. వేరుశనగ పొట్టు ఒక వరుస, వరిగడ్డి ఒక వరుసగా పేరుస్తూ ప్రతి సంవత్సరం వామి వేస్తారు పిరమిడ్‌ ఆకారంలో. దాన్ని వేయడం ఒక పనితనం. ఎంత వర్షం పడినా వాములోకి చుక్క దిగదు. దాంట్లో కూడ పతంజలి నేర్పు గడించాడు.

మేత విషయం తండ్రికి చెబితే, “రెండ్రోజుల్లో బొమ్మిరెడ్డి పల్లె, అల్లుగుండు, మల్లేపల్లె, అంకుదాడు, మదారుపురం పోయివస్తా లేనాయనా, బండికట్టించుకొని, ఊరికి ఒక బండి మేత అయినా, ఐదారు బండ్లవుతాయి. రెడ్లు మనమడిగితే కాదనరు” అన్నాడు.

ప్రతి ఊర్లో రెడ్లు తమ వాముల్లోంచి, తలాకొంత తీసి, స్వామి బండి నింపుతారు. వచ్చేటపుడు మాత్రం స్వామికి ఎవరయినా బండి కట్టించి పంపుతారు.

సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంకా ఆరవలేదు. సుమారు ఏడెనిమిది మంచి పిల్లలు పుస్తకాలు పెట్టుకొని కూర్చున్నారు. పతంజలి పంచె, భుజం మీద టవలు, టైరు చెప్పులు చూచి, వాళ్లు ‘ఎవరోలే’ అనుకున్నారు కాని ఎల్లయ్య పిల్లలు లేచి, “గుడ్‌మార్నింగ్‌ సార్‌” అని రాగయుక్తంగా చెప్పారు. అప్పుడర్థమయింది మిగతావారికి ఈనే మన ట్యూషన్‌ సారని. వాళ్ళు లేచి అదే పాటపాడారు.

పతంజలి వాళ్లను కూర్చోమని చెప్పి, లోపలికి వెళ్లి, చేతులు కాళ్లు కడుక్కొని, కాఫీ తాగి బయటకు వచ్చాడు. పిల్లలకెదురుగా కూర్చున్నాడు.

“డియర్‌ స్టూడెంట్స్‌!” అవి వాళ్లను సంబోధించాడు. “సాయంత్రం గుడ్‌ ఈవెనింగ్‌ చెప్పాలి. పొద్దునేమో గుడ్‌ మార్నింగ్‌, మధ్యాహ్నం గుడ్‌ ఆఫ్టర్‌ నూన్‌. రాత్రి యింటికి వెళ్లేటపుడు గుడ్‌నైట్‌ సరేనా?” అని చెప్పాడు.

“సరే సార్‌” అన్నారు వాళ్లు.

ఒకడు లేచి, “సార్‌, సార్‌, ఒకవేళ రాత్రి 9 గంటలకు కనబడినోళ్లకు?” అనడిగాడు.

“అప్పుడు గుడీవినింగే! రాత్రి విడిపోయేటపుడే గుడ్‌నైట్‌” అన్నాడు పతంజలి.

ఒకమ్మాయి చెప్పింది “సార్‌ మరి మాసారేమని జెప్పినాడంటే మనం మొదటిసారి కల్సినప్పుడు ఏయాలయినా సరే గుడ్మార్నింగు చెప్పాలంట” అన్నది.

“అదిసరికాదు. నేను చెప్పిందే కరెక్టు. మిట్ట మధ్యాహ్నం ఎవర్నయినా చూసినపుడు ‘గుడ్‌మార్నింగ్‌’ చెబితే ఏంబాగుంటుంది? ‘గుడ్‌ డే’ అని కూడ ఉంది. తక్కువగా వాడతారు దానిని.” అని వివరించాడు పిల్లలకు. కొందరికి ప్రశ్నలు జవాబులు నేర్చుకుని ఒప్ప చెప్పమన్నాడు.

ఏడెనిమిది క్లాసుల వాళ్లకు ఇంగ్లీషులో ప్రశ్నలకు జవాబులు టెక్ట్స్‌బుక్కులోనే ‘మార్క్‌’ చేసి నోట్సులో వ్రాయిస్తున్నట్లు అర్థమయింది. వాక్యాలు సింపుల్‌గా, చిన్నవిగా ఉండేలా తానే జవాబులు తయారు చేసి యిచ్చాడు. ప్రతి ఒక్కరూ రోజూ కనీసం ఐదు కొత్త పదాలు స్పెల్లింగులతో సహా నేర్చుకుని రావాలని చెప్పాడు.

ట్యూషన్‌ ఫీజు నెలకు ఐదు రూపాయలు. తొమ్మిది పది తరగతులకు మాత్రం ఏడు రూపాయలు నిర్ణయించాడు. పడసాల చాలడంలేదు. దాదాపు నలభై మందయ్యారు. రెండో నెలలో పట్టు పురుగుల షెడ్‌ శుభ్రం చేయించి, పిల్లలు కూర్చోడానికి ఈతచాపలు కొన్నాడు. గోడకు నున్నగా సిమెంట్‌ ప్లాస్టరింగ్‌ చేయించి దానిమీద బ్లాక్‌ బోర్డు పెయింట్‌ దట్టంగా, డబుల్‌ కోటింగ్‌ వేయించాడు.

పిల్లల్లో ఒకరి తండ్రి టైలర్‌. పాతగుడ్డలతో నీట్‌గా కుట్టి రెండు ‘డస్టర్‌’లు చేయించుకొచ్చాడు వాడు. చెప్పులు షెడ్‌ బయటే వదలాలి. యూరినల్స్ కు ఆడపిల్లలనొకసారి మగ పిల్లలనొకసారి వదిలేవాడు ఎరువు దిబ్బల దగ్గరకు.

మొదటి నెలలో ఆదివారం సెలవిచ్చాడు. రెండో నెలలో ఆదివారం కూడ ఒక్కపూట ఉదయం పిల్లలందరికీ ఇంగ్లీష్‌ గ్రామర్‌ నేర్పసాగాడు. దానివల్ల చాలా పేరొచ్చింది. టెన్స్‌లు, ఆర్టికల్స్‌, ప్రిపోజిషన్స్‌, డిగ్రీస్‌, వాయిస్‌, ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్‌, ఇవన్నీ టెక్స్ట్ తో సంబంధం లేకుండా నేర్పేవాడు.

‘రెన్‌ అండ్‌ మార్టిన్‌’ గ్రామరు పుస్తకం రివైజ్‌డ్‌ ఎడిషన్‌ తెప్పించాడు.

రెండు నెలల్లో ఆర్థిక స్థితి మెరుగుపడింది. రెండు వందలకు పైగా ఆదాయం రాసాగింది. పిల్లలు తమ చేలల్లో పండిన మటిక్కాయలు, (గోరు చిక్కుడును కర్నూలు జిల్లాలో అలా పిలుస్తారు), బుడ్డలు (వేరుశనగకాయలు), జున్ను, ఆకుకూరలు తెచ్చివ్వసాగారు.

పిల్లలకు మంచినీటి కోసం షెడ్‌ మూలన చుట్ట కుదురు మీద ఒక కుండ, మూత, గ్లాసు ఏర్పాటు చేశారు.

ఒకరోజు రాధాసారు కనబడ్డారు. నమస్కారం చేసి “బాగున్నారా సార్‌!” పలుకరించాడు పతంజలి.

“నాకేమైంది, బ్రెమ్మాండంగుండ్ల్యా” అన్నాడాయన.

 “ఏందిసామీ కత. ట్యూషన్లు చెప్పుతుండావంట. నీ పేరు మోగిపోతుండాదిలే” అన్నాడు. “సదువెంతవరకొచ్చినాది” అని అడిగాడాయన.

“డిగ్రీకి ప్రయివేటుగా కట్టాలని ఉంది సార్‌. ఉస్మానియాలో వన్‌ సిట్టింగ్‌ ఉంది. అని తెలుసుకున్నాను. ఈ నవంబరులోనే పరీక్షలు! ఈ ఏప్రిల్‌లోగా నోటిఫికేషన్‌ వస్తుందట. కానీ…” అని ఆగి తలవంచుకున్నాడు. రాధాసారుకు అర్థమయింది.

“రాత్రి ఇంటికాడికిరా. మాట్టాడేపనుండాది” అని వెళ్లిపోయాడాయన.

రాత్రి ట్యూషన్‌ పిల్లలను వదిలేసి, వాళ్లింటికి వెళ్లాడు పతంజలి. స్టేట్‌ బ్యాంక్‌ వీధిలో ఉంది. ఆయన పతంజలి కోసం ఎదురు చూస్తున్నాడు. ముందుగదిలో కుర్చీలో కూర్చోబెట్టాడు.

రాధాసారు భార్య రెండు గ్లాసులతో నిమ్మకాయ షర్బత్‌ తెచ్చిచ్చి పతంజలిని చూసి పలకరింపుగా నవ్వింది.

“నేం జెప్పిండ్ల్యా. ఈ పిల్లోడే. మా తెలివైనోడులే. గాచారం బాగలేక ఈ వూళ్లో ఉండిపోయినాడు. చదివించేటోల్లుంటే, ఐ.ఎ.ఎస్‌.కైనా పోతాడు.” పతంజలికి శంకరయ్యసారు కూడ ఇదే మాట అన్నట్లు గుర్తుకు వచ్చింది.

“ఏదో సారు అభిమానమమ్మా” అన్నాడు ఆమె వైపు చూచి.

“నాకంతా నాకు తెలుసులే స్వామీ” అన్నాదామె. లోపలికి వెళ్లిపోయింది.

“పుస్తకాలకు, ఫీజులకు, ఛార్జీలు, ఖర్చులు అన్నీ కలిపి ఎంతవుతాది. బి.ఎ. పూర్తిచెయ్యనీకె” అని సూటిగా విషయంలోకి వచ్చాడు రాధాసారు.

పతంజలికర్థమయింది. ఆయన తనకు ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నాడని. అతని ముఖం ప్రఫుల్లమయింది.

“ప్రస్తుతానికి ఒక వెయ్యి రూపాయలయితే సరిపోతుంది సార్‌. పరీక్షలపుడు కావాలంటే చూసుకోవచ్చు” అన్నాడు.

“సరే వెయ్యి కాదు పదిహేను వందలు నేనిస్తా. బుక్కులు తెచ్చుకో, ఫీజు కట్టు. ఎట్టబోయి ఎట్లోస్తాదో ఐదువందలు బ్యాంకులో వేసుకో, పరీక్షలప్పుడు తడుముకోకుండా వుంటాది. నీవంటి తెలివైనోళ్లకు సాయంచేస్తే నా పిల్లలకూ మంచి జరుగుతాది మల్లా నా డబ్బులు నీ బుద్ధి పుట్టినప్పుడియ్యి. ఏం తొందర లేదు” అన్నాడాయన.

ఆయన ఔదర్యానికి, సౌజన్యానికి పాదాభివందనం చేయాలనిపించింది పతంజలికి. అలా చేస్తే మీరు బ్రాహ్మలు మాకు మొక్కకూడదంటాడు తప్పకుండా. లేచి నిలబడి ఆయన చేతులు రెండూ తీసుకొని కళ్లకానించుకున్నాడు. కళ్లు చెమ్మగిల్లాయి. గొంతు గద్గదమవుతుండగా అన్నాడు. “మీ మేలు ఈ జన్మలో మరచిపోలేను”

రాధాసారు పతంజలిని దగ్గరకు తీసుకున్నాడు. “ఛాఛా, మొగోడు ఏడుస్తే సూడనీకె బాగుండదు. నీకెందుకు నేనున్నానీకు. బాగా చదువుకో. ఈ వెల్దుర్తి నుండి బయటపడు. నీకు చానా భవిష్యత్తుంది” అన్నాడు.

“నేను నెలకు వందరూపాయల చొప్పున మీకు యిచ్చుకుంటూ వస్తా” అన్నాడు పతంజలి. “ఈ విషయం మా నాన్నగారికి కూడ చెప్పాలి.”

“ఆ పిచ్చిబ్రాహ్మడేమయినా అంటే నాకు జెప్పు. నేనొచ్చి మాట్టాడతా”

“ఆయనైనా ఏం జేస్తాడు పాపం. మా కుటుంబ పరిస్థితులలాంటివి”

“ఓ యబ్బో! నాయన మీద ఈగవాలనిచ్చేట్టులేవే, సామీ!” అన్నాడు రాధాసారు నవ్వుతూ. తర్వాత తన గురించి చెప్పాడు.

“మాదీ రైతుకుటుంబమే. చిత్తూరు జిల్లా నగరి దగ్గర మావూరు. మెడిసిన్‌ చేయాలని నా కోరిక. ఇంటర్లో బైపిసి దీసినా నా మార్కులకు మెడిసిన్‌ సీటు రాల్యా. ఏ మణిపాలో, బెంగుళూరో పోయి ప్రయివేటు కాలేజీలో జేరడానికి మా నాయన కాడ అంత డబ్బు లేకపాయె. సరే తీయ్‌ అని ఎ.జి బియస్సీ జేస్తి. ఇదో ఇట్లా ఈ ఉద్యోగం వచ్చే” అన్నాడు.

ఆయన వద్ద సెలవు తీసుకొని యింటికి వచ్చాడు పతంజలి. భోజనం చేశాడు. తండ్రి ఆరు బయట నులకమంచం వేసుకొని పడుకున్నాడు. వెళ్లి కాళ్లవైపున కూర్చుని కాళ్లు నొక్కుతూ విషయమంతా వివరించాడు. కాసేపు ఆయన మౌనంగా ఉండి చివరకు ఇలా అన్నాడు.

“సరే నాయనా… విధి నిర్ణయం అనుల్లంఘనీయం”

తండ్రి మనసు లోతుల్లో ఇష్టం లేదని గ్రహించాడు పతంజలి. తనకు చేదోడు వాదోడుగా ఈ వయసులో ఉండకుండా కొడుకు చదువుకొని రెక్కలొచ్చి ఎగిరిపోతాడేమోనని ఆయన భయం.

“అన్నట్లు డిగ్రీలో కూడ సెకండ్‌ లాంగ్వేజ్‌ సంస్కృతమే నాన్నా” అన్నాడు తండ్రిని ప్రసన్నుడి చేసుకోవడానికి. “నీవు చెబుతావు కాబట్టి అదే తీసుకుందామనుకుంటున్నాను”.

“కానీ, అంతా దైవేచ్ఛ” అన్నాడాయన పతంజలి భుజంమీద చేయి వేసి గట్టిగా పట్టుకొని. ఆయన చేతిమీద తన చేతిని వేసి తండ్రివైపు చూస్తూ చెప్పాడు పతంజలి.

“ఎప్పుడూ మీ పెద్ద కొడుకుగా నా బాధ్యతలు విస్మరించను, నాన్నా” తండ్రి మోమున ఒక ప్రశాంతత గోచరించింది పతంజలికి.

***

రెండు రోజుల తర్వాత మంచిరోజు చూసుకొని హైదరాబాదుకు బయలుదేరాడు పతంజలి. ముందురోజే రాధాసారు దగ్గర డబ్బు తెచ్చుకున్నాడు. ఎనిమిది వందలు ఉంచుకొని ఏడువందలు బ్యాంకులో వేసుకున్నాడు తండ్రి అకౌంట్‌లో. ట్యూషన్‌ పిల్లలిచ్చిన డబ్బుల్లో ఒక వంద తీసుకున్నాడు.

ఆరోజు ఉదయం పదిన్నరకు భోజనం చేసి అమ్మ కట్టిచ్చిన ‘తపేలాంట్లు’ పొట్లం కట్టుకొని, ఒక జత బట్టలు, టవలు, బ్రష్‌, సోపు, అన్నీ ఒక సంచిలో సర్దుకున్నాడు. సంచిలో ‘వ్యక్తిత్వంలేని మనిషి’ని కూడ పెట్టుకున్నాడు. తల్లిదండ్రులకు కాళ్లకు నమస్కరించి బయలుదేరాడు.

సరిగ్గా 12 గంటలకు ద్రోణాచలం. కాచిగూడ ప్యాసెంజరు వచ్చి వెల్దుర్తి స్టేషనులో ఆగింది. అంత రష్‌ లేదు. కర్నూల్లో నిండిపోతుందా ట్రయిను. ఎక్కి కూర్చున్నాడు. ఊరు దాటిన వెంటనే వంక (వాగు), దానిమీద బ్రిడ్జి, దాన్ని దాటుతూనే ఎల్లమ్మ తల్లి గుడి. రైలు పట్టాలకు రెండు వందల గజాల దూరంలోనే తమతోట. గుడి దాటింతర్వాత తలుపువద్దకు వచ్చి నిలబడ్డాడు.

తోకోడు, సుంకన్న తోట బయట “పలగాడి” (ఎద్దులబండ్లు పోవడానికి రావటానికీ వీలుగా ఉండే వెడల్పుగా ఉండే ద్వారం) దగ్గర నిలబడి ఉన్నారు. పతంజలిని చూస్తూనే చేతులూపుతూ కేకలు పెట్టారు. తను ఈ రోజు ఈ రైల్లో హైదరాబాదు వెళుతున్నట్లు వాళ్లకు ముందే చెప్పాడు. షర్టు భుజంమీద టవలు చూపిస్తూ ఏదో అరుస్తున్నారు. పతంజలికర్థమయింది.

వెళ్లి లోపల కూర్చున్నాడు. తామిద్దరికీ రెండు షర్టు గుడ్డలు లుంగీలు, భుజాన వేసుకునే టర్కీ టవళ్లు తెమ్మనీ, రాబోయే ఉగాది పండక్కు వేసుకుంటామనీ, వాటికయ్యే ఖర్చు తమ కూలీ డబ్బులలో పట్టుకోమనీ చెప్పారు. వారి సైగలకర్థం అదే.

రైలు కర్నూలు చేరుకుంది. విపరీతంగా జనం ఎక్కారు. మళ్లీ బయలుదేరింది. సంచీలోంచి ‘వ్యక్తిత్వం లేని మనిషి’ బయటకు తీసి చదవడం ప్రారంభించాడు. కొన్ని నిమిషాలలోనే దాంట్లో లీనమయ్యాడు. కొమ్మూరి వృత్తి రీత్యా డాక్టరు. కాని రచయితగా లబ్ద ప్రతిష్ఠుడు. ఆయన రాసిన “హౌస్‌ సర్జన్‌”, “పెంకుటిల్లు” చదివాడు. మధ్య తరగతి వాళ్ల అంతరంగాలను ఆవిష్కరించడంలో ఆయన అందె వేసిన చేయి. కాని ‘వ్యక్తిత్వం లేని మనిషి’ ఒక సైకలాజికల్‌ నవల. తనకంటూ సొంత అభిప్రాయాలు, వాటిని ధైర్యంగా వ్యక్తం చేయలేని అశక్తత, అంతులేని మొహమాటం, ఒక మనిషి జీవితాన్ని ఎంత దుఃఖ భాజనం చేస్తాయో వర్ణించాడు కొమ్మూరి. పుస్తకంలో కధానాయకుడు మంగలిషాపులో కూడ తనకు క్రాపు ఎలా చేయాలో చెప్పాటానికి సంకోచించేంత మొహమాటి.

పతంజలికి ఒక మాట గుర్తొచ్చింది. “స్వభావోదురతిక్రమః” అన్నాడు కదా! ఎవరి స్వభావమైనా నిశ్చితంగా ఉంటుంది. దాన్ని అధిగమించటం అసాధ్యం అని కదా దానర్థం. అలాంటపుడు కధానాయకుడు అలా ఉండటంలో తప్పేమి?” అనిపించింది.

కాని కొమ్మూరి అభిప్రాయం, నవల చదివే కొద్దీ విశదమయింది. స్వభావం ఎంత దురతిక్రమమైనా, చదువు, చుట్టుపక్కల పరిస్థితులు, స్నేహితులు వీరందరి భ్రావంతో మన స్వభావంలోని లోపాలను అధిగమించాలని ఆయన చెప్పదల్చుకున్నాడు.

పతంజలికి ఇంకో కొమ్మూరి గుర్తొచ్చాడు. ఆయనే కొమ్మూరి సాంబశివరావు. డిటెక్టివ్‌ నవలలు అద్భుతంగా రాస్తాడు. వెల్దుర్తి బస్టాండ్‌లో ఒక పాన్‌ షాపు వాడు డిటెక్టివ్‌ నవలలు అద్దెకిస్తాడు. రోజుకు పదిపైసలు. కొమ్మూరి డిటెక్టివ్‌ నవలలన్నీ చదివాడు పతంజలి. ఎంత ఉత్కంఠ కలిగిస్తాయంటే చివరి వరకు వదలబుద్ధికాదు. డిటెక్టివ్‌ యుగంధర్‌, అసిస్టెంటులు రాజు, కాత్యా, సార్జంటు శివం, ఇన్‌స్పెక్టర్‌ స్వరాజ్యరావు ప్రతి నవలలో వాళ్లే. అయినా విసుగురాదు. ఆయన ‘కథాకథన చాతుర్యం గొప్పది. చదివించే శక్తి ఆయనకుంది.

అవేగాక విశ్వప్రసాద్‌, టెంపోరావ్‌, మొదలయిన రచయితల రచనలు కూడ విరివిగా చదివాడు పతంజలి. కానీ ఎందుకో సమాజానికి ఆ సాహిత్యంమీద గౌరవం లేదు. బుద్ధికి పదును పెట్టే పుస్తకాలివి.

అదే ఇంగ్లీషు సాహిత్యంలో అలాంటి రచయితలకు బ్రహ్మరథం పట్టారు. సర్‌ ఆర్ధర్‌ కానన్‌ డయల్‌, అగధా క్రిస్టీ, ఇయాన్‌ ఫ్లెమింగ్‌ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపారు. షెర్లాక్‌ హోమ్స్‌, జేమ్స్‌, బాండ్‌ లాంటి పాత్రలు తమను సృష్టించిన రచయితలనే డామినేట్‌ చేశాయి. హైస్కూల్లో ఎనిమిదో తరగతిలోనే “ది హవుండ్స్ ఆఫ్‌ భాస్కరవిల్లే” అన్న కానన్‌ డయల్‌ నవల సంక్షిప్తీకరించినది, తమకు ఇంగ్లీషు నాన్‌డిటెయిల్డ్‌ టెక్స్ట్‌గా ఉండేది. శంకరయ్యసారు దాన్ని అద్భుతంగా పాఠం చెప్పేవారు. కర్నూల్లో ‘ఆనంద్‌’ టాకీసులో ఎప్పుడూ యింగ్లీషు సినిమాలే వేస్తారు. పతంజలి రెండు మూడు సినిమాలు చూశాడు. “ది స్పైహు లవ్డ్‌మి”, “దిమ్యాన్‌ విత్‌ గోల్డెన్‌ గన్‌”, “అసాసినేషన్‌ ఆఫ్‌ ది ప్రసిడెంట్‌” బాగా నచ్చాయి.

“ఇంగ్లీషు భాషలో రాసినందుకే అంత ప్రాచుర్యం వచ్చిందా సాహిత్యానికి” అని అనుకున్నాడు. మల్లాది వెంకటకృష్ణమూర్తి అనే రచయిత అప్పుడే ప్రాచుర్యం పొందుతున్నాడు. ఆయనకు అభిమాన రచయిత కొమ్మూరి సాంబశివరావు అని ఎక్కడో చదివాడు.

బావ కొనిచ్చిన పుస్తకాల్లో ఓ హెన్రీ కథలు కూడ చాలా ఇష్టం పతంజలికి. పుస్తకం పూర్తయింది. తాను ఎలా ఉండకూడదో స్పష్టంగా అర్థమయింది. అలాగని వ్యక్తిత్వ వికాస వ్యాసంలా లేదు. చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంది.

రైలు మహబూబ్‌నగర్‌లో ఆగింది. సింగిల్‌లైన్‌ కాబట్టి క్రాసింగ్‌ లెక్కువ. పైగా మీటర్‌ గేజ్‌. ఇంకా పైగా ప్యాసింజరు. మెయిన్‌ ప్లాట్‌ఫారం మీదే ఉంది. దిగి టైము చూశాడు. ఆరుకావస్తుంది. క్యాంటీన్‌లో టీ తాగాడు వెంట తెచ్చుకున్న తపేలాంట్లు గుర్తొచ్చాయి. రాత్రి తిండి కవి సరిపోతాయి అనుకున్నాడు.

రైలు కాచిగూడ చేరేసరికి తొమ్మిదయింది. రాత్రి స్టేషన్‌లోనే వెయిటింగ్‌ రూంలో పడుకుంటే డబ్బులు మిగులుతాయి కదా అనుకున్నాడు. కాని వెయిటింగ్‌ రూంలో కూర్చోడానికి కూడ చోటు లేదు.

స్టేషన్‌ బయటకు వచ్చి, చౌరస్తా వరకు నడిచాడు. అక్కడ ‘టూరిస్టు లాడ్జ్‌’ కనబడింది. అందులో బస చేసే స్తోమత తనకెక్కడిది? అలా నడుస్తూ బోర్డులు చదువుకుంటూ వెళుతున్నాడు. ఒకచోట ఆగాడు. “ఇచ్చట బెడ్స్‌ లభించును” అని ఉంది. పైన “రాయల్‌ హోటల్‌” అని ఉంది. “ఇదీ మన బస” అనుకొని మెట్లెక్కపోతుంటే ప్రక్కన బండిమీద మిరపకాయ బజ్జీలు వేస్తున్నాడు. కమ్మని వాసన వెళ్లి నాలుగు బజ్జీలు పొట్లం కట్టించుకున్నాడు.

బెడ్‌ 24 గంటలకు ఐదు రూపాయలనీ, వెంటనే తీసుకోవాలనీ, మరి కొద్ది సేపట్లో కాచిగూడ చౌరస్తాలో ఫస్టు షో వదిలితే బెడ్లు దొరకవనీ చెప్పాడు.

“రేపు ఉదయాన్నే వెళ్లిపోతా. ఏమయినా తగ్గిస్తారా!” అని అడిగితే కౌంటర్లో వాడు ఒక బోర్డు చూపించాడు. దాని మీద రాసి ఉంది. “ఎ పార్ట్‌ ఆఫ్‌ దిడే ఈజ్‌ కన్సిడర్డ్ ఎ ఫుల్‌ డే” పతంజలి నోరు మూసుకున్నాడు. దాన్ని తెలుగులోకి అనువదిస్తే చాలా పెద్ద వాక్యం అవుతుందనుకున్నాడు. ఐదురూపాయలిచ్చి బెడ్‌ తీసుకున్నాడు. బెడ్‌ క్రిందనే ఒక పెద్ద సొరుగు, బ్యాగులవీ పెట్టుకోటానికి, ఒక తాళం కూడ యిచ్చారు.

కౌంటరు కవతల కుర్చీలు వేసి ఉన్నాయి. అక్కడ కూర్చుని తపేలాంట్లు, మిరప కాయ బజ్జీలు తిన్నాడు. ఒక మూల స్టాండు మీద పెద్ద స్టీలు క్యాన్లో మంచినీళ్లు పెట్టారు. నీళ్లు తాగి వెళ్లి పడుకున్నాడు. ప్రతి రెండు బెడ్స్‌కు మధ్యన ఫ్యాన్‌ ఉంది. “మడత మంచాల కంటె మన లెవెల్‌ కొద్దిగా పెరిగినట్లే” అని నవ్వుకున్నాడు. హాయిగా నిద్రపట్టింది.

***

పతంజలి నిద్ర లేచేటప్పటికి ఏడుదాటింది. యూనివర్సిటీ పది గంటలకు గాని తెరవరు. తొందరేంలేదనుకుంటూ, బ్రష్‌ చేసుకుని క్రిందికి వెళ్లి ఇరానీ చాయ్‌ తాగి వచ్చాడు. న్యూస్‌ పేపర్లు ఉన్నాయి. ది దక్కన్‌ క్రానికల్‌ కాసేపు చదివాడు. ‘హిందూ’ కంటే భాష చాలా సరళంగా ఉన్నట్లనిపించింది.

స్నానం చేసి తాను తెచ్చుకున్నవి మార్చుకొన్నాడు. చిత్తూరులో బావకొనిచ్చిన ప్యాంటు షర్టు అది టీషర్టు కాబట్టి ఇంకా బాగుంది పతంజలికి. గోడకున్న నిలువుటద్దంలో తనను తాను చూసుకున్నాడు.

“వెరీ స్మార్ట్‌” అని తనను తానే అభినందించుకొన్నాడు. తండ్రి మాటలు గుర్తుకొచ్చాయి.

“వస్త్రేణ, వపుషా, వాచా” – ముందుగా మనం వేసుకున్న దుస్తులు, తర్వాత మన శరీర సౌష్టవం, తరువాత మనం మాట్లాడే మాటలు, మనమీద యితరులకు ఒక అభిప్రాయాన్ని కలిగిస్తాయి. నిజమే. తనకు ఈ డ్రస్‌ తప్ప మంచివి లేవు. చెప్పులు కూడ పాతబడిపోయాయి. ఇంట్లో చెల్లెలు, తమ్ముళ్ల పరిస్థితి కూడ అదే. అమ్మకయితే మంచి చీరలే లేవు. నాన్న కూడ ఉన్న రెండు మూడు ధోవతులు జుబ్బాలు కండువాలతో సరిపెట్టుకుంటుంటారు.

బట్టలు కొనలేని తమ పేదరికాన్ని హాస్యం మాటున కప్పిపుచ్చుతాడాయన. వాళ్లమ్మ (పతంజలి నాన్నమ్మ) అనేదట. ‘బట్టలకు పెడితివో భ్రష్టయితివో” అని.

ఈసారి ట్యూషన్‌ ఫీజులతో అందరికీ బట్టలు తీయాలని అనుకున్నాడు పతంజలి.

బెడ్‌ ఖాళీ చేసి, సంచిపట్టుకుని కిందకు దిగాడు. తాను కాచిగూడ స్టేషన్‌ నుంచి వస్తూంటే కుడివైపు ఏదో గుట్ట, దానిమీద దేవాలయం ఉన్నట్లు చూచాడు. ఇంకా టైముంది కదా వెళ్లి దర్శనం చేసుకొని యూనివర్సిటీకి వెళదాం అనుకున్నాడు.

ఆంజనేయస్వామి గుడి అది. ఒక ప్రక్క శివుడు, నవగ్రహాలు, చెట్టుక్రింద సుబ్రహ్మణ్యస్వామి (నాగ ప్రతిమలు) ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఉంది.” మన లక్ష్మీనరసింహస్వామి లేడే” అనుకున్నాడు.

దర్శనం అయింది. తీర్థ ప్రసాదాలు తీసుకుని వస్తూ, అక్కడున్న పూజారిని అడిగాడు.

“ఇక్కడ నరసింహస్వామి వారిగుడి ఉందాండీ, దగ్గరలో?”

“గీడ స్టేషన్ల బస్సెక్కుండ్రి, కోటీ వుమెన్స్‌ కాలేజి కాడ దిగుండ్రి ఆడనే పెద్ద మందిర్‌ ఉన్నది నర్సింగ్‌ భగవాన్‌ది” అని చెప్పాడాయన.

“అక్కడ నుంచి నేను ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లవచ్చా”

“ఆ గాడనుండి బస్సులుంటాయి మస్తుగ”

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here